ఎన్నికల్లో ఓట్లు వేసి కార్పోరేటర్లను గెలిపించాం. మమ్మల్ని పాలించండి! మా బాధలు పట్టించుకోండి! మా ఆకాంక్షలు గమనించండి అని చెప్పి ఓటిచ్చాం. ఓట్ల కోసం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చారని, ఎన్నాళ్ళకో కనబడుతున్నారని, ఇంతకాలం మేం బాధలు పడుతుంటే పట్టించు కోలేదని మనలో మనమే గులుగుకున్నాము. కనీసం ఇప్పుడైనా మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడి, మనకున్న అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని నగర పరిపాలనలో మనం ఎట్లా పాలుపంచుకోవాలో, ఎట్లా నిర్ణయాధికారాల్లో భాగం కావాలో, ఏ విధంగా మన ఆకాంక్షలకు ఒక క్రియారూపం ఇవ్వాలో ఆలోచించు కోవడం చాలా అవసరం.
మనది ప్రజాస్వామిక దేశం. రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాల కు అనుగుణంగా పాలన సాగాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభల్లో కూర్చోబెట్టడమేనా? లేక పాలనలో, నిర్ణయాలలో ప్రజలు ఎట్లా పాల్గొనాలె అనే అంశాలపై చాలా చర్చ జరిగి, 73,74వ రాజ్యాంగ సవరణలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే ‘గ్రామ సభలు’, ఆ సభల్లో ప్రజలు పాలు పంచుకోవడం, తీర్మానాలు ప్రవేశ పెట్టడం, గ్రామానికి సంబంధించిన అన్ని అంశాలపై సూచనలు చేయడం లాంటి విషయాలకు ప్రభుత్వ పాలనలో చట్టబద్ధత వచ్చింది.
నగర పాలనలో కూడా ఇటువంటి ప్రజాస్వామిక పక్రియకు సంబంధించి ప్రాంతీయ సభలు (ఏరియా సభ), వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని 2005 సంవత్సరంలో ‘పరిపాలన సంస్కరణల కమీషన్-2’ సూచించింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోలేదు. రాష్ట్రాలలో నగరాల అభివృద్ధి కోసం కేందప్రభుత్వం జేఎన్ యూఆర్ ఎం పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకం కింద గ్రాంట్లు పొందాలంటే తప్పనిసరిగా వార్డు కమిటీలు, ఏరియా సభల ప్రాంతీయ సభల ద్వారా నగర పాలన జరగాలని షరతు విధించింది. 2010 సంవత్సరంలో మున్సిపల్ పరిపాలన శాఖ జీవో నెం.57 ద్వారా వార్డు కమిటీలు, ఏరియా సభల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ పక్రియ కాగితాలకే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఈ సంస్థల ద్వారా, నగర పాలనను ప్రజాస్వామికంగా పాలించే ప్రయత్నం చేయలేదు. జంటనగరాలలోని 25 స్వచ్చందసంస్థలు 2012 సంవత్స రంలో ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించాయి. ఆంధప్రదేశ్ హైకోర్టు వార్డు కమిటీలు, ఏరియా సభల ఏర్పాటు, నిర్వహణ విషయంలో జీహెచ్ఎంసీకి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చట్టప్రకారంగా ఏరియా సభలను, వార్డు కమిటీలను ఏర్పరచడం తప్పనిసరి. ఈ రెండు సంస్థల ద్వారా ప్రజలు వాళ్ళ మౌలిక వసతులకు సంబంధించిన అన్ని అంశాలు జీహీచ్ఎంసీ దృష్టికి తేవలసి ఉంటుంది. ఈ సభల్లో ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలతో పాటు నగర పాలక సంస్థ తలపెట్టిన ఇతర అంశాలు మహానగర పాలక మండలి (జీహెచ్ఎంసీ కౌన్సిల్) సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రాంతీయ సభ:
ప్రతి వార్డు కమిటీ కింద జనాభాను బట్టి 6 నుంచి 10 ప్రాంతీయ సభలను ఏర్పరచాలి. ప్రాంతీయసభ నిర్వహించే బా ధ్యత ఒక జీహెచ్ఎంసీ ఉద్యోగికి అప్ప జెప్పబడుతుంది. జీహెచ్ఎంసీ ఈ సభకు సభ్యులను నియమిం చాల్సి ఉంటుంది. కాలనీ అసోసి యేషన్ అధ్యక్షుడు / కార్యదర్శి పన్నుల చెల్లింపుదార్ల అసోసియేషన్ ప్రతి నిధి, కిరాయిదార్ల సంఘం ప్రతి నిధి, మురికివాడల ఫెడరేషన్ ప్రతినిధి (వార్డులో మురికివాడలు లేకుంటే స్వయంసహాయక బృందం ప్రతినిధి). రిజిస్టర్ చేయబడ్డ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో ప్రతినిధి), ఆ వార్డులో ఉండే ఒక గౌరవప్రదమైన పెద్దమనిషి. ఓటరు లిస్టులో పేర్లున్న పది మంది పౌరులతో ప్రాంతీయ సభను ఏర్పరచాలి. ఇందులో 50 శాతం మహిళలు ఉండాలి.
వార్డు కమిటీ:
వార్డు కమిటీలో అన్ని ప్రాంతీయ సభల ప్రతినిధు లతో పాటు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన నమోదిత ఓటర్లు ఉంటారు. దీనికి కూడా పైన సూచించిన నిబంధనల ప్రకారమే నియామకాలు జరపాల్సి ఉంటుంది. ఏరియా సభలో, వార్డు సభల్లో సభ్యులుగా నియ మించ బడకున్నా, ఓటరు లిస్టులో పేరున్న ఏ పౌరుడైనా ఏరియా సభ సమావేశానికి హాజరు కావచ్చు. ఏరియా సభ మూడు నెలలకు ఒక సారి, వార్డు కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలి. ఏరియా సభ నిర్వహించడానికి కనీసం 50 మందికి తక్కువ గాకుండా సభ్యులు హాజరు కావాలి. వార్డు కార్పొరేటరు తప్పనిసరిగా ఏరియా సభ కు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన హాజరు అయితే ఇతర ఓటరు సభ్యుల మాదిరిగానే సమావేశంలో కూర్చుంటారు. జీహెచ్ఎంసీ అధికారి ఒకరు ఏరియా సభను నిర్వహిస్తారు. ఈ సమావేశాన్ని నడిపి, అధ్యక్షత వహించడానికి సభలో నుండి ఒక సహాయ కార్యదర్శిని, ప్రతినిధిని ఆయన నామినేట్ చేయాలి. సభలోని తీర్మానాలు, నిర్ణయాలు, మినిట్స్ రాయడానికి ఒకరిని ప్రతిపాదించాలి. రెండు నెలలకు ఒకసారి జరిగే వార్డు సభలో ఏరియా సభల నుండి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలు చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. వార్డు కమిటీ సమావేశంలో వార్డు లోని రోడ్ల పరిస్థితి, పార్కులు, తాగు నీటి సరఫరా, పాఠశాలలు, ఆరోగ్యం, విద్యుత్ సరఫరా లాంటి ప్రజల మౌలిక అవసరాల పరిస్థితిని సమీక్షించాలి. వీటితో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల ఎంపిక, పన్ను వసూళ్ళ సమీక్ష, వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు లాంటివి ప్రణాళికలో చేర్చ డానికి నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రజలు గ్రామం లో గ్రామసభలో కూర్చుని చర్చించు కున్నట్లు ప్రాంతీయ సభల్లో సభ్యులు చర్చించి సూచించిన అన్ని విష యాలు వార్డు కమిటీ పరిగణ నలోకి తీసుకోవాలి. కార్పొరేటరు తప్పని సరిగా వార్డు కమిటీ సమావేశంలో పాల్గొనాలి.
ప్రభుత్వం జారీ చేసిన (పైన పేర్కొన్న) ఆదేశాలలో వార్డు కమిటీ సభ్యుల ఎన్నిక గురించి, కమిటీల పనివిధానం గురించి, వాటి అధికారాల గురించి, పర్యవేక్షణ గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని అంశాలను మనం తప్పకుండా తెలుసుకో వాలి.
రూల్ 25(1), (ఐ-ఎ):
వార్డుల్లో పారిశుద్ధ్యం కార్యక్రమం, వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణ గురించి ఈ రూల్ చెబుతుంది.
రూల్ 25 (జి)(4):
వితంతు, వికలాంగుల, వృద్ధాప్యపు పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ముందు ప్రాంతీయ సభలో ప్రతి పాదించాలి. తర్వాత వార్డు కమిటీలో అంతిమ నిర్ణయం జరుగుతుంది.
రూల్ 28 (4):
ఏరియా సభ, వార్డు కమిటీ, సంస్థలు ఎట్లా నిర్వహించాలి? మినిట్స్ ఎట్లా నమోదు చేయాలి? వార్డు డెవలప్మెంట్ ప్రణాళికను ఎట్లా తయారు చేయాలి? వార్డులో జరిగే రోడ్డు రిపేరులు, వివిధ రకాలైన కొత్త నిర్మాణాల పర్యవేక్షణ గురించి సూచిస్తుంది. వార్డులో చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత పరిశీలించి వార్డు కమిటీ నివేదిక తయారు చేయాలి. నివేదిక జతపరిస్తేగాని కాంట్రాక్టరుకు బిల్లు మంజూరు కాదు.
సెక్షన్ 28:
వార్డుకు కేటాయించిన నిధుల్లో 20 శాతం నిధులు వార్డు కమిటీ పరిధిలో ఉంటాయి. సత్వరం చేపట్టాల్సిన పనులకు వార్డు కమిటీ ఈ నిధుల నుంచి ఖర్చు పెట్టవచ్చు. వార్డు కమిటీలో చేసే తీర్మానాలు, ప్రతిపాదనలు మహానగర పాలక మండలి (జీహెచ్ఎంసీ కౌన్సిల్) సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్ట బడుతాయి. నిర్మాణాలు, పనులకు సంబంధించిన ప్రతిపాదనలను స్టాండింగ్ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన తరువాత నిధుల కేటాయింపు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణ మునిసి పల్ శాఖ మంత్రిగారు ప్రకటించిన వందరోజుల ప్రణాళికలో ప్రాంతీయ సభలు, వార్డు కమిటీల ఏర్పాటు మొదటి అంశంగా నిర్ణయించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిద్దాం.
ఇంతటి వ్యవహారం ప్రజా స్వామిక పక్రియ ఉన్న నగర పాలనను మనం పూర్తిగా ఓట్లకే కుదించాం. ఓటు వేస్తే మన బాధ్యత తీరిపో యిందను కుం టున్నాం. గెలిచిన వ్యక్తి కనబడడం లేదని మనలో మనమే నసుక్కుం టున్నాం. చాయ్ దుకాణాల దగ్గర, ఫంక్షన్లలో కలిసినప్పుడు కార్పో రేటరు ఎంత పెద్ద కారు కొన్నాడో, ఆయన చుట్టూ తిరిగే చిన్న లీడర్లు ఎట్లా సంపాదించుకుంటున్నారో రసవత్తరంగా ముచ్చట్లు పెట్టుకుంటాం. మనం మౌనంగాఉండి నాకేందిలే అని అనుకుంటే పరిస్థితి ఎప్పటిలాగే ఉంటుంది. వార్డు కమిటీలు, ఏరియా సభలు పారదర్శకంగా, నిర్మాణాత్మకంగా పని చేయడానికి మన పాత్రను పోషిద్దాం. మనమందరం మౌలికవసతుల ఏర్పాటు కోసం మునిసి పాలిటీకి పన్నులు కడుతున్నాం. మనం చెల్లించే ఇంటిపన్నులో, రోడ్లు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, వీధి దీపాలు, ఆరోగ్యం, పోలీసు సేవలు లాంటివి భాగంగా ఉంటాయి. ఇవే గాకుండా లైబ్రరీ అందుబాటులో ఉండడానికి అదనంగా పన్ను కూడా కడుతున్నాం. తాగునీరుకు ప్రత్యేక బిల్లు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా స్వచ్ఛ భారత్ సెస్ పేరిట కొన్ని సేవలలో వసూలు చేస్తున్నారు.
మనం చెల్లించే పన్నులతో పాటు కేందప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు మునిసిపల్ కార్పోరేషన్ బడ్జెట్ అవుతుంది. ఈ బడ్జెట్ను సరిగా వినియోగించుకునే విషయంలో మన బాధ్యత చాలా ఉంటుంది. ఈ నగర పౌరులుగా మనం జాగరూ కతతో ఉందాం. చట్టబద్ద పాలన, నియమబద్ద పాలన, ప్రజాస్వామిక పక్రియ అమలు కోసం మన పాత్రను బాధ్యతతో పోషిద్దాం.
–మానవ హక్కుల వేదిక, జంటనగరాల కమిటీ