సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం!


కరోనా ఏ రోజు కారోజు విజృంభిస్తున్నప్పటికీ ఉత్పాదక విధుల నిర్వహణ ఏదో ఒక పరిమితిలోనైనా పునఃప్రారంభమైంది. లాక్‍డౌన్‍ సడలింపులు మొదలయ్యాయి. భయభయంగానైనా సామాజిక జన జీవితం దారిలో పడుతున్నది. కరోనాతో సహజీవనమంటే ఇదే. కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు, సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మనకి ఒక కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసింది. దీనివల్ల భౌతిక, ఆంతరంగిక పరిణామాలతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులు హర్షనీయాలే. ముఖ్యంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గాయి. కాలుష్యరహిత వాతావరణంతో నదీజలాలు శుభ్రపడటమే కాక కాలుష్యరహిత వర్షాలు, అధిక వర్షాలు, పరిశుభ్రమైన భూగర్భజలాల పెంపుదల జరిగింది. శబ్ద కాలుష్యం తగ్గటం వల్ల మానసిక, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి. సీజనల్‍ వ్యాధులు తగ్గాయి. దాహార్తితో అల్లాడిన నేల ఇవాళ తడి ఆరని చెమ్మతో, మట్టి వాసనలతో ఆహ్లాదకరంగా ఉంది. ఇవన్నీ సహజ వనరులను సహజంగా ఎదగనివ్వడం ద్వారా సాధ్యమని నిరూపితమైంది.


తెలంగాణ ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ ప్రాంతపు ఆదాయ వనరు ప్రధానంగా వ్యవసాయమే. నగరీకరణ, పారిశ్రామికీకరణ లేదని కాదు. అవి కొన్ని నగరాలకు, పట్టణాలకు పరిమితం. గ్రామీణ తెలంగాణ చాలా వరకు వ్యవసాయ జీవనమే. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వర్షాధారిత, కుంటలు, చెరువుల మీద ఆధారపడిన వ్యవసాయానికి కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు, అనుసంధాన డ్యాములు ద్వారా 33 జిల్లాల్లో 1531 కిలోమీటర్లు పొడవున ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అందిస్తున్నది. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు, టాంకులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందనడానికి సందేహం లేదు.


జీవనాధారం కోసం, ప్రైవేట్‍ ఉద్యోగాల కోసం పల్లె వదిలి పట్టణాలకు వచ్చిన వాళ్ళకి ఈ జనారణ్యం రక్షణ ఇవ్వలేదని కరోనా అవగతం చేసింది. ప్రజలు నగరాన్ని వదిలి అమ్మఒడి పల్లెకు తిరుగుముఖం పట్టారు. పల్లెలు తల్లికోడి వలె రెక్కలు చాపి గుండెలకదుముకున్నాయి. కూలి జనం నుండి ఉద్యోగం పోగొట్టుకున్న విద్యాధికుల వరకు అందరికీ వ్యవసాయమే ఆధారమయింది. అప్పటి వరకు కౌలుకిచ్చి పట్టణాలకు వెళ్ళిన వాళ్ళు తమ భూముల్లో తామే స్వయంగా వ్యవసాయం మొదలు పెట్టారు. బీడుపడ్డ భూములకు కూడా సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ విస్తీర్ణత పెరిగింది. దీనికి తోడు వ్యవసాయాభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలులోకి వచ్చాయి. రాష్ట్ర విత్తన కేంద్రాల ద్వారా సరైన విత్తనాల సరఫరా, వ్యవసాయ పెట్టుబడి మద్దతు, జీవిత భీమా, వర్షాధారిత ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు, ఏ కాలంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలో నియంత్రిత పంటల పథకం, రైతులకు లాభసాటైన మార్కెట్‍ విధానాల అమలు – ఇవన్నీ వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. జాతీయ వ్యవసాయిక ఉత్పత్తిలో తెలంగాణా ఒక్కటి 54 శాతం అందించి అగ్రభాగాన ఉన్నది. 33 శాతం అడవుల అభివృద్ధి కోసం హరితహారం నిరంతరంగా కొనసాగుతోంది. ఇవన్నీ ఆర్థికాభివృద్ధికే పరిమితమైనవి కావు. ఈ చర్యలు చక్కని పర్యావరణానికి దోహదం చేసి పరోక్షంగా జీవ వైవిధ్యాన్ని నిలబెడుతున్నాయి.


నిరపాయకరమైన ఈ మౌలిక ప్రాకృతిక పరిణామాలు మానవ వికాసాభివృద్ధికి, ఆరోగ్యకర సమాజ ఆవిర్భావానికి నిర్మాణాత్మక అంశాలవుతాయి. మనం జీవిస్తున్న తీరు దీనికి దోహదం చేయాలి.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *