ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-6 శాస్త్రీయ దృక్పథం – పద్ధతి!(SCIENTIFIC TEMPER – METHOD)

ఇంతవరకు ప్రకృతి సూత్రాలలో జీవశాస్త్ర సంబంధమైన చివరి నాలుగు (15-18) సూత్రాలను చూసాం. జీవం పుట్టుకకు, నిర్జీవ పదార్థాలకు గల సంబంధాన్ని చూసాం. సూతప్రాయంగా సౌరకుటుంబం యొక్క ఆవిర్భావం, భూమి పుట్టుక గూర్చి కూడా తెలుసుకున్నాం. కరోనా నేపథ్యంలో వైరసుల చరిత్రను చూసాం. ఇదే కోవలో భౌతిక, రసాయన సంబంధమైన మొదటి 14 ప్రకృతి సూత్రాలను తెలుసుకునే ముందు, ఈ ప్రకృతి సూత్రాల సూత్రీకరణ ఎలా నిర్ధారిస్తారు, ఎలా రూపొందిస్తారు, అసలు ఈ సూత్రాలలోని శాస్త్రీయత ఎంత? వీటిని ఎలా నమ్మేది తదితర అంశాలను కూడా ఆకలింపు చేసుకోవాలి.

ముందుగా మానవ చరిత్రను, అభివృద్ధిని ఎలా విశ్లేషిస్తారో చూడాలి. భావవాదులు ఇతిహాసాల నేపథ్యంలో, మత గ్రంథాల ఆధారంతో భేరీజు వస్తే, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు వివిధ దశలలో మానవ వికాసం, ఎదిగిన విధానం, మార్పులు, ఆయా కాలాలలో జరిగిన ఆవిష్కరణలను (నిప్పును గుర్తించడం నుంచి మొదలుకొని, రాతి, లోహపు పనిముట్లు, మొదటి సరళ యంత్రమైన చక్రం మొ।।), వివిధ ప్రాంతాల్లో గుహలలో, తవ్వకాల్లో లభించిన శిలజాల ఆధారంగా వాటి కాలాన్ని లెక్కించి (4వ కథనంలో చూసాం), చర్చించి, తగు ఉదాహరణలతో నిర్దారిస్తారు.

మంచుయుగం, రాతియుగం, లోహయుగమని, ఇప్పుడైతే ఆధునికయుగమని, వీటి మధ్యన అందయుగమని పేర్కొనడం, ఇక కచ్చితమైన కాలానికైతే క్రీస్తుకు పూర్వం, తర్వాత అంటూ మానవ విజ్ఞాన వికాసంతో భేరీజు వేయండం జరుగుతుంది. ఇవన్నీ ఒక క్రమానుగుణంగా జరిగినట్లు గుర్తించడం జరిగింది. టూకీగా చెప్పాలంటే, దాదాపు 1950 దాకా గల యావత్‍ భూమండలంపై ఉన్న సహజ, స్వతంత్ర పదార్థాల కన్నా (అంటే మానవ ప్రయత్నం లేకుండా ఏర్పడిన పదార్థాలు), గత 70 సం।।లలో మానవుడు లక్షలాది కొత్త పదా ర్థాలను ఆవిష్కరించాడు. ఈ సంపదంతా శూన్యం నుంచి తయారు చేసింది కాదు. భూమిపైన, లోపల, సముద్రంలో దొరికే సహజ, ముడి పదార్థాల వినియోగంతో చేసినవి మాత్రమే! ఇదంతా భగవంతుడి సృష్టి అని భావించేవారు వేలాది రకాల పదార్థాలు, వస్తువులు, యంత్రాలు, వాహనాలు, వినియోగ వస్తువులు, వివిధరకాల ప్రయాణ, ప్రసార సాధనాలు, భారీ పరిశ్రమలు, అధునాతన కంప్యూటర్లు, సెల్‍ఫోన్లు, వినోద సాధనాలు, ఒకటేమిటి ఆధునిక మానవుడు ఉపయోగించుతున్న సర్వసంపదలు ఎలా అందుబాటులోకి వచ్చాయో చెప్పలేరు. వారు చెప్పే జాతకాలు, గ్రహచారాలు అబద్దాల వాస్తు, కర్మకాండలు, పాపపుణ్యాలు, స్వర్గనరకాలు కంప్యూటర్‍ జనితాలుగా మారిపోయాయి. పైగా ఇలా సృష్టించబడుతున్న సమస్త వస్తుసంపద వేదాల్లో, ఇతిహాసాల్లో వున్నట్లు సమాజాన్ని బురిడీ కొట్టిస్తూ వుంటారు. మన ఇండియన్‍ సైన్సు కాంగ్రెస్‍ సమావేశాలే దీనికి చక్కని ఉదాహరణ.

నిర్ధారణ (Establish):
ఉదాహరణకు రెండు వేర్వేరు ద్రవ్యరాశులున్న రాళ్ళను లేదా రెండు రకాల వస్తువుల్ని పైకి విసిరితే, ఏది ముందు కింద పడుతుందన్న ప్రశ్నకు ప్రఖ్యాత ఉపాధ్యాయుడు, శాస్త్రజ్ఞుడు అరిస్టాటిల్‍ (క్రీ.పూ.4వ శతాబ్దం) ముందు బరువైనదే కింద పడుతుందని చెప్పాడు. అయితే, ఇదో ఊహ మాత్రమే! ప్రయోగం జరగలేదు. కాని 2000 సం।। తర్వాత అనగా 16వ శతాబ్దంలో గెలీలియో రెండు వస్తువులు ఒకేసారి భూమిని తాకుతాయని ప్రయోగ పూర్వకంగా చూపాడు. దీనికి కారణం భూమికి గల ఆకర్షణ శక్తిని, న్యూటన్‍ చెప్పేదాకా, అలాగే భూమికి ఇతర గ్రహాలకు ఇలాంటి శక్తి ఉంటుందని తెలియదు. కాబట్టి సైన్సు ఎప్పుడు పిడివాదంతో కాకుండా, కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణలతో, ఆధారాలతో ముందుకు సాగుతూనే వుంటుంది. అందుకే ఇంత అభివృద్ధి, ప్రగతి జరుగుతున్నది. ఈ నిర్దారణలు ఎలా జరుగుతాయి?

శాస్త్రీయ దృక్పథం (Scientific Temper ) :
ఇలా వేలాది సంవత్సరాలుగా పోగుపడిన విజ్ఞాన సంపదకు ఏ ఒక్క వ్యక్తో, శక్తో, శాస్త్రజ్ఞుడో ప్రదాతకాడు. నిప్పును గుర్తించి దాని ప్రయోజనాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఆదిమానవుడితో మొదలైన శాస్త్రీయ విధానం, పరిజ్ఞానం నిరంతరం కొనసాగుతూనే వుంది. కాబట్టి ఈ పరిజ్ఞానానికి సమస్త మానవజాతి కర్తలే అవుతారు. ఇదంతా మానవుల అవసరానికి అనుగుణంగా లేదా తనకు తాను రక్షించుకోవడానికై నిరంతరం ప్రకృతితో పోరాడి సాధించు కున్నదే! ఈ విధంగా పోగుపడిన జ్ఞానాన్ని కాలానుగుణంగా అనేక భాగాలుగా, శాఖలుగా విభజించడం జరిగింది. ఇందులో అతి ముఖ్యమైన భౌతిక, రసాయన, జీవ, భూగర్భ, ఖగోళ శాస్త్రాలు. తర్వాత వీటిలో అనేక ఉపశాఖలు ఏర్పడ్డాయి. జీవశాస్త్రంలో సూక్ష జీవశాస్త్రం అలా ఏర్పడిందే! విజ్ఞానశాస్త్రం ఎన్ని శాఖలుగా వున్నా, అవి ఒకదానితో ఒకటి అనుబంధాన్ని కలిగి వుంటాయి. ఒక శాస్త్రం మరో శాస్త్రపు విజ్ఞానాన్ని వినియోగించుకొని గౌరవించుకుంటాయి. అలాగే శాస్త్రజ్ఞుల మధ్యన మానవీయ సంబంధాలుంటాయి.

అందుకే సైన్సు అజరామరంగా విరాజిల్లుతున్నది. అదే భావవాదుల్లో, మతవాదుల్లో ఎన్ని వైరుధ్యాలో! ఒకరి దేవుడు మరొకరికి నచ్చడు. ఒకరి మతం మరొకరికి నచ్చకపోగా, ఒకే మతంలో అనేక వైరుధ్యాలుంటాయి. పైగా ఒకే పేరుతోగల దేవుడు, కులాల వారిగా, వర్గాల వారిగా, స్థలాల వారిగా ఆధిపత్య ధోరణిని కల్గివుంటాడు. అందుకే స్థానిక హన్మాండ్ల కన్నా, కొండగట్టు ఆంజనేయుడు గొప్ప! చిలుకూరి బాలాజీ, లార్డ్ఆఫ్‍ సెవెన్‍ హిల్స్ ఇచ్చే వరాల్లో తేడాలుంటాయట! ఇక వాస్తు శాస్త్రం గూర్చి, జ్యోతిష్యశాస్త్రం గూర్చి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఒక వాస్తు పండితుడికి, మరో పండితుడి వాస్తు తప్పుగా తోస్తుంది. అలాగే ఏ ఒక్క జ్యోతిష్యుడు మరో జ్యోతిష్యుడితో ఏకీభవించడు. ఇక గణపతి ప్రతిష్టాపనల్ని చూస్తూనే వున్నాం! అందుకే గణపతులలో గణపతులు వేరయా..!!
కాని, విజ్ఞానశాస్త్రం అలా కాదు. అర్కిటిక్‍ ఎస్కీమోలు, కుక్కలు, అంటార్కిటికా పెంగ్విన్‍లు, హిమాలయస్‍ ఎలుగుబంటి, నైలునది చేప, పసిఫిక్‍ మహాసముద్ర తిమింగలం ఆక్సిజన్‍ను మాత్రమే శ్వాసిస్తాయని చెబుతుంది. అంతేగాని, ఆక్సిజన్‍తో, కార్బన్‍ డయాక్సైడ్‍తో శ్వాసిస్తాయనే పరస్సర విరుద్ద సూత్రీకరణ లుండవు. ఇదే ప్రకృతి సత్యం! ఈ తాత్విక అవగాహననే శాస్త్రీయ దృక్పథం అని అంటారు. ఈ అవగాహన యావత్‍ భూమండలం మీదనే కాదు, విశ్వంలో, చివరికి ఇతర గ్రహాలపై కూడా ఇదే తార్కిక భావనల్ని కల్గివుంటుంది.

శాస్త్రీయ పద్ధతి (Method of Science) :
విజ్ఞానశాస్త్రం కేవలం పనిముట్లను, సరళ, భారీ యంత్రాలను, సందపలను, సౌకర్యాల్ని మాత్రమే అందించదు, తయారు చేయదు. వీనట్నింటితో పాటుగా ఓ శాస్త్రీయ ఆలోచనను, తాత్విక చింతనను కల్గిస్తుంది. ఈ తాత్విక చింతనే సత్వాన్వేషనకు దోహదపడుతుంది. ఈ విధమైన అన్వేషన, తార్కిక దృష్టినే శాస్త్రీయ పద్దతి అని అంటారు.

శాస్త్రీయ పద్దతిలో ప్రధానంగా 4 మెట్లు (Steps) వుంటాయి:

  1. పరిశీలన (Observation)
  2. ప్రశ్నించడం (Reasoning)
  3. పరికల్పన (ఊహ) (Hypothesis)
  4. ప్రయోగం (Experiment)

నేటి ప్రగతికి ఆదిమానవుడి నిశిత పరిశీలననే హేతుబద్ద కారణం. నిరంతరం జరిగే ప్రకృతి మార్పులు, మళ్ళీ, మళ్ళీ సంభవించే సంఘటనలు, పగలు, రాత్రి, చంద్రకళలు, గ్రహణాలు నిర్ణీత కాలాల్లో రావడం, వర్షాలు, ఎండలు, చలి – వీటికి అనుకూలంగా ప్రకృతి స్పందించడం, మొక్కలు, చెట్లు కాలానుగుణంగా పుష్పించడం, పండడం, తిరిగి మళ్ళీ మొలకెత్తడం, పక్షులు, జంతువులు, జలచరాలు వీటికి అనుగుణంగా ప్రతిస్పందించడం మానవుడి తొలి పరిశీలనా మెట్లు. ఈ చర్విత దృగ్విషయాలపై ఆదిమానవుడి మెదడులో ఎన్ని ప్రశ్నలు చెలరేగాయో! ఎన్ని ఊహలో, కలలో! ఎన్ని నిర్దారణలో! ఇలా నిత్యం జరిగే ప్రకృతి, భౌగోళిక విషయాలపై ఓ నిర్ధిష్టమైన నిర్ణయానికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో! నాటి మానవ మేధస్సు ఎంత ఘర్షణ పడిందో నేటి మేధస్సుకు అందని సత్యమే!

వంకాయ ఎంపిక :
మన విస్తరిలో దర్పంగా వెలిగే వంకాయ (ముద్ద / వేపుడు తదితర)ను తినడానికి యోగ్యమని గుర్తించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయో నిర్దారించడం కష్టమే! అలా వంటల్లో నూనెలు, పోపులు, ఉప్పు, కారం తదితర ద్రవ్యాలు వాడడం మానవుడి నిశిత దృష్టికి నిదర్శనం! ఈ లెక్కన నాడు ఎంతమందికి నోబెల్‍ అర్హత వుండేదో! ఇలా ఏ విషయాన్ని చూసినా ప్రతిదానికి ఓ పెద్ద చరిత్రనే వుంటుంది. ప్రకృతిలో లక్షలాది మొక్కలు, ఆకులున్నా, ప్రపంచ వ్యాపితంగా తినే ఆకుకూరలు, కాయగూరలు లెక్కించే సంఖ్యలోనే వుండడం గమనార్హం. మరి వీటి ఎంపికకు మన ముత్తాత, ముత్తమ్మ, వీరి మత్తాతలు ఎంతగా జ్ఞాన సంపదను పోగు చేసుకోవాల్సి వచ్చిందో!
ఇదంతా నిరంతర పరిశీలనతో, జనించిన ప్రశ్నలతో, పొందిన సమాధా నాలతో, వీటి చుట్టూ ఏర్పడిన పరికల్పనల (ఊహల)తో, పదేపదే జనించే ఎందుకు? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఏమిటి? లాంటి జిజ్ఞాస ఆలోచనలే కారణం! సమాధానం దొరికితే సరే! లేనిచో తిరిగి అన్వేషించడం, శోధించడం, పరీక్షించడం, కారణం తెలుసు కోవడం, పోల్చుకోవడం, తప్పుల్ని గుర్తించడం లాంటి చర్యలన్నీ జరగాల్సిందే! కాబట్టి ఈ ప్రయోగాలు ఏ ఒక్క వ్యక్తికో, లేక సమూహానికో పరిమితం కాకుండా యావత్‍ మానవ సమాజానికి ఓ సిద్ధాంతంగా, విధానంగా అందుబాటులోకి తేవడం జరిగేది. కావున, పైన ప్రస్తావించిన నాలుగు మెట్ల శాస్త్రీయ పద్ధతి, వీటికి అనుబంధంగా ఏర్పడే మరికొన్ని ఉపమెట్లు విధిగా ఓ సూత్రీకరణకు, సిద్ధాంతానికి దారి తీస్తాయి. ప్రయోగానికి నిలబడినంత కాలం ఈ సిద్ధాంతాలే అక్షరసత్యాలు (Facts)గా, శిఖరాగ్ర సూత్రాలు (Caraclinals)గా నిలబడతాయి.

శాస్త్రజ్ఞానం – బదలాయింపు : (Transfer of Knowledge)
అనుభవపూర్వకంగా, ప్రయోగ పూర్వకంగా ఏర్పడిన జ్ఞాన సంపద తరతరాలుగా బదలాయించబడుతూనే వుంటుంది. మొదట అనుభవజ్ఞులైన వ్యక్తులచే (Shaman), తర్వాత వ్యవస్థలు ఏర్పర్చుకున్న పఠనా కేంద్రాలు అంటే పాఠశాలలు ఈ పాత్రను పోషించాయి. ఈ కేంద్రాల్లో గడించిన జ్ఞాన సంపదను చర్చల ద్వారా ఇతరులకు పంచడం జరిగేది. తర్వాతి కాలంలో కాగితం ఉనికిలోకి రావడం (కీ.శ. 25-220 కాగా 8వ శతాబ్దంలో పేపరు తయారి), జ్ఞాన సంపద లిఖించబడడం, తర్వాత జర్మనికి చెందిన గూటెనబర్గ్ (Johannes Gutemberg – 1450) అచ్చు యంత్రానికి రూప మివ్వడంతో జ్ఞాన బదలాయింపుకు మార్గం సుగమమైంది. ఇదేకాలంలో రాజ్యం. పాఠశాల అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు పఠన కేంద్రాలుగా, జ్ఞానాన్ని పంచే (Transfer)) ప్రదేశంగా వెలుగొందిన ఈ కేంద్రాలు రాజ్యం గుప్పిట్లోకి పోయాయి. ప్రజలకు శాస్త్రపరిజ్ఞానం ఒంటబట్టుతే పాలకులను ప్రశ్నించే పరిస్థితి ఎదురైతుందని భావించి మనువాద సంస్కృతి ప్రతిరూపాలైన అశాస్త్రీయ ఇతిహాసాలాన్ని, భారత్‍లో అయితే వేద సంస్కృతిని బలవంతంగా ఈ కేంద్రాల్లో బోధనాంశాలుగా మార్చి, బ్రాహ్మణ వర్గమే వీటి బోధనకు ఆర్వులుగా, రాచరిక, బ్రాహ్మణ కుటుంబాల పిల్లలే విద్యార్థులుగా వుండాలనే ముద్ర వేసుకున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఆదిమ సమాజాల్లో, గణాల్లో జరిగే ప్రకృతి పరమైన బోధనను అనర్హతగా ప్రకటించారు. ఎవరైనా అధిగమించి జ్ఞానాన్ని (విద్య) పొందితే, వారికి శిక్షలు వేసేవారు.

తర్వాత ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు పాఠ్య ప్రణాళికలను రూపొందించి, వారి ఉనికికి భంగం కలగకుండా, దైవం పేరున, పూర్వజన్మ సుకృతం పేరున, కర్మ పేరున పాఠ్యాంశాల్ని రూపొందించి, శాస్త్ర పరి జ్ఞానానికి సమాంతరంగా, ఇంకా చెప్పాలంటే కొంత ఎక్కువ మోతాదులోనే ప్రవేశపెట్టారు. ఇప్పటికి ఈ వ్యవస్థ కొనసాగడమేకాక, భ్రష్టు పట్టిన వ్యవస్థీకృత, రాజకీయ, ఆర్థిక లోపాలకు ఇతిహాసాల బోధనే పరిష్కారమనే తప్పుడు భావాల్ని ఉపాధ్యాయుల్లో పెంపొందించి, అదే ఉపాధ్యాయ శిక్షణగా అభివర్ణిస్తున్నారు.

అయినా అన్ని అడ్డంకుల్ని అధిగమిస్తూ విజ్ఞాన శాస్త్రం అన్ని దిశలకు విస్తరించింది. విస్తరిస్తూనే వుంది. ప్రపంచంలో ఏమూల, ఏ ఆవిష్కరణ జరిగినా ప్రపంచ భాషలన్నీంటిలోకి క్షణాలో అనువదించబడుతున్న ఏకైక జ్ఞాన సంపద విజ్ఞానమే! ప్రపంచ వ్యాపిత పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా మారుతున్నాయి. చివరికి సైన్సు వ్యతిరేక భావజాలం గలవారు కూడా సైన్సును శ్వాసగా చేసుకుని బతుకుతున్నారు. (సెల్‍ఫోన్‍, లాప్‍టాప్‍, ప్రసార, ప్రయాణ సాధనాలు, కళ్ళద్దాలు, బిపి, షుగర్‍ పరీక్షలు, ఆరోగ్య పరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు మొ।। వీరే అధికంగా వాడుకుంటారు).
వీరి దాష్టికాలకు రెండు ఉదాహరణలు.

శాస్త్రీయ పద్ధతి (Method of Science) ప్రదర్శన మూసివేత:
ఎస్‍సిఇఆర్‍టి (NCERT) ఆధ్వర్యంలో ఢిల్లీలోని బాల్‍భవన్‍లో నడిచే శాస్త్రీయ పద్దతి ప్రదర్శన జనతా ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై మూసివేయబడగా, సిసిఎంబి (CCMB) డైరక్టర్‍గా పని చేసిన పిఎం భార్గవ ప్రోద్బలంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వాటిని కొనుగోలు చేసి 1980లో హైదరాబాద్‍లోని కేందగ్రంథాలయ ఆవరణ (అఫ్జల్‍గంజ్‍)లో ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఈ కేంద్రాన్ని తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ప్రారంభించాలి. కాని కుదరలేదు. ఇందిర హత్య తర్వాత వారం రోజులకు మీనన్‍ (నాటి ప్రణాళిక సంఘం సభ్యుడు, భౌతిక శాస్త్రవేత్త) జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కేంద్రం ప్రారంభించడంతో ఆదిలోనే వివాదాలకు కేంద్రమైంది. చివరికి పాలక పక్షంలోని భావవాదులు (చెన్నారెడ్డితో సహా) తమ పలుకుబడితో మూసివేయించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‍ 51(A) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకునే హక్కు వుందని, భార్గవ ఈ కేంద్రానికి రూపల్పన చేస్తే, మతతత్వవాదులు దశాబ్ద కాలం కూడా నడవకుండా చూసారు. దీని ప్రతిరూపమే బిర్లా సైన్స్ సెంటర్‍. పోతే దీనికి ముందే నిర్మితమైన బిర్లా మందిర్‍కున్న ప్రాధాన్యత ఈ సైన్సు కేంద్రానికి లేకుండా చేయడంలో నిర్వహకుల చతురత ఓ కొసమెరుపు. అందుకే యువత మందిరాన్ని చుట్టి, పక్కన్ను సైన్సు కేంద్రాన్ని నిర్లక్ష్యం చేయడం తెలిసిందే! పాలకులకు కావల్సింది కూడా ఇదే!

శాస్త్రీయ పద్దతి ప్రసారాలపై తెరదించిన ఆకాశవాణి.
తిరిగి కాంగీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కొంతమంది ఔత్సాహికుల కోరిక మేరకు, కేంద్ర ప్రభుత్వ సైన్సు అండ్‍ టెక్నాలజీ ఆధ్వర్యంలో అహమ్మదాబాద్‍లోని విక్రమ్‍ సారాబాయి కమ్యూనిటి సెంటర్‍ (ASCSC)) సహకారంతో ఆకాశవాణి 1989లో పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికని ఓ చక్కని కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతి ఆదివారం ఉ।। 8.30 గం।।లకు, తిరిగి ప్రతి సోమవారం సా।। 6.15 గం।। ప్రసారమయ్యేలా 13 భాగాల్ని (Episode) రూపొందించిది. అలా జూన్‍ 25 నుంచి సెప్టెంబర్‍ 24 దాకా సాగిన ఈ ప్రసారాల్ని పాఠశాల విద్యార్థులు ఆసక్తితో వినేలా, కృత్యాలను. పఠనసామాగ్రిని, పోస్టర్లను రూపొందించి, కార్యక్రమానికి నమోదు చేసుకున్న పిల్లలందరికి పంపిణీ చేసింది. దేశంలోని 50 ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్ని హేతుబద్ధంగా ఆలోచించేలా చేసాయి. చివరికి ఈ కార్యక్రమాల్ని కూడా పాలకవర్గాలు కొనసాగించని వైనం.

సైన్సు కాంగ్రెస్‍ – ఓ సర్కస్‍ :
1914 నుంచి ప్రతీ ఏటా జనవరిలో జరిగే సైన్సు కాంగ్రెస్‍ ఎంతో అపసవ్య దిశలో జరుగుతున్నాయో గత 2015 నుంచి చూస్తున్నాం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ముంబాయిలో జరిగిన 102వ సైన్స్ కాంగ్రెస్‍ను ప్రారంభించిన మోడీ శివుడే మొదటి శస్త్రచికిత్స నిపుణుడని ప్రస్తావించగా, విమానాల తయారి వేదాల్లోనే వుందని సమర్పించిన ఓ పత్రం (Paper) పై పెద్ద దుమారం లేసింది. అలాగే 2019లో జలందర్‍లో జరిగిన 106వ సైన్స్ కాంగ్రెస్‍లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‍ఛాన్సలర్‍ మాట్లాడుతూ, స్టెమ్‍సెల్స్, టెస్టుట్యూబ్‍ గర్బధారణ, గైడెడ్‍ మిసైల్స్ అన్నీ వేల సం।। క్రితమే భారత్‍కు తెలుసని ప్రస్తావించాడు. ఈ అంశం కూడా దేశ వ్యాపితంగా పెద్ద చర్చకు దారితీసి నమ్మకాల్ని, మత భావాల్ని సైన్సుతో జోడించ వద్దని, ఇది సైన్సు పురోగతికి పెద్ద అడ్డంకని సెలవిచ్చారు. అందుకే మన తరగతి గదులు దేవుళ్ల ఫొటోలతో అలంకరించ బడితే, ఆవరణలన్నీ సరస్వతీ విగ్రహాలచే ఆక్రమిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయుల నియమాకాన్ని పట్టించుకోవడం లేదు. అయినా, సైన్సు భావవాద వర్గపోరును. పాలకవర్గాల వ్యతిరేకతను ఎదుర్కుంటూనే నిరంతరం మానవ వికాసానికి అవిరాళంగా కృషి చేస్తూనే ఉంది.

నోట్‍ : సర్‍ సివి రామన్‍, సర్‍ జగదీస్‍ చంద్రబోసుల పరిశోధనల్ని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. (వచ్చే సంచికలో త్యాగధనుల దారిలో విజ్ఞానశాస్త్ర విజయాల్ని చూద్దాం!)

డా।। లచ్చయ్య గాండ్ల
9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *