ప్రకృతి సూత్రాలలో 17వది – అనగా జీవశాస్త్రపరంగా మూడోవది:
సృష్టిలోని అన్ని రకాల జీవులలో వుండే జన్యుస్మృతి (Genetic code) ఒకటే! (All Living beings have the same Genetic code) సృష్టిలోని పదార్థాల్ని మూడు భాగాలు విభజించడం జరిగింది. అవి ఘన, ద్రవ, వాయు పదార్థాలు కాగా, ఇవి మూడు ధర్మాల్ని ప్రదర్శిస్తాయి. ఒకటి స్థలాన్ని ఆక్రమించడం, రెండు భారాన్ని కలిగివుండడం, మూడు పీడనాన్ని కలుగజేయడం. ఈ ధర్మాల్ని ప్రదర్శించనిచో దాన్ని పదార్థంగా పరిగణించం. ఈ పదార్థమే ఓ నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల్లో జీవంగా (రెండో వ్యాసంలో చూసాం) ఆవిర్భ వించినట్లు చూసాం. ఈ జీవం కొనసాగడానికి వివిధ జీవరసాయనిక చర్యలు అవసరం. ఈ రసాయనిక చర్యలే కణాలను, కణసముదాయాలను జీవంతో వుండేలా చేస్తాయి. బహుకణ జీవుల్లో నిత్యం వేలాది కణాలు చనిపోవడం, కొత్తవి నిర్మితం కావడం జరుగుతూనే వుంటుంది.
ఎదిగిని జీవుల్లో, మనుషుల్లో, మహావృక్షాల్లో వీటిని అనునిత్యం చూస్తూనే వుంటాం. ముదిరిన వృక్ష భాగాలు బెరడుగా మారడం జరుగు తుంది. ఏకవార్షికాలు, అత్యధిక పంట మొక్కలు ఈ ధర్మాన్ని ప్రదర్శించి ఎండిపోవడం తెలిసిందే! మనుషుల్లో వెంట్రుకలు, గోళ్ళు, చర్మం, అరచేతులు, పాదాలు నిత్యం నిర్జీవంగా మారిన కణాల్ని కోల్పోతూ వుంటాయి. పాము కుబుసం మరో చక్కని ఉదాహరణ!
ఇది ఎలా జరుగుతుందనేది ఓ ప్రశ్న! వీటికి అందాల్సిన ఆక్సిజన్, అభివృద్ధి చెందిన జీవుల్లో లవణజలాలు, రక్తప్రసరణ ఆగి చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ రసాయనిక చర్యలకు కొన్ని ఎంజైములు సహకరిస్తాయి. ఈ ఎంజైములు రసాయనిక ప్రొటీన్ సంబంధ పదార్థాలే! ఈ ప్రొటీన్లలో అమినో ఆమ్లాలు సూక్ష్మ అణువులుగా వుంటాయి. ఈ అమినో ఆమ్లాలు రసాయనిక బంధంతో కలిసి ప్రొటీన్లుగా, ఎంజైములుగా మారుతాయి. ప్రొటీన్లు కండరాలుగా, రక్తనాళాలుగా, అస్థిపంజరంగా, చర్మము మొదలగు అవయవాలుగా, భాగాలుగా ఏర్పడుతాయి.
జన్యుస్మృతి (Genetic coded)
అమినో ఆమ్లాల నిర్ధిష్ట వరుస క్రమమే జన్యుస్మృతి (Gc)అంటారు. ఇది DNA (Deoxyribo Nucleic Acid) అనే మెలేసిన పెద్ద నిచ్చెన (Double Helix) నిర్మాణం. ఇది ప్రతి కణంలోని కేంద్రకం (Nucleus)లో వుంటుంది. అలాగే RNA (Ribonucleic Acid) కణద్రవంలో (Cytoplasm) వుంటుంది.
ఈ జన్యు నిర్మాణమే జీవులకు, పిల్లలకు వారసత్వ లక్షణాలను (hereditary) అందించును. ప్రకృతిలో 100 రకాలు అమినో ఆమ్లాలుంటాయి. అయితే, జీవుల నిర్మాణానికి సుమారు 20 రకాల అమినో ఆమ్లాలే అవసరం వుంటాయి. ఈ 20 వాటితోనే జీవరాసుల్లో ప్రొటీన్లతో కూడిన మొత్తం ఎంజైములు ఏర్పడినవి.
ఏకకణ జీవి అమీబా నుంచి ఏనుగు, తిమింగలం, మనిషి, చింపాంజి, కోతి, చీమ, దోమ, చివరికి కరోనాలో ఉండేవి కూడా ఈ 20 రకాల అమినో ఆమ్లాలే! గరిక, తులసి, వేప, వరి, జొన్న, దూలగొండిలో వుండేవి ఈ 20 రకాలే!
సృష్టి రహస్యం : (Natur’s Secret)
ఈ సృష్టి రహాస్యాన్ని చేధించలేక, శోధించలేక ప్రకృతినే పరిహసించే భావాజలాన్ని స్వార్థపర శక్తులు (భావవాదులు) సృష్టించి, ప్రచారం చేసి, యావత్ సమాజాన్ని దేవుడిచే, దయ్యంచే బంధించి వేసారు. ఆది మానవుని కాలంలో లేని ఈ ఆలోచన, తర్వాతి కాలంలో కొంత మంది ఆధిపత్య ధోరణితో ఓ వర్గంగా (ఉన్నత) మారి మతాన్ని సృష్టించి యావత్ శ్రమజీవుల్ని ఉత్పత్తికే పరిమితం చేసి, ఆ ఉత్పత్తిని అనుభవించడం తమ హక్కు అని, అది పూర్వజన్మ సుకృతమని మతమనే మత్తు మందుతో ప్రచారం చేశారు.
ఈ విధంగా మానవాభివృద్ధి క్రమంలో పుట్టిన ఓ తప్పుడు భావజాలమే ఈ మతం.
ఇలా పుట్టించబడ్డ మతమే ప్రపంచ వ్యాపితంగా సమాజాల్ని నియంత్రించడమే కాక, దీన్ని వ్యతిరేకించిన వారిని, శాస్త్రజ్ఞుల్ని ఊచకోత కోసింది. ఈ నరమేధం అభివృద్ధి చెందిందని చెప్పబడుతున్న అన్ని దేశాల్లో, వర్గాల్లో కొనసాగుతూనే వున్నది. మనుషుల్ని కులాలుగా, మతాలుగా, వర్గాలుగా కర్మ సిద్ధాంతాల్ని జోడించి, విడదీసి అభివృద్ధికి అడ్డుకట్టలు వేస్తూ మారణ హోమాన్ని సాగిస్తూనే వున్నది. రాజకీయ పార్టీలు, రాజ్యం వీటిని పెంచి పోషించి రాజకీయ లబ్దిని పొందుతున్నది మనకు అనుభవంలోనిదే!
సైన్సు వీటన్నింటికి శాస్త్రీయంగా, రుజువులతో సమాధానం చెప్పగలదు. చెపుతూనే వుంది కూడా! అయినా, ఈ వాదనను, శాస్త్రీయ రుజువుల్ని వ్యతిరేకించేవారు అత్యధికులు విద్యావంతులు, అందులో కొంతమంది పరిశోధనకారులు కావడం గమనార్హం! ఈ మిథ్యా విద్యావంతుల్ని, శాస్త్రజ్ఞుల్ని మిగతా సమాజం ఉదాహరణగా తీసుకొని, ఈ మతం మత్తులో కొట్టుమిట్టాడుతూ, తమ జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు. వీరెవరికి పాఠశాల స్థాయిలో చదువుకున్న రసాయనిక చర్యలగూర్చి, ద్రవ్యనిత్యత్వ నియమం (Law of conservation of mass) గూర్చి వీరి చెవికెక్కదు. పరీక్షల్లో మార్కులకోసం, ఆ తర్వాత డాలర్ల సంపాదనకై మాత్రమే ‘చదువు’ అనే సూత్రీకరణతో జీవితాన్ని మతంతో జోడించి, తమతోపాటు ప్రజానికాన్ని మోసగిస్తూ, మోసం చేస్తూ వుంటారు. ప్రభుత్వాలు కూడా వీరికే అండగా వుంటున్నాయి.
కరోనా సందర్భంగా సైన్సు యొక్క ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో చూస్తున్నాం. ఈ రోజు ఏ నమ్మకాలు పనిచేయడం లేదు. ఏ ఒక్క మతం, దయాగుణాన్ని ప్రదర్శించక పోగా తలుపుల్ని మూసుకుంటే, మతాధిపతులు ఏ ఒక్కరికి బరోసా ఇవ్వలేకపోతున్నారు. పైగా, వాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా, మానవ కళ్యాణానికి సైన్సు ఏ విధంగా దోహద పడుతుందో అర్థం చేసుకోవాలి. ఇదంతా పైవాడి కృప, దయ అని నమ్మేవారు, ప్రచారం చేసేవారిని ఇప్పుడన్నా నిలదీయక పోతే, భవిష్యత్తు అంధకారంగానే వుంటుంది. ఇలా నమ్మేవారు కరోనాకు, మరో వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోకుండా వుంటారేమోనని ప్రశ్నించాలి.
చిరవగా, ఈ జన్ముస్మృతే ఒక జీవితో మరో జీవి సహచర్యం చేసేలా చూస్తుంది. అందుకే ప్రకృతిలో జీవుల్ని ఉత్పత్తిదారులుగా (మొక్కలు), వినియోగదారులుగా (జంతువులు), పరాన్నజీవులుగా (సూక్ష్మజీవులు) విభజించడం జరిగింది. దీన్ని ఆహారపు గొలుసులో (Food Chain) వివరంగా చూడవచ్చు! ఈ జన్ముస్మృతి లేకుంటే, అసలు జీవం ఏర్పడేది కాదు. ఎందుకంటే, ప్రతీ జీవి బతకాలంటే విధిగా ఆహారం కావాలి కాబట్టి. ఈ ఆహారం, ఈ జన్ముస్మృతి యొక్క వరం కాబట్టి, జంతువులు మొక్కలపై, మొక్కలు ప్రకృతిపైన, పరాన్నజీవులు ఈ రెండింటిపైన ఆధారపడి వేలాది సంవత్సరాలుగా మన జాలుతున్నాయి. లేదంటే పుట్టక, మరణం వెనువెంటనే జరిగేవి. లేదా ఎలా వుండేదో ఊహించలేము.
గమనిక : స్వర్గ, నరకాలు, పునఃర్జన్మ సిద్ధాంతాల గూర్చి హేతుబద్ధంగా ఆలోచించేలా ఉపాధ్యాయులు ఎదగాలి. అప్పుడే రేపటి మానవీయ సమాజం రూపుదిద్దుకుంటుంది. (ఆర్‍కె నారాయణ్ రాసిన Malgudi days లోని A Tryst at the temple (Nitya) అనే కథను ఈ సందర్భంగా అందరు చదవాలి.)
(వచ్చే సంచికలో 18వ ప్రకృతి సూత్రాన్ని చూద్దాం!)
డా।। లచ్చయ్య గాండ్ల
ఎ : 9440116162