లాక్‍డౌన్‍లో బాలలకు వరం బాలచెలిమి గ్రంథాలయం

జల్లెపల్లి గ్రామం, తిరుమలాయపాలెం మండలం,  ఖమ్మం జిల్లా

చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ మరియు బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలచెలిమి గ్రంథాలయములు లాక్‍డౌన్‍ కాలంలో బాలలకు మంచి వరములా ఉపయోగపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో గల జల్లెపల్లి గ్రామంలో చిల్డ్రన్‍ ఎడ్యుకేషనల్‍ అకాడమీ మరియు బాల చెలిమి ఆధ్వర్యంలో బాలచెలిమి గ్రంథాలయంను ఏర్పాటు చేయడం జరిగినది. మహనీయుల చరిత్రలు, కథలు, అనువాద కథలు, సైన్స్ & టెక్నాలజీ, విజ్ఞానం, వినోదం వంటి పుస్తకాలను గ్రంథాలయానికి అందజేయడం జరిగింది. గత మార్చి నెలలో ఈ గ్రంథాలయంను ప్రారంభించించడమైనది.

అభిప్రాయములు :



బాలచెలిమి పత్రికవారు రాష్ట్రంలో ఎన్నో పాఠశాలలు ఉన్నా మా జిల్లాలో మా పాఠశాలలో బాలచెలిమి గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ లాక్‍డౌన్‍లో విద్యార్థులకే కాకుండా గ్రామంలో యువ కులకు, పెద్దలకు చదువు కోవడానికి ఈ గ్రంథాలయం ఎంతో ఉపయుక్తంగా ఉంది. శానిటైజర్లు, మాస్కులు అందజేస్తూ ప్రజల్లో కరోనాపట్ల అవగాహన కల్పిస్తూ, పుస్తకాలను ఇంటింటికి అందజేస్తున్నాం. విజ్ఞానాన్ని పెంచే ఉపయుక్తమైన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి అందజేసి ముందుకు నడుపుతున్న బాలచెలిమి పత్రిక వారికి మేము మా గ్రామం ఎంతో ఋణపడి ఉంటాం. ఇక ముందు కూడా ఇటువంటి పుస్తకాలు ఎన్నో అందజేయాలని, మా పిల్లలు రాస్తున్న కథలకు ఆదరణ కల్పించేలా పుస్తకరూపం ఇవ్వాలని కోరుకుంటున్నాను.   -మక్సూద్‍ అలి, ప్రధానోపాధ్యాయులు, జల్లేపల్లి


మా గ్రామంలో బాలచెలిమి గ్రంథాలయం నెలకొల్పడం ఎంతో ఆనందగా ఉంది. ఈ లాక్‍డౌన్‍ కాలంలో మేము ఇంటి వద్దకే పుస్తకాలు తీసుకొని వెళ్ళి చదువుతున్నాము. నేను ‘‘పెంపుడు తండ్రి’’ ఉక్రెనియన్‍ జానపద గాథలు-1 పుస్తకం చదివాను. ఎంతో ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా సంతోషంగా మమ్మల్ని చదువు కొమ్మంటున్నారు. బాలచెలిమి గ్రంథాలయం నెలకొల్పిన బాలచెలిమి వారికి, మా తెలుగు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.  -ఎ. నాగేశ్వరి, 9వ తరగతి, జల్లేపల్లి


లాక్‍డౌన్‍లో బాలచెలిమి గ్రంథా లయం మాకే కాకుండా మా ఊరిలో పెద్దలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మాతోపాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఈ గ్రంథాలయం నుంచి పుస్తకాలు ఇంటికి తీసుకుపోయి చదువుతున్నాం. ‘‘రవీంధ్రనాథ్‍ ఠాగూర్‍’’ పుస్తకం చదవడం ఎంతో ఆనందంగా ఉంది. – ఎ. నాగచైతన్య, 8వ తరగతి, జల్లేపల్లి


మా పాఠశాల ఉన్నప్పుడు బాలచెలిమి గ్రంథాయలంలో రోజూ చదువుకున్నాము. ఇప్పుడు లాక్‍డౌన్‍లో కూడా మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటి వద్దకే పుస్తకాలు తీసుకుపోయి చదువుతున్నాను. ఈ వారం రోజుల్లో ‘‘చతురతకు బహుమానం’’ పుస్తకం చదివాను. ఎంతో ఆనందంగా ఉంది. పొద్దాక టీవీలు, సెల్‍ఫోన్‍లు చూడకుండా పుస్తకాలు చదువుతుంటే మా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతున్నారు.    -ఎ. నర్తనశ్రీ, 8వ తరగతి, జల్లేపల్లి


బాలచెలిమి గ్రంథాలయంలో పుస్తకాలు చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు కథలంటే ఎంతో ఇష్టం. చదవడం అన్నా, రాయడమన్నా, వినడమన్నా ఇష్టం. ఈ లాక్‍డౌన్‍లో బాలచెలిమి గ్రంథాలయం నుండి పుస్తకాలు తీసుకెళ్ళి ఇంటివద్ద చదువుతున్నాను. ‘లియోటాల్‍స్టాయ్‍’ రాసిన కథలు చదివాను. ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మా తోటి మిత్రులకు కూడా చదవమని ప్రోత్సహిస్తున్నాను. బాలచెలిమి పత్రికవారికి, మా తెలుగు  ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.  -పి.వివేక్‍, 9వ తరగతి, జల్లేపల్లి


పుస్తకాలు చదవడం వలన మస్తకాలు వికసిస్తాయి. పుస్తకాలు చదవడం తగ్గిపోతున్న రోజులలో మా జల్లేపల్లి గ్రామంలో బాలచెలిమి గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మా పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు కూడా మా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు తీసుకుపోయి చదవడం అభినందనీయం. మహనీయుల జీవిత చరిత్రలు, అనువాద కథలు, పిల్లలకు బాగా నచ్చుతున్నాయి. ఇంత విలువైన జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా మా విద్యార్థులకు, గ్రామస్తులకు ఇచ్చిన బాల చెలిమి గ్రంథాలయం వారికి ధన్యవాదాలు. అంతే కాకుండా ఈ లాక్‍డౌన్‍లో పుస్తకాలు చదవడం ఇష్టంగా మలుచుకొని చదువుతున్న మా విద్యార్థులకు, గ్రామస్తులకు అభినందనలు. – కొమ్మవరపు కృష్ణయ్య, తెలుగు ఉపాధ్యాయులు, జల్లేపల్లి

-కట్టా ప్రభాకర్, 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *