ఫణిగిరి బౌద్ధ ఆరామ శిథిలాలు

హైదరాబాదు సంస్థానం పూర్వ ఆంధ్రసామ్రాజ్య శిథిలాలకు పట్టుకొమ్మ, పూర్వ ఆంధ్రసాహిత్య, శిల్ప, లలితకళాది సంపదలు అస్థి స్వరూపములో, ఈదేశపు గడ్డను శిథిలాలలో దొరుకుతాయి. ఫణిగిరి అట్టి పూర్వ శిథిలాలలో ప్రసిద్ధమయినది.
నల్లగొండ జిల్లాలో, గత పది ఏండ్లలో నేనొనర్చిన పురావస్తు పరిశోధనలకు ఆలవాలమైన పురాతన క్షేత్రాలలో ఫణిగిరి శిథిలారామము, బహుముఖ్యమైనది. ఈ విహారము ఒక చక్కని కొండగుట్టమీద నిర్మితమై ఉన్నది. ఈ గుట్టలో క్రీ.పూ. 1వ శతాబ్దము నుండి, శతాబ్దాలతరబడి కాలగర్భమున లీనమైపోయిన భారత సంస్కృతి, పురావస్తు రూపమున అంతర్గర్భితమై శిథిలస్థితిలో నిలిచి యున్నది. పరిశోధకులకు ప్రాచీన భారత సంస్కృతిని బహిరపరచుటకు అనంతమైన సంపద ఈ ఆరామ శిథిలాలలో లభించగలదు.


ఫణిగిరి పోవలెనన్న ‘జనగాం’ రైల్వే స్టేషనులో దిగి సూర్యాపేట రోడ్డుమీదుగా 30 మైళ్లు పోవలెను. శాస్త్రీయ పరిశోధనల వలన ఫణిగిరి శిథిలాలు, బౌద్ధయుగము నాటివని బయల్పడినది.
ఇక్కడ దాదాపు ముప్పది స్తూపముల శిథిలములు బయలు పడినవి. ఇవన్నీ గుండ్రని కట్టడములు. ఎక్కువగా రాతితో కట్టినవే. అడుగున ఎత్తుగా రాతితో నలుచదరపు వీకము కట్టినట్లుండి పైన స్తూపములు కట్టబడి యున్నవి. ఈ చదరపు ఫలకములపై మరేమైన కట్టడము కూడ యుండెడిదో లేదో, ఇదంతయు ఎప్పుడైన గిలాబా చేయబడి యుండెడిదో లేదో ఊహించుట కష్టము. ఈ స్తూపములలో చాలా భాగము, ముఖ్య ఆరామమునకు పశ్చిమ భాగముననే కొండవాలువ, వివిధ అంతస్తులుగా నిర్మింపబడి యున్నది.
ఆరామ మధ్యమున, నలుచదరపు వ్యూహముగా, ఇటుక కట్టడముల పునాదులున్నవి. ఈ పునాదులలో కూడ గదులు గదులుగా కట్టబడ్డ నిర్మాణముల శిథిలములో ఎక్కువ బయలుపడు చున్నవి. ఈ గదులు విడివిడి బౌద్ధ సన్యాసుల నివాస గృహములో (Cells) లేక మరే ఇతర ప్రయోజనార్థమై కట్టబడినవో సరిగా ఊహించుట కష్టము.


ఈ చైతన్యము కొండపైన కట్టబడినదగుటచేత కాబోలు, కట్టడాలు వానకు, వరదకు కొట్టుకొని పోకుండను, నీరు ఇంకి కూలిపోకుండను, నిర్మాతలు చాలా జాగ్రత్త వహించినట్లు కనబడుచున్నది. దాక్షిణాత్య శిల్పములో తదితర స్థానములందు కనరాని, పెట్టె కట్టుడు విధానములో (Boxed buttresses) మందిరము గోడలకు ఈ రక్షణను అవలంబించినారు.
ఈ శిథిలాలలో దొరికిన వాసపు పెంకుల వంటివి, పూర్వ ఆంధ్రశిథిలాలలో మాత్రమే లభించిన వాటివంటివగుటచేత, ఈ చైతన్యములోని ఇండ్ల కప్పులకు కూడ కొన్నిటికి పెంకులే వాడి ఉండిరేమో అని ఊహించవచ్చును. దీనినిబట్టి ఈ చైతన్యగృహముల ఉపరి భాగములు గట్టి వస్తువులతో కాక, త్వరితముగా శిథిలమైపోవు వస్తువులతోనే నిర్మించినట్లు భావించ నొస్సదము కలుగుచున్నది. కట్టడములకు వాడిన ఇటుకలు రెండడుగుల పొడవు, అడుగు వెడల్పు, 3.1/2 అంగుళముల మందముగా కలిగి ఉన్నవి. ఫణిగిరి కట్టడములలో వాడిన ఇటుకల నిర్మాణము, కొండాపురం కట్టడములోని ఇటుకల నిర్మాణ విధానములోనే జరిగినది. మట్టితో ఎండుగడ్డి, ఊక మొదలైనవి కలిపియే ఈ ఇటుకలను తయారు చేసినట్లున్నది. ఈ ఇటుకలలో, గడ్డి, ఊక మొదలైనవి కాలినప్పటి గతుకులు చెక్కు చెదరకుండ అట్లే కన్పించుచున్నవి.


ఇక్కడ దొరికిన వానిలో తెల్ల సున్నపురాతి చెక్కడములు కొన్ని బహు అందమైనవి దొరికినవి. బౌద్ధుల మత విగ్రహములు తదితర లాంఛన శిల్పములుగల చెక్కడములు, తరువాయి కాలములలో ఈ ఆరామములను నాశన మొనర్చినప్పుడు, ముక్కలు ముక్కలుగా విరగగొట్టబడి, చిందర వందర చేయబడినవి.
ఫణిగిరిలో దొరికినవి శిల్ప సముదాయము బహుస్వల్పము. కాని వానిలో శిల్పకళ అత్యున్నత శిల్ప సాంప్రదాయములను వెలువర్చుచున్నది. శిల్పములలో, జీవశక్తి భావుకత్వము, రూప సౌందర్యము, విస్త•తముగ కొట్టవచ్చినట్లు కనిపించును.
ఈ దొరికిన విగ్రహములలో, ఒక విగ్రహ ఊర్ద్వభాగము మాత్రము దొరకినది, ఆ విగ్రహములోని కండరముల సొంపు, మొగమున భావశబలత, బహురమణీయముగ భావస్పూరకముగ నుండి, చిత్తవృత్తుల నద్దములో ప్రతిబింబించినట్లు మొగము రేఖలలో బింబించు చున్నవి. చెవుల వ్రేలాడుచున్న తాటంకముల బరువుతో చెవి సాగిపోయినట్లు, తాటంకముల బరువును తెలుపుతూ శిల్ప యథార్థముగ శిల్పమును నిర్మించినాడు. తలపై విజయలాంఛనముగ చుట్టబడిన ఆకుకొమ్మ, విగ్రహమునకు గ్రీకు స్వరూపమును కల్పించి, ఆనాటి శిల్పముపై గ్రీకుశిల్ప ప్రభావ మెంతగలదో చాటుచున్నది. దక్షిణ భారత భూమిలోనికి ఈ గ్రీకుశిల్ప ప్రభావము అటు ఉత్తరము నుండియూ, ఇటు తూర్పు పడమర సముద్ర తీరములనుండియూ కూడ చొచ్చుకొని ప్రవేశించినది.


ఇచ్చట దొరికిన వస్తువులలో మరొకటి కుడ్య భాగమైన నిడుపాటి పలకల దిమ్మ. దీనిలో దొరికిన భాగము చిన్నదేయైనను, ఈ ముక్కమీదనే, మూడు ప్రక్కలు శిల్పములు చెక్కబడి యున్నవి. ముఖభాగమున, సంపూర్ణముగా రేకులు విచ్ఛిన పద్మము అందముగా చెక్కబడి యున్నది. ఈ పత్రముల రచన బహు ఆకర్షణీయముగ నున్నది. ఈ పద్మమునకు దిగువ, ఒక వృషభము, మానవుడు, గజము, విగ్రహములు చెక్కబడి యున్నవి. ఈ వృషభ రూపము, మూపురము ఎత్తుగా ఉండుట, సుమేరియన్‍, మెహెంజొదారో శిల్పాలలోని వృషభాలను జ్ఞప్తికి తెచ్చుచున్నది. అజంతా శిల్పములలోని వృషభ సమరముల చిత్రములను కూడ జ్ఞప్తికి తెచ్చుచున్నది గాని, ఇచట వృషభ స్వభావము సమర ముఖముగాలేదు ఈ వృషభమును ఏనుగు తరుముచున్నది. ఏనుగుకాయము మహాస్థూలముగునూ, ఏనుగు దంతములు దీర్ఘములుగానూ, రచించబడినవి. ఈ తరుముకొని వచ్చుచున్న ఏనుగును, అల్పకాయుడైనను, మహాధైర్యముతో ఎదుర్చుచు వృషభమునకు గజమును మధ్య నరుడు నిలిచి యున్నాడు, మానవుని రూపములో విజయమందు కొను చిహ్నాలే గాన్పించుచున్నవి.
పలక ఎడమవైపు ముఖమున, మరల పద్మపత్ర ఖండమే లిఖించబడి యున్నది. దానికి దిగువను, వర్చస్వియైన పురుషుని రూపము చిత్రించబడి యున్నది.
పలక కుడివైపు ముఖమున కూడ రెండవ దానిలో వలనే యున్నది కాని, ఇచట పద్మము క్రింద పురుషుని బదులు, సింహము చెక్కబడి యున్నది.
ఈ శిథిలములలో దొరికిన మూడవ చెక్కడము, కుడ్య శిల్పమువలె నున్నది. దీనిలో విగ్రహము వామన రూపుడైన బొజ్జయ్య రూపమువలె, నేటి కార్టూన్‍ శిల్పములవలె నున్నది. ఈ విగ్రహమునకు చెక్కిన అలంకరణములు, నిండైన బొజ్జ, ఇవి కుబేరుని స్వరూపమునకు వ్యంగ్య శిల్పమేమోనని యనిపించు చున్నది. విగ్రహము రూపు రేఖలు దాక్షిణాత్య విధానములోనే ఉన్నవి. ముఖమున భావప్రకటనము, విగ్రహము అంగవిన్యాసము ఉత్తమశిల్ప లక్షణములను ప్రకటించుచున్నవి.


ఫణిగిరిలో, దొరికిన నాణెములలో ఆంధ్ర రాజులవి ఆరువది నాల్గు నాణెము లున్నవి. ఇవన్నియు సీసముతో చేయబడిన నాణెములు. క్రీ.శ. 2వ శతాబ్దపు నాణెములు కూడ మఱికొన్ని దొరికినవి. ఈ నాణెములు ఫణిగిరి ఆరామ కాలమును నిరూపించుచు తక్కిన చారిత్రక పరిశోధనలను బలీయమొనర్చు చున్నవి.
ఒకనాడు దక్కన్‍లో ప్రబలముగా వెలిగిన ఆంధ్ర సామ్రాజ్య పై భవనమును ఈ నాణెములు వేనోళ్ళ చాటుచున్నవి. వీటిని బహిరపరచి, పూర్వచరిత్రను పండిత లోకమున కందించుట, మా విధాయక ధర్మము. మనపూర్వ చరిత్ర సమీకరణలో, ఫణిగిరి శిల్ప సంపద అపారముగా నుపయోగించ గలదని ఆశించు చున్నాము.


– ఖ్వాజా మహమ్మద్‍ అహమద్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *