జీవవైవిధ్య రక్షణే ప్రాణికోటి సంరక్షణ

ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రాణవాయువును, జీవక్రియల నిర్వహణకు నీటిని, ఆరోగ్య సిద్ధికి పోషకాహారాన్ని మరియు ప్రాణకోటి మనుగడకు అనువైన పరిసరాలను ప్రకృ తి మాత ప్రసాదించింది. గాలి, నేల, నీరు, నింగిల సమ్మిళితమే పర్యావరణంగా పేర్కొనబడింది. ఎన్విరాన్‍మెంట్‍లోని ‘ఎన్విరోనియా’ అనగా పరిసరాలని, వీటిలోకి జీవ మరియు నిర్జీవ పదార్థాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. పర్యావరణంలో నేల, నీరు, గాలి, జీవులు మరియు సౌరశక్తి ప్రధాన భాగాలున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే జీవకోటి ఉనికి ప్రకటితమవుతుంది. భూగోళాన్ని నివాసయోగ్య ఆలయంగా మార్చుటకు ప్రతి ఒక్కరు తమ తమ చేయూతను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ధరణి ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణతోనే సుసాధ్యమని భావించాలి. పర్యావరణాన్ని కాపాడుకొనుటలో మన స్వరాన్ని పెంచుతూ చేయి చేయి కలిపి కాలుష్య భూతాన్ని తరుమాల్సిన తరుణమిది.

పర్యావరణ సమతుల్యతను పునర్‍ ప్రతిష్టించు టలో సభ్యదేశాలు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరాలను ప్రజలకు వివరించేలా ఐక్యరాజ్య సమితి జూన్‍ 05 రోజున ప్రపంచ పర్యావరణ దినాన్ని జరుపుతున్నది. శిథిలమౌతున్న శిలావరణం, అపరిశుద్ధ జలావరణం, అనారోగ్య జీవావరణం, కలుషిత వాతాపరణం, సమతుల్యత తరిగిన జీవ వైవిధ్యం ప్రాణి మనుగడను పెను ప్రమాదంలోకి నెట్టిన అకాలంలో మనం ఉన్నాం. ప్రతి సందర్భాన్ని అవకాశంగా తీసుకొని జల కాలుష్యం, భూతాపం, జీవ వైవిధ్య వినాశనం, జనాభా పెరుగుదలతో గాలి మరియు నేల కాలుష్యాలు విసిరిన సవాళ్ళకు సమాధానాలు సత్వరం వెతకాల్సిన బాధ్యత మనిషి మీదనే ఉంది. పర్యావరణానికి తూట్లు పొడిచిన నడవంత్రపు నరుడు కరోనా, మిడతల దండు, దట్టమైన పొగ మేఘాలు కమ్మిన నగరాలు, అకాల వర్షాలు, జీవజాతులు అంతరించడం, ప్రకృతి ప్రళయాలు, జీవుల అనారోగ్యాలు లాంటి పెను సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు.


పర్యావరణ పరిరక్షణను ఒక పవిత్ర యజ్ఞంగా భావించి కాపాడుకోవలసిన అవసరాన్ని ప్రచారం చేయడం, విద్యార్థిలోకానికి పలు పర్యావరణ అంశాలలో పోటీల నిర్వహణ, ప్రదర్శనలు, వనమహోత్సవాలు, ర్యాలీలు, స్వచ్ఛ భారత్‍ కార్యాలు, ఉపన్యాసాలు, పర్యావరణహితుల సన్మానాలు, పోస్టర్‍ విడుదలలు ఉద్యమంలా చేపట్టాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంధ సంస్థలే కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని రేపటి తరానికి ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించే బాధ్యతలను భుజాన వేసుకోవాలి. రాజకీయ సంకల్పం లేనిదే పర్యావరణ పరిరక్షణ జరుగదు. సమాజం మేల్కొననిదే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించదు. జీవవైవిధ్యానికి విఘాతం కలుగుట వలన ఒక మిలియన్‍ జీవులు అంతరించబోతున్నాయనే వాస్తవం విచారకరం. ‘జీవవైవిధ్య వేడుకలు’ నినాదంగా పర్యావరణ పరిరక్షణ జరుపు కోవలసిన సందర్భమిది. భూమిపై ప్రాణికోటికి ఊపిరితిత్తులుగా వర్ణించబడిన అమెజాన్‍ మరియు ఆస్ట్రేలియా అడవులు అగ్నికి ఆహుతి కావడం పర్యావరణానికి ప్రమాదకరం.
పర్యావరణంలో భాగాలైన ‘జలావరణం’లో సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు లాంటి ఉపరితల జలాలు మొదలగునవి వస్తాయి. ఎడారులు, నేలలు, పర్వతాలు, కొండలు, కోనలు, వ్యవసాయ భూములు మొదలగునవి ‘భూతలావరణం’ లేదా ‘శిలావరణం’లోకి వస్తాయి. భూమి చుట్టూ ఉన్న పలు వాయువుల (ఆక్సీజన్‍, నైట్రోజన్‍, హైడ్రోజన్‍, కార్బన్‍ డై ఆక్సైడ్‍ మొదలగు) సమ్మిళితమైన గాలి అంతా కలిపుకొని ‘వాతావరణం’లోకి వస్తుంది. భూమండలంపై నివసిస్తున్న జీవులన్నీ కలిసి ‘జీవావరణం’గా గుర్తించబడింది. మరొక వర్గీకరణ ప్రకారం ‘సహజ పర్యావరణం’ (నీరు, కాంతి, నేల, గాలి మరియు జీవులు), ‘పారిశ్రామిక పర్యావరణం‘ (నగరాలు, నివాసల ప్రాంతాలు, పరిశ్రమలు లాంటి మానవ నిర్మితాలు) మరియు ‘సాంఘీక పర్యావ రణాలు’గా (ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు, విద్యాలయాలు, కంపెనీలు మొదలగునవి)గా వివరించబడినవి.


పర్యావరణ పరిరక్షణకు సాంప్రదాయ తరిగే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తూ, సాంప్రదాయేతర తరగని ఇంధనాలైన సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తుల వంటి వాటి వినియోగాన్ని పెంచే కృ షి చేయాలి. వీటి ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. అడవుల నరికివేతతో పాటుగా అడవీసంపద అగ్ని ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నగరాలకు, నివాసప్రాంతాలకు దూరంగా పరిశ్రమలను నెలకొల్పి, వ్యర్ధాలను శుద్ధి చేస్తూ బయటకు వదలాలి. సముద్రజలాలలో వ్యర్ధాలను, నగర మురికి నీటిని కలువకుండా మరియు పెట్రోలియం ఉత్పత్తులు లీక్‍ కాకుండా చూసుకోవాలి. అవకాశం ఉన్న ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటడం మరియు పోషించడం చేయాలి. చెట్ల వలన గాలి శుద్ధి చేయబడుతుందని మరువరాదు. వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ సైక్లింగ్‍ను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‍ వాడకాన్ని తగ్గించుటతో పాటు వ్యర్థ ప్లాస్టిక్‍లను తిరిగి వినియోగంలోని తేలాలి. ప్రకృ తి వనరులను తక్కువగా వాడటం(రెడ్యూస్‍), తిరిగి వాడడం(రీయూస్‍) మరియు మరో వస్తు ఉత్పత్తికి (రీసైకిల్‍) వాడడం మూలంగా పర్యావరణానికి మేలు కలుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన వనరులను, అమూల్య సంపదలను విచక్షణతో వాడుకోవాలి. ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించాలి. నీటిని పొదుపుగా వాడడంతో పాటుగా ఇంకుడు గుంటలను, వాటర్‍ షెడ్‍ నిర్మాణాలను చేపట్టాలి. ప్లాస్టిక్‍ వాడకాన్ని నిషేధించి, జీవ విచ్ఛిన్న ప్లాస్టిక్‍లను వాడుకలోని తేవాలి. విద్యుత్‍ వినియోగాన్ని, శిలాజ ఇంధనాల వాడకాన్ని పొదుపుగా వాడాలి. నివాసప్రాంతాలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలి. భూతాపానికి కారణమైన హరిత గృహ ప్రభావాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. జీవావరణానికి విఘాతం కలుగకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణే జీవి రక్షణ అని నమ్మాలి.   ప్రకృతిలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత ఉందని గమనించాలి. ‘ధరణీ రక్షతి రక్షితః’ని నిజం చేస్తూ పర్యావరణ ఆరోగ్యమే విశ్వ జీవుల ఆరోగ్యంగా భావించి, మన కోసం మనమే నడుంబిగించి, మానవాళి ప్రగతి పథంలో నడవటానికి అందరం కంకణ బద్దులమవుదాం. అందరం పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తూ ఆరోగ్యంగా జీవిద్దాం.


డా।। బి.ఎం.ఆర్‍
ఎ : 99497 00037

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *