(కేరళలో గర్భం దాల్చిన ఏనుగు హత్యకు స్పందనగా)
కేరళలోని నీలంబూర్ అటవీ ప్రాంతంలో గర్భం దాల్చిన 15 సంవత్సరాల వయస్సు గల ఏనుగును క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ భారతదేశ ప్రజలను, జంతు ప్రేమికులను విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనకు స్పందించిన వారిలో రతన్ టాటా, విరాట్ కొహ్లీ, ఇతర ప్రముఖులతో పాటు అసంఖ్యాక సామాన్య జనం తమ గళాన్ని వినిపించడం ఆహ్వానించదగిన పరిణామం. కరోనా లాక్‍డౌన్ కారణంగా వన్యప్రాణులు కొంత స్వేచ్ఛను తీసుకోవడం, మానవ నివాసాలకు దగ్గరగా రావడం కూడా ఏనుగు హత్యకు దారి తీయవచ్చు. పైనాపిల్ పండులో పేలుడు పదార్థాలను నింపి ఎరగా వేసి తినిపించిన కారణంగా తీవ్ర నోటిగాయాలతో 3 రోజులు నరకాన్ని అనుభవిస్తూ ఆహారం తినలేక, వైద్యానికి స్పందించక చివరికి 27 మే రోజున చనిపోవడం అత్యంత విచారకరం. వెల్లియార్ నదీ జలంలో కూరుకుపోయి, బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రాణం పోయిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగు దవడలకు తీవ్రగాయాలై దంతాలను కోల్పోయి ఆహారం తినలేక చనిపోయింది. నీటిలో చిక్కుకున్న ఏనుగును బయటకు తీసేలోపుగానే మరణించిందని వార్తలు వచ్చాయి. ఏనుగును పోస్టుమార్టం నిర్వహించగా గర్భవతి అని తేలడం బాధాకరం. ఈ విషాద ఘటనను పోస్టమార్టం నిర్వహించిన డా: కృష్ణన్ ఫేస్ బుక్ పోస్టులో రాసిన కారణంగా బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ పాశవిక చర్యకు పాల్పడిన మానవ మృగాళ్లని పట్టుకునే ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించకపోవడం విచారకరం. పతనపురం అడవులలో ఏప్రిల్ మాసంలో ఇలాంటిదే మరో ఘటన జరగడం వలన ఆడ ఏనుగు మరణించింది.
అడవుల్లో మనుషులకు వన్యప్రాణులకు మధ్య అనాదిగా పోటీ జరుగుతూనే ఉంది. వన్యప్రాణుల మాంసం, జంతు చర్మాలు, దంతాలు (ఏనుగు), ఇతర జంతు శరీర భాగాల కోసం దుండగులు, స్మగ్లర్లు జంతువులను హత్య చేయడం కొత్తేమీకాదు. వీరప్పన్ లాంటి అనేక మంది క్రూరులు వన్యప్రాణులను చంపడమే వృత్తిగా తీసుకొని అడవులలోనే నివాసం ఉంటున్నారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన అటవీ అధికారులను కూడా హత్య చేయటానికి వెనుకాడటం లేదు. ఏనుగులను హత్య చేసి దంతాల స్మగ్లింగ్‍కు పాల్పడి లక్షల రూపాయలను గడిస్తున్న కీచకులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన తరుణం ఆసన్నమైంది. అలక్ష్యం చేస్తే మరి కొన్ని వన్యప్రాణులు అంతరించే ప్రమాదం కూడా లేకపోలేదని జంతు ప్రేమికులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఏనుగు హత్యోదంతానికి స్పందించిన వారు, దొంగలను పట్టిచ్చిన వారికి లక్షల రూపాయల నజరానాలు ప్రకటనలు చేశారు. నోరు లేని మూగజీవాలను క్రూరంగా చంపే రాక్షసులను శిక్షించాలని కోరుకునే జంతు ప్రేమికులు కూడా అనేక మంది ఉన్నారు. మృగాలు క్రూర మైనవి కాదని, మానవులే నిజమైన క్రూర మృగాలని నెటిజన్లు వ్యాఖ్యలు చేయడం ఆహ్వానించ దగిన పరిణామం.
ప్రపంచవ్యాప్తంగా 4,15,000 ఏనుగులుఉన్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. భారతదేశ అడవుల్లో 27,000 ఏనుగులుఉన్నాయని అంచనా వేశారు. దశాబ్దాల క్రితం మిలియన్లు ఉన్న ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గడం జరుగుతున్నది. కర్నాటకలో 6,049, అస్సాంలో 5,719 మరియు కేరళలో 3,054 ఏనుగులు అన్నాయని తేల్చారు. 2018 కేరళ అటవీశాఖ వివరాల ప్రకారం, ఏనుగులను హత్య చేసే ప్రయత్నాలు లేదా హింసించే వారిలో 21 మంది మరణించగా, 45 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. గజరాజులను ప్రభుత్వాలు నడిపిస్తున్న ప్రముఖ దేవాలయాలలో పూజాకార్యక్రమాలకు వినియోగింటడం ఆచారంగా వస్తున్నది. తిరుమల, గురువాయూర్, కోచి, ట్రావెన్‍కోర్, మలబార్ దేవస్థానాలలో ఏనుగులను పూజలలో మరియు స్వామివారి ఊరేగింపు ఉత్సవాలలో పెద్ద ఎత్తున వాడుతున్నారు. ఒక్క కేరళ రాష్ట్ర దేవాలయాలలోనే 486 పెంపుడు ఏనుగులు ఉన్నాయని అంచనా. కొన్ని చోట్ల ఈ ఏనుగుల కాళ్ళకు భారీ గోలుసులు కట్టి వాటి స్వేచ్ఛకు విఘాతం కలిగించుట, హింసించుట జరుగుతోంది. ఆలయాలలో దేవుని దర్శనంతో పాటు గజరాజులు కూడా భక్తుల పూజలందుకోవడం చూస్తున్నాం. ఏనుగులను పెంపుడు జంతువులా కట్టి పడేయడం, గొలుసులతో బంధించడం, హింసించడం లాంటివి మన మనసును పిండేసిన అనుభవం కూడా ఉంది. ఇవే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల వద్ద కూడా 507 ఏనుగులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
03 జూన్ రోజున రతన్ టాటా స్పందిస్తూ, గర్భవతిగా ఉన్న నోరు లేని వన్యప్రాణి ఏనుగును పేలుడు పదార్థం కలిపిన పైనాపిల్ తినిపించి పాశవికంగా చంపిన క్రూర మానవ మృగాలను సత్వరమే పట్టుకొని హత్యా నేరం కింద కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిని మానవ హత్యగా పరిగణించాలని ఆవేదన వ్యక్తం చేయడం సమస్య గంభీరతను తెలియజేస్తున్నది. ఇలాంటి అమానవీయ ఘోర అకృత్యాల వలన జీవ వైవిధ్యం దెబ్బ తినడం, పర్యావరణానికి విఘాతం కలగడం జరిగి మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కానున్నది. మనం అనుభవిస్తున్న వైరస్‍ల కల్లోలం, పెనుతుఫానులు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు మొదలగు విపత్తులకు ఇలాంటి సంఘటనలు ఆజ్యం పోస్తాయని గుర్తుంచుకోవాలి. ‘‘సర్వ ప్రాణి సుఖినోభవంతు’’ నినాదమే మన ఊపిరి కావాలి. ప్రాణికోటి పరిరక్షణే మన లక్ష్యం కావాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమ తమ కర్తవ్యాలను తూచాతప్పక పాటించాలి. మనిషి సంఘజీవి మాత్రమే కాదని, సకల జీవుల సంరక్షణ పక్షపాతియని రుజువు చేయాల్సిన సమయం ఆసన్నమైందని భావిద్దాం.
-డా।। బుర్ర మధుసూదన్ రెడ్డి
ఎ : 99497 00037