ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం

తెలుగు సాహిత్యంలో ప్రజా కవులు, ప్రజా కళలు, ప్రజా సాహిత్యం లాంటి మాటలు విరివిగానే వాడుకలో ఉన్నాయి. అయితే ప్రజా వాగ్గేయ సాహిత్యం అనే పదం గత రెండు మూడు దశాబ్దాలుగానే ప్రయోగంలో ఉంటూ వస్తున్నది. ఒక అర్థంలో ప్రజావాగ్గేయ సాహిత్యం అనే మాట కొత్తది. సాహిత్యంలో వాగ్గేయ సాహిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదొక ప్రత్యేక శాఖ. అసలు ప్రజా వాగ్గేయ సాహిత్యం అంటే ఏమిటనే సందేహం వస్తుంది. వాగ్గేయ సాహిత్యం, వాగ్గేయ కవిత్వం, వాగ్గేయ కారులు అనేవి అనేక సాహిత్య సందర్భాలలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. మరి అట్లాంటి అప్పుడు ప్రజా వాగ్గేయ సాహిత్యం అని ప్రత్యేకంగా వ్యవహరించ వలసిన అవసరం ఏముంది. అనే ప్రశ్నకూడా వస్తుంది. మరీ ఇటీవలి కాలంలోనే భిన్న సందర్భాలలో ప్రజా వాగ్గేయ కారులు, ప్రజా వాగ్గేయ సాహిత్యం అనే మాటలు వినపడుతున్నాయి. ప్రయోగంలో కూడా ఉన్నాయి.
ప్రజా వాగ్గేయ సాహిత్యం అంటే ప్రజల కొరకు వాగ్గేయ కారులు సృష్టించిన సాహిత్యం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ప్రజల కొరకు సృష్టించిన సాహిత్యం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ప్రజల కొరకు సృష్టించిన సాహిత్యాన్ని ప్రజా సాహిత్యం అని వ్యవహరిస్తూ ఉండగా ‘వాగ్గేయ’ అనే విశేషప్రయోగం ఎందుకు అనే సందేహం కూడా కలుగుతుంది. పదకర్తలుగా, పదకవితా పితామహులుగా సంకీర్తనా చార్యులుగా, వాగ్గేయ కారులుగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసులు సృష్టించిన సాహిత్యం వాగ్గేయ సాహిత్యం, వాగ్గేయ కవిత్వం, ప్రసిద్ధమైనది. సాహిత్యం సంగీతాత్మను కూడా తనలో కలిగి ఉన్న సందర్భంలో గానాను కూలత సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వాగ్గేయం’ అనేది ప్రయోగంలోకి వచ్చింది. ‘ప్రజా వాగ్గేయ సాహిత్యం’ కూడా ఇటువంటి గాన యోగ్యతా గుణాన్ని కలిగి ఉన్నందువల్ల, ప్రజలు కొరకు ఉద్దేశించింది కావటం వల్ల హితవుతో కూడిన భావాలను కలిగి ఉండటం మొదలైన కారణాల రీత్యా ‘ప్రజా వాగ్గేయ సాహిత్యం’ అనే మాటను సార్థకంగా వాడుతున్నారు. దీనిలో ‘సాహిత్యం’ అనే పదం విస్త•తిని తెలియ జేస్తుంది. వాగ్గేయం, వాగ్గేయ కవిత అనేది వాడుకలో ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక శాఖగా ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కనుక ‘ప్రజా వాగ్గేయ సాహిత్యం’గా వ్యవహరించడం సముచితమని భావించి వాడటం జరిగింది. ‘వాగ్గేయం’ వాగ్గేయ కవిత్వం’ అని వ్యహరించినప్పుడు కంటే వాగ్గేయ సాహిత్యం అన్నప్పుడు కలిగే నిండుదనం, ఇచ్చే అర్థ స్ఫూర్తి. ఏర్పడే గౌరవం గమనించ దగింది. వాగ్గేయ సాహిత్యం ఎన్నో విధాలుగా విశిష్టమైనదని పండిత పరిశోధకులు నిరూపించి ఉన్నారు. అదే విధంగా ప్రజా వాగ్గేయ సాహిత్యం కూడా ఎంతో వైశిష్ట్యాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ తరహా గేయ కవిత్వాన్ని గురించి విపుల పరిశోధనలు జరిగినా గేయ లక్షణాల మీద, వాటి నిరూపణ మీద ఛందస్సులు, గతి వైవిధ్యాల మీద జరిగినవే అధిక భాగం ఉన్నాయి. డా।। జి. చెన్నకేశవరెడ్డిగారి ఆధునికాంధ్ర గేయ కవిత్వం ఈ కోవకు చెందుతుంది. డా।। ఎస్వీ సత్యనారాయణ గారి తెలుగులో ఉద్యమ గేయాలు పరిశోధన వివిధ ఉద్యమాలు నేపథ్యంలో వెలువడిన పరిశోధన. దీనిలో జాతీయోద్యమం మొదలుకొని అభ్యుదయ, విప్లవ ఉద్యమాలకు వరకు వెలువడిన గేయాల గురించి పరిశోధన సాగింది.
ఆయా పరిశోధనల దృష్టి కోణం వేరు కావడంతో పరిశోధకులు గేయం, గీతం, పాట, గేయరూపం తదితరమైన వాటి గురించి రూపపరమైన భేదాలను చర్చించారు. పరిశోధన అవసరాలను బట్టి వస్తు, ఛందస్సులను పరిశీలించారు. ఉద్యమ సందర్భాలలో వెలువరింపబడిన గీతాలను లేదా గేయాలను వివిధ దశలుగా విభజించి పరిశీలించారు. తెలుగులో గేయ కవిత్వం మీద సాగించిన పరిశోధకులు ఎవరూ ప్రజా వాగ్గేయ సాహిత్యం అని పిలవలేదు. ఆ కోణంలో పరిశోధించనూ లేదు. అభ్యుదయ గేయాలు లేదా అభ్యుదయ ఉద్యమ గీతాలు అని వ్యవహరించారు. విప్లవోద్యమంకు సంబంధించిన గేయాలను లేదా పాటలను విప్లవోద్యమం – పాట అనే దృష్టితో చూశారు. తెలుగు సాహిత్యంలో గేయం ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. సాధారణంగా పద్యరూపం తరువాత గేయం, ఆ తదుపరి పాట, ఉద్యమ గీతం లాంటి పేర్లతో గేయ పరిణామ క్రమాన్ని అనుశీలించడం జరిగింది.


అయితే ఏ పక్రియ లేదా కవితా రూపమైన సరే కాలనుగతిలో పరిణామం పొందుతూ ఉంటుంది. సాహిత్య, సామాజిక పరిణామ క్రమాన్ని అనుసరించి కొన్ని మార్పులు అనివార్యంగా వివిధ పక్రియలు, కవిత రూపాలు మారుతూ ఉంటాయి. వివిధ సాహిత్య పక్రియలకు పేర్లు ఏర్పడటం అనేది రూపపరమైన, దృక్పథగతమైన విశిష్టతలను బట్టి జరుగుతుంది. భావ కవిత్వం ప్రబలంగా ఉన్నప్పుడు వాటిని భావ గీతాలుగా పిలిచారు లేదా కాల్పనిక గేయాలు అని వ్యహరించారు. జాతీయోద్యమం నడిచిన కాలంలో ఖండ కావ్యాలు ఎన్ని వచ్చాయో దేశభక్తిని రగుల్కొలిపే గేయాలు వచ్చాయి. అభ్యుదయ కవిత్వోద్యమం ప్రచలితంగా ఉన్న కాలంలో అభ్యుదయ గీతాలు, అభ్యుదయ గేయాలు, అభ్యుదయోద్యమ గీతాలు అని ‘అభ్యుదయం’ అనే మాటను దృక్పథాన్ని, తత్ప్రాధాన్యాన్ని సూచించటం కోసం వాడారు. ఇక విప్లవోద్యమ కాలంలోనూ విప్లవ గీతాలు, విప్లవ గేయాలు విప్లవోద్యమ పాటలు అంటూ వ్యవహరిచబడటం జరిగింది. విప్లవసాహిత్య ఉద్యమ ఉధృతి కొంత వెనకపట్టు పట్టిన తరువాత కూడా ఆయా ఉద్యమాల ప్రభావం కొనసాగింది. వామపక్ష భావాల చేత ప్రేరితులైన కవులు రాసిన సాహిత్యాన్ని కొంత సడలింపు నిచ్చి ఒక తటస్థ పదంగా, విస్త•తార్థంలో ప్రజా వాగ్గేయ సాహిత్యం, ప్రజా వాగ్గేయ కవిత్వం లాంటి పదాలతో సూచించటం జరిగింది. ఈ దృష్టితోనే ఈ తరహా సాహిత్యాన్ని ప్రజా వాగ్గేయ సాహిత్యంగా స్థిరపరచటం కోసం, ఇదొక ప్రత్యేక శాఖగా, పక్రియగా పరివృద్ధి పొంది ఉండటం వల్ల వర్తమాన, భవిష్యత్‍ సాహిత్య పరిశోధనల అవసరాల ప్రాతిపదికగా ప్రజా వాగ్గేయ సాహిత్యంగా పరిగణించడం జరుగుతున్నది.
అభ్యుదయ, విప్లవ, బహుజన తదితర సామాజిక, రాజకీయ ఉద్యమాల నేపథ్యంలోంచి వచ్చిన కవులు రాసిన గేయాలను, వారు సృష్టించిన గేయ సాహిత్యాన్ని ప్రజా వాగ్గేయ సాహిత్యంగా చూడటం జరుగుతున్నది. ప్రజా వాగ్గేయ సాహిత్యం లేదా ప్రజా వాగ్గేయ కారులు రాసిన గీతం లేదా పాట లేదా గేయాల మొత్తాన్ని ఈ విధంగా పిలవడం జరుగుతున్నది. ఇటువంటి ప్రజా వాగ్గేయ సాహిత్యం యొక్క లక్షణాలను ఈ విధంగా క్రోడీకరించవచ్చు.


1. అభ్యుదయ, విప్లవ, ఇతర సామాజిక ఉద్యమాల నిబద్ధత ఈ తరహా సాహిత్యంలో ఉంటుంది.
2. వామ పక్ష ఉద్యమాల ప్రభావం కారణంగా విప్లవ దృక్పథం ఉంటుంది.
3. ఆయా సంఘాలలో సభ్యులు కానందువల్ల కొంత ఉదార లక్షణం ఉంటుంది.
4. స్థూలంగా ఇటువంటి సాహిత్యం ఏ ఒక్క అంశాన్ని లేదా దృక్పథానికి మాత్రమే కట్టుబడి ఉండదు.
5. ప్రజా సమస్యల మీద పూర్వ ఉద్యమాల అవగాహన వల్ల ఏర్పడిన దృష్టికోణం ప్రతిఫలిస్తూ ఉంటుంది.
6. ఉద్యమ నిబద్ధత కంటే గేయంలో ప్రజా సమస్యలను అధికంగా వివరించే లక్షణం ఉంటుంది.
7. పడికట్టు పదాలతో కూడిన రచనగా ఈ గేయం లేదా ఈ తరహా సాహిత్యం ఉండదు.
8. జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు గేయాత్మక స్పందన ఉంటుంది.
9. ఏ ఒక్క ప్రత్యేక ఉద్యమం తోటి మమేకం కాకుండా కలగలుపుతో కూడిన విస్త•త అవగాహనను ఎరుక పరచే లక్షణం ఉంటుంది.
10. సామ్రాజ్యవాద వ్యతిరేకతను ఈ తరహా సాహిత్యం ప్రదర్శిస్తుంది.
11. పెట్టుబడిదారీ విధానాలను లాభా పేక్ష మార్కెట్‍ శక్తుల వైఖరులను నిరసించడం, ప్రతిఘటించే లక్షణం ఉంటుంది.
12. అంతర్జాతీయ వైఖరిని, స్థానిక అనుభవాల ఆధారంగా ప్రతిబింబించటం ఉంటుంది.
13. అభివృద్ధి, ప్రగతి లాంటి మాటలను విశ్వాసంలోకి తీసుకొని లక్షణం, వీలయితే వాటి పట్ల నిరాకరణ గుణం ప్రతిబింబిస్తూ ఉంటుంది.
14. సకల ఆధిపత్యాలను తిరస్కరించే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది.
15. స్థానిక సమస్యలను స్థానిక ప్రజలను సుడికారంలో స్థానికులకు ప్రభావితం పరచడం కోసం ఉద్దేశింపబడి ఉంటుది.
16. అన్నిటితో పాటుగా గానానుకూలతతో పాటు దీనిని ఒక నాటకీయతతో కూడిన ప్రదర్శనాత్మక స్వభావం గల కథనంతో కూడిన కవితా లక్షణాన్ని కలిగి ఉంటుంది.
17. వాగ్గేయ కారుడు తన కర్త•త్వంలో రూపొందిన గేయాన్ని తానే అభినయాత్మకంగా పాడి ప్రదర్శించ గల సౌలభ్యం ఉంటుంది.
18. భిన్న ఉద్దేశాలు, భిన్న దృక్పథాలను ఏక కాలంలో తనలో ఇముడ్చుకుని ఉంటుంది. సాహిత్య సౌందర్య వ్యక్తీకరణను కలిగి ఉంటూ అలంకారితలో నిండి ఉంటుంది. ఇట్లాంటి భిన్న లక్షణాలను ఈ వాగ్గేయ సాహిత్యం కలిగి ఉంటుంది.


వాగ్గేయకార లక్షణాలు :
శార్గ్జ్ఞ దేవుడు తన సంగీత రత్నాకరములో ప్రకీర్ణకాధ్యాయంలో ఉత్తమ వాగ్గేయ కార లక్షణాలను ఈ విధంగా పేర్కొన్నాడు.
1. వాజ్ఞ్మౌతు రుచ్యతే గేయం ధాతురిత్యభిధీయతే
వాచం గేయంచ కురుతే యః స వాగ్గేయ కారకః
మాతు, ధాతు నిర్మాణములను రెండిటినీ చేయగలవాడు.
2. ‘శబ్దాను శాసన జ్ఞాన మభిధాన ప్రవీణతా
ఛన్దః ప్రభేద వేదిత్య మలంకారేషు కౌశలమ్‍
శబ్దాను శాసన జ్ఞానము, నైఘంటుక శబ్ధపరిజ్ఞానమును ఛన్ద ప్రభేద వేదిత్యమును, అలంకార శాస్త్ర జ్ఞానమును కలిగి ఉంటాడు.
3. రసభావపరిజ్ఞానం, దేశ స్థితిషు చాతురీ
అశేష భాషా విజ్ఞానం కల శాస్త్రేషుకౌశలమ్‍
రసభావ పరిజ్ఞానమును, దేశకాల పరిజ్ఞానము, అశేష భాషా జ్ఞానము, సంగీతాది కళల యందును, శాస్త్రములందును కౌశలమును.
4. తూర్యత్రితయ చాతర్యం హృదయ శారీర శాలతా
లయతాల జ్ఞానం, వివేకోనేక కాకుషు,
వృత్త తీతమందలి నేర్పు, హృద్యమైన గాత్రము లయ తాళ కళాజ్ఞానము, స్వరకాకువు, రాగ కాకువు
అన్యరాగ కాకువు, క్షేత్ర కాకువు, యంత్ర కాకువు
అనెడు గాన పద్ధతిలోని వివిధములైన యాసలయందు పరిజ్ఞానము.
5. ప్రభూత ప్రతి బోద్భేద భావత్వం సుభగగేయతా
దేశి రాగేష్వభిజ్ఞానం వాక్పటుత్యం, సభాజ్యతే
ప్రతిభ, సుభగగేయత, దేశిరాగాలను గూర్చి జ్ఞానము
వాక్పటుత్వము….. మొదలైన వాటితో పాటుగా
రోషద్వేష పరిత్యాగము, సార్ద్రత్వము, ఉచితజ్ఞత
నూత్నధాతు వినిర్మాణ సామర్థ్యము, పరచిత్త పరిజ్ఞానము.
ద్రుత గీత వినిర్మాణము, పదాంతర విదగ్థత, త్రిస్థాన గమక ప్రౌఢి, వివిధాలప్తి నైపుణ్యాము చిత్తై కాగ్రత అను లక్షణములు కలిగి యున్నట్టి వాడు ఉత్తమ వాగ్గేయ కారుడు ఉత్తమ వాగ్గేయ కారులు గురించి ఇంత సూక్ష్మగా లక్షణీకరించిన శార్జదేవుడి లక్షణాలు ఆధునిక కాలంలోని ప్రజా వాగ్గేయ కారులకు అన్నీ వర్తించకపోవచ్చు. కానీ కొన్ని ఏకాలం నాటి వాగ్గేయ కారుడికైనా వర్తిస్తాయి. వీటిల్లో ముఖ్యమైనవిగా ఇలా పేర్కొనవచ్చు.
శబ్దశాసన జ్ఞానం, నిఘంటు శబ్ద పరిజ్ఞానం, ఛన్దస్సుల్లో తేడాలు తెలిసి ఉండటం, అలంకార శాస్త్రజ్ఞానం, రసభావ పరిజ్ఞానం, దేశకాల పరిజ్ఞానం, అధికజ్ఞానం సంగీతం మొదలైన కళాశాస్త్రాలలో నేర్పరితనం, హృద్యమైన గాత్రం, కాకువుల్లో రకరాల యాసల పరిజ్ఞానం దేశిరాగజ్ఞానం, ప్రతిభ, సుభగగేయత తదితరమైనది. ఎంతో ముఖ్యమైనది. ఇవి వాగ్గేయకారులందరిలో సర్వ సంపూర్ణంగా ఉంటాయని, ఉండాలని కాదు. ఇవి ఉంటే ఉత్తమ వాగ్గేయకారుడు అనిపించుకుంటాడు.
ఇవన్నీ కాకపోయినా వాగ్గేయ కారుల్లో ఈ లక్షణాలు అవసరమైన మేరకు కనిపిస్తాయి. ఇవే కాకుండా శార్జ దేవుడు పేర్కొనని లక్షణాలు కూడా కొద్దిమంది ప్రతిభావంతులైన వాగ్గేయ కారులలో ప్రత్యేకంగా కనిపించవచ్చు. తాళ్లపాక కవుల రచనల గూర్చి దివాకర్ల వేంకటావధాని ఇలా అంటారు ‘‘తాళ్ళపాక కవుల రచనలలో భక్తి యెంతో కవిత్వమంతః కవిత్వమెంతో సంగీతమంత, సంగీత మెంతో వైవిధ్యమంత, వైవిధ్యమెంతో యలంకార ప్రీతియంత వాగ్గేయకారుల వాగ్గేయ రచనలో ప్రజానుకూల దృక్పథమెంతో కవిత్వమంత, కవిత్వమెంతో సంగీతమంత, సంగీతమెంతో వైవిధ్యమంత, వైవిధ్యమెంతో, అలంకార ప్రతీ కూడా అంతే కనిపిస్తుంది. ఈ కారణంగా ప్రజా వాగ్గేయకారులు సృష్టించిన వాగ్గేయాలను ప్రజా వాగ్గేయ సాహిత్యంగా పరిపూర్ణంగా అంగీకరించడానికి, దీనినొక ప్రత్యేక ప్రతిపత్తి గల పక్రియ భేదంగల సాహిత్య శాఖగా చూడాలి. ఈ దిశగా ఈ శాఖలోని భిన్న కోణాలను ఆవిష్కరించడానికి పరిశోధనలు సాగాలి. అటువంటి ప్రయత్నంలో భాగమే ప్రజా వాగ్గేయ సాహిత్యం పర్యావరణ తత్వం అనేది.


పదం – గీతం – గేయం – పాట:

ఇంచుమించుగా పదం నుంచి పాట వరకు వివిధ సందర్భంలో ప్రయోగింప బడుతున్న మాటలు సమానార్థకాలు గానే భావించాలి. ప్రచార ప్రబోధాలకు గేయం అత్యుత్తమ సాధనమని చెప్పవచ్చు. పాడు కోవడానికి అనువైన పక్రియగనుక దీనికి చాలా ఆదరం లభించింది. ఆత్మాభివ్యక్తికి గేయం ప్రధాన వాహిక… మనసులో మెదలిన భావాల్ని సూటిగా చెప్పడానికి సామాన్యుడికి సైతం అవకాశం యిచ్చిన పక్రియ గేయం. గేయానికి ప్రచారం, ప్రబోధం అనే రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. రెండవది పాడుకోగల వీలు, మూడవది ఆత్మాభివ్యక్తి వెసలు బాటు ముఖ్యంగా ఉంటాయి.
సాహిత్యంలో పద్యం కంటే పదం ముందు పుట్టిందనే విషయాన్ని ఎంతోమంది పరిశోధకులు రూఢి పరిచారు. పాటకు పర్యాయ పదంగా ‘పదం’ను వాడుతూ ఉన్నట్లు పాల్కురికి సోమనాధుడి పండితారాధ్య చరిత్ర నిదర్శనంగా నిలుస్తుంది.
‘‘పదములు తుమ్మెద పదముల్‍ ప్రభాత
పదములు పర్వత పదము లానంద
పదములు వెన్నెల పదములు సంజ
వర్ణన మరిగణ వర్ణన పదము
లర్ణన ఘోష ఘూర్ణిల్లు చునుండు
బాడునాడుచు బరమహర్షమున’’
బహు విధాలయిన పదములను ప్రజలు పరమ హర్షముతో ఆడుతూ పాడుతూ ఉండేవారని పాల్కురికి సోమనాధుడు వర్ణన ద్వారా తేలుతున్నది. నన్నెచోడుని కుమారసంభవంలో కూడా పదములు, పాటల ప్రస్తావన ఉండటం గమనార్హం. బసవపురాణ కాలం నాటికి భక్తులు ఏ పాటలు పాడుకునే వారో అవే పాటలు మాతృకగా
ఉన్నాయని సోమనాథుడు పేర్కొన్నాడు.
‘‘ఆతత సకల పూరాతన భక్త
గీతార్థ సమితియే మాతృకగాగ’’
‘పదం’ను పాటకు పర్యాయ పదంగా వాడుతూ ఉన్నప్పటికి ఈ రెంటి మధ్య కొంత భేదమున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ‘‘పాట లేక గీతం గాన ప్రధానమైనది. పదం అభినయ ప్రధానమైనది. క్షేత్రయ్య పదాలు అందుకు ఉదాహరణలు’’.
దీనిని బట్టి చూస్తే అభినయం, గానం అనేవి పదం నుంచి పాటను విడదీసి చూపుతున్న అంశాలు. క్షేత్రయ్య పదాలు అభినయాత్మకాలు. అన్నమయ్య పదాలు అభినయాత్మకాలు, గానయోగ్యాలు. పైగా అన్నమయ్యను పద కవితా పితామహుడిగా గౌరవిస్తూ ఉండటం చేత ‘పదం’ అనే మాట ‘పాట’కు ‘గేయం’కు సమానార్థకంగా ఆధునికంగా ఎవరూ వాడటం లేదు. బహుశా అన్నమాచార్యుల వారి పదాలకు దక్కిన గౌరవానికిది సూచన కావచ్చు. కాగా ఆధునిక కాలంలో గీతం, పాట, గేయం దాదాపుగా సమానార్థ కాలుగానే ప్రయోగంలో ఉన్నాయి. దీనిలో ‘గీతం’ అనేది భావాలాలిత్యంలో కూడిన పాటలకు ఎక్కువగా వాడబడింది. అలాగని ‘అభ్యుదయ గీతాల’ విప్లవ గీతాలు లాంటివి ప్రయోగం లేవని కాదు. ‘‘పదము లేక పాట గేయమునకు పర్యాయపదముగా వాడబడినది. గాగౌతుమ్‍ యోగ్యమ్‍ గేయమ్‍’ పాడుట కనువైనది గేయము అని నిష్కర్షగా తేల్చి చెప్పారు. పరిశోధకులు, గాన యోగ్యత కలిగినది గేయము అని పేర్కొనవచ్చు. ఏ కవిత్వమైన పురుడు పోసుకునేది పాటతోనే. ఇంతకూ పాటా గేయం ఒకటే. గానయోగ్యం గేయం కదా. సుప్రసిద్ధ కవి సి.నారాయణరెడ్డి. దాదాపుగా పరిశోధకులందరూ గేయం, అంటే గానయోగ్యతా గుణాన్నే ప్రధానీకరించి చెప్పారు. పదం, గీతం, అనేవి పరిమిత అర్థంతోనే మిగిలిపోగా గేయం, పాట అనేవి మాత్రమే మిగిలాయి. దీన్లోను పాట అనేది సినిమాకు సంబంధించిన వ్యవహారంగానే మిగిలి పోయింది. ఆధునిక కవిత్వంలో గేయాలను గేయ కావ్యాలు, ప్రణయ గేయాలు, ప్రకృతి వర్ణనాత్మక గేయాలు, దేశభక్తి గేయాలు, సాంఘిక లేదా సంస్కరణాత్మక గేయాలు, భక్తి లేదా సంస్కరణాత్మక గేయాలు, గేయ నాటికలు, పలు విధాలుగా విభజించారు. గేయానికి ఉన్న ప్రయోగ విస్తృతి దృష్ట్యానే ప్రజా వాగ్గేయ కారులు సృష్టించిన గేయాలను వాగ్గేయ సాహిత్యంగా పిలవటం జరిగింది. అయితే ఈ వాగ్గేయ కార లక్షణాన్ని గూర్చి సవివరంగా ఆచార్య జి.ఎన్‍.రెడ్డిగారు వాగ్గేయకారుడు అంటే వాక్‍+గేయం=వాక్కును, గేయాన్ని చేసే నేర్పుగలవాడు. వాక్కారుడూ గేయకారుడూ అయిన వాడు వాగ్గేయ అని తెలుసుకోవాలి వాక్కునే గేయంగా కలిగినవాడు. వాక్కుకు గాన యోగ్యతను ఇవ్వగలిగినవాడు వాగ్గేయ కారుడు. వాగ్గేయం అంటే భాషాపరంగా చెపితే పాట లేదా గేయంలోని మాటలు, దీనిని వాక్కు అంటారు. ఇక సంగీత విషయంగా గేయం లేదా పాటకు రాగంను లక్షణ బద్ధంగా నిర్ణయించడం. అంటే సంగీతాన్ని కూర్చటం. దీనిని మరికొంత వివరంగా చెపితే సంగీతపు పరిభాషలో వాక్కును అంటే, పాటల్లోని మాటల కూర్పును మాతువు అనీ, గేయాన్ని అంటే సంగీతపు కూర్పును ధాతువు అనీ వ్యవహరిస్తారు. ‘వాగ్గేయ కారుడు’ అన్నప్పుడు వాక్కరుడు వాక్కును (మాతువును) కూర్చగలవాడని గ్రహించాలి. అంటే గేయకారుడు వాక్కారుడు, గాయకుడు అయిన వాడే వాగ్గేయకారుడు అని భావించాలి.
ఈ వాగ్గేయ కారుల రచనలు జానపద కవుల రచనలకు సన్నిహితంగా కనిపిస్తాయి. వీరి భాష ప్రజల భాష. ఇటు వంటి వారు అనేక మంది సాహిత్య చరిత్రలో కనిపిస్తారు.


తెలంగాణలో రామదాసు రచించిన కీర్తనలు వాగ్గేయ సాహిత్యంగా పేర్కొన దగినవి. ‘‘వాగ్గేయ కారులంతా కర్ణాటక సంగీతాన్ని ఆధారం చేసుకొని కీర్తనలు రచించారు’’. తెలంగాణకు చెందిన వాగ్గేయ కారులలో కనిపించే లక్షణం రాజ్యం పట్ల ధిక్కార ప్రదర్శన. వీరిలో మరొక లక్షణాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. ఈ వాగ్గేయ కారుల్లో మరో వినూత్నత కనిపిస్తుంది.
సాహిత్యమంటే కేవలం బ్రాహ్మణులదే అనే గీతలను చెరిపివేస్తూ మాదిగ కులం నుండి తొలి దళిత వాగ్గేయకారుడు దున్నా ఇద్దాసు వెలుగు చూశాడు. అలాగే బహుజనులైన మన్నెం కొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరి హనుమద్దాసులు గేయాలు రచిస్తూ ప్రజల్లో ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగా తమను అవమానించిన బ్రాహ్మణులపై వీరు తిరుగబాటును కూడా ప్రదర్శించారు.
హృదయ పరివర్తనలో భగవంతుని దర్శించాలంటే, ఒకరిని తక్కువగా చూసే అసమదృష్ణిని తృణీకరించుకోవాలని సూచించారు. ఆ విధంగా సంస్కరణ దృష్టితో పాటు, భక్తి భావనతో ఆశ్రమాలను నిర్మించి వందలాది మంది శిష్యులను సంపాదించుకున్నారు. ఇలా ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే ఆధునికంగా వర్తమాన ప్రజా ఉద్యమాల నేపథ్యంలో ప్రజా వాగ్గేయం చారిత్రక అవసరంగా రూపొందింది.


ప్రజావాగ్గేయ సాహిత్యం – ఆవిర్భావం :
తమ స్వీయ సృజనాత్మక రచనా గాన శక్తితో అపూర్వ గేయ కవిత్వం సృష్టించిన కవులు ఎవరు తాము సృష్టించిన సాహిత్యాన్ని ప్రజా వాగ్గేయ సాహిత్యం అని వ్యవహరించలేదు. తదనంతరకాలంలో ఈ పేరు క్రమంగా వాడుకలోకి వచ్చి స్థిరపడింది. ‘‘ప్రజలు మేలు కోరి, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే సాహిత్యన్నే ప్రజా వాగ్గేయ సాహిత్యంగా భావించవచ్చు. ప్రజలనుంచి వచ్చిన వాగ్గేయ కారులే ఈ సాహిత్యానికి సృష్టికర్తలు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ సృష్టించిన ఈ సాహిత్యమే అసలైన ప్రజా వాగ్గేయ సాహిత్యం, స్వయంగా రాసి పాడే నైపుణ్యమున్న ప్రజా కళాకారులు ఉద్యమంలో ప్రజా వాగ్గేయ కారులుగా రూపొందారు.


-డా।। ఆర్‍. సీతారామారావు,
ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *