వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి

మహబూబ్‍నగర్‍ జిల్లా వట వృక్షాలకు పేరెన్నిక గన్నది. మహబూబ్‍నగర్‍ జిల్లా క్షేంద్రం నుండి చుట్టు పక్కల సుమారు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో అరడజన్‍ మర్రి వృక్షాలున్నాయి. ఇవన్నీ పర్యాటకానికి అనువైనవే. కాని ఒక పిల్లలమర్రిని మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసింది. అలా అభివృద్ధి చేయవలసినది, అంతకంటే అందమైన మర్రి మరొకటి పిల్లలమర్రికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాని పేరు గోసాయి మర్రి.


కొన్ని వందల సంవత్సరాల కింద ఈ మర్రి కింద గోసాయిలు అనే సన్యాసులు నివసించారు. కాబట్టి దానిని గోసాయి మర్రి అని స్థానికులు పిలుస్తున్నారు. కాని ఆ వృక్షం గోసాయిల కంటే ముందు నుంచే మనుగడలో ఉంది కాబట్టి ఆ మర్రి ప్రాంతంలో ఏర్పడిన ఊరికి దాని పేరునే పెట్టారు. అదే మరికల్‍. ఈ మరికల్‍ గ్రామం రంగారెడ్డి జిల్లాలోని కులక్‍చర్ల మండల పరిధిలోని కొత్తపల్లి తాండాకు దగ్గరలో ఉంది.
హైదరాబాద్‍ నుండి బెంగళూరు రహదారిలో వచ్చే జడ్చర్లకు ముందున్న మాచారం (87 కి.మీ.) నుండి కుడివైపుకు తిరిగి నవాబ్‍పేట మీదుగా 20 కిలోమీటర్లు ప్రయాణించి ఈ మర్రిని చేరుకోవచ్చు.

వృక్ష క్షేత్రం:

ఈ మర్రి కేవలం పెద్ద చెట్టుగా మాత్రమే కాకుండా క్షేత్రంగా కూడా తరతరాల నుండి పూజలందుకుంటున్నది. ఇందుకు కొన్ని కారణాలు కన్పిస్తాయి. ఒకటి, ఇది అందమైనది, ఆహ్లాదకరమైనది కావడం వల్ల మనుషులతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఈ చెట్టును ఆశ్రయిస్తున్నాయి. ఎన్నో ఏళ్ళ కింద గోసాయిలు సంచార వశంగా వచ్చి, ఈ చెట్టు అందం నచ్చి దీని కిందే కొంత కాలం నివసించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజల రోగాలకు, గ్రహ బాధలకు మందులిచ్చి మంచి చేయడం వల్ల ఆ మంచికి కేంద్రమైన మర్రి చెట్టు ఒక క్షేత్రమైంది. ఈ మర్రి కిందే గోసాయిలు వీరాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించి మర్రి ఊడలనే గోడలుగా మలచుకొని ఆలయం నిర్మించారు. ఆంజనేయుడు శని గ్రహ బాధల నుండి భక్తులను విముక్తులను చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆంజనేయుని విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంది. సూర్య కిరణాలు విగ్రహం మీద పడుతుండడం గమనార్హం. ఈ కారణంగా హనుమంతుని విగ్రహం మహిమాన్వితమైందని, కాబట్టి కొన్ని దశాబ్దాల క్రితం ఒక కోతి ఈ హనుమంతుని చుట్టే తిరుగుతూ కొన్ని సంవత్సరాల కాలం గడిపిందని, ఆ కోతిని ఒక ఆకతాయి వడ్డెర కులస్థుడు తుపాకితో కాల్చి చంపాడని, ఆ పాప ఫలితంగా కొన్నాళ్ళకు అతని కుటుంబం మొత్తం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు చెప్తారు.


ఆంజనేయుని ఆలయం ముందు రెండు శిల్ప శోభితాలైన స్తంభాలున్నాయి. సుమారు ఐదు అడుగుల ఎత్తుతో నలు చదరాలుగా ఉన్నాయవి. ఒక స్తంభానికి హనుమంతుడు నాలుగు రూపాలతో శిల్పించబడ్డాడు. ఎడమ వైపుకు చూస్తున్నట్లు, కుడి వైపుకు చూస్తున్నట్లు, ఎదురుగా చూస్తున్నట్లు, వంగి చూస్తున్నట్లున్న హనుమంతుడు సదా జాగరూకుడై మానవాళి సంక్షేమానికై కృషి చేస్తున్నట్లు ఒక అర్థం స్ఫురించగా, హనుమంతుడి నడకను సూచిస్తుంది ఇంకొక విశ్లేషణ. ఈ శిల్పాల్లో హనుమంతుడు చేతులు జోడించి పబ్బతి పట్టుకున్నట్లుండడం అతని రామభక్తిని తెలియ జేస్తుంది. అయితే రాముడి విగ్రహం ఈ పరిసరాల్లో కనిపించలేదు. కాని రాముని పూర్వ అవతారాలుగా చెప్పే విష్ణు, వరాహం, కూర్మం, మత్స్యం శిల్పాలు మరో స్తంభానికి చెక్కి ఉన్నాయి. తాబేలు శిల్పం కింద ఒకే కన్ను ఆధారంగా నాలుగు చేపలు శిల్పించిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మర్రికి ఈశాన్యంలో ఉన్న ఊరి కుంటలో, ఆగ్నేయంగా ఉన్న ఊరి చెరువులో తాబేళ్ళు, చేపలుండటం గమనార్హం. అయితే ఈ శిల్పాలన్నీ సృష్టి క్రమాన్ని సూచిస్తుండడమూ గమనార్హం. దీనికి నిదర్శనంగా రెండవ స్తంభానికి ఒక వైపు దంపతులు కూర్చుని సంభోగిస్తున్నట్లున్న శిల్పం కన్పిస్తుంది. హనుమంతుని శిల్ప స్తంభం మీద ఒక గుండు, దానిపై ఆరు అంగుళాల ఎత్తున్న పిడి ఉన్నాయి. ఇవి హనుమంతుని జెండాను సూచిస్తాయేమో!
మర్రి చెట్టుకు వాయువ్య దిశలో ఉన్న బురుజు దగ్గర ‘బురుజు మైసమ్మ’ సన్నిధి ఉంది. అదే దిశలో ఫర్లాంగు దూరంలో ఉన్న మరో బురుజు దగ్గర పరిగి తిప్పవ్వ విగ్రహముంది.
పైన పేర్కొన్న వివరాలు ఈ మర్రి, దీని పరిసరాలు పవిత్ర స్థలాలని తెలియజేస్తున్నాయి. కాబట్టి స్థానిక గ్రామాల ప్రజలు ఈ మర్రి వృక్షం చూట్టూ ప్రతి యేటా ఉగాది పండుగనాడు ఎడ్లబండ్లు తిప్పుతున్నారు. పరిగి తిప్పవ్వ పేరును బట్టి, ఆ విగ్రహమున్న ఒకప్పటి ఊరు పేరు (అప్పిరెడ్డి గూడెం)ను బట్టి కొన్ని వందల ఏండ్ల కింద ఇక్కడికి సమీపంలో ఉన్న పట్టణం పరిగి నుండి అప్పిరెడ్డి అనే భూస్వామి వచ్చి ఇక్కడ తన పేర గ్రామాన్ని పొందించి దాని చుట్టూ కోట కట్టి ఆ కోటలో అతను, అతని వంశ పరంపర నివసించారు అని అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా శిథిలమైన ఆ కోటలో ఆనాటి కుండ పెంకులు, తదితర వస్తుగత ఆధారాలను కొన్నింటిని తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ అధ్యక్షులు శ్రీ ఎం.వేదకుమార్‍ గారు, ఈ వ్యాసకర్త సేకరించారు. ఇప్పటికీ ఈ మర్రి అప్పిరెడ్డి గారి వంశస్తుల ఆధీనంలోనే ఉంది.
ఈ చెట్టును కొన్ని దశాబ్దాల కింద ఇక్కడికి దగ్గరలో ఉన్న వెంకటాపురం గ్రామస్థుడైన ఒక ముస్లిం పెద్ద మనిషి 66 వేల రూపాయలకు కొనుగోలు చేశాడట. కాని కీడు సూచిత మవడంతో దాన్ని కొట్టి కలపను అమ్ముకునే ప్రయత్నాన్ని మానుకున్నాడట.

పర్యాటక ప్రయత్నాలు :

ఈ విశిష్టమైన మర్రికి విశేష ప్రాధాన్యం కల్పించాలని సుమారు మూడు దశాబ్దాల కిందట కొందరు స్థానిక యువకులు ప్రభుత్వానికి విన్నపాలు చేయగా ఆనాటి జిల్లా కలెక్టర్‍ శ్రీ ఎస్‍.పి. టక్కర్‍గారు స్వయంగా వచ్చి ఈ చెట్టును చూసి దాని అభివృద్ధికై ప్రణాళికలు రచించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు ఈ మర్రిని పరిశీలించి, ఇది 600 సంవత్సరాల కంటే ముందుదని, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అడయార్‍ మర్రి కంటే పెద్దదని నివేదించారు. అటవీ శాఖ వారు ఇంతటి విశిష్టమైన చెట్టును అభివృద్ధి చేయడానికి దీనిని సమీపంలోని మహమ్మదాబాద్‍ అడవుల్లో భాగంగా చూపుతూ దీని కింద మొక్కలను (నర్సరీ) పెంచాలని, జింకల పార్కును ఏర్పాటుచేయాలని అందుకు తగిన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. కాని ప్రభుత్వం ఇప్పటివరకు ఏ కార్యక్రమాలనూ ఇక్కడ చేపట్టలేదు. పైగా ఈ చెట్టు చుట్టు పక్కలా భూ ఆక్రమణలు విస్తరిస్తున్నాయి.


పర్యాటక అవకాశాలు :


ఈ మర్రి చెట్టు, దాని పరిసరాల్లో పర్యాటక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ క్రింది కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.

  1. ముందుగా ఈ చెట్టు ఇక మీదట ఆక్రమణకు గురికాకుండా దీని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి.
  2. దీని కింద నర్సరీని పెంచాలి.
  3. దీని కింద జింకలు, కుందేళ్ళను పెంచాలి. సందర్శకులకు అవి ఆహ్లాదాన్ని కూడా పంచుతాయి.
  4. ఈ చెట్టు కొమ్మలు, ఊడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి వాటి పైన (పది మీటర్ల ఎత్తున) పావు కిలోమీటర్‍ పొడవున తలకోన (చిత్తూరు జిల్లా)లో ఏర్పాటు చేసినట్లుగా ఊగే ఊయల వంతెన ఏర్పాటు చేసి దాని మీద ఆహ్లాదకరంగా నడిచే అవకాశాన్ని పర్యాటకులకు కలుగజేయాలి.
  5. సమీపంలోని ఊరి కుంట, ఊరి చెరువులో పెడల్‍ బోట్లు ఏర్పాటు చేయాలి.
  6. చెట్టు, ఊరి కుంట మధ్యలో పిల్లల ఆట స్థలం ఏర్పాటు చేయాలి.
  7. పర్యాటకుల కోసం ఒక రెస్టారెంట్‍ ఏర్పాటు చేయాలి. పైన పేర్కొన్న విధంగా చేస్తే ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగి నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ అరుదైన మర్రి చెట్టును కాపాడినట్లూ అవుతుంది, పర్యాటకులకు కొత్త పర్యావరణ పర్యాటక క్షేత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లూ అవుతుంది. ప్రభుత్వానికి సాధ్యం కాకపోతే పర్యావరణ హిత నిబంధనలతో అభివృద్ధి చేయాలని ప్రైవేట్‍ సంస్థ(ల)కైనా పై పనులను అప్పగించాలి. లేదంటే ఈ అరుదైన చెట్టు ఆక్రమణలకు గురై అవశేష స్థితికి చేరే ప్రమాదముంది.

ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29.
తెలంగాణ. వెల: రూ.100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *