యే షెహర్‍ మేరా హై! తోడ పురానా హై!

నేను, నా కల్చరల్‍ సిటీ హైదరాబాద్‍ వర్షంలో తడిసి అలా నిద్రపోయాం. రాత్రి కురిసిన వర్షం నేలకు ప్రశాంతతను బహూకరించింది. ఆరు బయట చల్లగా ఉంది. హాయినిచ్చే చల్లదనం. గరం చాయ్‍ ఉదయాన్ని మరింత రాగరంజితం చేస్తుంది. జస్ట్ ఇప్పుడే తెలవారింది. లేత ఉదయం, రాత్రి కురిసిన వానలో చెట్లు స్నానం చేసి, ఆకుపచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తురాయి చెట్టు అయితే మరీనూ. నా ముందు హొయలు పోతుంది. ఆటిట్యూడ్‍, సో మచ్‍ ఆటిట్యూడ్‍. ఎర్రగా వికటించి నా ముందు అందంగా నిలబడింది. పోనీలే చెట్టు కదా అనుకున్నాను.
చుట్టూ అపార్ట్మెంట్లు, అక్కడక్కడ చిన్నచిన్న ఇండ్లు. కొన్ని ఆకాశహర్మ్యాలు. ప్రపంచ ప్రజలు నివసించే చోటు ఇది. అనేక సంస్కృతుల్ని తనలో సమ్మిళితం చేసుకున్న మహానగరం ఇది. గ్లోబల్‍ సిటీ నా హైదరాబాద్‍ ఇది. నా నగరానికి తనదైన సొంత అస్తిత్వం ఉంది. ఒక నవాబి ట్కస్టెల్‍ ఉంది. ఇక్కడ భాష, ఈ సంస్కృతి, వంటలు, వస్త్రధారణ, అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి. గుండెనిండా ఊపిరి పీల్చి ఎవరైనా హైదరాబాద్ను ఏ ప్లేస్‍ టు లివ్‍ అనుకుంటారు. అందుకే అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి తరలి వచ్చాయి. ఎమ్మెన్సీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు గ్లోబల్‍ సిటీలో రూపుదిద్దుకొని సైబరాబాద్‍ ఐడెంటిటీగా మారిపోయాయి. ఈ సైబరాబాద్‍, ఫైనాన్షియల్‍ డిస్ట్రిక్ట్ నాకు కొత్త కొత్తగా ఉంటాయి.

సంపన్నంగా ఉంటాయి. నిత్యం టెక్నాలజీతో విరాజిల్లుతుంటాయి. అమెరికా భూభాగం నుంచి ఒక ముక్క రాలి హైదరాబాద్లో పడిందా అన్నట్టు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. నేను అటు వైపువెళ్లను. అది ఈతరం కోసం.
నాది పాత నగరం. ఓల్డ్ సిటీ. పురానా షెహర్‍. డౌన్‍ టౌన్‍ హైదరాబాద్‍ మనసున్నవాళ్ల చోటు. నేను ప్రేమ, ఆత్మీయతల్ని వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తిరుగుతుంటాను. ఇదొక గతకాలపు జ్ఞాపకాల ఇంద్రధనస్సు. అనేక రంగుల జలకీ. నా పాతనగరం పేదదే అయినా కండ్లు తిప్పనియ్యదు. మనల్ని కట్టి పడేస్తుంది. ఓల్డ్ సిటీ ఆఫ్‍ హైదరాబాద్ ను చూసేందుకు రెండు కండ్లు చాలవు. మదీనాలో హలీం తిని, చార్మినార్‍ వైపు నడుచుకుంటూ వెళ్తే, జీవితం కనిపిస్తుంది. స్వచ్ఛమైన జీవితం. కపటం, డ్రామా, ఎత్తుగడ, వ్యూహం లాంటి మాటలు ఏ మాత్రం పరిచయం లేని నిఖార్సయిన మనిషి జీవితాలెన్నో అక్కడ కనిపిస్తాయి. మా చార్మినార్‍ మాకు తాజ్మహల్‍ అంత అందమైనది. చరిత్రను నిక్షిప్తం చేసుకొని, రోడ్డు మధ్య నిలబడి మనల్ని చూస్తూ ఉంటది చార్మినార్‍. మక్కా మజీద్‍ పాత వైభవాల గవాక్షం. లాడ్‍ బజార్‍ వీధి కనువిందు చేస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాళ్ల గాజులు ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ ముత్యాలు తయారవుతాయి. పర్ల్ కల్చర్‍. నిజానికి పాత బస్తి ముత్యాల నగరం. ఇది ఆడపిల్లల షాపింగ్‍ సెంటర్‍. చమ్కీల తళుకుల్లో మెరిసిపోతుంది ప్రతి షాపు.
ముస్లింల జీవితాల్లో పేదరికం తొలగిపోవాలి. వాళ్లు ప్రధాన స్రవంతి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన సామాజిక సందర్భం ఇది. హైదరాబాద్‍ తెహజీబ్ను అడుగడుగునా ప్రతిబింబించే నా నగరం భవిష్యత్తులో మరింత దృఢంగా రూపుదిద్దుకుంటుంది. నాకు అనిపిస్తుంది.. ఇండియాను నడిపించే సత్తా హైదరాబాద్కు మాత్రమే ఉందని.


మహెజబీన్‍
ఎ : 9866587919

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *