పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు?

నాకు పాకిపని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూ డుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరి దారి యింట కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమన్నడట. సెయ్యనంటె వూడిస పని పోతదో ఏమో? ఎట్ల బత్కాలె, పాకామె గూడనా అసోంటి ఆడిమనిషే గద ఆమె జేసినపుడు నేంగూడ జేత్తనుకున్నది. ముక్కుకు బట్ట గట్టుకొని పదిరోజులు మలమెత్తిపోసి మనిషిల మనిషిగాలే.. ఆ పదిరోజులు యింటికాడికొస్తే పీతి వాసనొస్తందని గిన్నె, చెంబు ముట్టనియ్యలే, బువ్వవండనియ్యలే ఆమె పెనిమిటి పిల్లలు.
‘గీ పదిరోజులకే నన్ను గిట్లంటండ్రు, సీ.. సీ.. అని దూరం బెడ్తండ్రు గీ పాకిపని మెల్లకాలంజేసేటోల్ల గోసెంతుంటదో! యింట్ల బైట, గీ బతుకు ఎవ్వలికి రావద్దు, గీ పనిపాడువడగా వాసనకు కడు పుల పేగులు నోట్లెకత్తయి, వాళ్లేరిగింది వాల్లే ఎత్తిపోసు కోవచ్చుగదా! వాల్లది వాల్లకే రోతైతే వేరే వాల్లకెంతరోత రావాలె. తక్కువ కుల మాడోల్లంటె అగ్గువకు దొర్కుతమని, బువ్వ లేకుంటున్నమని, గిసోంటి గలీజుపని జేయిస్తరు వాల్లకు గత్తర్రాను’ అన్న మాటలు నాకు బాగా యాది.
ఈ మద్య భాషాసింగ్‍ అనే ఒక జర్నలిస్టు, భారతదేశ రాష్ట్రాలన్ని తిరిగి మనిషి మల మూత్రాల్ని ఎత్తిమోసి సాఫ్‍ జేసే పాకి వృత్తిమీద ‘అన్‍సీన్‍’ ఒక పుస్తకం రాస్తే హైద్రాబాద్‍లో సఫాయి కర్మచారి ఆందోళన కన్వీనర్‍ బెజవాడ విల్సన్‍ వాల్లు ఆవిష్కరించిండ్రు. భారత దేశ అన్ని రాష్ట్రాల్లో పాకి వృత్తి వుందని ఏ రాష్ట్రం మినహాయింపుగా లేదని చెప్పింది. సమ న్యాయసమాజాలు అని చెప్పే కమ్యూనిస్టు పార్టీ ఏలుబడిలో వున్న కేరళ, పశ్చిమబెంగాల్‍ నుంచి సస్య విప్లవాలొ చ్చిన పంజాబ్‍ దాకా పాకివృత్తి నిరాఘాటంగా కొనసాగుతున్న పచ్చి నిజాల్ని రాష్ట్రాల్ని తిరిగి పాకి మహిళల అనుభవాల్ని, వ్యతిరేకతల్ని, కులంకారణంగా అంటరాని మహిళలకు అంటగట్టిన యీ వృత్తి పై వున్న వాల్ల గోసలు అక్షరీకరించింది భాషాసింగ్‍.


పాకి ఆడవాల్లు లేనికాడ మాదిగ ఆడవాల్లే పాకి వృత్తిలో వున్నారని మా మేనత్త సంఘటనే కాక, రైలల్ల కక్కోసులు కడిగేది రైల్‍ పట్టాల మద్య మలం ఎత్తిపోసేది, శుభ్రం జేసేది యీ ఆడవాళ్లే. మా కులాల మహిళలకే ఎందుకీ నికృష్ట వృత్తి. మా అత్తన్నట్లు వేరే బతికే దారి లేకనా ఆకలి యింతకన్నా క్రూరంగుంటదనా! యీ క్రూరత్వాలు, నీచాలు నికృష్టాలు మా కులాల ఆడవాల్లకే ఎందుకంట గట్టిండ్రని కడుపు కత్తి కోతైతది. చాలా వృత్తుల్లోకి యాంత్రీకరణొచ్చినట్లు పాకి వృత్తిలోకెందకు రావట్లేదు! ‘యీ వృత్తి తల్లి పిల్లలకు జేసే పవిత్రమనీ, సమాజానికి తల్లి లాంటి వృత్తి అని గ్లోరిఫై జేసిండుగాంధి. కాని అంతగా పవిత్రమనుకుంటే తల్లిలాంటి వృత్తే అనుకుంటె కులరహితంగా మిగతా కులాలు ఎందుకు చేయట్లేదనే దానికి సమాధానముండదు. అంటరాని కులాలైన పాకి, మాదిగ ఆడవాల్ల చేతనే మలమూత్రాలెత్తించే యీ వ్యవస్థీకృత దుర్మార్గాన్ని మాట్లాడరు. అంబేద్కర్‍ ఆనాడే గాంధీ పవిత్రతల్ని ప్రశ్నిస్తూ పవిత్రము పాకీవృత్తనుకుంటే మీ కులాలు ఎందుకు చేయవంటే జవాబుల్లేవు.


నిత్యం అంటరానితనాల్ని ఆచరిస్తూ.. కులగోడలు దాటని అగ్ర కుల సమాజము ‘కులమా ఎక్కడుంది?’ అంటరు, జోగినీలా వాళ్లెక్కడున్నరు అంటరు కాని కులహింసలు, కులహత్యలు, అగాయిత్యాలు నిత్యం జరుగుతూనే వుంటయి. బోనాల ఉత్సవాల్లో, బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల్లో లక్షల మంది జోగినీలున్నా కనిపించరు. ఆడమగ తేడానే అంతా సమానంగానే వున్నాంగదా అని వాదిస్తరు. కాని రోజు జరిగే హత్యలు, హింసలు, అత్యాచారాలు ఎందుకు? కారకులు ఎవరు? యిట్లా మసిబూసేపని పాకివృత్తికి కూడా ఎదురైంది. 2012లో అనుకుంట. జాతీయ మానవహక్కుల కమిషన్‍ అన్ని రాష్ట్రాల నుంచి పాకిపనికి సంబంధించిన నివేదికలతో మీటింగుపెడితే అన్ని రాష్ట్రాలు ‘నిల్‍ రిపోర్టు’ యిచ్చినయి ఏపీతో సహా. అట్లా అబద్దపు రిపోర్టులిచ్చి చేతులు దులుపుకున్నది. పాకి వృత్తి లేనే లేదని చెప్పిన వాల్లకు ‘సఫాయి కర్మచారి ఆందోళన’ వాళ్ళు చూయించినా కళ్లు మూసుకునే వ్యవస్థల నేం చేయాలె. లేదనుడు సౌకర్యవంతంగా తప్పించుకునే ఒక వ్యవస్తీకృత కుట్ర. ఆకుట్రలుండడం వల్లా లేవన్న యీ దుర్మార్గాలన్నీ కొనసాగించడానికే. యీ కుట్రల క్రూరత్వాలు పాకీ పనిచేసే కులాల్లో ఆడవాల్లుగా పుడితే గాని ఆగోస, బాద అర్థంగావేమో!


సఫాయి కర్మచారి ఆందోళన వాల్లు 20 సంవత్సరాలు పోరాడి పాకీవృత్తి రద్దు చట్టం తెచ్చినా, పునరావాసం చట్టం తెచ్చినా 2014లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం పదిలక్షల ఎక్స్గ్రేషియాలున్నా వారికి చేరే యంత్రాంగం నిజాయితీగా లేదు.
‘‘అంటరానికులాలు పాకీ వృత్తిని దైవాజ్ఞగా దైవకార్యంగా.. తరతరాలుగా చేస్తున్నారు. లేకుంటె యిన్ని తరాలుగా యీ వృత్తి కొనసాగడం అసాధ్యం’’ అనే వాల్లు రాజ్యం చేస్తున్న దేశంలో వుండడం ఒక తీరని విషాదం.

-జూపాక సుభద్ర, ఎ : 9441091305

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *