మునులగుట్ట – రెండు శాసనాలు

శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కొడుకు హకుసిరి శాసనం దొరికింది. ఈ మధ్యనే ఆ శాసన సారాంశం వెలుగు చూసింది. ఈ గ్రామంలోనే పెద్దగుట్టగా స్థానికులు పిలుచుకునే ‘పెద్దగుట్ట’, చరిత్రకారులు రాసిన పేరు మునులగుట్ట’ మీద 5 కాదు 6 రాతిపడకలున్న రాతిగుహ వుంది. ఇది జైనులస్థావరమని పివి పరబ్రహ్మశాస్త్రి వంటి చరిత్రకారులు, కాదు బౌద్ధుల వస్సా (వర్షా) వాసమని కుర్రా జితేంద్రబాబు మొదలైన చరిత్రకారుల అభిప్రాయాలున్నాయి. కాని, పెద్దపల్లివాసి ఠాకూర్‍ రాజారాం సింగ్‍ మునులగుట్ట మీద పెద్ద ఇసుకరాతిఫలకం మీద స్వస్తిక్‍, త్రిరత్న చిహ్నాలున్న బ్రాహ్మీలిపి లఘుశాసనం వున్నట్లు Pre-satavahana Andhra kings (Satavahana  Special Andhra Pradesh Journal of Archaeology,1990) అనే వ్యాసంలో రాసాడు.
తెలంగాణజాగృతి చరిత్రబృందం పరిశోధకుడు సునీల్‍ సముద్రాల మునులగుట్ట మీద క్షేత్రపరిశోధన చేసినపుడు ఒకటి కాదు రెండు బ్రాహ్మీలిపి శాసనాలు వెలుగుచూసాయి. శ్రీరామోజు హరగోపాల్‍ ఈ శాసనాల గుర్తింపు, పరిష్కరణలో గైడ్‍గా పనిచేసారు.

అందులో ఒకటి ఠాకూర్‍ రాజారాం సింగ్‍ చూసిందే. మరొకటి కొత్తది.
మునులగుట్ట మీద తలదిండ్లు చెక్కిన 5 రాతిపడకలున్నాయని ఇప్పటిదాకా అందరికి తెలుసు మరొక పెద్ద రాతిపడకను సునీల్‍ గుర్తించాడు. గుహ బయట తొలిచిన నీటితొట్టి(నీటికుండం) వుంది.
పెద్ద రాతిఫలకం మీదున్న మొదటి బ్రాహ్మీశాసనం ఒక పంక్తిలో వుంది. లిపి జీర్ణమై పోయింది. (ఎడమవైపు) స్వస్తిక్‍ సవ్యదిశలో చెక్కి వుంది. శాసనంలో 1
ఎడమవైపు స్వస్తిక్‍ చిహ్నం ‘‘కాస….. ధ పా(ద) దానం’’ కుడి వైపున చెదిరిపోయిన త్రిరత్న చిహ్నంతో ప్రాకృతభాష, బ్రాహ్మీలిపిలో వేయబడిన దాన శాసనం. లిపి క్రీ.పూ.1 లేదా క్రీ.శ.1వ శతాబ్దానికి చెందినది.
కాస(ప) అనునతడు బుద్ధపాదాలు దానం చేసివుంటాడు. బుద్ధ పాదాలను అన్వేషించవలసివుంది. శాసన ఫలకం కింద 2,3 కూర్చొనేంత స్థలం వున్న గుహ ఒకటి వుంది.
ఈ గుట్ట మీదనే మరొక చోట లభించిన కొత్త శాసనంలో
‘‘మణికరస సామి రేవస ధమథానం
…… సివ.. పాలితస వాపి’’ అని క్రీ.పూ.1 లేదా క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీలిపిలో, ప్రాకృతభాషలో శాసనం చెక్కబడి వుంది2.
మణికారుల3 (మణులను చెక్కే శిల్పకళాకారుడు) సామి (స్వామి, యజమాని) ‘రేవ’ ఆదేశంతో ‘సివప’ అనే అతను ఆ(బౌద్ధ) ధర్మస్థలంలో బావిని పాలించాడని (నిర్వహించాడని) భావం. రాతి పడకలున్న గుహ బయటి నీటితొట్టి (బావి) యిదే. శాతవాహనకాలంనాటి ఈ రెండు శాసనాలు తెలంగాణ చరిత్రకు చేర్చిన కొత్తపుటలు.


కోటిలింగాల చుట్టు బౌద్ధధర్మ స్థలాలెన్నో వున్నాయి. ధూళికట్ట, పాశిగాం, కంభాలపల్లె వంటి స్తూప, చైత్యాలున్న ప్రదేశాలు. కోటి లింగాలను చుట్టిన దాదాపు 30 గ్రామాలలో బౌద్ధానికి సంబంధించిన పురావస్త్వా ధారాలు లభిస్తూనే వున్నాయి.
శాతవాహన చక్రవర్తి, దక్షిణాపథపతి సాతకర్ణి, నాగానికల పుత్రుడు కుమార హకుసిరిని పేర్కొంటున్న శాసనం మొక్కట్రావు పేటలో గతంలో లభించింది. ఈ శాసనం ప్రాకృత భాషాశాసనం. లిపి క్రీ.పూ.1వ శతాబ్దపు బ్రాహ్మి. శాసనం 3 పంక్తులలో
‘‘అహిమకా నభతి బాలి(ల)కాయ మహ(హా)పురిస దతాయ
అమాచపుతస సివవటుస స ఉపఠా యకినియచ దేయ
చథ బాలి(లి)కాయ హకుసిరియ ఈ దేయ నాగసిరియ గోపియ’’ అని రాయబడింది.4
ఈ శాసనాన్ని పరిష్కరించిన ఏఎస్సై ఎపిగ్రఫీ శాఖ, మైసూరు- డైరెక్టర్‍ కె.మునిరత్నంరెడ్డి ఈ శాసన సారాంశాన్ని ‘బాలక హకుసిరి ఏలుతున్నపుడు అహిమక (అస్మక)లోని మహాపురి (నగరం) నుంచి నభతి మనవడైన దాత అనే మంత్రికుమారుడు సివవటు నాగసిరి, గోపులకు ఉపఠ యక్షిణి విగ్రహాన్ని, ఛత్రాన్ని కానుకగా ఇచ్చాడ’ని వివరించాడు.
ఈ హకుసిరి ప్రతిమ నానేఘాట్‍ గుహలో నాగానిక శాసనమున్న చోట చెక్కిన సాతవాహన రాజవంశం ప్రతిమలు 6రింటిలో ఒకటిగా చెక్కబడ్డది. ఆ ప్రతిమలిపుడు లేవు కాని, వాటి పేర్లు ప్రతిమల వద్దనే రాసివున్నాయి. వాటిలో సిముక సాతవాహనుడు, సాతకర్ణి, నాగానిక కుమార భాయ, త్రణకయికరో, కుమార హకుసిరి, కుమార సాతవాహనుల పేర్లున్నాయి.
శాసనాన్ని బట్టి బాలక హకుసిరే కుమార హకుసిరి. మహాపురి నగరం నుంచి హకుసిరి పాలించివుంటాడని చెప్పడానికి విప్రపత్తి లేదు. ఆ మహాపురి కోటిలింగాల కావచ్చు.


తెలంగాణాను అస్మక అని చెప్పిన శాసన సాక్ష్యమిది. అస్మక జనపదం తెలంగాణాలోని పాతజిల్లాలు నిజామాబాద్‍, కరీంనగర్‍, వరంగల్‍, హైద్రాబాద్‍, మెదక్‍, మహారాష్ట్రలోని నాందేడులను కలుపుకున్న భూభాగం. మొక్కట్రావుపేటలోనే పెద్ద (మునుల) గుట్ట మీద లభించిన రెండు కొత్తశాసనాలు సాతవాహనుల బౌద్ధమత పోషణకు గొప్ప నిదర్శనాలు. సాతవాహనుల నానేఘాట్‍, నాసిక్‍, కార్లే గుహాశాసనాలు ప్రసిద్ధాలు కదా.


– శ్రీ రామోజు హరగోపాల్‍
ఎ : 9505646046

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *