కుతుబ్‍షాహీ ఉద్యానవనాలు

దక్కన్‍ పాలకుల్లో ఇతరులతో పోలిస్తే తమ దాతృత్వం, కులీనత, ఉన్నతస్థాయి ఆలోచనల పరంగా కుతుబ్‍షాహీ పాలకులు ఎంతో విలక్షణమైన వారు. 16,17 శతాబ్దాల్లో ఈ రాజులు ఆంధ్ర దేశాన్ని పాలించారు. ఎంతో విలువైన వారసత్వాన్ని, సంస్కృ తిని దక్కన్‍ ప్రజానీకానికి అందించారు.
హైదరాబాద్‍ నగర నిర్మాణానికి 1591-92 లో పునాది రాయి వేశారు. హైదరాబాద్‍ నగరం సరికొత్తగా ప్రాణం పోసుకునేందుకు, సామాజిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యేందుకు ఎంతో కాలం పట్టింది. హైదరాబాద్‍ లేఅవుట్‍, అలంకారంగా నిలిచిన గొప్ప కట్టడాలు అన్నీ కూడా దాని వ్యవస్థాపకుల అభిరుచిని, మేధస్సును చాటిచెబుతాయి.


‘‘ఆరోగ్యదాయకమైన శీతోష్ణస్థితి, తగినంత నీటిసరఫరా నేపథ్యంలో యావత్‍ భారతదేశంలోనూ అత్యుత్తమ నగరం హైదరాబాద్‍’’ అని అంటారు విలియం మెట్‍హోల్డ్ (William Methold). గొప్ప అభిరుచితో, భౌగోళికపరమైన కచ్చితత్వంతో రూపుదిద్దుకున్న ప్రణాళికాయుత నగరం. దానికదే వృద్ధి చెందింది కాదు. అది శాస్త్రీయంగా ప్లాన్‍ చేయబడింది. ప్రధాన రహదారులు నగరమంతా విస్తరించి ఉన్నాయి. ప్రతీ దిక్కులోనూ ప్యాలెస్‍లు, మాన్షన్‍లు, కమాన్లు, ఉద్యానవనాలు ఉండేవి.


కుతుబ్‍ షాహీల కాలంలో మొదటి ఉద్యానవనంను బాగ్‍-ఫైజ్‍-ఎ-అసర్‍ (గోల్కొండ వద్ద ఉన్న ప్రస్తుత కుతుబ్‍ షాహి గార్డెన్స్) ను సుల్తాన్‍ కులీ-1 నిర్మించారు. అది ఇబ్రహీం కుతుబ్‍ షా కుమారుడు మొహమ్మద్‍ కులీ కుతుబ్‍షాచే నిర్మించబడింది. టౌన్‍ ప్లానింగ్‍, ఆర్కిటెక్చర్‍లో ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన ఆ ఘనత సాధించేలా బాట వేసింది మాత్రం ఆయన తండ్రి ఇబ్రహీం కుతుబ్‍ షా.

గోల్కొండ భిన్న సంస్కృతుల కూడలిగా మారింది. మరీ ముఖ్యంగా దక్షిణ భారత సంస్కృతికి, పర్షియా-అరబ్‍ సంస్కృతికి. వాణిజ్యవ్యాపారాల పరంగా లేదంటే సాంస్కృతికంగా… రాజ్యానికి ఎవరు వచ్చినా సరే… వారికి స్వాగతం పలికాడు ఇబ్రహీం. విద్యార్థులు, కవులు, ఇతర అర్హులైన వ్యక్తులకు బహుమతులు, పింఛన్లు అందించడమే గాకుండా ఉద్యానవనాల సందర్శనకు వచ్చే ప్రతి ఒక్కరికీ దానిమ్మ, మామిడి… ఇలా ఏ కాలానికి తగ్గ పండ్లను ఆ కాలంలో బహుమతిగా ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. రాజధాని నగర సౌందర్యం (Londoner Ralph Fitch) లాండొనర్‍ రాల్ఫ్ ఫిచ్‍ ను ఎంతగానో ఆకట్టుకుంది. 1583 నుంచి 1591 దాకా ఆయన భారత్‍ లో ఉన్నారు. ‘గోల్కొండ చక్కటి నగరం. ఇటుకలు, కలపతో నిర్మించిన చక్కటి ఇళ్లు ఉన్నాయి. పండ్లు, నీటి నిల్వకు చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి’ అని హైదరాబాద్‍ నగరం గురించి వర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‍ షా అనేక ఉద్యానవనాలు నిర్మించారు. విశాలమైన బాగ్‍ ఇబ్రహీం షాహిల్‍ లేదా ఇబ్రహీం బాగ్‍లోని కొద్ది భాగం లేదా గోల్కొండ కోటకు నైరుతి భాగంలోని లోని బాగ్‍ దాకా ఎన్నో వీటిలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. ప్రజల సందర్శనకు వీలుగా అవి తెరిచే ఉండేవి. అసలైన ఇబ్రహీం బాగ్‍ తారామతి బారాదరి పైభాగంలో ఉండే జంట గుట్టలు మొదలుకొని ప్రేమామతి మసీదు దాకా విస్తరించి ఉండేది.

ఉస్మాన్‍ సాగర్‍ కు వెళ్లే రోడ్డు మొదలుకొని మసీదుకు పశ్చిమంలో భవన శిథిలాలు ఉన్న ప్రాంతం దాకా ఉద్యానవనం ఉండేది. మహ్మద్‍ కులీ కుతుబ్‍ షా మూసీ దక్షిణ మైదానంలో భారీస్థాయిలో నూతన నగరం ప్రతిపాదించారు, మరెన్నో సదుపాయాలతో. ఓ శుభ సమయంలో సుల్తాన్‍ నగర ప్రణాళికల రూపకల్పనకు ఆర్కిటెక్ట్లకు, మేస్త్రీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలో మరే నగరం కూడా దానికి దీటుగా ఉండకూడదని, స్వర్గానికి నకలుగా ఉండాలని ఆదేశించాడు. రాజభవనాలతో పాటుగా మహ్మద్‍ కులీ మూడు విశాలమైన భవనాలు కూడా నిర్మించారు. వాటిలో రెండు గుట్టల మీద, మరొకటి నదీ మహల్‍ను మూసీ నది దక్షిణ తీరంలో. నదీ మహల్‍లోనే ఆయన అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేవారు.


గుట్ట మీద పెద్ద భవనం కట్టాలని సుల్తాన్‍ ఆదేశించారు. నాలుగు దిక్కులకు ముఖం చేసి ఉండేలా, సిస్టెర్నస్ (Cisterns), పెద్ద పెద్ద గేట్లు ఉండేవి. ఆ భవనాల నిర్మాణాలు పూర్తయ్యే నాటికి అక్కడ తోటలు కూడా రూపుదిద్దుకున్నాయి. ఆయన వాటిని నబాత్‍ ఘాట్‍ (హిల్‍ సైడ్‍ బొటానికల్‍ పార్కస్) గా వ్యవహరించారు. ఆ తరువాతి కాలంలో ఇదే నౌబత్‍ పహాడ్‍ (Naubat Pahad.)గా పేరొందింది. నబాత్‍ ఘాట్‍ ఆ తరువాత బాగ్‍-ఎ – దిల్‍ కుశ నుంచి నది వరకు విస్తరించింది. ఈ ప్రాంతం అంతా ఇప్పడు బషీర్‍ బాగ్‍, బాగ్‍-ఎ-ఆమ్‍, రెసిడెన్సీలుగా ఉంది. మొత్తం విస్తీర్ణం 9 చదరపు మైళ్లు. హుసేన్‍ సాగర్‍ నుంచి నీటి సరఫరా జరిగేది. చార్మినార్‍ కు దక్షిణాన మూడు మైళ్ళ దూరాన మరో గుట్ట ఉండేది. దాని చుట్టూరా పచ్చదనం. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అందుకే అక్కడ కూడా ఓ భవనం నిర్మించారు. నాలుగు పెద్ద వరండాలు, 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఓ వేదిక ఉండేవి. వెనుక వైపున 45 గజాలు×30 గజాల కొలతతో ఓ పెద్ద ట్యాంక్‍ కూడా నిర్మించారు. రాజు దీనికి కోహ్‍-ఇ-తుల్‍ అని పేరు పెట్టారు. నగరం ఉత్తర ప్రాంతాలపై నాబాత్‍ ఘాట్‍ ఆధిక్యం ఉన్నట్లే దక్షిణ ప్రాంతాలపై దీని అధిక్యం ఉండేది. ఈ గుట్ట ఇప్పటికీ హైదరాబాద్‍ శివార్లలో తన ఘనతను నిలబెట్టుకుంటోంది. తరువాత కాలంలో ప్రపంచప్రఖ్యాత ఫలక్‍ నుమా ప్యాలెస్‍ నిర్మితమైంది ఇక్కడే. నాబత్‍ ఘాట్‍ మొదలుకొని కోహ్‍-ఇ-తుల్‍ దాకా మధ్యలో అనేక తోపులు, తోటలు, పార్క్లు, కొత్త రాజధాని భవనాలు ఉండేవి. తోటలు మాత్రమే కాదు, ఎన్నో పార్క్లు కూడా ఉండేవి.


కొన్ని తోటలు ఏకంగా భవనాలపైనే ఉండేవి. వాటిని చూసి టావెర్నెట్‍ (Thevenot)) ఎంతగానో ఆశ్చర్యపోయారు. హీనా మహల్‍ పైకప్పులు అంతటి భారాన్ని ఎలా మోస్తున్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాన్నో అద్భుతంగా అభివర్ణించారు. ఈ తోటల అంతర్గత ప్లాన్‍ల గురించి తెలుసుకునేందుకు వాటి గురించిన వర్ణనలు చదవడం ముఖ్యం. బాగ్‍లింగంపల్లి లాంటి వాటి వర్ణనలు మనకు అందుబాటులో ఉన్నాయి.


‘‘పట్టణంలో ఎన్నో తోటలు ఉన్నాయి. వాటిలో ఎన్నో నడక మార్గాలు, పండ్ల చెట్లు ఉన్నాయి. అవే వాటికి అందాన్ని తీసుకు వచ్చాయి. ఓ గొప్ప స్థలంలోకి వచ్చాను. తాటి, పోక లాంటివి దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఎంత దగ్గరగా అంటే, వాటి మధ్యలో నుంచి చూస్తే సూర్యుడు కనిపించ నంతగా. కాలిబాట మార్గాలు ఎలాంటి వంపులు లేకుండా, శుభ్రంగా, గుల్‍ – దాండి గా పిలిచే పూలు అంచులుగా ఉండేవి. తోట చివర్లో భవనం ఉండేది’’. ‘‘తోటలో పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నాయి. అన్నీ కూడా క్రమపద్ధతిలో ఉన్నాయి. దీంట్లో, మొదటి గార్డెన్‍ లో కూడా అందమైన నడక మార్గాలున్నాయి. వాటికి రెండువైపులా హద్దులుగా వైవిధ్యభరితమైన పూలు ఉన్నాయి. నడక మార్గం మధ్యలో నుంచి ఓ కాలువ వెళ్తుంది. కాలిబాట పొడుగునా నిర్దిష్ట దూరంలో ఉండే ఫౌంటెన్ల నుంచి వచ్చే నీళ్లు కాలువలోకి చేరుతాయి. ఈ తోట బాగా పెద్దదిగా ఉంది. చుట్టూరా ప్రహరీ గోడతో, మధ్యలో పెద్ద గేట్‍తో ఉన్న ఈ తోట పండ్ల చెట్లతో తోటగా తీర్చిదిద్దబడింది’’.


కుతుబ్‍ షాహీ భవనాల (ఉద్యానవనాలతో సహా) అందం మాటల్లో వర్ణించలేనిదని బ్రిటిష్‍ కంపెనీ ఉద్యోగిగా ఉన్న విలియం మెట్‍హోల్డ్ (William Methold)) అంటారు.
‘‘ఆ భవనాలు ఎంతో చక్కగా కట్టబడ్డాయి. బ్రొకేడ్‍, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించబడ్డాయి. గదులు, హాల్స్ చక్కటి విలాసవంతమైన ఫర్నీచర్‍ తో, చైనావేజ్‍, బంగారు, వెండి అలంకరణ వస్తువులతో ఉన్నాయి.’’ అని చెబుతారు. ఈ భవనాలన్నీ కూడా ఒక మార్మికమైన నీటి సరఫరా ఏర్పాట్లను కలిగి ఉండడం విశేషం. దాదాపుగా అన్ని భవనాలు కూడా నీటిగొట్టాల వ్యవస్థను కలిగిఉన్నాయి. చివరకు గోడలు, పైకప్పులు కూడా. ఇవే గాకుండా, ఉద్యానవనాల పచ్చదనం కన్నులపండువగా ఉంటుంది. కాలువలు కొన్ని చోట్ల చక్కటి వంపులతో ఉంటాయి. అక్కడక్కడా ఫౌంటేన్లు, కొలనులు ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాల్లో ఈ భవనాలు కట్టబడ్డాయి. అదే సమయంలో ప్రవాహాలు, జలపాతాలు లాంటివి ప్రధాన నిర్మాణాలకు చేరువలో ఉంటాయి. చుట్టూరా ఫౌంటేన్లు ఉంటాయి’’.


హీనా మహల్‍ మూసీ తీరంలో అమీన్‍ బాగ్‍ లో నెలకొంది. అది ఒకప్పుడు అమీన్‍ ఖాన్‍ ఉద్యానవనం. ఇబ్రహీం కులీ కుతుబ్‍ షా హయాంలో ఉన్నతాధికారి. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ అమీన్‍ బాగ్‍ అని పిలుస్తారు. ప్రస్తుతం విక్టోరియా జెనానా హాస్పిటల్‍ ఉన్న చోట ఈ ప్రాంతం ఉంది. మొన్నటి వరకూ బాగ్‍ లింగంపల్లి అస్తిత్వం కొంతవరకైనా ఉండేది. కుతుబ్‍ షాహి పెవిలియన్‍ మాత్రం అసలేమాత్రం మిగలలేదు.
‘‘అద్భుతమైన భవనాలతో ఓ భారీ నగరం నిర్మించబడింది, ప్రతి భవనానికి పక్కనే పెద్ద ఉద్యానవనం. బజార్లు, ఇళ్లు కూడా చెట్లతో నిండిఉండేవి. యావత్‍ నగరం ఓ తోటలా కనిపిస్తుంది. ఖురాసాన్‍ (ఇరాన్‍), పోర్చుగల్‍ నుంచి తెప్పించిన పండ్ల జాతులతో సహా ఎన్నో రకాల పండ్లు ఉండేవి. ఇప్పుడు నగరంలో ఎన్నో బాగ్‍ లు ఉన్నాయి కానీ వాటిలో దేనిలో కూడా పండ్ల చెట్లు లేవు. జామ్‍ బాగ్‍, మురళీధర్‍ బాగ్‍, బషీర్‍ బాగ్‍, తెషిర్‍ బాగ్‍, జెబా బాగ్‍, సీతారామ్‍ బాగ్‍, మూసారం బాగ్‍, బాగ్‍ అంబర్‍ పేట్‍, అమీన్‍ బాగ్‍, ఇంకా మరెన్నో. అన్ని చోట్లా నిర్మాణాలు వచ్చాయి.


నగరంలో తోటలు ఉండాలనేది మహ్మద్‍ కులీ గుండెలోని కోరిక. ప్రకృతి గురించి ఆయన వర్ణించారు. వానాకాలం, చలికాలం, ఎండాకాలం, తోటలు, తోపులు, పార్కులు, పండ్లు, కూరగాయలు లాంటి వాటిపై పద్యాలు రాశారు. తన చుట్టూరా కనిపించే భారతీయ ప్రతీకలను వాడారు. చినుకుతో యవ్వనాన్ని చిగురింపజేసే తొలకరి జల్లుకు స్వాగతం పలికారు. పచ్చటి పచ్చికకు, మట్టి పరిమళానికి కూడా. ఎన్నో విధాలుగా ఆయన తోటలను వర్ణించారు.
1. మేఘాలు మళ్లీ గర్జిస్తున్నాయి, తోటలు మళ్లీ కళకళ లాడుతున్నాయి, పూల పరిమళాన్ని వేలాది పక్షులు ఆస్వాదిస్తున్నాయి.
2. ప్రవక్త తనకు తానుగా ఈ చెట్టుకు ఇచ్చిన పేరు; అందుకే స్వర్గం మాదిరిగా ఉండే ఈ పార్క్ మధుర ఫలాలను అందించే ఎన్నో చెట్లకు నిలయంగా ఉంటుంది.
3. తోటలోని ద్రాక్ష గుత్తులు స్వర్గంలోని నక్షత్ర సమూహాలుగా
ఉన్నాయి. ద్రాక్ష తీగ చల్లటి నీడ స్వర్గంలో పాలపుంత మాదిరిగా విస్తరించింది.
4. ఖర్జూరాల గుత్తులు పగడపు దీవులకు వేలాడేవిగా కనిపిస్తున్నాయి. పోక చెట్లకు పోకలు రాత్రి పూట కెంపుల సమూహాలుగా కనిపిస్తున్నాయి.
5. జామ పండ్లు ఓ రత్నంలా కనిపిస్తోంది, నేను నాటిన చెట్లకు దిష్టి తగులవద్దనే నా తపనంతా.

కులీ కుతుబ్‍ షా హయాంలో ఖైరతాబాద్‍ మసీదు ఆవరణలో  ఓ తోట ఉండేది.

హయత్‍నగర్‍లో ఖాస్‍ బాగ్‍ లేదా ప్రైవేట్‍ గార్డెన్‍

హయత్‍ నగర్‍ మసీదు ఆవరణకు వెలుపల ఈశాన్య మూలన ఓ పెద్ద చదరపు భాగాన్ని హాథీ బౌలిగా వ్యవహరించేవారు. అక్కడ అందమైన పక్షుల బొమ్మలను తయారు చేసే వారు. నీళ్లను తోడేందుకు వీలుగా ఈ కట్టడానికి పుల్లీలు ఉండేవి. దిగువ భాగంలోని మూడు పుల్లీలను ఎడ్లతో తోడేవారు. పైభాగంలోని పెద్ద పుల్లీని నడిపేందుకు ఏనుగును ఉపయోగించేవారు. అలా తోడిన నీటిని దిగువ భాగంలో నిల్వ చేస్తారు. ఆ తరువాత ఆ నీటిని ఖాస్‍ బాగ్‍తో పాటుగా పరిసర ప్రాంతాలకు మట్టిపైపుల ద్వారా పంపిస్తారు.
హదికా – టుస్‍ – సలాతీన్‍ గ్రంథం హైదరాబాద్‍ నగరాన్ని స్వర్గంలో భాగంగా అభివర్ణించింది. సుల్తాన్‍ అబ్దుల్లా కుతుబ్‍ షా పాలన మొదటి సంవత్సరంలో అత్యుత్తమ శైలిలో నిర్మించారు. వ్యాపారులు, హస్తకళాకారులు, అన్ని వర్గాల ప్రజలు అక్కడ నివసించేలా చేశారు. అసంఖ్యాక ఇళ్లు, అందమైన భవంతులు, ఎన్నో తోటలు ఉండేవి. పెద్ద వీధులు, చౌరస్తాలు, దాద్‍ మహల్‍ ఉండేవి.
బాగ్‍ -ఎ-నబి, బాగ్‍ లింగంపల్లి లకు సుల్తాన్‍ అబ్దుల్లా కుతుబ్‍ షా పునాదులు వేశారు గానీ బాగ్‍-ఎ-నబి గురించి తెలియరావడం లేదు. సుల్తాన్‍ మహ్మద్‍ కులీ కుతుబ్‍ షా హయాంలో లింగంపల్లి గార్డెన్‍ భారీస్థాయిలో రూపుదిద్దుకుంది.తాజా పండ్లకు అది ప్రఖ్యాతి చెందింది. సుల్తాన్‍ అబ్దుల్లా దీని పునరుద్ధరణకు 3 లక్షల రూపాయలు వెచ్చించారు. ఆ తరువాత తన విందువినోదాలకు దాన్ని ఉపయోగించుకున్నారు. ఈ తోటలు ఎంతో అందంగా ఉండేవి. పుష్కలంగా నీటిసరఫరా ఉండేది.
రిజర్వాయర్‍, రహదారులు, ఇతర భవనాలను అసఫ్‍ జా ।। నిర్మించారు. ఈ తోటను ఐదో అసఫ్‍ జా నవాబ్‍ అఫ్జల్‍ ఉద్దౌలా బహదూర్‍ తన బావ నవాబ్‍ ఖుర్షిద్‍ జా బహదూర్‍ కు బహుకరించారు.

అబ్దుల్లా కుతుబ్‍ షా మరో రెండు ఇతర భవనాలను కూడా నిర్మించారు. మీర్‍ జుమ్లా చెరువు గట్టున మీర్‍ జుమ్లా సయ్యద్‍ ముజఫర్‍ రూపొందించిన తోటలో ఇవి ఉన్నాయి. ఇక్కడో ముచ్చట చెప్పుకోవాలి. సయ్యద్‍ ముజఫర్‍ ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు సుల్తాన్‍ స్వయంగా వచ్చి పరామర్శించారు. ఆ సందర్భంగా సుల్తాన్‍కు ధన్యవాదసూచకంగా ముజఫర్‍ ఈ తోటను సుల్తాన్‍ కు బహుకరించారు. ఆ తరువాత రాజు అక్కడ రెండు అందమైన భవనాలను నిర్మించారు. వాటి నిర్మాణం పూర్తయిన తరువాత అబ్దుల్లా కుతుబ్‍ షా వాటిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఆ ప్రాంతాన్ని సుల్తాన్‍ షాహి బాగ్‍ గా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ భవనాల సమాచారం తెలియకున్నా సుల్తాన్‍ షాహి పేరు మాత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది.


అబ్దుల్లా కుతుబ్‍ షా నయాఖిల్లాలో బాగ్‍ – ఎ – నయా ఖిల్లా పేరిట ఒక తోటను రూపొందించారు. దీర్ఘచతురస్రాకార నమూనాలో అది నిర్మితమైంది. బహుశా అది ఒకప్పుడు ఈ తోటకు నీరు అందించే కాలువకు రెండు వైపులా ఉండి ఉంటుంది. ఈ కాలువ, తోట… రెండూ కూడా మొఘల్‍ విధానంలో రూపుదిద్దుకున్నాయి.
అత్తాపూర్‍లో మియన్‍ మిష్క్ ఒక విధమైన గార్డెన్‍ పెవిలియన్‍ నిర్మించారు. అత్తాపూర్‍ పురానాపూల్‍ నుంచి నాలుగు మైళ్ల దూరంలో ఉండేది. కుతుబ్‍ షాహి కాలం నాటి రాజకుటుంబాలకు ఇది ఒక పిక్నిక్‍ స్పాట్‍ గా ఉండేది. పది ఎకరాల సువిశాల స్థలంలో మిష్క్ మహల్‍ నిర్మితమైంది. చుట్టూరా పెద్ద ప్రహరీ గోడ ఉండేది. లోపలికి ప్రవేశించేందుకు ఉత్తర, దక్షిణ దిశల్లో రెండు రాజమార్గాలు ఉండేవి. ఎన్నో రకాల పండ్లచెట్లు, నీటి కాల్వలు ఆవరణలో ఉండేవి.


మొఘల్స్, కుతుబ్‍ షాహీలు కళాప్రియులు. సౌందర్య ఆరాధకులు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా పూలు, మొక్కలు ఆరాధించబడ్డాయి, సాగు చేయబడ్డాయి. బౌద్ధ సాహిత్యంలోనూ, సంస్కృత నాటకాల్లోనూ తోటల ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి.


(ఇంగ్లీషు : మహ్మద్‍ అబ్దుల్‍ ఖయ్యూమ్‍)
అనువాదం : ఎన్‍.వి.మోహన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *