మూఢనమ్మకాలపై పోరాడిన డా. వై.నాయుడమ్మ

పద్మశ్రీ డాక్టర్‍ యలవర్తి నాయుడమ్మ గురించి ఒక మాటలో పరిచయం చెయ్యాలంటే పుట్టుకతో రైతుబిడ్డ-వృత్తిరీత్యా అస్పృశ్యుడు. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు చెప్పుకునేవాడు. 1943లో కేవలం 17 రూపాయల నెలజీతంతో మదరాసులో గల తోలు పరిశోధనాసంస్థలో రసాయనశాస్త్ర విభాగంలో డిమాన్‍ స్ట్రేటర్‍ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ ఉద్యోగం లభించటంలో ఆ సంస్థలో కీలక పదవిలో వున్న ప్రొఫెసర్‍ కాట్రగడ్డ శేషాచలపతి సహకారం మరువలేదు. జీతం తక్కువైనా తను చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగమే లభించిందని నాయుడమ్మ భావించారు. అయితే దీనికి భిన్నంగా నాయుడమ్మ తండ్రి అంజయ్యగారు ఎదుగూ పొదుగూ లేని జీతంతో ఎలా బతకడగలడని తన కొడుకుని న్యాయశాస్త్రం చదవటానికి లా కాలేజీలో చేర్చించారు. అప్పటికే యలవర్రుకు చెందిన శ్రీ యడ్లపాటి వెంకటారావుగారు న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నారు. ఎల్‍.ఎల్‍.బి. కోర్సు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఆ చదువు పట్ల నాయుడమ్మగారికి ఏమాత్రం ఆసక్తి కలగలేదు. ఆ తరుణంలో లెదర్‍ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్‍గా వున్న ప్రొఫెసర్‍ కాట్రగడ్డ శేషాచలపతి పరిచయమయ్యారు. వారి మాటలలో నాయుడమ్మ గారు బెనారస్‍ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్‍ కెమిస్ట్రీలో బి.యస్సీ డిగ్రీ చేశారని తెలిసి తన సంస్థలో కెమిస్ట్రీ విభాగంలో చేరమని ప్రోత్సహించారు. అలా 1943లో చిన్న ఉద్యోగిగా 17 రూపాయల జీతంతో చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించారు. నాయుడమ్మగారి చొరవ చూసిన శేషాచలపతిగారు మద్రాసు ప్రభుత్వంలో తన సంస్థ పనులన్నీ చూడవలసిందిగా నాయుడమ్మగారికి అప్పగించారు. ఆ విధంగా ప్రభుత్వ వివిధ శాఖలతో, అధికారులందరితో దగ్గర పరిచయాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

1945లో నాయుడమ్మగారి వివాహం వెల్లటూరుకు చెందిన సీతాదేవిగారితో జరిగింది. అదే సంవత్సరం సి.ఎస్‍.ఐ.ఆర్‍ కు చెందిన లెదర్‍ రీసెర్చి కమిటీ యూరప్‍, అమెరికా దేశాలలోలాగా తోలు పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ‘కేంద్ర చర్మపరిశోధనా సంస్థ’ స్థాపన అవసరమని భావించి మదరాసు కేంద్రంగా పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసింది. బ్రిటన్‍లో చర్మ పరిశోధనలో విద్యనభ్యసించిన శేషాచలపతి తమ సంస్థనుంచి సమర్థుడైన నాయుడమ్మను విదేశాలకు పంపమని మదరాసు ప్రభుత్వానికి నివేదించగా నాయుడమ్మ సమర్థత అప్పటికే తెలిసినందువలన ప్రభుత్వపరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమోదం తెలిపింది. విదేశాలలో ఈ విధంగా ట్రైనింగ్‍ పొందినవారు రెండేళ్ళు తప్పనిసరిగా తమ సంస్థలో పనిచేయాలని నియమంతో బ్రిటన్‍లో గల నార్తామ్పటన్‍ కాలేజీలో చేరారు. భార్య తనతో విదేశాలకు తీసుకెళ్ళలేని పరిస్థితులలో ఆమెను ఆంధ్ర మహిళాసభలో మెట్రిక్యులేషన్‍ పరీక్షకు శిక్షణ పొందమని అక్కడ చేర్పించారు. బ్రిటన్‍లో ఒక సంవత్సరం ట్రైనింగ్‍ వల్ల అదనంగా ఒక డిప్లమా వచ్చింది కానీ, వృత్తిపరమైన నైపుణ్యం లభించలేదు. అక్కడ అధ్యాపకుల సహకారంతో అమెరికాలో ఎమ్‍.ఎస్‍. చెయ్యాలని నిర్ణయించుకుని లీ యూనివర్సిటీలో సీటు సంపాదించటమే కాక మదరాసు ప్రభుత్వం లెదర్‍ టెక్నాలజీ ఇన్‍ స్టిట్యూట్‍ తన చదువుకి ఆమోదం తెల్పటం కొత్త జీవితానికి పునాది వేసినట్లయింది. యూనివర్సిటీలో చేరటానికి ముందు ఇండియా వచ్చి భార్యను చూడటానికి అవసరమైన డబ్బు, సమయం లేదు. అప్పటికే కాలేజీ ప్రారంభమైంది. రెండేళ్ళలో ఎమ్‍.ఎస్‍. పూర్తి చేసి లీ యూనివర్సిటీలో ప్రఖ్యాత ప్రొఫెసర్‍ ఎడ్విన్‍ ఆర్‍ థీయస్‍ దగ్గర పిహెచ్‍.డి.లో చేరాడు.

× × ×

తన విద్యార్థి నాయుడమ్మ పట్ల ప్రొ. ఎడ్విన్‍ థీయస్‍ ఎంతో ఆదరణ ప్రేమ కనబరిచేవాడు. అనేకసార్లు నాయుడమ్మను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చేవారు. వారు చూపిన ఆదరణకు ముగ్ధుడైన నాయుడమ్మ కృతజ్ఞతా భావంతో తన మొదటి కుమారుడికి తన ప్రొఫెసర్‍ పేరులోగల ఆర్‍. థీయస్‍ కలిపి ‘రితైష్‍’ అని నామకరణం చేసి గురుభక్తికి నిదర్శనంగా నిలిచాడు. పరిశోధనలలో ఆవిష్కరణమైన విజ్ఞానం పరిశ్రమలు ఉపయోగించుకోవాలన్నది నాయుడమ్మ ఆకాంక్ష.  బోస్టన్‍ నగరంలోగల ఒక ప్రఖ్యాత తోలుపరిశ్రమలో కొంతకాలం, మిన్నిసోటాలో గల అత్యంత పురాతనమైన (1872 లో స్థాపించారు) ఎస్‍.బి.ఫుట్‍ టానింగ్‍  పరిశ్రమలో మెలకువలు నేర్చుకుని స్వదేశంలో వాటిని అమలు పరిచారు.


1977లో రోములో జరిగిన ఇంటర్నేషనల్‍ లెదర్‍ కెమిస్ట్ సభకు హాజరయినప్పుడు భారతదేశపు ప్రఖ్యాత శాస్త్రవేత్త శాంతిస్వరూప్‍ భట్నాగర్‍ దృష్టిలో పడ్డారు. నాయుడమ్మను లంచ్‍కు తీసుకునిపోయి ఇండియాకు తిరిగి రావలసిందిగా నాయుడమ్మను కోరారు. 1983లో భట్నాగర్‍ స్మారకపోన్యాసంలో తనని ఇండియాకు రమ్మని సి.ఎల్‍.ఐ.ని అభివృద్ధి చెయ్యమన్నాడని స్వయంగా చెప్పారు. 1953లో టి.జి. కృష్ణమాచార్యులు సి.ఎల్‍.ఐ.ని ఆవిష్కరించారు. సి.యస్‍.ఐ.ఆర్‍. సంవత్సరానికి 60 వేల గ్రాంటు ఇచ్చేది. ఆ తరువాత దీనిని సి.ఎల్‍.ఆర్‍.ఐ.గా రూపొందింది. నాయుడమ్మ తొలి భారతీయ సైంటిస్టుగా లెదర్‍ టెక్నాలజీలో పిహెచ్‍.డి. డిగ్రీతో చేరారు. అలా ఆయన 1951లో ఇండియా తిరిగి వచ్చి అసిస్టెంట్‍ డైరెక్టర్‍గా చేరారు. 1956లో అతి పిన్నవయసులో డైరెక్టర్‍ హోదాలో చేరారు.

1958లో సి.ఎల్‍.ఆర్‍.ఐ.కి నియామకం కోసం నాయుడమ్మ పేరు ప్రతిపాదనలో వుంది. అప్పుడు ఆయన వయస్సు 37 సంవత్సరాలు. అప్పుడు ఆ వయసు వాళ్ళు ఇంకా పరిశోధనలోనే వుంటుండగా నాయుడమ్మ ఏకంగా డైరెక్టర్‍ పోస్టుకు ఇంటర్వ్యూ కోసం పండిత్‍ నెహ్రూని కలిశారు. నాయుడమ్మలో ఏమాత్రం అలసట లేదు. నెహ్రూ అభిరుచికి తగ్గట్టుగా సూటు వేసుకుని ఇంటర్స్వూకి ఆకర్షణీయంగా వెళ్ళారు. అప్పుడు నెహ్రూ నాయుడమ్మను ఉద్దేశించి చిన్నవయస్సులో డైరెక్టర్‍ పదవికోసం ఇంటర్వ్యూకి వచ్చారు – అనాదిగా వున్న చర్మకారుల సమస్య పరిష్కారం కోసం నువ్వేం చేస్తావని అడిగారు. అప్పుడు నాయుడమ్మగారు నేను శాస్త్రీయ పద్ధతిలో అనాదిగా వస్తున్న చర్మకారులనుసరిస్తున్న పద్ధతులకు స్వస్తి పలికి వారికి సమాజంలో ఆర్థికంగా సమాజపరంగా గౌరవంగా బతకటానికి తోడ్పడతానని చెప్పారు. నాయుడమ్మ నేతృత్వంలో సి.ఎల్‍.ఆర్‍.ఐ. ప్రపంచస్థాయి లెదర్‍ రిసర్చి సెంటర్‍ గా వాసిగాంచింది.

1958లో పండిట్‍ నెహ్రూ సి.ఎల్‍.ఆర్‍.ఐ.ని సందర్శించి నప్పుడు తోలుతో తయారు చేసిన సువాసన వెదజల్లే గులాబి పువ్వులు బహుమతిగా ఇచ్చి నెహ్రూని ఆశ్చర్యపరిచారు. అనుక్షణం కొత్తదనం కోరే నాయుడమ్మ తోలు ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేసి భారతీయ తోలు ఉత్పత్తులకు ప్రపంచఖ్యాతి తెచ్చారు. విదేశాల నుంచి సి.ఎల్‍.ఆర్‍.ఐ.లో ట్రైనింగ్‍ పొందటం కోసం ఏటా అనేకమంది వస్తున్నారు. సి.ఎల్‍.ఆర్‍.ఐ. సైంటిస్టులు ఇతర సైన్సు కాన్ఫరెన్సులకు హాజరయినప్పుడు ‘‘మీరు నాయుడమ్మ ఇన్‍ స్టిట్యూట్‍ నుంచే వచ్చారా’’ అని అడిగేవారట. నాయుడమ్మగారు చర్మకారులు ఏ శుభకార్యాలకైనా ఆహ్వానించినప్పుడు తప్పక హాజరయ్యేవారు.

డా. నాయుడమ్మ ఆలోచనా శీలిగా, మూఢనమ్మకాలు వ్యతిరేకించే శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు పొందారు. వారి రచనలు వ్యాసాలు ఎన్నో వున్నాయి.

-నాగసూరి వేణుగోపాల్‍,
ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *