పిల్లల సాహిత్య సృజన – పాఠ్యపుస్తకాలు

(ఆరు నుంచి పదవతరగతి వరకు)

ఒకటవతరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు సరదాగా, ఆటల్లాగా ఉండేలా సాహిత్య పక్రియల్లో ముఖ్యమైన వాటిని పరిచయం చేశారు. అలాగే సాహిత్య సృజనకు అవసరమైన పరిశీలన, ఆలోచన, ఊహ, కల్పన మొదలైన వాటిని మెల్లగా పెంచే ప్రయత్నం జరిగింది. పేర్లు పెట్టడం, శీర్షికలు నిర్ణయించడం, పొడిగించడం, వాటిలో మంచిచెడుల గురించి ఆలోచించడం వంటి ప్రయత్నాలనూ పిల్లలు కొనసాగించడానికి పునాదులు వేశారు. అయితే ఇవన్నీ పిల్లల ప్రాథమిక స్థాయిని దృష్టిలో ఉంచుకొనే జరిగాయి.


ఇక ఆరవ తరగతి నుంచి పిల్లలు ఆ పక్రియల్లో మరింత ముందుకు కదలడానికి, మరికొంత కృషి చేయడానికీ అవకాశాలు పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాయి. వాటితో బాటు మరికొన్ని సాహిత్య పక్రియల్ని కూడా పరిచయం చేయడం, ఆ పక్రియల్లో కూడా విద్యార్థులు రచనలు చేసేలా అనేక అవకాశాలు, ప్రయత్నాలు కొనసాగించడం కనిపిస్తుంది. ఈ తరగతుల పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు ప్రధానంగా సాహిత్య సృజనకు అవసరమైన ‘‘వస్తువు’’ల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనబడుతుంది.వాటిని కూడా క్లుప్తంగా చూద్దాం.


ముందుగా ఉపాధ్యాయులకు ఇచ్చిన కొన్ని సూచనలు ఇలా ఉన్నాయి. ‘‘పాఠ్య బోధనను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకూడదు. పాఠశాల గ్రంథాలయాన్ని, అంతర్జాలాన్ని (ఇంటర్నెట్‍), మేగజైన్‍లు, వార్తాపత్రికలు, బాలసాహిత్యం, వంటివి ఉపయోగించుకునేటట్లు చూడాలి. తరగతి గదిలో పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడం, ప్రశ్నించే వాతావరణనాన్ని కల్పించాలి… పాఠశాలలో భాషాభివృద్దికి దోహదపడే కార్యకలాపాలు, భాషోత్సవాలు, బాలకవిసమ్మేళనాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు, వార్షికోత్సవాలు వంటివి నిర్వహించాలి. పిల్లలు రాసిన సృజనాత్మక అంశాలను సంకలనం చేసి తరగతి గదిలో ప్రదర్శించాలి.’’ ఇవన్నీ పిల్లల సాహిత్య సృజనకు సంబంధించిన అంశాలు. అలాగే పిల్లలు ఈ తరగతిలో సాధించవలసిన సామర్థ్యాలు కొన్ని చూద్దాం.


‘‘చదివిన, అనుభవంలో ఉన్న, విన్న, చూసిన అంశాలను వర్ణించి రాయగలగాలి. కథలు, కవితలు అల్లడం, పాత్రలు పోషించడం, పాటలను, గేయాలను పాడడం, కథలు, కవితలు, గేయాలు రాయడం, బొమ్మలను చూసి సంభాషణలను, కథలను రాయడం మొదలైనవి చేయగలగాలి. లేఖలు, వ్యాసాలు, సంభాషణలు, పట్టిక, ఆత్మకథ మొదలైనవి రాయగలగాలి. జాతీయాలు, సామెతలు ఉపయోగించి కథను రాయగలగాలి.’’ ఇలాంటి సాహిత్య సృజనకు అవసరమైన బొమ్మలు, పనులు, ప్రాజెక్టులు పాఠ్య పుస్తకంలో దాదాపు ప్రతి పాఠంలో ఉన్నాయి. వాటిని క్లుప్తంగా మచ్చుకు చూసినట్టు చూద్దాం.


మొదటి పాఠంలోనే ‘ఎవరిగురించైనా అభినందనలు తెలుపుతూ చిన్న గేయం రాయండి’ అని కనిపిస్తుంది. రెండవ పాఠంలో ‘కథ’ అంటే ఏమిటో పరిచయం చేస్తూ, ‘ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో ఉన్నదే కథ’ అని పరిచయం చేశారు. పాఠశాల ముందు ఓ స్త్రీ, నలుగురు పిల్లలు ఉన్న బొమ్మను ఇచ్చి ‘బొమ్మలో పిల్లలు ఏంచేస్తున్నారు? ఏం మాట్లాడు కుంటున్నారు? ఈ బొమ్మను చూస్తే నీకేం భావన కలిగింది?’ అని పరిశీలనకూ, ఊహకూ పని కల్పించారు. సృజనాత్మకతలో భాగంగా ‘జంతువులను, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి’ అని కథా రచనకు పురికొల్పారు. ‘అడవిలోని జంతువులు మనవలెనే మాట్లాడితే మన గురించి అవి ఏం మాట్లాడుకుంటాయో ఊహించి రాయండి’ అని ఊహలకూ, కల్పనలకూ పిల్లలకు ఇష్టంగా ఉండే పని కల్పించారు. ఇంకా ఈ పుస్తకంలో సాహిత్య పక్రియలను నేర్చుకోవడానికి ఇచ్చిన వాటిలో సామాజిక పరిస్థితులను, ప్రజల జీవితాలను అర్థం చేసుకోవడానికి, అవగాహన పెరగడానికి దోహదపడేవి ఎన్నో కనిపిస్తున్నాయి. ‘వర్షాకాలంలో పేదల కాపురాలు ఎట్లా ఉంటాయో ఆలోచించండి, చెప్పండి, సొంత మాటల్లో రాయండి’. ‘ఎండాకాలంలోని వాతావరణాన్ని, ప్రజల స్థితి గతుల్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి’ అని పిల్లలకు తమ సాహిత్య సృజనలోకి సామాజిక అంశాలనూ, ప్రజలనూ తెచ్చే పరిధుల్ని పెంచారు.


ఇలా తరువాత ఉన్న అన్ని పాఠాల్లో ఉన్న వాటిలో పిల్లల సాహిత్య సృజన వికాసానికి తోడ్పడే విషయాలు చాలా ఉన్నాయి. మనం మచ్చుకు కొన్ని మాత్రమే చూద్దాం. ‘ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?’ విశ్లేషించమని అడిగారు. మరో పాఠంలో ‘తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లా ఆగమైపోతారు?’ అని, మరో పాఠంలో ‘పశువుల కాపరిలా బాల్యాన్ని కోల్పోతున్నవారు ఇంకేవరు ఉండవచ్చు?’ అని ఆలోచింప జేస్తూ, పిల్లలకు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎట్లా పరిశీలించాలో అనే ఒక దృష్టిని కూడా ఇచ్చే ప్రయత్నాలు ఎన్నో చేశారు. చదువు తప్ప పిల్లలకు మరొక ఆటల ప్రపంచం ఉండకూడదని చాలా మంది తల్లిదండ్రులు కూడా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ‘ఆటలు ఎందుకు ఆడాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం’ రాయమని, ‘ఇప్పుడు ఆడుకునే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఊహించి సంభాషణలు’ రాయమని పిల్లలను అడిగారు.


పక్రియలు మార్చి రాయడం, గేయాలు రాయడం, విశ్లేషించి రాయడం, ఆత్మకథ, పట్టిక, వర్ణనలు, జాతీయాలూ, సామెతలూ కథల్లో ఉపయోగించి రాయడం వంటి మరికొన్ని అదనపు విషయాలు కూడా ఈ తరగతి పాఠ్యపుస్తకాన్ని పూర్తి చేస్తూ పిల్లలు నేర్చుకుంటారు.
ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో సాహిత్య సృజనకు సంబంధించి గతంలో నేర్చుకున్న విషయాలకు మెరుగులు దిద్దుకుంటూ, కొత్తవి నేర్చుకోవచ్చు. ‘చిన్న చిన్న సంఘటనలను గ్రహించి వర్ణించడం, కథలు, కవితలు అల్లడం, సంభాషణలు రాయండం, కథలు, గేయాలు పొడిగించడం, వివరించడం, ఆత్మకథ, స్వీయ అనుభవాలు, వర్ణనాత్మకంగా రాయడం, నాటకీకరణ చేయడం వంటివి నేర్చుకోవడానికి అవసరమైన విషయాలు పనులు కావలసినన్ని ఉన్నాయి. అలాంటివి కొన్ని చూడండి. ‘వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.’ ‘మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. వారికి ఏమేమి పనులవల్ల సంతోషం కలుగుతుందో కలుసుకొని తెలుసుకొని రాయండి’, మీ అమ్మ ఇష్టాయిష్టాలను, గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి’ అన్నారు. కేవలం ఊహలకు మాత్రమే పరిమితం కాకుండా తమచుట్టూ ఉన్న ప్రపంచం లోకి వెళ్లి పరిశీలించి, పరిశోధించి, అనుభూతిచెంది రాసే అలవాటును, నైపుణ్యాలను పెంచుకునే అవకాశాలను కూడా తగినన్ని పాఠ్య పుస్తకాలు కల్పించాయి.


ఊరు అందాలను వర్ణించడం, సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుందో రాయడం, తెలిసిన పద్యాలను కవితలుగా, గేయాలుగా రాయడం, గేయాన్ని ఆత్మకథగా రాయడం తోబాటు, ఏకపాత్రాభినయం రాయడం కూడా నేర్పే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితోబాటు ‘శ్రామికులు కూటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?, కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది?’ వంటి ప్రశ్నలతో పిల్లలో లోతైన పరిశీలన, అవగాహనలు పెంచే ప్రయత్నాలు కూడా ఈ తరగతిలో ప్రారంభమైంది. ‘‘మాట్లాడడంకూడా ఒక కళ’’ అని ప్రత్యేకంగా చెప్పి భాషానైపుణ్యాలలో అతి ముఖ్యమైన మాట్లాడే కళను నేర్పే అనేక సందర్భాలను కల్పించారు.
ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఇంతవరకు గత తరగతుల్లో నేర్చుకున్న సాహిత్య పక్రియలను, వాటి రచనకుకావలసిన మెళుకువలను మరింత తీర్చిదిద్దడంతోబాటు పోస్టర్లు, ఇంటర్యూల వంటి మరికొన్ని కొత్త పక్రియల్ని నేర్చుకునే విధంగా పాఠాలు కనిపిస్తున్నాయి. రచనలో ముఖ్యమైన సామాజిక అవగాహన, శాస్త్రీయమైన, మానవీయమైన అవగాహన పిల్లలలో కలిగించే విధంగా వివిధ అభ్యాసాలు, పనులు, ప్రాజెక్టులు ఉన్నాయి. సమాజాన్ని నడిపించే చోదక శక్తులైన శ్రామికుల గురించీ, కార్మికులగురించీ, ప్రత్యేకంగా సింగరేణి కార్మికులగురించీ, పరిచయం చేశారు. ఇంకా రైతుల గురించీ, వలస కూలీల గురించీ, స్త్రీల గురించీ, వృద్ధుల గురించీ ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.

ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమాల గురించి క్లుప్తంగా నైనా పరిచయం చేసే ప్రయత్నం కూడా ఈ పాఠ్యపుస్తకంలో కనిపిస్తుంది. పై అంశాల గురించి తెలుసుకునేలా, పరిశీలించేలా, ఆలోచించేలా, ఒక అవగాహన కల్పించుకునేలా, ఒక దృష్టిని ఇచ్చేలా బొమ్మలు, సూచనలు, ప్రశ్నలు, పనులు, ప్రాజెక్టులు ఇంకా ఇలాంటివి ఎన్నో ఈ పాఠ్యపుస్తకంలో ఇచ్చారు. పిల్లలు లోతుగా, విశాలంగా ఆలోచించే విధంగా, బాధ్యతా యుతమైన సాహిత్య సృజనలు చేసేలా, భవిష్యద్దర్శనం చేయించే విధంగా ఇవి ఉండడం గొప్పవిషయం.
అవయవ దానంపై ప్రజలకు చైతన్యం కలిగించమని వార్తా పత్రికలకు లేఖ రాయమన్నారు. మునిసిపల్‍ కార్మికులు చేస్తున్న శ్రమను చూపే బొమ్మను ఇచ్చి ‘ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరున్నారు? వారి గొప్పదనం ఏమిటి?’ అని సామాజిక శ్రమజీవన సహకారాన్ని గుర్తించే తోవను చూపించారు. ఇంకా స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగి, చెప్పులు కుట్టేవాళ్ళు, క్షురకులు, నేతపని వాళ్ళు ఇటువంటివాళ్ల గొప్పదనం, వాళ్ళ జీవితాలు కళ ఎందుకు తప్పుతున్నాయో ఆలోచించమంటున్నారు. ఇంకా దేశానికి అన్నం పెట్టే రైతు జీవితం దుర్భరంగా ఎందుకు మారిందో చర్చించమని అంటున్నారు. ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు అని ఎట్లా చెప్పగలరో రాయమంటున్నారు. ప్రత్యక్ష అనుభవాలకోసం ‘మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయమని పంపుతున్నారు. ఇలాంటి విషయాలను గురించి ఆలోచించడం, వాటిని ఏదో ఒక సాహితీ పక్రియలో రాయడం వంటివి సాహిత్య సృజనలో ఎంతో అమూల్యమైన విషయాలు. మనుషులకు తమ స్వేచ్ఛతోబాటు ఇతరుల సహకారం ఎంత అవసరమో గుర్తించి, దానిని గౌరవించడం ఈనాటి విద్యకు ఉండవలసిన ముఖ్యమైన కర్తవ్యాలలో ఒకటి అని విద్యావేత్తలు భావిస్తున్నారు.


పిల్లల సాహిత్య సృజనకు అవసరమైన అవగాహన పెరగడానికి ఇలాంటి మరెన్నో ద్వారా ల్లాంటి, వంతెనల్లాంటి, మార్గాల్లాంటి అవకాశాలు ఈ పాఠ్యపుస్తకంలో అనేకం ఉన్నాయి. వాటిలో మరికొన్ని చూద్దాం. ‘ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరను కుంటున్నారు? ఎందుకు?’. ‘మంచి మార్గంలో నడిచే ఆలోచనలు కలుగక పోవడానికి కారణాలేమిటి?’. ‘మీ ప్రాంతంలోని కార్మికులను లేదా శ్రామికులను కలిసి, పనిలో వారు పొందిన అనుభవాలను, అనుభూతులను తెలుసుకొని, ఆ వివరాలను తరగతి గదిలో ప్రదర్శించండి’. ధరల ప్రభావం మనిషి జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?’ ఇలా అనేక అనుభవాలు పొందడానికీ, అవగాహన పెంచుకొవడానికీ ఉపయోగపడే సంగతులు అనేకం ఉన్న పాఠ్య పుస్తకం ఇది. ‘మూగజీవులకు నోరొస్తే?’ కథ రాయమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత గానీ గేయం కానీ రాయమన్నారు. మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు,చెరువు, నది ఏదైనా ఒకదాన్ని వర్ణిస్తూ కవిత కానీ, గేయం కానీ రాయమన్నారు. లేఖ, వ్యాసం, నివేదిక, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, ప్రకటన, అభినందన పత్రం, పెద్దవాళ్ళు చెప్పిన కథ విని పెద్దవాళ్ల భాషలోనే యథాతథంగా రాయడం వంటి సాహిత్య పక్రియలు కూడా విద్యార్థులు ఈ పాఠ్య గ్రంథం ద్వారా నేర్చుకుంటారు.
తరువాత తొమ్మిదవ తరగతి పుస్తకం చూస్తే ‘విద్యార్థులు సగటున నెలకు మూడు, నాలుగు కథల పుస్తకాలు, మాస పత్రికలను చదవగలగాలి’ అని సూచించారు. ఇంకా పాఠశాలకు సంబంధించిన ‘భాషా సంఘంలో సభ్యులుగా చేరి పాఠశాల పత్రిక రూపకల్పనలో భాగస్వాములు కావాలని, సాహితీ సమావేశాలు నిర్వహించడం వంటివి చేయగల్గాలని’ లక్ష్యనిర్దేశ్యం చేశారు.


పాఠాల్లోకి ప్రవేశించి చూస్తే ‘మంచి చెడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ ఎందుకో చర్చించండి అన్నారు. ‘మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి’ అన్నారు. ఇలా మంచి చెడుల విచక్షణ కలిగివుండడం, తాము మంచివైపే నిలబడి ఉండడం కాబోయే రచయితలకు తప్పని సరి అవసరం, అర్హత కూడా. మరో పాఠంలో ‘పల్లె బతుకు కష్టానికి కారణం ఏమిటి? అని అడిగి ఆలోచించమన్నారు. ‘ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏంచేస్తే బాగుంటుంది?’ అని చర్చించమంటున్నారు. అంతకన్నా గొప్ప అవగాహన కలిగేలా ‘మీ గ్రామంలో లేదా, వాడలో వలసకూలీల వద్దకు లేదా వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకొని, వాళ్ళ కష్ట సుఖాలను గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి’ అని ప్రాజెక్టు పని ఇచ్చారు. వలస కూలీల జీవనాన్ని ఊహించి ఒక కవిత లేదా గేయం రాయండి’ అని వాళ్ళ అనుభవాలు, అవగాహన ఆధారంగా కవిత్వ సృజన చేయంచే పనిని పురమాయించారు.


మరో పాఠంలో ఉన్న పద్యాల భావాన్ని తీసుకొని ఒక కథను రాయమని చెప్పారు. చెలిమి అనే పాఠంలో ‘శర్మిష్ఠ తన తప్పును తెలుసుకొని చింతిస్తే ఎట్లా ఉంటుందో ఊహించి ఏకపాత్రాభినయానికి అనువుగా మాటలు రాయండి’ అని మరో పక్రియ రాసే అవకాశం కల్పించారు. గాథా సప్తశతిలోని ఓ కథ ఇచ్చి ‘ఈ కథను రచయితలు రకరకాలుగా ఊహించారు, మీరూ ఊహించండి…’ అన్నారు. ఇది అక్కడ ముగింపు చెప్పకుండా అనేక రకాల ముగింపులు ఊహించడానికి ఆస్కారం ఉన్న గొప్ప మానవీయతతో కూడిన కథ. మరోచోట గోర్కీ, చెకోవ్‍, చార్లెస్‍ డికెన్స్ వంటి వారు మీకు తెలుసా? అని అడిగి పాశ్చాత్య సాహిత్యం గురించి తెలుసుకునే కుతూహలం కలిగించారు. పిల్లల్లో ఆలోచనా, అవగాహనా పెరగడానికి ‘అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట’ అంటే మీకేం అర్థమైంది?’ అని మరో పాఠంలో సామాజిక పరిస్థితులు అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు.


విద్యార్థుల ఆలోచనలకూ, సృజనకూ పదును పెట్టే ఆసక్తికరమైన సాహిత్య ‘వస్తువు’లు అనేకం ఈ పాఠ్యాంశాల్లో ఉన్నాయి. ‘కాకిని చులకన చేసి, కోకిలను ఆదరించడం సరైందేనా? ఎందుకు?’ ఆలోచించమన్నారు. ‘మనుషులు తనగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న కాకి మనుషులను గురించి ఏమనుకుంటుందో ఊహించి రాయండి’ అని సృజనకు కొత్త కొత్త వస్తువులను అందించారు. ‘నిజంగా మనిషికి కావలసింది ఏమిటి?’ ఆలోచించమని పిల్లను పురమాయించడం అంటే నిజమైన జీవితా దర్శాన్ని సందర్శింపజేయడం, పిల్లల్నే ఆలోచించమనడం సాధారణం కాదు. పిల్లలు బాధ్యతాయుతమైన రచయితలుగా ఎదగడానికి, మానవీయమైన మనస్తత్వాలు పెంపొందడానికి అవసరమైన కృత్యాలు అనేకం ఉన్నాయి ఈ పాఠ్యపుస్తకంలో. ‘మీ ఇంటి చుట్టు ప్కల ఉండే వృద్ధుల వద్దకు వెళ్ళండి. వాళ్లతో మాట్టాడండి. వాళ్ళకిష్టమైన పనులు ఏవో తెలుసుకొని చెప్పండి. వారేమనుకుంటున్నారో రాయండి.’ ఇలా తొమ్మిదవ తరగతి పుస్తకం పిల్లలకు సాహిత్య పక్రియలు నేర్పడంతో బాటు వాటిలో అతికీలకమైన ‘వస్తువు’ను అనేక రూపాల్లో చూపించింది, సూచించింది.


పదవతరగతి పాఠ్యపుస్తకంలో పిల్లలు సంపాదకీయం, గజల్‍, పీఠిక వంటి మరికొన్ని పక్రియలను తెలుసుకుంటారు. సాహిత్య సృజనకు కీలకమైన ఆలోచనలకూ, ఊహలకూ, పరిశీనలకూ, చర్చలకూ, రచనలకూ సంబంధించిన పనులు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని చూద్దాం.
‘మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జాపకాలను ఒక వ్యాసంగా రాయండి’. పై కవితకు శీర్షిక నిర్ణయించండి’. ‘రచనా శైలిని అభినందిస్తూ రాయండి’. ‘మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో రాయండి’. ‘మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి’. మీ పరిసరాల్లో పిల్లల రూపురేఖలు, వేషధారణ ఎట్లా ఉంటాయి?’. ఇవన్నీ సాహిత్య సృజనలో తప్పనిసరి అవసరమయ్యే విషయాలు కదా! పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ కవిత రాయమన్నారు.

నగరంలోని అనుకూల అంశాలపై కవిత రాయమన్నారు. పద్యభావం ఆధారంగా నీతికథ రాయమన్నారు. ఏదైనా ఒక ప్రధాన సామాజిక అంశం లేదా సంఘటనల ఆధారంగా సంపాదకీయ వ్యాసం రాయమన్నారు. వీటితో బాటు పీఠిక, ముందుమాట, లేఖ, నివేదిక వంటి మరికొన్ని పక్రియల్లో రాసే, నేర్చుకునే అభ్యాసాలూ, కృత్యాలూ ఎన్నో ఉన్నాయి. అందుకు అవసరమైన పరిశీలనలు, చర్చలు, ఊహలు, ఆలోచనలు, కల్పనలు, జ్ఞాపకాల పొరలలోకి వెళ్లి వాటిని వెలికి తీయడాలు వంటివి కూడా అనేకం ఉన్నాయి.


మరణానంతరం అవయవదానం ప్రాధాన్యతను చర్చించడం, పిల్లల ఇంటి భాష, బడిలో ఉండే భాషల గురించి చర్చించడం, మనిషీ మృగమూ ఒకటేనా, కాదా?, కుల వ్యవస్థ వలన సమాజంలో ఏంజరుగుతున్నది? వంటి మరికొన్ని విషయాలపైన చర్చించడం పిల్లల అవగాహనా స్థాయిని పెంచడానికి దోహదం చేసుంది. కథకూ కవిత్వానికీ గల భేదం ఏమిటి? మీకు ఏదంటే ఇష్టం? ఎందుకు?.,నేటి సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉందో చెప్పండి? అని అడిగారు.ఇలా ఇంత వరకు విద్యార్థులు తాము నేర్చుకున్న సాహితీ పక్రియలనూ, నైపుణ్యాలనూ ఎవరికోసం, ఏ లక్ష్యాలకోసం, ఎలా ఉపయోగించుకోవాలో సరిగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.


ఇలా ప్రాథమిక స్థాయి నుంచి పదవతరగతి వరకు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాలు పరీక్షల దృష్టితో కాకుండా పిల్లల్లో సృజనాత్మక రచనా సామర్థ్యాలు పెరగడానికి, పెంచడానికి అనేక చక్కని అవకాశాలు అడుగడుగునా, ప్రతిపాఠంలో కల్పిస్తున్నాయి. వీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈనాటి విద్యార్థులు భవిష్యత్తులో మన జాతి గర్వించగలిగే గొప్ప సాహితీ వేత్తలు కాగలిగే అవకాశాలున్నాయి. పుస్తకాల రూపకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు.


-డా. వి.ఆర్‍.శర్మ,
ఎ : 9177887749

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *