తెలుగు భాషాభివృద్ధి – సమస్యలు – పరిష్కారాలు

తల్లి పేగు ప్రాణధార – తల్లి భాష జ్ఞానధార
తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే – తల్లి భాషకూ ప్రత్యామ్నాయం ఉండదు

మానవుని మనసులోని భావాలను వ్యక్తపరిచే సాధనం భాష. సకల జీవరాశులలోనూ మానవుడొక్కడే తన భావాన్ని వాక్కు రూపంలో వ్యక్తపరచగలడు.  తెలుగుభాషకున్న విశిష్టతను బట్టి శ్రుతి మాధుర్యాన్ని బట్టి పాశ్చాత్యులు ‘ఇటాలియన్‍ ఆఫ్‍ ద ఈస్ట్’ అని కీర్తించారు. శాస్త్ర సాంకేతిక విద్యలతో సహా అన్ని విద్యలకు తెలుగుభాష అనువైన భాషనీ, దేశమంతటికి జాతీయభాష కాగల పూర్తి అర్హత తెలుగుభాషకు ఉందని ప్రముఖ జన్యుశాస్త్రవేత్త జెబియస్‍ హాల్డెన్‍ కొనియాడాడు. హాలుని గాథాసప్తశతి రచనా కాలానికే తెలుగుభాష ప్రబలంగా వ్యాపించి ఉన్నట్టు చారిత్రక, సాహిత్య పరిశోధనలవల్ల తెలుస్తున్నది. మాతృభాషలో మన అనుభూతులు, ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటేమిటి మన జీవనవిధానానికి సంబంధించిన ప్రతి చిన్న-పెద్ద అంశాన్ని విశదీక రించగలం. భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ సరితూగగలిగిన భాష. ప్రపంచం లోని క్రమబద్ధీ కరించబడిన అతికొద్ది భాషలలో తెలుగు ఒకటి. తెలుగు వ్యాకరణము స్పష్టమైన అన్వయ స్థితిరూపాలలో నిర్మాణ పరంగా మిక్కిలి ఒప్పిదం గానూ, అతి శుద్ధంగానూ ఉంటుంది.


తెలుగుభాషా విశిష్టత:
సృజనకు విత్తు స్వంత భాష. రచనకు సత్తువ ప్రలభాష. విద్యకు పరమార్థాలైన ఆధారపడే తత్వాన్ని విడనాడడం, స్వతంత్రంగా ఆలోచించగలగడం, మానసిక వికాసాన్ని పొందడం, ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోగలగడం మొదలగునవన్నీ మాతృభాషలో బోధనవల్లనే సాధ్యమవుతాయి. ఇది భాషావేత్తల నిశ్చితాభిప్రాయం. ‘ప్రజలభాషలో విద్య, పరిపాలన ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, హక్కు’ అని ఎలుగెత్తారు గిడుగువారు. ‘మాతృభాష తల్లిపాల వంటిది, పరాయిభాష పోతపాల వంటిది’ అని కొమర్రాజు లక్ష్మణరావుగారు తీర్మానించినారు. ‘నిజమైన భావప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లనే సాధ్యమవుతాయని, స్వభాషలో విద్యను బోధించినట్లయితే దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చివుండేదని’ గాంధీ మహాత్ముడు చెప్పారు. మాతృభాషలో విద్యనేర్వని ఏ పిల్లవాడైనా మేధావిగా ఎదగలేడన్నది ప్రామాణిక సత్యం. పద్యనాటకం, అవధాన పక్రియలు తెలుగు భాషకే సొంతం. ప్రపంచంలో మరే భాషలోనూ ఈ పక్రియలు కనిపించవు. రాసినట్లే ఉచ్చరించడం, ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం.


బోధనాభాషగా తెలుగు ప్రయోజనాలు:

తెలుగుభాష ప్రాచీనమైనదేగాక చాలా శక్తివంతమైన భాష. ఏ భాషాపదజాలాన్నైనా తనలో కలుపుకోగలదు. సంస్కృత, ఉర్దూ, పారశీక, ఆంగ్లపదాలను తనలో ఇముడ్చుకోగలదు. ఎంత సున్నితమైన భావాన్నైనా, ఎంత ప్రౌఢమైన భావాన్నైనా బలంగా చెప్పగలిగే శక్తి తెలుగుభాషకు ఉంది. తెలుగుభాషలో బోధన కొనసాగినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మేధావులు చెబుతున్నారు. ఎన్నో సర్వేలు ఘోషిస్తున్నాయి. నాగరికజాతి మాతృభాషలోనే మాట్లాడుతుందని ప్రముఖ ఆంగ్లకవి ఈట్స్ అన్నారు. భాష సంస్కృతిలో భాగం. కావున భాష నిలిచినపుడే సంస్కృతి నిలుస్తుంది. తెలుగుభాషలో బోధన కొనసాగడంవల్ల గ్రహణ సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించగలుగుతారు. సాహిత్యాభిరుచి, వివేచనాశక్తి, కళాపోషణ మొదలైన సామర్థ్యాలు పెంపొందడానికి ఏ జాతికైనా సరే మాతృభాష దోహదపడుతుంది. మాతృభాష వల్ల మాత్రమే సంస్కృతీ సంప్రదాయాలపై మక్కువ ఏర్పడుతుంది. ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం కలుగు తాయి. మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. జాతీయత వికసిస్తుంది. మాతృభాషలో చదివిన వారికి అవగాహన విషయంలో సమయం చాలా కలిసివస్తుంది. భట్టీయం అక్కర్లేకుండానే సులభంగా విషయాలను గ్రహిస్తారు. విషయ సంగ్రహణంతో పాటు వినోదం, విజ్ఞానం, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయి. ఇతరులతో పోటీపడే శక్తి అలవడుతుంది. తల్లిదండ్రులతో పిల్లలకు అనుబంధం మాతృభాషలోనే బలీయంగా ఉంటుంది. మాతృభాషాభిమానం, స్వజాతి గౌరవానికి మూలబిందువు. భిన్నత్వంలో ఏకత్వం దిశగా దేశాభిమానానికి ఇది ప్రథమ సోపానం. మాతృభాషలో బోధనవల్ల గ్రహణ సామర్థ్యం, సృజనాత్మకతలు పెంపొందుతాయి. మనసులు చురుకుగా పనిచేస్తాయి. అన్ని విద్యాదశలలోనూ మాతృభాష బోధనాభాషగా ఉండాలని కొఠారీ కమీషన్‍ సూచించిన విధాన నిర్ణయం గమనార్హం.


ప్రస్తుత తెలుగుభాషాస్థితి – సమస్యలు:

‘‘వచ్చినా రానట్లు మాట్లాడేది తెలుగుభాష – రాకున్నా వచ్చినట్లు మాట్లాడేది ఆంగ్లభాష’’ గా మారిపోయింది నేటి భాషాస్థితి. అభివృద్ధి అంతా ఆంగ్లంలోనే ఉందన్నట్లు జనమంతా ఆంగ్లభాష మోజులోపడి కొట్టుకుపోతున్నారు. దైనందిన వ్యవహారంలో ముఖ్యంగా చదువుకున్నవారు కుప్పలు తెప్పలుగా ఆంగ్లపదాలను వ్యవహరిస్తున్నారు. ‘మనిషికి మంచి విగ్రహపుష్టిని ఇచ్చేది మాతృస్తన్యమైతే, ఉత్తమ మూర్తిమత్వాన్ని, సౌశీల్యాన్ని కలిగించేది మాతృభాష’ అని భాషా ఔన్నత్యాన్ని గురించి పెద్దలు చెప్పిన మాటలను నేటితరం విస్మరిస్తున్నది. ప్రజలు కూడా స్తోమత లేకున్నా అప్పుచేసి తమ పిల్లలను ఆంగ్లమాధ్యమంలో చదివిస్తున్నారు. ఫలితంగా ప్రతి ఏడాది 70 శాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చేరుతున్నారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగాల్లో చేరిన తర్వాత వాళ్ల పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించే పరిస్థితి ఉండదు. రెండు మూడు తరాలు గడిచిన తర్వాత చూస్తే తెలుగు రాష్ట్రాలలో తెలుగువాళ్ళంతా ఆంగ్ల విద్యాధికులై ఉంటారు. చివరకు తెలుగు వాళ్ళు ఉండి, తెలుగు భాషలేని స్థితి ఏర్పడుతుంది. అన్యభాషలో బోధనవల్ల విద్యార్థులపై తీవ్ర దుష్ఫలితాలుంటాయని మనోవైజ్ఞానికులు చెబుతున్నారు. ఆంగ్లంలో విన్నదానిని మాతృభాషలో అర్థం చేసుకొని, మళ్లీ ఆంగ్లంలో స్పందించవలసి వస్తుంది. ఇది పిల్లలకు మోయలేని భారమై మానసిక శ్రమకు గురవుతారు. కష్టపడి చదువుతున్నారే కానీ, ఇష్టపడి చదవడంలేదు. విద్యార్థులు ఆయా అంశాలను అర్థం చేసుకోలేక సంకేతాలు మాత్రమే గుర్తుంచు కుంటున్నారు. అవగాహనా సామర్థ్యాన్ని పెంపొందించుకోలేక పోతున్నారు. బట్టీపద్ధతిపై ఆధారపడి యాంత్రికతకు అలవాటుపడుతున్నారు. సృజనాత్మకత దెబ్బ తింటున్నది. విద్యార్థులలో సొంత ఆలోచనాశక్తి మరుగున పడుతున్నది. అందువల్ల స్పష్టత కొరవడి ఇతర సబ్జెక్టులలో సగటు స్థాయి కంటె తక్కువ స్థాయిలో ఉంటున్నారు. పరాయి భాషపై మోజు చూపిస్తూ, పిల్లలు బాల్యం నుండి కృత్రిమంగా చదువుతున్నారు. ఆ పిల్లలు తమ ఆలోచనలను, సృజనాత్మకతను, మాతృభాషలో వ్యక్తీకరించినట్లుగా పరాయి భాషలో వ్యక్తీకరించలేకపోతున్నారు. యాంత్రికంగా ఆలోచిస్తూ యంత్రాల వలె తయారవుతున్నారు. ఫలితంగా ప్రతిభాసామర్థ్యాలు లోపిస్తున్నాయి. ఈ విధంగా పరభాషా మాధ్యమంలో చదివే చిన్నారులు రెంటికి చెడ్డ రేవడి చందంగా తయారవుతున్నారు. ఇంగ్లీషులాంటి ఇతర భాషలు నేర్చుకోవడం తప్పుకాదు. కాని కేవలం ఇంగ్లీషులోనే అన్నీ నేర్చుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది. అంతర్జాతీయ సంస్థ యునెస్కో తెలుగు భాష మరణ శయ్యను చేరుకుంటుందని ప్రకటించింది. గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో తెలుగుభాష పరిరక్షణ కోసం తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషాసంఘం నెలకొల్పింది. తెలుగు అభివృద్ధికి పెద్దబాలశిక్షతో మొదలుకొని ఇటీవలి తెలుగు వికీపీడియాలాంటి విజ్ఞాన సర్వస్వము వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినా ఎన్నో ప్రతికూల ప్రభావాలకు లోనై తెలుగుభాష వాడుకలో రోజురోజుకూ తగ్గిపోతున్నది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇక్కడి ప్రభుత్వం పాఠశాల, కళాశాలల్లో మాతృభాష నిర్బంధ మాధ్యమంగా – ద్వితీయ భాషగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నది. ప్రత్యేకంగా ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ’ ని స్థాపించింది. ప్రపంచ తెలుగు భాషా మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఇది ఆశారోచిస్స్ఫోరకమైన అంశం.


బోధనాభాషగా తెలుగుభాషా పరిరక్షణ:
చైనాలో రోదసీ విజ్ఞానానికి అధినేతగా పనిచేస్తున్న ఆచార్యుడికి ఇంగ్లీషు రాదు. ఆ విజ్ఞానాన్నంతటిని అతడు మాతృభాషలోనే అధ్యయనం చేశాడు. ప్రారంభ దశలో జపాన్‍ ఆంగ్లంలో రాసిన పాఠ్యగ్రంథాలనే ఉపయో గించింది. తర్వాత మాతృభాషలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యధునాతన ఆవిష్కరణలను స్వాగతిస్తూ, ఆంగ్లభాష తాకిడిని తట్టుకొని: చైనా, జపాన్‍, జర్మనీ వంటి దేశాలు ధీమాగా ముందడుగు వేయగలు గుతున్నాయి. పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఇంజనీరింగ్‍ విద్య కూడా కన్నడంలో నేర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్‍, ఒరిస్సా, మహారాష్ట్రలలో మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. అన్ని ప్రభుత్వోద్యోగాల లోనూ, సాంకేతిక రంగంలోనూ వారిదే పైచేయి. ఆంగ్లభాష కూడా 17వ శతాబ్దం వరకూ సొంత దేశమైన ఇంగ్లాండులో కూడా దిక్కులేని స్థితిలో దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆంగ్లేయులే దాన్ని పనికిమాలిన భాషగా చూసేవారు. అప్పుడు పెత్తనం అంతా ఫ్రెంచి, లాటిన్‍ భాషలదే. అవి ఆంగ్లాన్ని తుచ్ఛమైన, అనాగరిక భాషగా పరిగణించేవి. ఆర్థికంగా అప్పట్లో ఆ దేశాలే బలంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. ఆ పరిస్థితుల్లో తమ భాషను ఎలాగైనా కాపాడుకోవాలని కొందరు భాషాభిమానులు ముందుకు వచ్చారు. వారందరి కృషి ఫలితమే అక్కడ పార్లమెంట్‍లో చట్టం వచ్చింది. మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పదేపదే ప్రజలకు నూరిపోశారు. క్రమంగా ఆంగ్లేయులు వ్యాపారం పేరుతో విదేశాల్లో పాగావేసి, అధికారం చేజిక్కించుకోవడం, సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలు పెట్టాక వారితో పాటు వారి భాష కూడ ప్రపంచమంతా వ్యాపించింది. వారి ప్రాబల్యాన్ని పెంచింది, ఇంగ్లీషు భాష నేడు ప్రపంచాన్నే శాసించే స్థితికి చేరుకుంది.

  •  తెలుగు భాష మనకు గుర్తింపును, ఉనికిని, అస్తిత్వాన్ని ఇచ్చింది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైనా ఉంది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం మనదే. తెలుగు భాష లేకుండా తెలుగు రాష్ట్రాలనూ – తెలుగు జాతిని ఊహించుకోలేం.
  •  ప్రతి విద్యా దశలోనూ మాతృభాషను తప్పకుండా అందరూ చదువుకోవాలి. ప్రథమ భాషగా మాతృభాషను అధ్యయనం చేయాలి. మాతృభాషలో విద్యాబోధన, ప్రభుత్వ పాలన జరుగనిదే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందదు. కాబట్టి ప్రభుత్వం ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమంలో ప్రోత్సహించకూడదు.
  •  రాజ్యాంగంలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే, ఉచితంగా బోధించాలనే నిబంధన లున్నాయి. ఒకటో తరగతి నుంచి పట్టభద్ర స్థాయి (కె.జి. నుండి పి.జి.) దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశం చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో కృత నిశ్చయంతో ఉండడం ముదావహమైన అంశం.
  • ప్రాథమిక విద్య పరాయి భాషలో బోధించడం అంటే చక్రాలు కదలని బండ్లను బలమైన గిత్తల చేత లాగించడం లాంటిదే అవుతుంది. అది అశాస్త్రీయం.
  •  ప్రాథమిక విద్యాభ్యాసాకికి తగిన పుస్తకాలుండి కూడా ప్రాథమిక విద్య పరభాషలో ఉండడం శోచనీయం. కళాశాల స్థాయి విద్యార్థులకు కావలసిన పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు తగిన సంఖ్యలో లేవు. పుస్తకాలను తెలుగులో తయారు చేసుకోవడం కష్టసాధ్యమే కాని అసాధ్యం కాదు. ఇప్పటికే తెలుగు అకాడమి స్నాతకోత్తర స్థాయికి సైతం అనుగుణమైన గ్రంథాలను ఎన్నింటినో ప్రచురించింది.
  •  ‘సేవా వృత్తి వల్ల వచ్చు పాయసం కంటే స్వయం వృత్తివల్ల లభించు గంజి మేలు’ అని పూర్వులు మరియు పెద్దలు చెప్పిన మాటలు మరవద్దు. నాగరిక జాతి మాతృ భాషలోనే మాట్లాడుతుంది. అట్లా మాట్లాడటమే జాతి మనుగడకు జీవగర్ర.
  •  అనువాద అకాడెమిని స్థాపించి దాన్ని అభివృద్ధి చేస్తే మాతృభాషలో మహనీయ గ్రంథాలు లభిస్తాయి. ప్రతి చట్టాన్ని మొదట తెలుగులో రూపొందించి తరువాత అవసరమయితే ఇతర భాషల్లోకి అనువదించాలి.
  •  శాసనసభలో గౌరవ సభ్యులందరూ మాతృభాషలోనే మాట్లాడాలి. అలా జరిగితేనే ప్రజా బాహుళ్యానికి శాసనపరమైన విధివిధానాలు, పరిపాలన సంబంధమైన పారదర్శకత తెలిసి వస్తాయి.
  •  ఉద్యోగాల కోసం పెట్టే పోటీ పరీక్షలలో శాస్త్ర పరిజ్ఞానానికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని మాతృభాషకు కూడా ఇవ్వాలి. అధికారులు మాతృభాషలో మాట్లాడాలి. పరిష్కారాలను నిర్ణయించాలి.
  •  పాలనారంగంలో అధికార భాషగా మాతృభాషను నూటికి నూరుపాళ్ళు ఉపయోగించాలి. అమలు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డులే కాక, వివిధ రకాల పేర్ల పలకలు నోటీసులు తెలుగులోనే రాయించాలి.
  •  న్యాయవ్యవస్థలో న్యాయవాదుల వాదోపవాదాలు, తీర్పులు పూర్తిగా అధికార-మాతృభాషలో జరగాలి.
  •  దృశ్య మాధ్యమంలో తెలుగు భాషా వికాసానికి ప్రామాణికమైన, మెరుగైన కృషి జరగాలి. వృత్తి విద్యను కూడా ఆంగ్లంతో సమానంగా మాతృభాషలో బోధించాలి.
  •  ఇతర రాష్ట్రాలలో వలె అధికార భాష కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పరచాలి.
  •  తెలుగు భాషలో చదివితే ఉపాధికి హామీ ఉండేలా ప్రభుత్వ కార్యాచరణ కొత్తపుంతలు తొక్కితే భాషా పునరుజ్జీవనం సాధ్యపడుతుంది. భాషా మాధ్యమంగా జాతి ఐకమత్యం కాపాడబడుతుంది.
  •  ఎప్పటికప్పుడు కొత్త నిఘంటు నిర్మాణంలో భాగంగా వినూత్న పదాల సేకరణ జరగాలి. తెలుగు భాషా స్వరూపాన్ని నిర్ధారించుకోవడానికి పరామర్శ గ్రంథాలు, ప్రామాణికమైన మహానిఘంటువులను నిర్మించుకోవాలి. మహానిఘంటు నిర్మాణానికి పంచవర్ష వ్యవధికంగా శాశ్వత పీఠం ఏర్పాటు కావాలి. వైజ్ఞానిక రంగాలకు చెందిన మౌలిక ఆలోచనలను వ్యక్తం చేయడానికి కావలసిన పరిభాషా నిర్మాణం జరగాలి. అనేక శాస్త్ర సాంకేతిక అంశాలకు చెందిన పదజాలం, పరిభాష తెలుగులో కొత్తగా రూపొందించడం ఆగిపోయింది. దాన్ని కొనసాగించాలి.
  •  భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవ కళతో ఉప్పొంగు తుంది. తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, మరాఠీలు తమ భాషా సంస్కృతులను ప్రాణప్రదంగా చూసుకొంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసు కున్నారు. తెలుగువారు సైతం ఈ అంశాలలో ముందంజ వేయాలి.
  •  తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమాన్ని సాగించాలి. జానపద కళలను, హరికథలను అవధానాలను ప్రోత్సహించాలి.
  • వ్యవహారంలో వచ్చిపడే ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలను సృష్టించుకోవాలి. అవి వినడానికి ఇంపుగా తేలికగా ఉండాలి. పల్లె ప్రజల వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకోవాలి. డ్రిప్‍ ఇరిగేషన్‍ – చుక్కలసాగు, ఫ్లె ఓవర్‍ – పైదారి అన్న పదాలను సృష్టించింది సామాన్యులేనని మరవ రాదు. ఇది మాతృభాషాపరమైన సృజనశీలతకు మచ్చుతునక.
  •  ఆంగ్ల శబ్దం రాకుండా మాట్లాడేలా, రాసేలా పిల్లలను ప్రోత్స హించాలి. ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలు, సమానార్థకాల అన్వేషణ, పదసేకరణ, నూతన పదాల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తిలోకి తేవడం మొదలైన పనులు చేయాలి. వక్తృత్వం, వ్యాస రచన, సామెతలు, శతక పద్యాలు, కీర్తనలు వంటి వాటిలో పోటీలు పెట్టి భాషా యోజనరీతుల్ని సక్రమంగా అర్థం చేసుకునేట్లు చేయాలి.
  •  తెలుగు కోసం ఒక మంత్రిత్వ శాఖను, ప్రత్యేక నిధులను కేటాయించాలి.


ఏ భాషకైనా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది చెప్పిన మాట ఎదుటి వారికి స్పష్టంగా అర్థం కావాలి. అది సామాజిక ప్రయోజనం. భాష ఉపాధి ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలను నెరవేర్చినప్పుడే భాష రోజువారి వ్యవహారంలో ఉంటుంది. తెలుగు వస్తేనే తమ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి.

ముగింపు:
భాషను పరిరక్షించుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి. మొదటిది ప్రేమ. భాషపట్ల ప్రేమ, అభిమానం ఉండాలి. రెండవది ఉపదేశం. మాతృభాష యొక్క గొప్పదనాన్ని, విలువను ప్రజలకు తెలియజెప్పాలి. మాతృభాషలో బోధన లేకపోవడంవల్ల కలిగే దుష్ఫలితాలను, బోధన మాతృభాషలో ముడిపడి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను విశదీకరించి భాషాభిమానం పెంపొందించాలి. భాషకేర్పడిన ముప్పును తెలియజేసి ప్రజలను మేల్కొల్పాలి. మూడోది శాసనం. ప్రేమ, ఉపదేశం పనిచేయనప్పుడు శాసనాలు తయారుచేసి కఠినంగా అమలుపరచాలి. ఇతర భాషలు నేర్చుకోకూడదని కాదు. ఇతర భాషలు నేర్చుకొని ఆయా భాషలలో మాతృభాషా ఔన్నత్యాన్ని చాటిచెప్తూ, మాతృ భాషాభిమానాన్ని పరివ్యాప్తం చేయాలి. మాతృభాషలో గనుక శాస్త్ర సాంకేతిక వృత్తివిద్యలు అభ్యసించినట్లయితే ఆయా అంశాలమీద పట్టు సాధించి సమర్థంగా విధినిర్వహణ చేయగలుగుతారు. ఆ స్థాయికి తెలుగుభాషను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మన మాతృభాష తెలుగును కంటికి రెప్పలా కాపాడుకుందాం.


– డా।। రాపోలు శ్రీనివాస్‍, 
మో: 9848 0506 94

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *