తొలి తెలుగులిపి, తెలుగు భాషా శాసనం ఏది?

మానవ నాగరికతా, సంస్కృతుల వికాసానికి భాషకు విడదీయలేని సంబంధముంది. ప్రత్యేక మానవ సమూహాల ప్రత్యేకతలలో ప్రాథమికమైంది భాషే. వేష, భూషలు, ఆహార, విహారాదులు సమానంగానే వున్నా భాష మనల్ని ఫలానా సమాజానికి చెందినవారిగా గుర్తించడానికి అవసరమైన పనిముట్టు. హరప్పా-నాగరికత వస్త్వా ధారాలు బయటపడ్డప్పటికి తవ్వకాలలో లభించిన మట్టిముద్రల మీది భాషనింతవరకు చదువలేకపోవడం వల్ల ఆ నాగరిక సమూహాలు ఎవరన్నది రూఢిగా చెప్పలేకపోతున్నాం. వస్త్వాధారాలు చరిత్రకెంత అవసరమో భాష కూడా అంతే అవసరం. లిఖితరూప ఆధారాలు లభించినప్పటినుంచి మన చరిత్రను చారిత్రక కాలానికి చెందినదిగా, అంతకు ముందున్న మానవచరిత్ర చరిత్ర పూర్వయుగ చరిత్రగా నిర్ధారించుకున్నాం.
చదువగలిగిన భారతీయ లిపులలో ముందుగా పేర్కొన దగింది మౌర్యలిపి. అంతకు ముందున్నవని చెప్పబడిన సాహిత్య గ్రంథాలు రాయబడిన లిపి ఏదో ఆధారాలైతే లభించలేదు. మౌర్యలిపి అంటే అశోకుని శాసనాలలోని లిపి అని. ఆ లిపికి పరిణామ కాల మొకటి వుంటుంది. కనుక మౌర్య లిపికి పూర్వం వున్నలిపిని మౌర్య పూర్వ లిపిగా పేర్కొనవచ్చు.

కోటిలింగాలలో దొరికిన లఘు బ్రాహ్మీ శాసనాలు1 ఆ కోవకు చెందినవే. ఆ లిపిని పరిశీలిస్తే ఆ శాసనాలలో అది మౌర్యలిపికి పూర్వమున్న అక్షరాలు అనిపిస్తున్నాయి.మౌర్యలిపిలో లేని అక్షరాలు ఆ శాసనాలలో వున్నాయి.


తెలంగాణా నిర్మల్‍ జిల్లా కుబేర్‍ నగరానికి చెందిన కుబేరకుని భట్టిప్రోలు శాసనం, ఎర్రగుడి అశోకుని శాసనం తెలుగునాట మొదటి లిపిరూపాలని చెప్పుకుంటున్నాం. సాతవాహనపూర్వరాజులు, సాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, శాలంకాయనులు, బృహత్ఫలాయనులు, మాఠర రాజవంశాల శాసనాల బ్రాహ్మీలిపి ఎన్నోసార్లు మార్పులకు గురైంది. సాతవాహనుల పూర్వకాలంలో నాణాలమీది లిపి, సాతవాహనుల శాసనాలు, నాణాలమీది లిపి, ఇక్ష్వాకుల కాలానికి కిందికి, పైకి గీతలు పొడిగించే బ్రాహ్మీలిపిగా మారింది. వాకాటకుల నాటి బ్రాహ్మలిపిని ‘బాక్స్ టైప్‍ బ్రాహ్మీలిపి’ అని అంటున్నారు. విష్ణుకుండినుల నాటికి బ్రాహ్మీలిపి నుంచి తెలుగులిపి కొత్త రూపు దిద్దుకోసాగింది. విష్ణుకుండిన మహారాజు గోవిందరాజు వేయించిన ‘చైతన్యపురి (ప్రాకృతభాష, బ్రాహ్మీలిపి) శాసనం’ నుంచి అతని కొడుకు 2వ మాధవవర్మ విష్ణుకుండినుల రెండవ రాజధానిగా పరిగణించబడుతున్న కీసరగుట్టలో దేవాలయాదులు నిర్మించిన కాలంలోనే రామలింగేశ్వరుని ఆలయానికి దక్షిణాన రాతిగుండుమీద చెక్కబడిన నామక శాసనం ‘తొలుచువాండ్రు’ మధ్య కాలాంతరం వందేండ్లు. తొలుచువాండ్రు కీసరగుట్ట ఆలయాల నిర్మాణంలో పాల్గొన్న శిల్పులు. శిల్పులు వారివేదికకు పెట్టుకున్న పేరది.


శిలాదులపైకెక్కిన వ్రాత అంటే లేఖనం (లిఖిత రూపం.). ఇంగ్లీష్లో Inscriptions  అంటే రాయబడినవనే కదా అర్థం. శాసనాలేవైనా లేఖనాలే. లేఖనాలన్నీ శాసనాలు కావు. శాసన మంటే రాజుల ఆదేశంతో రాయబడిన, చెక్కబడినదని అర్థం చెప్పుకుంటున్నాం. అన్ని లేఖనాలు రాజుల ఆదేశాలున్న శాసనాలు కాదు. దేన్ని చరిత్రకారులు శాసనమంటున్నారో మళ్ళీ నిర్వచించవలసి వుంది.
పదాలు మాత్రమే కనిపించేవి, ఇంకా చిన్న, చిన్న వాక్యాల శాసనాలు నాగార్జునకొండ, కోటిలింగాల వంటిచోట్ల అగుపించాయి. అటువంటి శాసనాలు, ముద్రలు, నాణాలు వున్నాయి. నాటికి రాతపనులకు వాడుకుంటున్న బ్రాహ్మీలిపినే తెలుగువారు కొంతమార్పుతో ఉపయోగించుకున్నారనిపిస్తున్నది. కన్నడంలో కూడా అంతే. తెలుగుమాటలు విష్ణుకుండినుల నాటికే వాడుకలో వున్నా, తెలుగు లిపి కనిపించింది ‘తొలుచువాండ్రు’లోనే.
తొలుచువాండ్రులో మొదటి ‘త’కారం బ్రాహ్మీలిపిలోని ’త’ అక్షరంతో పోలిక కలిగివుంది. ‘వ’కారం బ్రాహ్మీలిపి ‘వ’ అక్షరంతో పూర్తిగాపోలివుంది. లకారం, చకారం, డకారాలలో లిపి పరిణామం కనపడు తున్నది. ‘తొలుచు’ క్రియాపదంతో ‘వాండ్రు’ అనే సర్వనామం చేరి సమాస పదంగా రూపొందింది. వాండ్రు వాడుకం గురించి పివి పరబ్రహ్మశాస్త్రి ‘తెలుగు శాసనాలు’లో సోదాహరణంగా వివరించారు.


తెలుగు అక్షరాలలో బండి ‘ఱ’లోని అడ్డుగీతలేని అక్షరాలు శాసనాలలో కనిపిస్తున్నాయి. అట్లే? అక్షరం కూడా శాసనాలలో వాడబడుతున్నది. తెలుగులో బహువచనం రాసేచోట ‘వాన్డ్రు’ రాయటానికి? వాడడం పాత శాసనాలలో కనపడుతున్నది.
ఉదా: కాచి కుడిపిన వాన్డ్రు-(వెల్దుర్తి శాసనం)
పుణ్యకుమారున్డ్రు -(తిప్పలూరు శాసనం-630)
వేవాన్డ్రు-(మాలెపాడు శాసనం-725)
వక్రంబు వచ్చువాన్డ్రు-(వేల్పుచెర్ల శాసనం)
వాన్డ్రు అనే మాట ప్రథమైక బహువచన ప్రత్యయంగా పరబ్రహ్మ శాస్త్రిగారు పేర్కొన్నారు. దీనివల్ల వాండ్రు అనే మాట మొదటిసారి వాడిన కీసరగుట్ట శాసనం తర్వాతి శాసనాలకు పూర్వరూప భాషను పేర్కొన్నదని చెప్పాలి.
బ్రాహ్మీలిపిలోని అక్షరాలే పరిణమించి తెలుగులిపికి ఆధారమైనవని చెప్పడానికి తెలంగాణాలోని ప్రస్తుత మేడ్చల్‍ జిల్లా కీసరగుట్టలో 1967లో గుర్తించిన లఘుశాసనం(లేబుల్‍) ‘‘తొలుచు వాండ్రు’’ తిరుగులేని సాక్ష్యం.

ఆధారాలు: 

మల్లావఝల నారాయణశర్మ-కోటిలింగాల బ్రాహ్మీలఘు శాసనాలు
పివి. పరబ్రహ్మశాస్త్రి- తెలుగుశాసనాలు, (ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమి ప్రచురణ) పే.5-11

శ్రీ రామోజు హరగోపాల్‍,
ఎ : 9505646046

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *