నల్లమలలో చల్లని పర్యటనలు

‘‘నీ కడుపు చల్లగుండ’’.
పెద్ద మనుషులు మనల్ని దీవించేటప్పుడు మనకు వినిపించే ప్రధాన వాక్యం ఇది. కారణం మనది వేడి ప్రదేశం… కాబట్టి మనకు చల్లదనం కావాలి. వేసవి కాలపు సెలవుల్లో చల్లదనం కోసం కూర్గ్, ఊటీ, కొడైకెనాల్‍, కుల్లు-మనాలి వంటి ప్రదేశాలకు ప్లాన్‍ చేసుకుంటుంటాం. డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి మన తెలంగాణలోనే ఏవైనా చల్లని ప్రదేశాలున్నాయేమో ఆలోచించండి. ఏవీ తట్టలేదా? అయితే ఈ వ్యాసం చదవండి… తెలంగాణలోనూ ఉన్న చల్లని పర్యాటక స్థలాలేవో మీకే తెలుస్తుంది.
చల్లగా ఎక్కడుంటుంది? ఎత్తైన గుట్టలు, జలపాతాలు, నదులు… ఇక్కడేగా చల్లగా ఉండేది. మనది దక్కన్‍ పీఠభూమి. ఎత్తుగా ఉంటుంది. పైగా నల్లమల పర్వతాలు, దండకారణ్య పర్వత సానువులు కూడా తెలంగాణలో ఉండడంతో ఎత్తైన గుట్టలకు, వాటిపై నుండి దూకే జలపాతాలకు, వాటి మధ్య నుండి పారే నదులకు కొదువ లేదు. మరి చల్లదనానికి కొదువ ఎందుకుంటుంది?
అది సరే. ఇంతకీ ఎక్కడ ఎత్తైన గుట్టలున్నాయి? ఎక్కడ జలపాతాలున్నాయి? ఎక్కడ నదులు అనువుగా ఉన్నాయి?… ఇవేగా మీ ప్రశ్నలు? అయితే చదవండి.


నల్ల‘మలయ’ పర్వతాల్లో
తెలంగాణకు దక్షిణాన మహబూబ్‍నగర్‍, నల్గొండ జిల్లాల్లో కృష్ణానది సరిహద్దుగా విస్తరించాయి నల్లమల అడవులు. వీటిల్లో 1978లో పులుల సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం. అధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం నల్లమలల్లో చిన్నవి పెద్దవి కలిపి సుమారు  164  పులులున్నాయట. పులులతో పాటు అనేక జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, వృక్ష జాతులు… ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన జీవజాలానికి నిలయమైన నల్లమల అడవులు దేశంలోనే రెండవ అతిపెద్ద అడవులు. వీటి వైశాల్యం 3,568 చదరపు కిలోమీటర్లు. నల్లమల గుట్టల సరాసరి ఎత్తు 914 మీటర్లు. కాబట్టి చల్లగా ఉంటాయి. వాటిమీది నుంచి ఎన్నో జలపాతాలు, వాటి మధ్య నుంచి ఎన్నో ఏరులు పారుతున్నాయి. అవేమిటో… మనం ఈ వేసవి కాలంలో ఎక్కడికి వెళ్ళి చల్లగా, హాయిగా గడపవచ్చో చూద్దాం.


మల్లెల తీర్థం జలపాతం
హైదరాబాద్‍ శ్రీశైలం రూట్‍లో వటవర్లపల్లి మీదుగా… బస్సులో గాని, సొంత వాహనంలోగాని ప్రయాణించి ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. మొత్తం 165 కిలోమీటర్ల ప్రయాణం. ఇందులో 40 కిలోమీటర్లు మాత్రం నల్లమల అడవుల్లో రోడ్డుకు ఇరువైపులా జుయ్‍య్‍… మని ఈదర గాలినిచ్చే ఎత్తైన చెట్ల మధ్య, కోతులు, కొండెంగలు, అడవి కోళ్ళు, నల్లమల ఉడుతలు, నెమళ్ళ మధ్య… ఎర్లీ మార్నింగ్‍, లేట్‍ ఈవినింగ్‍ అయితే ఎలుగుబంట్లు, జింకలు, అడితులు, అడవి పందుల మధ్య ఆసక్తికరమైన అనుభవాలతో ఎంజాయ్‍ చేస్తూ సాగిపోవచ్చు. అలా మధ్యలో కనిపించిన అటవీ జీవజాలాన్ని ఉచితంగా ఫోటోలు తీసుకోవచ్చు కూడా.


ఈ 40 కిలోమీటర్ల అటవీ ప్రయాణంలో మనకు అటవీ జీవజాలం మాత్రమే కాదు అడవుల్లో నివసించే చెంచులు, లంబాడీలు, వారి పెంటలు, తండాలు… అంటే చిన్న చిన్న గ్రామాలు… వారి వేషభూ షాదులు, తిండి తిప్పలు… అన్నీ మనకు కొత్తగానే కన్పిస్తాయి. అవన్నీ మనమో, మన పూర్వీకులో దాటి వచ్చారనుకుంటే మనకు ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తి ఏర్పడుతుంది.


ఇక ఈ అడవుల్లో ఎన్నో ఘాట్లు, మూల మలుపులు, వాటిపై ప్రయాణిస్తు న్నప్పుడు, వాహనాల్లో నుంచి లోయల్లోకి చూస్తున్నప్పుడు మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో తెలిసి పులకించిపోతాం. అదే లోయలో ప్రయాణిస్తూ కొండల అంచులను చూస్తున్నప్పుడు మనం ఎంత కింది స్థితిలో ఉన్నామో కూడా తెలుస్తుంది. ఇక పీఠభూమి సమతలంపై ప్రయాణిస్తున్నప్పుడు ఎత్తైన పచ్చని చెట్ల వరుసల మధ్య నల్లని సన్నని పాపిట దూరంగా పరుగెత్తుతున్నట్లు కనిపిస్తుంది… ఇలా నల్లమలలో చేసే ప్రయాణమే ఒక పరవశం.


మల్లెల తీర్థం జలపాత నిర్వహణను సార్లపల్లి-కుడిచింతలబైలు అనే చెంచు పెంటలకు చెందిన స్థానిక చెంచు గిరిజనులకు అప్పజెప్పారు. వారి దగ్గర టికెట్లు తీసుకుంటుండగానే మనకు జలపాతపు హోరు వినిపిస్తూనే ఉంటుంది. కాని దాన్ని చూడటానికి మాత్రం సుమారు మూడు వందల మెట్లు దిగవలసి ఉంటుంది. సగం మెట్లు దిగుతుండగానే ఎడమ వైపు చెట్ల మధ్య నుంచి నురగలు కక్కుతూ దూకే జలపాతం మనల్ని ఉవ్విళ్ళూరిస్తుంది. ఇక కాళ్ళకు ఎక్కడ లేని శక్తి వచ్చి జలపాతం వైపు పరుగెత్తుతాం. దగ్గరికి వెళ్ళీ వెళ్ళక ముందే మన కళ్ళ ముందు అద్భుతమైన అందమైన జలపాతం ఆవిష్కారమవుతుంది.


మల్లెల తీర్థం జలపాతం ఎత్తు సుమారు వంద అడుగులు. రెండు పర్వత సానువుల మధ్యనున్న లోయలో నుంచి ఒక ఏరు పారుతూ వచ్చి అకస్మాత్తుగా మరో లోయలోకి దూకుతుంది. దూకే క్రమంలో జలధారలు మల్లెపూవుల ఆకారం తీసుకోవడమే కాకుండా మల్లెల వలె చల్లగా కూడా ఉంటాయి కాబట్టి ఈ జలపాతానికి మల్లెల తీర్థమని పేరు. అయితే జలపాతానికి కుడివైపునున్న ప్రాచీన శివలింగాన్ని సుమారు రెండు వేల మూడు వందల ఏళ్ళ కింద మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కూతురు చంద్రావతి ప్రతిష్టించి మల్లెపూలతో పూజించడం వల్ల ఇక్కడి జలపాతానికి మల్లెల తీర్థం అని పేరు వచ్చిందని స్థానిక / పురాణ కథనం.


ఈ జలపాతం అందమైనది మాత్రమే కాకుండా ఆహ్లాదకరమైంది కూడా. చాలా జలపాతాలను చూడడమే కాని వాటితో కలిసిపోయి ఆనందించలేము. మల్లెల తీర్థం జలపాతం కింద మాత్రం స్త్రీ, బాల, వృద్ధులు, యువకులు అందరూ స్నానం చేయవచ్చు. కొండ మీద నుంచి గుండంలోకి జలపాతం దూకేటప్పుడు కొండ చరియకు, గుండానికి మధ్య ఏర్పడిన ఆ ఖాళీ స్థలంలోకి మనం వెళ్ళి ఎంచక్కా జలపాత ధారల కింద ఎంజాయ్‍ చేయవచ్చు. మండుటెండలో వెళ్ళిన మనకు జలపాత ధారలు మరీ చల్లగా తగలడంతో అలవోకగా మన నోటి నుండి అత్యుత్సాహంతో కేరింతలు వెలువడతాయి. ఆ కేరింతల ధ్వనులు అక్కడి గుట్టలు, లోయల మధ్య గింగిరాలు తిరిగి వింతైన ప్రతిధ్వనులు వస్తాయి. అలాంటి ప్రతిధ్వనులు అక్కడికి వెళ్ళినవారికే ప్రత్యేకం/సొంతం.


జలపాతం ముందున్న నీటి గుండం కూడా చాలా లోతైనది, విశాలమైనది, అందమైనది. పెద్ద పెద్ద వట వృక్షాలు ఆ గుండం నీటి ఉపరితలంపై తమ కొమ్మలను వేలాడేయడంతో కన్పించే దృశ్యం ఒక సుందరకాండ.


రెండు గుట్టలను చీల్చుకుంటూ పారుతున్న గుండం నీళ్ళు అలా ఉత్తరం వైపు ముందుకు సాగుతూ అల్లంత దూరంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున మరో ఆరు జలపాతాలను ఏర్పరుస్తాయట. ఆ ఏరుకు ఇరువైపులా ఉండే ఒడ్ల మీది నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాటినీ చూడవచ్చు. కాని మధ్యలో చాలా గుబురు పొదలు అడ్డుతగుల్తాయి. అంతేకాదు, ముందుకు వెళ్ళినకొద్దీ అడవి చిక్కనవుతుంది కాబట్టి అడవి జంతువుల సంచారం కూడా ఉంటుంది. కాబట్టి గుండం ముందు ఫర్లాంగు దూరంలో ఉన్న విశాలమైన స్థలంలో నీటి అంచున చెట్ల నీడలో కావలసినంత సేపు కాలం గడిపి వెనుదిరగడం శ్రేయస్కరం. ఇప్పుడిప్పుడే ఇక్కడ పర్యాటకుల వసతి ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ స్థానిక గిరిజనులు టిఫిన్స్, స్నాక్స్ పర్యాటకులకు అందుబాటులో ఉంచారు.


ఇక తిండి, వసతి సౌకర్యాలు కూడా ఈ జలపాతానికి 25 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‍ వైపున్న మన్ననూరిలోని చీతల్‍ రెస్టారెంట్‍లోను, 25 కిలో మీటర్ల దూరంలో శ్రీశైలం వైపున్న దోమలపెంట వనమయూరి గెస్ట్ హౌజ్‍లోను అందుబాటులోఉన్నాయి. వనమయూరి గెస్ట్ హౌజ్‍ కృష్ణానది ఒడ్డున ఉంది కాబట్టి, శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‍ వాటర్స్ నల్లమల పర్వత సానువుల్లో చిక్కుకున్న అందమైన దృశ్యాన్ని, ఆ నీటి పైనుంచి వచ్చే చల్లగాలులను ఆ గెస్ట్ హౌజ్‍లో ఉండి ఆస్వాదించవచ్చు. చీతల్‍ రెస్టారెంట్‍ (వనమాలి గెస్ట్ హౌజెస్‍), వనమయూరి గెస్ట్ హౌజ్‍… రెండూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‍ ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి సందర్శకులు ముందే వాటిని బుక్‍ చేసుకోవలసి ఉంటుంది. వనమాలి గెస్ట్ హౌజ్‍లో ఉన్నవారు ఆ చుట్టు పక్కల్లో ఉన్న ఎన్విరాన్‍మెంటల్‍ ఎడ్యుకేషనల్‍ సెంటర్‍ను, చెంచు లక్ష్మి అనే గిరిజన మ్యూజియంను, దగ్గరలోని ఉమామహేశ్వరం అనే గుహాలయాన్ని, ప్రతాపరుద్ర కోటను, షావలి దర్గాను కూడా సందర్శించవచ్చు.


లొద్దిలో మరో జలపాతం
మహబూబ్‍నగర్‍ జిల్లాలోని మన్ననూరులో ఉన్న వనమాలి గెస్ట్ హౌజ్‍ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్నప్పుడు 16 కిలో మీటర్ల దూరంలో రోడ్‍కు కుడివైపున లొద్ది అనే ప్రదేశం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‍ వారి వాచ్‍మన్‍ గది దగ్గర తమ వాహనాలను ఆపి సుమారు అర కిలోమీటరు దూరం అడవిలో నడిచాక ఒక వింతైన లొద్ది కనిపిస్తుంది. మూడు దిక్కులా వేయి అడుగుల ఎత్తైన గుట్టలు వర్తులాకారంలో మూసుకోగా తూర్పు వైపు నుంచి పడమర వైపు ప్రవహిస్తున్న ఒక ఏరు (చంద్రవాగు) సుమారు 150 అడుగుల ఎత్తునుండి లోయలోకి దూకుతుంది. ఆ అరుదైన అందమైన దృశ్యాన్ని చూడడానికి మనం తూర్పు వైపున చంద్రవాగును దాటి దక్షిణం వైపు నుండి పావు కిలోమీటరు ప్రయాణించి, ఉత్తరం వైపుకి తిరిగి లోయలోకి చేరుకున్నాక మళ్ళీ పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకి తిరిగి లొద్ది జలపాతం వైపుకు నడిచి చేరుకోవలసి ఉంటుంది. నడువలేనివారు జలపాతం పైనుంచే లోయలోకి చూసి అందులో నుండి వేగంగా వచ్చే ఈదర గాలులను ఆస్వాదించవచ్చు.


లొద్ది జలపాతం తాకిడికి దాని కింద ఒక విశాలమైన గుండం ఏర్పడింది. అందులోని నీళ్ళు చాలా తేటగా, స్వచ్ఛంగా ఉంటాయి. నీళ్ళపైకి గుండం చుట్టూ పెరిగిన పెద్ద పెద్ద చెట్లు వంగి అద్భుత దృశ్యాన్ని ఏర్పరుస్తుంటాయి. గుండం నీళ్ళల్లో ఎవరైనా… ఈత రానివారు కూడా స్నానం చేయవచ్చు. ఎందుకంటే, గుండం లోతు తక్కువగా ఉండి దాని అడుగు పైకే కనిపిస్తుంది.
గుండం తూర్పు అంచున జలపాతం కింద ఒక చదునైన బండ ఉంది. దానిపై నిల్చుని కూడా జలపాతం కింద హొయలు పోవచ్చు. ఆ బండ మీద నిల్చున్న వారు పాపాత్ములైతే వారి మీద జలపాతం దూకకుండా పక్కకు తప్పుకుంటుందని, అది ఈ ‘పుష్కర తీర్థం’ మహిమ అని 17వ శతాబ్దానికి చెందిన నాగలూటి శేషనాథా చార్యులు ‘శ్రీ పర్వతపురాణం’లో వర్ణించారు.
గుండం చుట్టూ గుట్టల సొరికెలు(గుహలు)న్నాయి. వాటిల్లో సునాయాసంగా నడవవచ్చు. జలపాతం వెనుక ఉన్న గుహలో జలపాతపు చల్లని తుంపర్లను ఆస్వాదిస్తూ నడువడం మరువలేని మధురానుభూతినిస్తుంది. ఉత్తరపు గుహ చాలా విశాలమైంది, లోతైంది. కాబట్టి అందులో 1600 సంవత్సరాల కిందనే ఈ ప్రాంతం నుంచి ఎదిగిన విష్ణుకుండి రాజులు శివాలయం కట్టించారు. కాకతీయుల కాలం (క్రీ.శ.1200)లో మరిన్ని విగ్రహాలు చేర్చారు. ఇక్కడ ప్రతి యేటా తొలి ఏకాదశి పండుగ సందర్భంలో స్థానిక చెంచు గిరిజనుల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జాతర జరుగుతుంది. ప్రకృతి ప్రేమికులు, చల్లదనాన్ని ఆస్వాదించాలనుకునేవారు మిస్‍ కాకండి మరి. ప్రధాన గుహ ముందు పైకి చూసి పావు కిలోమీటరు ఎత్తైన గోడ లాంటి గుట్ట నుండి పొడుచుకొచ్చిన రాయికి పెట్టిన తేనె తుట్టెలను చెంచులు ఎలాంటి నిర్మాణాల (మంచెల) సహాయంతో కొట్టుతున్నారో చూసి ఆశ్చర్యపడండి.


గుండం నుంచి పారుతున్న ఏరు వెంట కొంత దూరం వెళ్ళి అక్కడున్న నిటారైన గుట్టను స్త్రీబాలవృద్ధులు కూడా చీమల దండులా నిజాం కాలం నాటి నిచ్చెన నెక్కుతూ ‘వత్తున్నాం వత్తున్నాం లింగమయ్యా’ అని అరుస్తూ ఎలా వస్తున్నారో చూసి వెనుదిరగండి.


ఊహకందని వ్యూ పాయింట్స్
లొద్ది నుంచి శ్రీశైలం వైపు ఫర్లాంగు దూరం ప్రయాణించగానే ఫరహాబాద్‍ గేట్‍ వస్తుంది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‍ వారు ఆరుగురికి ఆరు వందల రూపాయలు తీసుకొని ఫారెస్ట్ జీప్‍లో టైగర్‍ సఫారీకి తీసుకెళ్తారు. మన అదృష్టాన్ని బట్టి పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, అడితిలు వంటి జంతువులు అక్కడక్కడా ఉండే నీటి గుంటల్లో నీళ్ళు తాగడానికి వస్తూ కన్పిస్తాయి. మార్గ మధ్యంలో నిజాం కట్టించుకున్న గెస్ట్ హౌజ్‍, వంటశాల, గుర్రాల శాలలను చూసి… ఏడెనిమిది దశాబ్దాల క్రితం ఈ అడవుల్లో నిజాం రాకుమారులు వేటాడి ఆ జంతువుల మాంసాన్ని వండించుకుని తిని తాగి ఆనందించిన వైనాన్ని తలచుకుంటే కూడా థ్రిల్‍ అన్పిస్తుంది.


ఇదే నిజాం రాజులు మరో ఏడెనిమిది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వచ్చే పర్వత సానువు అంచున కూడా గెస్ట్ హౌజ్‍ కట్టించారు. వాటిని పదిహేనేళ్ళ క్రితం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిత్వ హయాంలో పునరుద్ధరించి వసతి యోగ్యంగా చేశారు. కాని, నక్సలైట్లు పేల్చేశారు. అట్లని నిరుత్సాహపడకండి. ఆ శిథిల గెస్ట్ హౌజ్‍ల ముందర ఉన్న గుట్ట కొసకెళ్ళి చూడండి… భయము ప్లస్‍ అనిర్వచనీయమైన ఆనందం ఒకేసారి కలిగే దృశ్యం కన్పిస్తుంది. ఆ గుట్ట అంచున నిల్చున్న మన కాళ్ళ కింద కిలో మీటరు లోతైన లోయ, మైదానాలు, వాటిల్లో చిక్కటి అడవుల్లో చిక్కుకున్న పెద్ద పెద్ద చెరువులు కాన్వాస్‍ మీద గీసిన చిత్రాల్లా కన్పిస్తాయి. మనం ఆ లోయలోకి పడిపోతా మేమోనన్న భయమూ కలుగుతుంది. తల తిరిగినట్లనిపిస్తుంది. అందుకే అక్కడ రైలింగ్‍ (ఇనుప కంచె) ఏర్పాటు చేశారు… మనం పడిపోకుండా. ఆ కంచె కడీలను పట్టుకొని లోయలోకి చూస్తుంటే ఆ పల్లపు ప్రాంతపు చెట్ల పుప్పొడి (వాసన)ని, నీటి తుంపర్లను మోసుకొంటూ వస్తూ మనల్ని వెనక్కి తోసి పడేసేంత వేగంగా వీస్తున్న ఈదర గాలులను ఆస్వాదిస్తుంటే ‘గాల్లో తేలినట్టుందే’ అని అరువక మానం.


నిజాం గెస్ట్హౌస్‍ నుంచి రాంపూర్‍ పెంట మీదుగా కుడివైపు 18 కి.మీ. దూరంలో సలేశ్వరం జలపాతం, గుహాలయాలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక చెంచు గిరిజనుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా చైత్ర పౌర్ణమికి జాతర జరుగుతుంది.


వ్యూ పాయింట్‍ మరొకటి ఫరహాబాద్‍ గేట్‍ నుండి శ్రీశైలం రూట్‍లో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని పేరు ‘ఆక్టోపస్‍ వ్యూ పాయింట్‍’. ఇది కృష్ణానది ఎడమ ఒడ్డున అర కిలోమీటరు ఎత్తులో ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్‍ కియోస్క్ (మెట్ల గూడు) కట్టారు. దానిపై నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‍ వాటర్స్ ఆక్టోపస్‍ ఆకారంలో పచ్చగా ఉన్న కొండల మధ్య చిక్కి(పోయి)న సౌందర్యం, ఆ నీళ్ళల్లో శ్రీశైలంలోని పాతాళ గంగ నుంచి వీచే చల్ల గాలులకు ఎగిరే మన ముంగురులను సవరించుకుంటూ ఆ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే నెమళ్ళను, 2,300 ఏళ్ళనాటి చంద్రగుప్త పట్టణపు శిథిలాలను చూస్తూ ఆనందంతో కడుపు నిండిన స్మృతులతో వెనుదిరగండి.


అరుదైన అక్కమహాదేవి గుహలు

ఫరహాబాద్‍ గేట్‍ నుండి శ్రీశైలం రూట్‍లో వటవర్లపల్లి మీదుగా సుమారు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత కుడివైపున్న లోయలో ‘అక్కమహాదేవి గుహలకు దారి’ అనే బోర్డు కన్పిస్తుంది. అక్కడి నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఆహ్లాదకరమైన ప్రకృతిలో వెలగపండ్లు, పరికి పండ్లు తింటూ ట్రెక్కింగ్‍ చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‍ వాటర్స్ అంచున ఉన్న అరుదైన గుహలను చేరుకోవచ్చు. క్రీ.శ.12వ శతాబ్దంలో ఈ గుహల్లో కర్ణాటక నుంచి వచ్చిన శివభక్తురాలు శ్రీశైలం శివుణ్ని సేవించి తరించడంతో ఆమె పేరు మీద వీటిని అక్కమహాదేవి గుహలు లేదా అక్కమ్మ బిలం అంటున్నారు.


ముందుగా మనల్ని సహజ శిలాతోరణం ఆహ్వానిస్తుంది. తూర్పు పడమర దిక్కుల మధ్య సుమారు 50 గజాల దూరంతో రెండేసి స్తంభాలు ఇరువైపులా సహజంగా ఏర్పడగా వాటిపైన రెండు గజాల మందం, నాలుగు గజాల వెడల్పు, 55 గజాల పొడవు ప్రమాణాలతో ఉన్న ఒక చదునైన బండను పొందించినట్లున్న సహజమైన ఏర్పాటుంది. ఈ బండ (పందిరి) కింద సుమారు వేయి మంది నిల్చోవచ్చు. ఏవైనా ఆహ్లదకరమైన కార్యక్రమాలు నిర్వహించు కోవచ్చు.
అన్నట్టు ఇక్కడ స్థానిక చెంచు పిల్లలు అమ్మే బోలు పేలాలు ఓ ప్లేటు తిని టీగాని, మజ్జిగగాని తాగి వాళ్ళలో ఒకర్ని గైడ్‍గా తీసుకొని గుహలోకి గబ్బిలాల శబ్దాల మధ్య కొవ్వొత్తి వెలుతురులో మూడు మలుపుల ద్వారా 108 అడుగులు నడిచి గుహ చివరనున్న గజమెత్తు గద్దెపైన సహజంగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందంతోపాటు అడ్వెంచరస్‍ థ్రిల్లింగ్‍నీ మన సొంతం చేసుకోవచ్చు. తూర్పునుండి పడమర వైపు సాగే ఈ గుహకు ఎదురుగా మరో గుహ, దానికి సమాంతరంగా ఇంకో గుహ, వీటన్నింటి పైన మరి రెండు గుహలు ఉన్నాయి. పై గుహల్లో ఇప్పటికీ కర్ణాటక నుండి వచ్చిన శివ భక్తులు నివాసం ఉంటున్నారు. కింది గుహల్లో అదే రాష్ట్రానికి చెందిన శివశరణురాలు నివాసం ఉంటున్నది.


ఈ గుహల అంచునే ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‍ వాటర్‍లో స్నానం చేయడం మర్చిపోకండి. చేస్తూ అవతలి ఒడ్డుపైన అక్కడక్కడా విసిరేసినట్లు కన్పిస్తున్న ఆవులపెంట, చేపలోళ్ళ పెంటలు, సూర్యోదయం, సూర్యాస్తమయం నీళ్ళలో ప్రతిఫలిస్తున్న ప్రతిబింబాల అందాలనూ చూడండి. పాతాళగంగ నుంచి ఇక్కడికి 22 కిలోమీటర్లు పర్యాటక శాఖవారి బోటులో ప్రయాణించి కూడా చేరుకోవచ్చు. తెలంగాణ వైపున్న నీలిగంగ రేవు నుండి ప్రైవేటు బోట్లనూ ఎంగేజ్‍ చేసుకోవచ్చు. బోటు విహారమూ ఒక థ్రిల్లింగే కదా!

– ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29. తెలంగాణ. వెల: రూ.100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *