విచారణే ఓ పెద్ద శిక్ష..!?

తెలుగు కవి ఓ కవితలో ఇలా అంటాడు
‘‘ఎన్నో సంవత్సరాల
విచారణ అనే శిక్షని ఎదుర్కొన్న తరువాత
రాబోయే శిక్ష ఏ పాటిది
ఈ దేశంలో
ట్రయలే ఓ పెద్ద పనిష్మెంట్‍’’

నిజమే. మనదేశంలో ట్రయలే ఓ పెద్దపనిష్మెంట్‍. విచారణ ఖైదీలుగా ఎంతో మంది జైళ్లల్లో బతుకులీడుస్తున్నారు. ఇంకా ఎంతో మంది బెయిల్‍ మీద వుండి విచారణని ఎదుర్కొంటున్నారు. విచారణ తుది దశకి ఎప్పుడు చేరుతుందో తెలియదు. ఎన్ని సంవత్సరాలు వేచి వుండాలో తెలియదు. అప్పీల్లు వగైరాలు ముగించుకొని ఆ ఊబి నుంచి ఎప్పుడు బయట పడతారో అందులో చిక్కుక్కున్న వాళ్ళకి బోధపడదు.
‘విచారణ్‍ పెద్ద శిక్ష’ ఈ స్టేట్‍మెంట్‍ని బలపరచడానికి ఎన్నో కేసులని ఉదహరించవచ్చు. తాజా ఉదాహరణ ప్రేంచంద్‍ కేసు. ప్రేంచంద్‍కి హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‍ అన్న గ్రామంలో చిన్న కిరాణా షాపు వుండేది. ఆయనకు 38 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు అంటే 38 సంవత్సరాల క్రితం ఆయన షాప్‍కి ఫుడ్‍ ఇన్స్పెక్టర్‍ ఆహార తనిఖీ కోసం వచ్చాడు. (ఇప్పుడు ప్రేంచంద్‍ వయస్సు 76 సంవత్సరాలు) ప్రేంచంద్‍ షాపు నుంచి 600 గ్రాముల పసుపుని కల్తీ వుందా లేదానన్న విషయం తెలుసుకోవడానికి 600 గ్రాముల పసుపుని శాంపిల్‍ తీసుకొని ల్యాబ్‍కి పరీక్షల కోసం పంపించాడు. ఇది జరిగింది 18.8.1982 రోజున. ఇద్దరు సాక్ష్యుల సమక్షంలో శాంపిల్‍ తీసుకున్నాడు. పబ్లిక్‍ అనలిస్ట్ ఆ శాంపిల్‍ని పరీక్షించి తన నివేదికను 7.09.1982 రోజున పంపించాడు. ఆ నివేదిక ప్రకారం నాలుగు భోజన పురుగులు, ఇంకా మరో రెండు పురుగులు వున్నాయి. అందుకని అతనిపై ఆహారకల్తీ నిరోధక చట్టప్రకారం కేసు నమోదు చేశారు. ఆ విచారణని పూర్తి చేయడానికి ట్రయల్‍ కోర్టుకి 13 సంవత్సరాలు పట్టింది. చివరికి అతని మీద కేసు రుజువు కాలేదని ట్రయల్‍ కోర్టు తేల్చుతూ తన తీర్పుని 31.8.1995 రోజున ప్రకటించింది. ఈ తీర్పు మీద హర్యానా ప్రభుత్వం హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది. హైకోర్టు ఈ అప్పీలుని పరిష్కరించడానికి హైకోర్టు మరో 14 సంవత్సరాలు తీసుకుంది. పసుపులో కల్తీ జరిగిందని, అతను లైసెన్స్ లేకుండా పసుపుని అమ్ముతున్నాడని హైకోర్టు భావించి ఆరు మాసాల శిక్షని జరిమానాన్ని విధించింది.


ఈ తీర్పుకి వ్యతిరేకంగా ప్రేంచంద్‍ సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు తన తీర్పుని జులై 30, 2020న ప్రకటించి అతని మీద కేసుని కొట్టివేసింది. అంటే సుప్రీంకోర్టు మరో 11 సంవత్సరాల కాలాన్ని తీసుకొంది.
ప్రేంచంద్‍ జీవితంలో సగం జీవితం మూడు కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోయింది. అతను చేసిన నేరం హత్యకాదు. ఆర్థిక నేరం కాదు. ఆహార కల్తీ తీవ్రమైన నేరమే. అందులో రంగుల కల్తీ చేయలేదు. అతని షాపు దగ్గర తీసుకున్న శాంపిల్‍లో భోజన పురుగులు కన్పించాయి. అది కూడా శాంపిల్‍ తీసుకున్న రోజున కాదు. 19 రోజుల తరువాత. ఆ పురుగులు ఆ మధ్య కాలంలో అందులో తయారై వుండవచ్చు. పుట్టి వుండవచ్చు. ప్రేంచంద్‍ అనుభవించిన ఈ ట్రయలనే శిక్షకి కారకులు ఎవరు?
ప్రభుత్వంలో వున్న బ్యూరోకాట్ల నిర్లక్ష్యానికి ప్రేంచంద్‍ బలైనాడా? కోర్టుల్లో జరిగే జాప్యం వల్ల వేదనకి గురైనాడా?
ప్రేంచంద్‍ని నిర్దోషిగా ప్రకటించడానికి ఆ కేసుని విచారించిన కోర్టుకి 13 సంవత్సరాలు పట్టింది. ఆయన పాత కేసులో కూడా అప్పీలు చేయాల్సిన అంశాలు వున్నాయని హర్యానా ప్రభుత్వం భావించి హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది. దీని తరువాత పంజాబ్‍ అండ్‍ హర్యానా హైకోర్టు ప్రేంచంద్‍కి మరో షాక్‍ని ఇచ్చింది. అతనికి శిక్షను విధించింది. అది కూడా 14 సంవత్సరాల తరువాత. అక్కడితో ఆయనకు షాక్‍లకు ముగింపు రాలేదు. అతనికి ఆ కేసునుంచి ఉపశమనం సుప్రీంకోర్టు నుంచి లభించడానికి 11 సంవత్సరాలు పట్టింది. అదృష్టం ఏమంటే ఈ మధ్య కాలంలో అతనికి ఏమీ జరుగలేదు. తుది తీర్పు వచ్చేవరకు అతను బతికే వున్నాడు. ట్రయలనే శిక్షని అనుభవిస్తూ అతను బతికే వున్నాడు.
ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచి ఈ తీర్పుని ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దుచేసి విచారణ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు ధృవీకరించి అతన్ని ఈ కోర్టు బంధనాల నుంచి విముక్తి చేసింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసులో సూక్ష్మ న్యాయ సమస్యలు లేవు.
రికార్డులో వున్న సాక్ష్యాలని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు తన తీర్పుని ప్రకటించింది. అతని షాపు నుంచి సేకరించిన శాంపిల్‍నే పబ్లిక్‍ అనలిస్టే పరీక్షించాడా అనేందుకు కోర్టు ముందు సాక్ష్యం లేదు. ఒకవేళ అది శాంపిల్‍ అయినా కూడా శాంపిల్‍ తీసుకున్న రోజు నుంచి పరీక్ష చేసే రోజు వరకు భోజనపు పురుగులు అందులో తయారయ్యే అవకాశం వుంది. ఈ రెండూ కారణాలు పేర్కొంటూ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయ సూక్ష్మం లేదు. అయినా ఈ కేసు నుంచి బయటపడటానికి ప్రేంచంద్‍కి 38 సంవత్సరాలు పట్టింది.


ఈ కేసులో నేరన్యాయ పక్రియ చాలా రకాలుగా విఫలం చెందింది. ప్రేంచంద్‍ దగ్గర శాంపిల్‍ని తీసుకున్న ఫుడ్‍ ఇన్స్పెక్టర్‍ అనలిస్ట్కి శాంపిల్‍ని పంపించాడు. పంపించినట్టు రశీదుని తీసుకోలేదు. తీసకున్నట్టు కోర్టు ముందు దాన్ని ఉంచలేదు. ఆ శాంపిల్‍ని పరీక్షించడానికి అంత సమయం ఎందుకు పట్టిందో తెలియదు.
ఈ ఆహార కల్తీకేసుల్లో సాధారణంగా ముగ్గురే సాక్షులు వుంటారు. ఫుడ్‍ ఇన్స్పెక్టర్‍ ఇద్దరి సమక్షంలో శాంపిల్‍ని తీసుకుంటాడు. ఈ ముగ్గురే సాక్షులు. రెండు మూడు వాయిదాల్లో విచారణని కోర్టు పూర్తి చేసే అవకాశం వుంటుంది. కానీ కేసు విచారణ కోసం అన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారో అర్థంకాని విషయం.
ట్రయల్‍ కోర్టు ప్రేంచంద్‍ని నిర్దోషిగా తేల్చింది. అది కూడా 14 సంవత్సరాల తరువాత. కేసులోని మెరిట్‍ ప్రకారం అప్పీలు చేయడాఇకి వీల్లేదు. ఒకవేళ మెరిట్‍ వుందని హర్యానా ప్రభుత్వంలోని బ్యూరోకాట్లు భావించినా కేసు విచారణలో జరిగిన జాప్యాన్ని గమనించైనా అప్పీలుని చేయకూడదు. అప్పీలు చేయమని ఆదేశించడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. ఏ మాత్రం బుద్దిని ఉపయోగించకుండా చేసిన అప్పీలు అది.
హైకోర్టులో ఈ అప్పీలుని పరిష్కరించడానికి దాదాపు 14 సంవత్సరాల కాలం పట్టింది. అందుకు కారణం తెలియదు. ఈ ఆలశ్యానికి ఎవరిని బాధ్యులని చేయాలో అర్థం కాని పరిస్థితి. సుప్రీంకోర్టులో కూడా అలాంటి పరిస్థితే. కేసు పరిష్కారం కోసం 11 సంవత్సరాల కాలం పట్టింది. 9 సార్లు కేసు విచారణ కోసం లిస్ట్ అయ్యింది సుప్రీంకోర్టులో. కానీ అది ఎప్పుడూ విచారణ దగ్గరికి చేరుకోలేదు. ఈ పరిస్థితికి కారకులు ఎవరు?
ఒక్కటి మాత్రం నిజం. ప్రతి అధికార వ్యవస్థ కేసు ఫైలుని మామూలు కట్టగానే చూశారు తప్ప అందులో జీవితం వుంది, అతని మీద ఆధారపడిన వ్యక్తుల జీవితాలు వున్నాయన్న విషయాన్ని గ్రహించలేదో నిర్లక్ష్యం చేశారో తెలియదు. ప్రతి దశలో ప్రేంచంద్‍ ఫైలుని ఫైలు మాదిరిగానే చూశారు తప్ప అందులో జీవితం వుందని ఎవరూ గుర్తించలేదు.


ఫలితంగా 76 సంవత్సరాల ప్రేంచంద్‍ తన సగజీవిత భాగాన్ని ఈ ఒక్క కేసు కోసమే వెచ్చించాడు.
ఎంత ఖర్చులని భరించాడో
ఎంత వేదనని అనుభవించాడో
ఆ పసుపు శాంపిల్‍లో వున్న నాలుగు భోజనం పురుగులకి తెలియదు. కానీ బ్యూరోకాట్లకి, న్యాయ వ్యవస్థకి తెలియాలి కదా?
ఒక్క ప్రేంచంద్‍ కాదు. కొన్ని మిలియన్ల ప్రేంచంద్‍లు ఇలా వున్నారో ఇప్పుడు మనకు తెలియదు. చట్టం కోసం, న్యాయం కోసం ఎదిరి చూడటం ఎన్ని సంవత్సరాలో?
హాజిర్‍హై అన్న శబ్దం కోసం ఎదురు చూసి చూసీ వరదలో మనిషి కొట్టుకుంటాడు. కేసు మొదలైన దగ్గర నుంచి తీర్పు వరకి ఆశా నిరాశల మధ్య అతని ప్రయాణం.
మనిషిని నిర్వీర్య పరచడానికి ఇంతకు మించి శిక్ష మరేమీ వుంటుందీ? ట్రయల్‍ కన్నా మరో శిక్ష ఏం వుంటుందో మన దేశంలో.


మంగారి రాజేందర్‍ (జంబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *