సైన్సు – మూఢనమ్మకం

(ఆంగ్ల మూలం డా. వై. నాయుడమ్మ : తెలుగు సేత – డా. నాగసూరి వేణుగోపాల్‍)

1976లో శాస్త్రవేత్త మేథావి హేతువాది గాంధేయవాది డా. హెచ్‍. నరసింహయ్య సైన్స్, సొసైటీ అండ్‍ సైంటిఫిక్‍ ఆటిట్యూడ్‍ అనే సంకలనాన్ని  బెంగుళూరు  విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురించారు. ఎంతో విలువైన ఈ వ్యాస సంకలనంలో ఎంతోమంది శాస్త్రవేత్తల, ఆలోచనాపరుల విశ్లేషణలున్నాయి. ఇందులోనే సైన్స్ అండ్‍ సూపర్‍ స్టిషన్‍ అనే ఆంగ్ల వ్యాసాన్ని డా. నాయుడమ్మ రాశారు. ఆ వ్యాసానికి డా. నాగసూరి వేణుగోపాల్‍ మూడు దశాబ్దాల క్రితం చేసిన అనువాదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.


నేడు మాయలూ, అద్భుతాలూ చేయగలవారు విపరీతమైన ప్రచారాన్ని చేసుకొంటున్నారు. గాలిలోంచి ఉంగరమూ, గడియారాలూ సృష్టిస్తున్నామని చెప్పుకొంటున్నారు. భవిష్యత్‍ గురించి ముందుగా చెప్పడమే కాకుండా దానిని నిర్దేశించడం కూడా తమకు చేతనవుతోందని చెప్పుకుంటున్నారు! విజ్ఞానశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న విద్యార్థిగా చెబుతున్నా – ఇవన్నీ అయోమయాన్నీ, గందరగోళాన్నీ కలిగిస్తున్నాయి. వీటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంత్కెనా వుంది!


అందుకే మూఢనమ్మకాల గురించి రాసిన పుస్తకాలూ, చదవడం మొదలుపెట్టాను. ఎన్నో తెలుసా? పదమూడూ! అవి చదవగా తెలిసిందేమిటంటే…మూఢనమ్మకాల మీద చాలా పుస్తకాలు ఆంగ్ల భాషలో వెలువడ్డాయని. అయితే భారతదేశంలో మూఢనమ్మకాల గురించి రెండు పుస్తకాలు మాత్రమే 1976 వరకు ఆంగ్లంలో లభ్య మవుతున్నాయి. ఎక్కువ చదివిన కొద్దీ మరింత అయోమయమే మిగిలింది. ఇలా చదవడం వల్ల ఏమైనా మంచి జరిగిందా అంటే సందేహమే!
మూఢనమ్మకమంటే …


నిఘంటువులు అనేక రకాలుగా నిర్వచిస్తాయి. అద్భుతాన్ని, అసాధారణాన్ని, నమ్మటం, తెలియని దానిని గురించి అసంగతమైన భయం, ఒక ఆచారం, మాయపై తీవ్రమైన గురి, భయం లేదా అజ్ఞానం ఆధారంగా వున్న నమ్మకం, అసంగతమైన మతాచారం, అంథవిశ్వాసం…. వగైరా.


ఈ నిర్వచనాలను పరిశీలిస్తే మూఢనమ్మకమనేది అసంగతమూ, మతపరమైనదీ అని విశదమవుతుంది. మరో సమస్య ఏమిటంటే ఒక వ్యక్తి మతం మరో వ్యక్తికి మూఢనమ్మకం! మూఢనమ్మకమనేది భయమూ, అంధ విశ్వాసమూ, అసంగతమైన దృష్టి అనే వాటి ఆధారంగా బతికిపోతోంది. పరిశీలన, ప్రయోగం, పరిశోధనపై ఆధారపడి, చక్కగా వర్గీకృతమైన జ్ఞానాన్ని ‘విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్’ నిర్వచించవచ్చు.

మరి సైన్స్ పరమార్థం ఏమిటి?

శాస్త్రీయ పద్ధతి (Scientific Method) – పవిత్రత వల్లగానీ, అధికార హోదా వల్లగానీ దానికి గుర్తింపు లభించదు. కేవలం ప్రాయోగికమైన పరీక్ష, రుజువు ఆధారంగానే గుర్తించడం జరుగుతుంది. సైన్స్లో తప్పు సరిదిద్దుకోవడానికి వీలుంది. సైన్స్లో సృజనకే కాకుండా వినాశనానికి సైతం వీలుంది. శాస్త్రీయ అభినివేశం (Scientific Temperment) అనేది ఒక మనోదృష్టి – అది విశాలమైన, హేతుబద్ధమైన మనోదృష్టి, అది ప్రశ్నించగల, జిజ్ఞాస రేకెత్తించగల మనోదృష్టి. నిన్నటిది కాక రేపటిదైన మనోదృష్టి, మార్పును ఆహ్వానించే దృష్టి!


ఇప్పుడు సైన్స్కు, మూఢనమ్మకానికీ తేడా బాగా గోచర మవుతుంది. సైన్స్ అనేది అవిచ్ఛిన్నమైన పరిణామం గది, తన్నుతాను సరిదిద్దుకోగలది. అంతేకానీ స్థాయివల్లగానీ, అధికార హోదావల్ల గానీ, తెలియని భయం వల్లగానీ మారదు.


మూఢనమ్మకాల వర్గీకరణ అన్నికాలాల్లోనూ, అన్ని విషయాలకు సంబంధించి అనేక రకాల్కెన మూఢనమ్మకాలు ప్రపంచ మంతటా కనిపిస్తాయి. మూఢనమ్మకాలను ఈ విధంగా వర్గీకరించ వచ్చు.
అ) మతపరమైనవి
ఆ) సంప్రదాయపరమైనవి
ఇ) వృత్తిపరమైనవి
ఈ) పూర్తిగా వ్యక్తిగతమైనవి

Eric Maple ఎన్నో రకాల మూఢనమ్మకాలను చాలా విపులంగా వివరించాడు. ఇల్లు, తోటపని, ప్రయాణం, విశ్రాంతి, వినోదం, ఆచారాలు, దుస్తులు, పొలం, ప్రజలు, జానపద సాహిత్యం, సంప్రదాయం, మాయలు, యోగులు తదితరాలకు సంబంధించి చాలా మూఢనమ్మకాలు వున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఖన్నా రచయితలు భారతదేశంలోని మూఢనమ్మకాలు గురించి రాస్తూ – తల్లి, పిల్ల, గర్భధారణ, ప్రసవం, రోగం, మంచి – చెడు, నిద్ర, ఆలోచన, ప్రకృతి, సహజ పక్రియలకు సంబంధించి చాలా సంఖ్యలో మూఢనమ్మకా లుంటాయంటారు. 1976లో ప్రచురితమయిన పుస్తకంలో బిజల్వాన్‍ (Bijelwan) హిందూ మూఢనమ్మకాలు శకునశాస్త్రం, కన్ను అదరటం, తుమ్మడం, మొదల్కెన వాటి గురించి రాశారు.

మూఢనమ్మకమెందుకు?

‘‘సైకాలజీ ఆఫ్‍ సూపర్సిషన్‍’’ అనే పుస్తకంలో జహాడా (Jahoda) మనస్తత్వ శాస్త్రరీత్యా మూఢనమ్మకాలను వివరించడానికి ప్రయత్నిస్తాడు. Eric Maple మూఢనమ్మకాలను కారణాలతో వివరిస్తాడు. భారతదేశంలో వున్న 300 మూఢనమ్మకాలను వివరించడానికి ఖన్నా రచయితల ప్రయత్నించారు. కారణం తెలియని భయం అనేది మూఢనమ్మకానికి మూలకారణం. ఆ భయానికి కారణం పుట్టుక, చావు, రోగం, ఆపద, నిస్సహాయత, సందేహం, అనిశ్చితత్వం, ఉద్వేగం ఇలా ఏవైనా కావచ్చు. మనకు తెలియనిదీ ఏదో శక్తివంతమైనదీ వుందని నమ్మడమూ, ఆ నమ్మిక మానవ స్థైర్యాన్ని, గుండె దిటవును నాశనం చేయడమూ మూఢనమ్మకానికి ఆధారం. అసహాయతకు ఒక అర్థం లేని కవచం ఈ మూఢనమ్మకం. ఎప్పుడయితే అవకాశాలు, పరిస్థితులు అనే వాటిని మనిషి అతడి జ్ఞానం శాసించలేక పోతున్నాయో అపుడు మనిషి మూఢనమ్మకాలలో కూరుకుపోతాడు.


మూఢనమ్మకం అనేది ఒక ఆలోచనా రీతి. అది పూర్తిగా ఒక మనోవికారం. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బయల్పడుతుంది. ఉద్వేగపూరితమైన, ఆలోచనా రహితమైన దృష్టి వల్లనే మూఢనమ్మకాలు బాగా పాతుకుపోయాయి. భాష, జానపద కథలు, సంప్రదాయం, మతం- ఇలా అన్నీ కలిసి పెరిగి మెదడు మీద ప్రభావం చూపి మూఢనమ్మకం ఒక రూపుదిద్దుకోవడానికి తోడ్పడుతున్నాయి.


‘ఇదిగో పులి అంటే అదిగో తోక’ అనే రీతిలో వున్న మన సంప్రదాయం, కక్ష కట్టిందనే సందేహం కల్గించే రీతిలో వున్న వాతావరణం – అనే రెండింటి మీద మూఢనమ్మకం బతికిపోతుంది. మూఢనమ్మకం అనేది పసితనం నుండి సంక్రమిస్తుందని చెప్పవచ్చు. ఇది మామ్మగారు పోసిన ఉగ్గుపాలతో కలిసిపోయింది. అది మన ఆలోచనా పద్ధతిలో కలిసి వుంది. తెలియనిదేదో జీవితం మీద దాడి చేస్తోందనీ, దాని నుంచి ఏదో శక్తి రక్షిస్తుందనీ నమ్మటమే మూఢ విశ్వాసం.
అంతేకాకుండా సహజమైన జిజ్ఞాస వల్ల కూడా మూఢనమ్మకం వ్యాపిస్తోంది. అర్థం కాని ప్రకృతి సంఘటనను గమనించటం, దానిని ఆశ్చర్యంతో పరిశీలించటం, దానిని వివరించడానికి ప్రయత్నించడం, విభిన్నత్వంలో ఏకత్వం చూడడానికి ప్రయత్నించడం – ఈ విధానంలో కూడా మూఢనమ్మకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అసహజమైన అనుభవంలో అర్థం వెదకడానికి ప్రయత్నిస్తాడు మనిషి.


కొన్ని మూఢనమ్మకాలు విద్యావంతం చేయడానికి  ఉద్దేశితమవుతాయి. ఆరోగ్యం, భద్రత, నిలకడ గురించి, కొత్త ఆర్థిక అవసరాల గురించి మూఢనమ్మకాలు ఇలాగే ఏర్పడతాయి. అయితే కాలం గడిచేకొద్దీ వాటి వెనుక వున్న కారణాన్ని మరచిపోగా కేవలం తుప్పు మిగిలినట్లు మూఢనమ్మకం మాత్రమే మిగుతోంది.
మూఢనమ్మకాలు మనిషి దేన్ని నమ్మాలనుకుంటాడో దాన్నే నమ్ముతాడు. దేనిని నమ్మాల్సిన అవసరం వుందో దాన్నే నమ్ముతాడు.

ఎప్పుడయితే ఆవేశం, భయం లోపలికి వస్తాయో అప్పుడు హేతువు, ఆలోచన బయటకు దారితీస్తాయి. దాంతో మొత్తం పరిస్థితిని నిర్ణయించేది కేవలం మూఢనమ్మకం మాత్రమే! నరకం నుంచి బయటపడటానికి హామీ – మూఢనమ్మకం !!
సైన్సు, మూఢనమ్మకానికి లంకె!
ఇపుడు సైన్స్, మూఢ నమ్మకాలను పరిశీలిద్దాం.
మౌలికంగా సైన్స్, మూఢనమ్మకమూ – ఈ రెండూ మనోదృష్టికి సంబంధించినవి. ఒకటి పూర్తిగా హేతుబద్ధమైనదీ, పరీక్షకు నిలిచేది! మరోటి పూర్తిగా హేతురహితమైనది.
ఉద్వేగభరితమైనదీ. మూఢనమ్మకమనేది వ్యక్తిగతమైన విశ్వాసాలకూ, విషయపరిజ్ఞానానికీ సంబంధించినది. అయితే సైన్స్ మాత్రం ప్రయోగం, పరీక్ష, రుజువు ఆధారంగా గలది. మూఢనమ్మకమనేది సాపేక్షమైనది. అది ఒక వ్యక్తి ఒక ప్రత్యేక సమయంలో అతనికున్న శాస్త్రీయ విజ్ఞానం, అశాస్త్రీయత మీద ఆధారపడి వుంటుంది.


వాస్తవానికి సైన్స్ వుంటే మూఢనమ్మకముంటుంది. మూఢనమ్మకముంటే సైన్స్ వుంటుంది. కానీ అవి పరస్పర పూరకాలుగా కాదు. శాస్త్రీయ విజ్ఞానం అనేది ఒక హేతుబద్ధమైన అవగాహన. అందులో జడత్వం, ఆచారం, అద్భుతం వగైరాలకు చోటులేదు.
ఈ సైన్స్ మూఢనమ్మకం అనే లంకె ఎంతవరకు విస్తరించి వుంది? సోషలిస్టు వ్యవస్థ నుంచి పరిణమించిన శాస్త్రీయ సంఘాన్ని శాసించే వ్యక్తికి శాస్త్రీయ దృక్పథం అంతిమ గమ్యం, అయితే సామాన్య ప్రజానీకానికి మాత్రం మూఢనమ్మకం ఇలవేల్పు!


ఇలా కొత్తా, పాతా, సైన్స్, మూఢ విశ్వాసమూ అనేవి రెండూ కలసి వుంటాయి. మనదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రెండింటి మిశ్రమం మనుషులను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం అవిచ్చిన్నం. ఇటువంటి విచిత్రమైన ముడి మనకు కొత్తగాదు. ఇది పశ్చిమ దేశాల్లో కూడా వుంటోంది. సైన్స్ పురోగతిలో కూడా ఎన్నో ఒడిదుడుకుంటాయి. ఇంకా కొన్ని సమయాల్లో మూఢనమ్మకాలు శాస్త్రానికి స్పీడుబ్రేకర్లుగా పనిచేస్తాయి. చరిత్రకారులూ, సామాజిక శాస్త్రవేత్తలూ ఇదెందుకో వివరించడానికి ప్రయత్నించారు. ‘‘సైన్స్, టెక్నాలజీ అండ్‍ సొసైటీ ఇన్‍ ది సెవెన్టీన్త్ సెంచరీ ఇంగ్లండు’’ అనే పుస్తకంలో  Mertonఇలా అంటాడు. ‘‘….శాస్త్రపోకడలకు ఎంతో దగ్గరి సంబంధం గల సమాజమూ, దాని నిర్మాణం, నమ్మకం, ఆశలసముదాయాన్ని ఉత్తేజపరచి, పరీక్షించి సరిద్దిద్దేటటువంటి ఒక సంస్కృతి ఫలితం, ఒక మేథాశక్తి రూపం – సైన్స్’’… అతడి ప్రకారం శాస్త్రజ్ఞుడు ఎన్నుకునే సమస్య అప్పటి ఆర్థిక, సామాజిక అవసరా మీదనే ఎక్కువ ఆధారపడుతుంది.


ఈ దేశంలో బాగా చదువుకున్న వ్యక్తులు సైతం దివ్యమైన ఘడియ కోసమూ, మంచి ముహూర్తం కోసం వేచిచూడటం సాధారణం. రాహుకాలం, యమగండం అనే వాటిని ఇంకా నమ్ముతున్నారు.
సూర్యచంద్రులను రాహుకేతువు మింగితే సూర్య, చందగ్రహణాలు ఏర్పడుతాయని ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. చంద్రుడి మీద మనిషి తిరుగాడి వచ్చినా చాలామంది – కొంతమంది శాస్త్రవేత్తలు సైతం – జాతకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతేకాకుండా వీటిని మించినది మరోటి వుంది – అది, రాబోయే చెడును తొలగించడానికి యజ్ఞాలు, గ్రహశాంతులూ చేసి గ్రహగతులు మార్చడానికి ప్రయత్నించడం.


పునర్జన్మ వుందన్న నమ్మకం కూడా కొత్తది కాదు. Julian Huxley ఇలా అంటారు. – పునర్జన్మ మీద గల నమ్మకం వల్ల చాలామంది పరలోకంలో మోక్షసాధనకై ఆరాటపడుతూ ఈ జన్మను నిర్లక్ష్యం చేస్తారు. ఇక ఈ జన్మను మెరుగుపరచుకోవటానికి ప్రయత్నం జరగదు. ఇంకా అసాధారణం, అద్భుతం వంటి వాటిని నమ్మడం వల్ల అవి తీవ్రమైన మూఢనమ్మకాలకే కాకుండా, ఆర్ధికపరమైన మోసాలకూ, దోపిడీకి కూడా దారితీస్తాయి.
ఒకవైపు లక్షమంది ఆకలితో మలమల మాడుతోంటే మరోవైపు కొంతమంది యజ్ఞాల పేరుతో బస్తా కొద్దీ ఆహారధాన్యాల్ని అగ్నిదేవునికి ఆహుతిగా ఇస్తున్నారు! ఇదంతా ఎందుకంటే కొంతమంది ‘తెలివైన వారు’ మతం ముసుగులో దోపిడీ చేసేందుకు! మంత్రాలకు చింతకాయలు రాలితే జీవితం గడపటం అత్యంత సులువు. వర్షాకాలంలో కురిసే వర్షానికై యజ్ఞాలు చేయడం ఎందుకో!


మూఢనమ్మకాలు మంచి వ్యాపారం చేయించగలవు. కొత్త పరిశ్రమలు స్థాపించగలవు. మూఢనమ్మకాలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాజీని రూపొందించడానికై ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రగత్తెకూ, మాయాఫకీర్లకూ సాధన సామగ్రిని తయారు చేయడానికి కొత్త పరిశ్రమలు మెస్తున్నాయి. దినఫం, తారాబం, జ్యోతిష్యం వగైరాలు పత్రికకు మంచి రాబడినిస్తున్నాయి. కంప్యూటర్‍ జాతకాలు వ్యాపారం అమెరికాలో చాలా బాగా జరుగుతోంది. 18 మంది నోబుల్‍ బహుమతి గ్రహీతతో పాటు 168 మంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలు బహిరంగంగా జ్యోతిష్యాన్ని ఖండిం చారంటే – జ్యోతిష్యమెంత బాగా విస్తరించిందో అవగతమవుతోంది.


కొన్ని మూఢనమ్మకాలు ఖచ్చితంగా మంచివి కావు. డబ్బు రెట్టింపు చేయడం, లోహాలను మార్చటం, నరబలితో పుత్రసంతానం పొందగలగటం వగైరాలు తీవ్రమైన విషాదానికి దారితీస్తాయి.
మరో దారుణమైన విషయమేమంటే మూఢనమ్మకాలు, వ్యక్తుల మనస్థైర్యాన్ని దెబ్బతీసి అసహాయులను చేస్తాయి. దీనివల్ల అసలు సమస్య, దాని కారణం అర్థం కావు. అటువంటి సమయంలో మూఢనమ్మకాలను నివారించేందుకు ప్రయత్నాలు అసలు జరగవు.
ప్రజల అజ్ఞానం మీదా, శాస్త్ర విజ్ఞానం మీదగల అవిశ్వాసం మీదా మూఢనమ్మకాల పెరుగుదల ఆధారపడుతుంది. ఈ మూఢనమ్మకాలూ, అంధవిశ్వాసాలూ, కసి మానవ పురోగతిని నివారించడమే కాకుండా ముఖ్య సమస్యను పెడత్రోవ పట్టించి, మానవ గమ్యానికి సంబంధించిన దృష్టిని నాశనం చేస్తున్నాయి. అయితే శాస్త్రం విస్తరించే కొద్దీ మూఢవిశ్వాసాల పరిధి కుచించుకు పోతుంది. అయినా మూఢవిశ్వాసాలు ఇంకా వ్యాపించి వున్నాయి.

మూఢనమ్మకాలు శాస్త్రబద్ధమైనవా?

జ్యోతిష్యం, హస్తసాముద్రికం, గంగాజలం, నుదిటి తిలకం, విభూతి, అతీంద్రీయ ధ్యానం గురించి సైన్స్  వివరణ ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే, ఇలా ఇచ్చిన వివరణలు తిరగబడుతున్నాయి. Tremb ఇలా వాదిస్తాడు – గ్రహాలూ, నక్షత్రాలూ, భూమీ విద్యుదయస్కాంత మండలాన్ని ప్రభావితం చేశాయని, అది మానవ ప్రవర్తనను నిర్దేశిస్తుందని! ఇంకా అతను జ్యోతిష్యానికి ఆధారంగా పుట్టిన తేదీని తీసుకోవడంలో జ్యోతిష్యులు పప్పులో కాలు వేశారంటాడు. పుట్టిన తేదీకి బదులు తల్లి తండ్రి కలిసిన ఘడియను పరిగణనలోకి తీసుకోవా లంటాడు. ఇలా ఇదంతా అనవసర పైత్యానికి దారితీస్తోంది. (తరువాయి వచ్చే సంచికలో)

-నాగసూరి వేణుగోపాల్‍,
ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *