విపత్కర పరిస్థితుల్ని సైన్స్ మాత్రమే ఎదుర్కొంటుంది!

ఉ. సా. (ఉప్పుమావులూరి సాంబశివరావు) కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా.) విప్లవోద్యమ క్షేత్రంలో అస్తిత్వ పోరాటాల గొంతుక, రచయిత, వక్త, ఉద్యమాల ఉపాధ్యాయుడిగా పేరొందారు. ‘దక్కన్‍ ఛానల్‍’కు మే మాసంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.


కరోనా వ్యాప్తి చెందడానికి కారణం ఏమనిపిస్తుంది?

విపత్కర పరిస్థితికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పవచ్చు. ఒకటి కరోనా మిగతా వైరస్‍ల కంటే విలక్షణ లక్షణాలు కలది. ఈ వైరస్‍ వ్యాప్తి చెందడంలో చాలా చురుకైన, వేగవంతమైన పాత్ర వహిస్తుంది. ఒకరినుంచి మరొకరికి వ్యాధి చాలా తొందరగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకగానే వచ్చే లక్షణాల్లో శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. ఐసీయూలో పెట్టి ప్రత్యేక వైద్యం వల్ల లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన వైరస్‍ను ఎదుర్కోవడానికి అన్ని సదుపాయాలు సమకూర్చుకునే లోపే మరణాలు సంభవిస్తున్నాయి.


రెండో కారణం ఈ వైరస్‍ చైనాలోని వూహాన్‍ ప్రాంతంలో ఏర్పడితే ఆ దేశానికి, ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ మంతా వ్యాపించి విపత్కర పరిస్థితి ఏర్పడడం రెండో కారణం. నేడు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. చైనాతో ప్రపంచం దేశాలన్నిటికీ సంబంధాలు ఉన్నాయి. చైనాకు వెళ్ళి వచ్చిన వారు, చైనా నుండి ఇతర దేశాలకు వచ్చిన వాళ్ళ ద్వారానే ప్రతి దేశానికి ఈ వ్యాధి అందింది. ఒక వాహకంగా ప్రపంచీకరణ తోడ్పడింది. కోవిడ్‍ కరోనాకి పాండమిక్‍ అనే పదాన్ని వాడుతున్నారు. దాని అర్థం ఏమిటంటే ప్రపంచ మహమ్మారి అని. ఒక దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది సోకుతుందనే భయం అందరిలో ఉంది. ఈ భయం ప్రతి దేశంలోకి ప్రవేశించింది.


ప్రపంచీకరణ తోడ్పాటు, గ్లోబలైజేషన్‍ అనే అభివృద్ధి లేకపోతే ఇలాంటి వైరస్‍లను అధిగమించవచ్చా?  

సాంకేతిక అభివృద్ధి, శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందటం అవసరమే. అభివృద్ధి అందరికి అందించాలనే లక్షణం ఒక సర్వజనీనం. ధనిక వర్గానికో, ప్రైవేటు వర్గానికో కాకుండా ప్రజలందరికి అందిచాలనే సత్‍సంకల్పం ఉంటే అభివృద్ధి ప్రపంచానికి మేలు చేస్తుంది. ప్రపంచదేశాలల్లో అమెరికా పెద్ద దేశం అని అంటున్నాం. ఆర్థికంగా, సాంకేతికపరంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి చెందినటువంటి అమెరికావంటి దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొలేక పోయాయి.


కరోనాను ఇండియా ఎలా కట్టడి చేసింది?
ఇండియా కట్టడి చేసిందని అనుకోవటం కరెక్ట్ కాదు. మరణాలు ఎక్కువగా లేకపోవటం అనేదాన్ని చూపించి అలా మాట్లాడుతున్నాం గానీ, అది వాస్తవం కాదు. ఇండియాలో కూడా దాదాపు ఒక 60, 80వేల దాకా కేసులు రికార్డు అవుతున్నాయి. దాదాపు 20వేల దాకా మరణాలు దగ్గరౌతున్నాయి. రేపు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కట్టడి చేసే పరిస్థితులు లేవు. ఒకటి ప్రపంచ మహమ్మరి కరోనా క్రిమిని చంపటానికి మందు కనుక్కోలేదు. మందు లేకుండా వైద్యం చేయటం సాధ్యం కాదు. ఈ ఇన్ఫెక్షన్‍ వ్యాపించకుండా నియంత్రించటం కోసం వివిధ దేశాలు, రాష్ట్రాలు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నాయి. అందులో భాగంగా లాక్‍డౌన్‍. ఎవరికి వాళ్లు భౌతిక దూరం పాటించటం. వ్యాప్తికి అవకాశం ఇచ్చే వాటిన్నిటిని బంద్‍ చేయటం. మాల్స్, సినిమాలు, బస్సులు, రైలు, విమానాలు, పండుగలు, ప్రార్థన స్థలాలు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. మాస్క్ను ఒక సింబాలిక్‍గా తీసుకున్నారు. కనీసం దూరం పాటించటం, మాస్క్లు ధరించటం, దానితో పాటు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‍ ద్వారా శుభ్రపరుచుకోవటం. ఈ జాగ్రత్తలు తీసుకొని మనం కట్టడి చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇవన్నీ ఆ వైరస్‍ మనకి సోకకుండా, సంక్రమించకుండా తీసుకునే జాగ్రత్తల కిందకి వస్తాయి. ఇతర దేశాలకంటే మన దేశం మెరుగుగా ఈ పని చేసిందా అంటే చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే మార్చి రెండో వారం దాకా కేంద్ర ప్రభుత్వం మేలుకోలేదు. ఈ లోపల ఇండియాకు ట్రంప్‍ వచ్చాడు. ట్రంప్‍ వస్తూ వస్తూ్త ఆరువేల మందిని తీసుకొచ్చి దేశమంతటా తిరిగి వెళ్ళిపోయారు. మనమేమో నమస్తే ట్రంప్‍ అని చెప్పడం కోసమే లక్షలాది మందిని జమ చేశాం. వీటివల్ల జరగాల్సిన నష్టం జరిగింది. ప్రభుత్వ కట్టడి కన్నా భారత దేశంలో ఉండేటు వంటి సమశీతోష్ణ స్థితి ఒక వరం మనకి.


వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఎలా ఉన్నాయి?

కోవిడ్‍ మహమ్మరిని ఎదుర్కొవటం కోసం ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహకరిస్తు ప్రజలు ఏ మేరకు స్వయం నియంత్రణ పాటిస్తున్నారో అది కూడా ఒక చర్యనే. జీవితం జీవనాధారం ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సంపన్న వర్గం, ఉన్నత మధ్య తరగతికి సంబంధించిన వాళ్లకి రేషన్‍, కూరగాయలు, డబ్బులకు ఇబ్బంది లేదు. కానీ ఏ పూటకు ఆ పూట రెక్కడితేగానీ డొక్కాడని వాళ్లు జీవనాధారం కోసం బయటికి రావాల్సి వస్తది. నిబంధనల్ని పాటిస్తే మంచిదని అందరికి తెలుసు. కానీ కరోనాతో వచ్చేటువంటి చావు కంటే తాము ఉన్న స్థితిలో ఆకలి చావుతో వచ్చే చావు ముందుగా వస్తే ఏం చేయాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇల్లులేని వలస కూలీల, అసంఘటిత కూలీల, నిరాశ్యుల నిర్భాగ్యుల స్థితిగతులను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి జీవనాధారం కల్పించకపోవడాన్ని చూశాం.


అసలు ముందు వలస కార్మికులు ఎంత మంది ఉంటారో అవగాహన లేదు. మన తెలంగాణలో ఉండే పాలమూరు జిల్లాకు సంబంధించిన వారు దేశం నలుమూలా ఉన్నారని తెలుసు తప్ప, దేశం నలుమూల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చారని మనం గమనించలా. ఇప్పుడు కరోనా రాకుంటే ఈ వార్తలు మనం చూసే వాళ్లమే కాదు. ఈ రెండు రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది గమనించటంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. ప్రజలు వంద రోజులు ఇంట్లో కూర్చుని జీవనాధార సమస్య తలెత్తకుండా జీవించే పరిస్థితి ఈ దేశంలో ఉందా? లేదు అనే సంగతి కరోనా బయటికి తీసుకొచ్చింది.


జీవనాధారంతో జీవించే హక్కు ప్రజల హక్కు అయినప్పుడు వాళ్లు జీవనాధారం కోల్పోతే లేదా పొందే పరిస్థితి లేకపోతే కల్పించాల్సిన బాధ్యత ఎవరిది! హీన స్థితిలో ఉన్న వాళ్లకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, నిస్సాయత స్థితిలో ఉండే వాళ్లకి సహాయక పాత్ర వహించాలని రాజ్యాంగం చెబుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి. మూడు సార్లు ప్రసంగాలు చేసినటువంటి ప్రధానమంత్రి వలస కూలీలకు సంబంధించిన ఆర్థిక ప్యాకేజీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడటం జరిగింది. వలస కార్మికుల ఇబ్బందికి ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోవటం వల్ల మరీ చివరికి వలసకార్మికులే తిరుగుబాటు చేసి మా ప్రాంతాలకి వెళ్తామని ఆందోళనకి దిగటం జరిగింది. అందరం చూశాం సూరత్‍లో, బాంబేలో జరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‍ సంగారెడ్డిలో జరిగింది.


గౌడోన్లల్లో ధాన్యం మూలుగుతుంది. వలస కార్మికుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి! ప్రతి కుటుంబానికి నెలకి 10వేల రూపాయలు నగదు, ప్యాకేజీ ఇవ్వాలి. రెండు ఈ మూడు నెలలకి సరిపడా నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయాలి. నిత్యావసరాల సరుకులు రేషన్‍ షాపుల ద్వారా రేషన్‍ కార్డు లేకపోయినా సరే పంపిణీ చేయాలి. మూడు స్వస్థలాలకు వెళ్లాల్లి అనుకొనేవారికి ప్రయాణ సౌకర్యాలు ఉచితంగా కల్పించాలి. వలస కార్మికులకు పుడ్‍, పుట్‍వేర్‍, వాటర్‍, మాస్క్ ఉచితంగా అందించాలి. పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట వారిని ఉద్యోగంలోంచి తొలగించకుండా లాక్‍డౌన్‍ కాలానికి వేతనం ఇచ్చేలాగా యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిస్సహాయులకు సహాయం అందించాలి. సాధారణ ప్రజల విషయంలో, ఈ వలస కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వాలు అనుసరింస్తున్నటువంటి బాధ్యతా రాహిత్య వైఖరి ఇది కరోనా కంటే ప్రమాదకరమైనదని చెప్పవచ్చు.


చిన్న చిన్న దేశాలు విపత్కర పరిస్థితి నుండి ఎలా బయట పడ్డాయి?
అభివృద్ధి చెందిన పెద్ద దేశాలే ఈ కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కోవటంలో ఘోరంగా విఫలమయ్యాయి. అభివృద్ధిలో వెనుకబడిన చిన్న దేశాలే చాలా వరకు సక్సెస్స్ అయినాయని ప్రపంచ అనుభవాలు చెబుతున్నాయి. సైన్స్, వైద్య రంగంలో అభివృద్ధి చెందిన దేశాన్ని ఈ కరోనా వైరస్‍ ఏం చేస్తుందని చాలా తేలికంగా నిర్లక్ష్యంగా, అహంకారంతో మాట్లాడం ఒక కారణం. చిన్న దేశాలు పెద్ద దేశాల వాళ్లలాగా నేలను విడిచి సాము చేయలేదు. అందుకని వాళ్లు బెటర్‍ పోజిషన్‍లో ఉన్నారు. వియత్నాం, దక్షిణ కొరియా, క్యూబా ఉదాహరణలు. వియత్నాంలో వాళ్లు త్రిముఖమైన వ్యూహం అనుసరించారు. ఆ త్రిముఖమైన వ్యూహంలో అంశాలు ఏమిటంటే, ఒకటి నిర్లక్ష్యం చేయకుండా ముందుగా మేల్కొనటం. ముందు జాగ్రత్తలు తీసుకోవడం. ఇది ఏదో మామూలు ప్లూ జ్వరం లాగా పారాసిటమాల్‍ వేసుకుంటే పోతుంది అని కాకుండా, ఇది చాలా ప్రమాదకరమైన వ్యాది, అది చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది. ప్రాణప్రాయాలు కల్గిస్తుంది. ప్రభుత్వ సాధనాల ద్వారా చాలా ముందు జాగ్రత్త చర్యగా గ్రాస్‍రూట్‍ లెవల్‍లో ప్రతి మనిషికి అర్థం అయ్యేటట్లుగా ప్రచారం చేశారు. అందువల్ల ప్రపంచంలోనే ఒక్క చావు కూడా లేని దేశం వియత్నాం. చైనాకు ఆనుకొని వున్న దక్షిణ కొరియా పరిమితులను, లోపాలను అధిగమించి దాన్ని ఎదుర్కోవటం కోసం కొన్ని చర్యలను తీసుకున్నది. అంటే కార్వంటైన్‍లు తరువాత ఐసోలేషన్‍ వార్డులు, వెంటిలేటర్లు పరికరాలు, వైద్య సిబ్బంది ఇలాంటివి ఏవైతే అవసరం అవుతాయో అవి దేశ ప్రజలకి సరిపడినన్ని తయారు చేసుకొని వున్నారు. ఇవి ఉండటం వల్ల వాళ్లు వెంటనే వియత్నాం లాగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంతో పాటు, టెస్ట్లు చేయటం కార్వంటైన్‍కు పంపటం, వైద్యం చేయటం తద్వారా మినిమం మరణాలతో ఆ దేశం ఎదుర్కోగల్గింది. తరువాత క్యూబా. క్యూబా అదొక కమ్యూనిస్టు దేశం. అభివృద్ధి చెందిన దేశం అమెరికా ఇవాళ ప్రపంచంలోనే మరణాల రేటులో నెంబర్‍ వన్‍ స్థానంలో వుంటే క్యూబా ప్రమాదంలో వున్న దేశాలకు వైద్యుల్ని, వైద్య పరికరాల్ని, మందులను పంపగల్గుతుంది. చిన్న దేశాలకు ప్రజల సంక్షేమం పట్ల ఉన్న బాధ్యత వల్ల, నిబద్ధత వల్ల యిది సాధ్యమైంది.

ప్రపంచ ఆర్థిక రంగంలో రాబోయే మార్పులు ఏమిటి?
ఇప్పుడు నడుస్తున్నది న్యూయో లిబరల్‍, న్యూ ఎకనమిక్‍ పాలసీ. ఉదార ఆర్థిక విధానం, నూతన ఆర్థిక విధానం. దాన్ని వ్యక్తీకరణ ఎల్పీజీ రూపంలో లిబలైజేషన్‍, ప్రవైటేజేషన్‍, గ్లోబలైజేషన్‍ నడుస్తుంది. ఈ కరోనా తరువాత ఈ న్యూయో లిబరల్‍, న్యూ ఎకనమిక్‍ పాలసీ స్థితిలో మార్పులు రాబోతున్నాయి. ఎల్పీజీలో కూడా మార్పులు రాబోతున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అది ప్రపంచీకరణ అయితే అది గ్లోబలైజేషన్‍. అయితే రాబోయే పరిణామం లోకలైజేషన్‍ రాబోతుంది. మా తెలంగాణ మాకు ముఖ్యం. మా ఇండియా మాకు ముఖ్యం. మా అమెరికా మాకు ముఖ్యం, ఒక స్థూల నైతికతతో లోకలైజేషన్‍ అనేది స్థానీకీకరణ రాబోతుంది. ఉదార ఆర్థిక విధానం అంటే ప్రపంచ మార్కెట్‍లో ఎవరైనా ఏ దేశంలోనైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక నుంచి అది జరగదు. చైనాలో ఉండే వ్యాపారాలన్నింటిని యూరప్‍ దేశాలు ఎత్తేసుకొని ఇతర దేశాలల్లో పెట్టబోతున్నాయి. ఇండియా కూడా చైనా నుండి మన దేశానికి దిగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏవి కూడా దిగుమతి కావటానికి వీల్లేకుండా ఒక చట్టాన్ని చేసింది. ప్రపంచీకరణతో పాటు ప్రైవేటీకరణ ప్రక్కన పెట్టి ప్రభుత్వ రంగంలో స్వావలంబన పాటించి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.


కరోనా పరిస్థితులను అంచనా వేయటంలో ప్రపంచ వ్యాప్తి వైఫల్యానికి కారణం ఏమిటి?
ఈ వైఫల్యం అమెరికా నుండి కనిపిస్తుంది. ఈ వైఫల్యం ఇతర పశ్చిమ దేశాలనుంచి యూరప్‍ దేశాల నుంచి ఇటలీ, ఫ్రాన్స్ ఇంగ్లండ్‍ దేశాలనుంచి కనిపిస్తున్నది. ఎక్కువ జనసాంద్రత కల్గిన భారతదేశం లాంటి దేశం నుంచి కనిపిస్తున్నది. ఒకరకంగా వైఫల్యం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీనికి కారణం కరోనా ఎంత ప్రమాదం కల్గించగల్గుతుందో అంచనా లేకపోవటం. ఇప్పటికి అది ప్రపంచ వైఫల్యం అనే దానికంటే కరోనాకి సంబంధించిన విలక్షణం అని చెప్పుకోవాలి.


పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
కరోనానే పర్యావరణాన్ని కాపాడుతున్నదేమో అనిపిస్తుంది. ఇది ఎంత ప్రమాదం కల్గిస్తా ఉన్నదో అంత మేలు కూడా చేస్తున్నది. గంగానదిలో నీళ్ళు ఇప్పుడు ఉన్నంత స్వచ్ఛంగా ఎప్పుడూ లేవట. జల కాలుష్యం లేకుండా కరోనా కాపాడుతుంది. రెండోది శబ్ద కాలుష్యం. మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే సరికి చెవులు దిబ్బిలు లేస్తుంటాయి. మూడోది వాయు కాలుష్యం. ఈ వాహనాల కార్బన్‍ డయాక్సైడ్‍ వలన అసలు భూమి యొక్క భూతాపం ఎక్కువై పోతుందని చెబుతున్నారు. వాయు కాలుష్యం తగ్గింది, జలకాలుష్యం తగ్గింది, శబ్ద కాలుష్యం తగ్గింది. అందువల్ల భూతాపం తగ్గింది. కారణం లాక్‍డౌన్‍ విధించి అందరిని ఇంట్లో ఉంచడం వలన. మళ్లీ మనం బయటికొస్తే చేసేవన్నీ చేస్తాం. కరోనా సందర్భంలో ఈ పర్యావరణానికి ఎంత మేలు జరిగిందో గమనించి ఆ జాగ్రత్తలను పాటించటం అవసరం.


కరోనా పుట్టుకకు ప్రకృతి వైపరీత్యాలే కారణమా?

ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదు. ప్రకృతి కారణం కావొచ్చు. చెట్లు జంతువులు, పక్షులు, మనుషులు మొత్తం కలిసి ప్రకృతి. ప్రకృతితో సంబంధం లేకుండా మనిషి లేడు. ప్రకృతి ధర్మాలను బట్టి మనిషి కూడా నడుచు కోవాలి. చలికాలం ఎలా బతకాలో, ఎండాకాలం ఎలా ఉండాలో, వానా కాలంలో ఎట్లా బతకాలో మనకు తెలుసు. ప్రకృతి అనుగుణంగా నడుచుకోవాలి. ప్రకృతితో మానవుడికి వుండే సంబంధాన్ని శాస్తీయంగా ఏర్పాటు చేసుకోవాలి.


మానవ సంబంధాలు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థపై దీన్ని ప్రభావం ఎట్లా ఉంటుంది?
మానవుడికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి స్వార్థం, రెండు మానవుడు సంఘ జీవి. సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మనిషి బతకలేడు. అలాగే స్వార్థ జీవి కూడా. ఇప్పుడు కరోనా అంటే ఎందుకు అంత భయపడుతున్నాం. ఉప్పెన వస్తుందంటే, భూతాపం పెరిగిపోతుందంటే, భూగోళం బద్దలు అవుతుందంటే అవ్వనీలే నాకేమిలే అనుకొంటాం. ఎక్కడో ఏదో జరిగిదంటే నాకేమిలే అనుకుంటాం. దేనికీ భయపడని వాడు కరోనాకి ఎందుకు భయపడు తున్నాడు. ఒకరినుంచి మరొకరికి సోకుతుంది అనే సూత్రంలో ఆ మరొకరిని నేను కాకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ వ్యక్తి ప్రాణాప్రాయం కల్గకుండా ఉండటం కోసం అవసరమైతే కన్న తల్లినైనా, కన్న కొడుకునైనా, కుటుంబ సభ్యులనైనా, ఫ్రెండ్స్నైనా, రాజకీయ పార్టీ వాళ్లనైనా అవతలికి తీసేసి వాడిని వాడు కాపాడుకోవాలని చూస్తాడు.
మానవ సంబంధాలు, రక్తసంబంధాలు, కుటుంబ సంబంధాలు, బంధుత్వ సంబంధాలు ఎక్కడ ఏడ్చినాయి. బేసిక్‍గా మానవుడు స్వార్థపరుడు. తన ప్రాణానికే ప్రమాదం వచ్చినప్పుడు ఎవ్వరిని పట్టించుకోకుండా తన ప్రాణాన్నే కాపాడుకుంటాడు. ఇది మంచిదా, చెడ్డదా అని కాదు. ఇది మనిషి లక్షణం. ఈ స్వప్రయోజనంతో కూడుకొన్న స్వార్థ లక్షణానికి సామాజిక సమిష్టి ప్రయోజనానికి మధ్య ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతా వుంటది. ఈ కరోనా ఏం చేసిందంటే మనిషిని మళ్లీ భయం రీత్యా స్వార్థ పరుడిగా ఒంటరిని చేసింది. మనం ఏం చేయా లంటే మళ్లీ మానవ సంబంధాలను పెంపొందిం చాలి. నా తల్లిని చూసుకోవాలని, నా బిడ్డను చూసుకోవాలని వేల కిలోమీటర్లు నడుచుకుంటు పోతాడు ఒక మనిషి. స్వార్థానికి – నిస్వార్థానికి, వ్యక్తికి – సమిష్టికి, మానవ సంబంధానికి – రక్త సంబంధానికి, సమాజ సంబంధానికి – సంఘ సంబంధానికి మధ్య సంఘర్షణలో మళ్లీ వీటిని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మనదేశ ఫెడరల్‍ వ్యవస్థ రేపు ఎలా ఉండబోతుంది? ఎలా ఉండాలి?
కేందప్రభుత్వం రాష్ట్రాలకి ఎలాంటి సహాయం చేయకుండా, రాష్ట్రాలకు ఉండే హక్కులను కూడా హరించేస్తుంది. రాష్ట్రాలకుండే ఆదాయాలకు గండి కొడుతూ ఒకరకంగా రాష్ట్రాలను వేధిస్తుంది. ఇప్పటి దాకా సహకార ప్యాకేజీ ఇవ్వలేదని అంటున్నారు. సహకార ఫెడరలిజం అంటేనే సహకారం అందించేది. సహకారం అందించకపోతే కేంద్రం వేధించుతుంటే ఫెడరలిజం ఎలా అవుతుంది. దీన్ని సీరియస్‍ సమస్యగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు అంశాలను ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు రాష్ట్రాలు లేకుండా కేంద్రం లేదు. ఒకప్పుడు ఎన్టీరామారావు అయితే కేంద్రం మిధ్య అన్నాడు. రాష్ట్రాలు సత్యం, కేంద్రం మిధ్య. అయినా రాష్ట్రాలను ఇప్పుడు మిధ్య చేసి కేంద్రం సత్యం అవుతున్నది. కరోనా సందర్భంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మూడు రకాల నష్టాలను కల్గుజేస్తున్నది. ఒకటి ఒక ఎలక్ట్రిసిటి బిల్లు చట్టంగా తీసుకురాబోతున్నదని ఇవాళ నిన్న వార్తలు వస్తావున్నవి. రాష్ట్రాల చేతుల్లో ఉండే అధికారాన్ని కేంద్రం లాక్కోమని ఏ రాజ్యాంగం చెప్పింది కోపరేటివ్‍ ఫెడలిజం సహకరించమందే గానీ గుంజుకోమనలేదే. రాష్ట్రాల హక్కు ఇది. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం తీసుకెళ్తుంది. రాష్ట్రాలకి కేంద్రాలకి ఉమ్మడి హక్కులు ఉన్నాయి. అది కూడా కేంద్రం హక్కుల్లోకి తీసుకెళ్తా ఉంది. దీని ద్వారా ఏమౌతుంది రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని దొంగ దెబ్బ తీసి కేంద్రం తీసుకుంటా ఉంది. పోనీ నీవు తీసుకున్న ఆదాయాన్ని రాష్ట్రాలకు ఏమన్న ఇస్తున్నావా.


ఉదాహరణకి ప్రధానమంత్రి సహాయనిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి రెండు రకాల నిధులు ఈ విపత్కర పరిస్థితులో వస్తున్నాయి. ప్రధానమంత్రి సహాయనిధికింద దాతలు చేసినటువంటి సహాయానికి ట్యాక్స్ వెసులుబాటు కల్గిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం చేసే విషయంలో ట్యాక్స్ వెసులుబాటు లేకుండా కేంద్రం చేస్తుంది. అప్పుడు ప్రధానమంత్రి నిధికి ఇస్తే ట్యాక్స్ వెసులుబాటు వస్తుందని చెప్పి అటే ఇస్తారు కొంతమంది.


కేంద్రం ప్రభుత్వం అధికార కేంద్రీకరణ పెరిగి పోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలిసో తెలియకో ఇప్పటి దాకా ఆమోదం తెలియచేస్తూ ఉన్నాయి. రాష్ట్ర పాలితప్రాంతాల్ని దేశ వ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతున్నది. కేంద్రం అధికార కేంద్రీకరణ, ఆర్థిక వనరుల నియంత్రణ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని గుర్తించి రాష్ట్రాలు నిజమైన ఫెడలిజం కోసం పోరాడకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల చేత ఓట్లు పొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొన్న రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఉండవు. మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోతుంది. అందుకే నిజమైన ఫెడలిజం రావాల్సిన అవసరం ఉంది. రియల్‍ ఫెడలిజం అంటే నాలుగైదు అధికారాలు మాత్రమే కేంద్రంలో ఉండాలి. రైల్వే, పోస్టల్‍, టెలిగ్రాఫ్‍, రక్షణ, సైన్యం, కరెన్సీ ఇలాంటి నాలుగైదు అంశాలు కేంద్రం చేతిలో ఉండాలి. మిగతావన్నీ కూడా రాష్ట్రాల చేతిలో ఉండాలి. ఈ రాష్ట్రాలను సమన్వయం చేసే పాత్ర కేంద్రానికి ఉండాలే తప్ప పెత్తనం చేసే పాత్ర ఉండటానికి వీలు లేదనే మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఉండదు.


కరోనా సందర్భంగా మీ అంతర్మథనం, ఆలోచనలు ఏమిటి?
హెల్త్ అనేది పబ్లిక్‍ సెక్టార్‍లో ఉండకపోతే ఎంత అభివృద్ధి చెందినా విపత్తుని ఆపలేమని తేలిపోయింది. సైన్స్ను నమ్మండి. మూఢనమ్మకాల్ని, మూఢ విశ్వాసాలని నమ్మితే మనం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోలేమని కరోనా మనకు గుణపాఠం చెబుతావుంది. జబ్బులొచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి మందులు వేసుకోవాలి, వైద్యం చేయించుకోవాలి. అలా అయితేనే బతుకుతాం. లేకపోతే బతుకు లేదని కరోనా చెబుతున్నటువంటి ఈగుణపాఠాన్ని చూసి నేర్చుకోవాలి. కోవిడ్‍ సందర్భంగా ఈ విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దక్కన్‍ ఛానల్‍ వారికి ధన్యవాదాలు.

(సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)
– జుగాష్‍ విలి, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *