నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍

చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ అనేది నకాశి ఆర్ట్కు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన అద్భుతకళారూపాలను ఇందులో చూడవచ్చు. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కానవస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తుంటారు. ఫిల్మ్ రోల్‍, కామిక్‍ స్ట్రిప్‍ తరహాలో ఈ పటాలు పురాణగాధలను, ఇతిహాసాలను వివరిస్తుంటాయి. సాధారణంగా జానపద పురాణాల, చిన్న చిన్న కథలకు దృశ్యరూపం వీటిలో ఉంటుంది. ఒకప్పుడు ఈ కళ దేశం లోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యంలో ఉండింది. ఎక్కడికక్కడ ఈ కళ ప్రాంతీయ విశిష్టతలను పొంది ఒక్కో చోట ఒక్కో శైలిగా పేరొందింది. స్థానిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఈ కళను ప్రభావితం చేస్తూ వచ్చాయి. అదే విధంగా చేర్యాల్‍ పటం చిత్రాలు తెలంగాణలో బాగా పేరొందాయి. టీవీలు, సినిమాల, కంప్యూటర్ల రాకతో వివిధ ప్రాంతాల్లో ఈ కళ సన్నగిల్లుతూ వచ్చి చివరకు చేర్యాల్‍ గ్రామాన్ని చివరిస్థానంగా చేసుకొని స్థిరపడింది.


పటం బొమ్మలకు సుసంపన్న చరిత్ర ఉంది. ఆసియా కళాత్మక సంప్రదాయాల్లో ఇవి ముఖ్యపాత్రను పోషించాయి. చైనాలో స్క్రోల్‍ పెయింటింగ్స్ అనేవి రాచరికపు ఆచార వ్యవహారాల్లో భాగంగా ఉండేవి. భారతదేశంలో మాత్రం ఈ కళ గ్రామీణుల జీవితాలకే పరిమితమై జానపదకళగా వెలుగొందింది.
భారతదేశంలో ప్రతి ప్రాంతం, గ్రామం కూడా తనదైన శైలిలో పటం బొమ్మల సంప్రదాయాన్ని వృద్ధి చేసు కుంది. స్థానిక విశ్వాసాలు, ఆదరణ, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి విషయం, రూపం, సాంకేతికతలలో తమదైన ముద్రను కలిగి ఉంటాయి.


రాజస్థాన్‍లో ఈ కళ ద్వారా పభుజీకి పాద్‍, దేవ్‍నారాయన కథ, ధోలా, మరు లాంటి కథలు ప్రచారం చేస్తారు. గోవాలో దశావతారం ప్రఖ్యాతి గాంచింది.  మహారాష్ట్రలో పింగులి, చిత్రకథా సంప్రదాయాలు పేరొందాయి. మహారాష్ట్ర, గుజరాత్‍ అధునాతన స్క్రోల్‍ పెయింటింగ్‍ సంప్రదాయం ‘ప్రశస్తి పత్ర’కు ప్రఖ్యాతి చెందాయి. ఒడిషా, బెంగాల్‍లు పట చిత్ర సంప్రదాయానికి పేరొందాయి.


తెలంగాణలో…

నకాశిపెయింటింగ్స్, చేర్యాల స్క్రోల్‍ పెయింటింగ్స్, పట చిత్రాలు.. పేర్లు వేరైనా కళ ఒక్కటే. ఈ ఆర్ట్కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. పటం చిత్రాలను గీసే కళాకారులు నకాశిలు. ఒకప్పుడు వీరు ఎక్కువగా కరీంనగర్‍లో ఉండేవారు. ఇప్పుడు వేములవాడ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. దేవాలయాలలో విగ్రహాలు, హంస వాహనం, గరుడవాహనం, సింహవాహనం, చెక్క రథాలు లాంటివి తయారు చేయడంలో వీరు నిష్ణాతులు. వీటిని ఎత్ల పొనికి కర్రతో చేసేవారు. పండుగల సమయంలో ఉత్సవ విగ్రహాలకు, రథాలకు రంగులు వేసేవారు. గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ, దుర్గమ్మల విగ్రహాలను తయారు చేసేవారు.


తెలంగాణలో నకాశి వారసత్వం వందల ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఆ కళాకారుల కుంచె పురాణాల కథలను బొమ్మల రూపంలో చెబుతున్నది. చరిత్రను చిత్రరూపంలో చిత్రిస్తున్నది. సాంస్కృతిక సంపదను భావితరాల వారికి వారసత్వంగా అందిస్తున్నది. సంప్రదాయం, పురాణం, విశ్వాసాలు, ఊహల సమ్మేళనంగా ఆ చిత్రం రూపుదిద్దు కుంటుంది. అదే నకాశి. పటం చిత్రకారులుగా పేరొందిన నకాశీలు తెలంగాణకు ప్రత్యేకతను సంతరింపచేశారు. కొన్ని దశాబ్దాలుగా ఇతర అనేక హస్తకళలకు పట్టిన దుర్గతే దీనికీ పట్టింది. ఆ కళకు ఆదరణ తగ్గి చేతిలో పనిలేకపోవడంతో ఆ కళాకారులంతా వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. మిగిలిన ఒకటి అరా కుటుంబాల వారు పల్లెలను విడిచి నగరాలకు వలస వెళ్ళారు. వారు తమకళకు ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్‍ ఎత్తుగడలను జోడిస్తున్నారు. తద్వారా ఈ కళను సజీవంగా ఉంచడంతో పాటు ఎంతో కొంత ఆదాయాన్ని కూడా పొందుతున్నారు.


నకాశి పటాలు కుల పురాణాలకు కీలకం
వివిధ కులాల ఆవిర్భావం, గొప్పదనాన్ని వివరించే కులపురా ణాలను ఆయా కులాల ఆశ్రిత కులాల వారు చెబుతారు. అలా చెప్పడం ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదా యంతో తమ బతుకులు గడుపు తుం టారు. ఆవిధంగా ఆ కుల పురాణాలను పటాలపై దృశ్యీకరించి ఇచ్చేవారు నకాశిలు. పద్మశాలీలకు భక్త మార్కండేయ కథను చెప్పే కూనపులివారికి, గౌండ్లకు కంఠమ మహేశ్వర పురాణం చెప్పే ఏనుటివారికి, చాకలివారికి దక్షపురాణం, చాకలి పురాణం వివరించే పటపోళ్లకు, మాది గలకు జాంబవ, ఆది పురాణాలు చెప్పే డక్కలివారికి, మాలలకు గుర్రం మల్లయ్య కథను చెప్పే గుర్రపోళ్లకు, మంగళి కులానికి రామాయణం చెప్పే అద్దపోళ్లకు, ముదిరాజ్‍లకు మహా భారతం చెప్పే కాకి, గొల్ల కురుమలకు కాటమరాజు కథలను చెప్పే మందహెచ్చులకు వీరిచ్చిన చిత్రపటాలే ఆధారం. అయితే ఒక్కసారి గీసిచ్చిన బొమ్మలు రెండు, మూడు వందల సంవత్సరాలపాటు పాడవ్వకుండా ఉంటాయి. తరతరాలుగా ఈ పటాలను వారసత్వంగా అందిపుచ్చుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అదీ నకాశి చిత్రకళ విశిష్టతగా చెప్పవచ్చు.


చేర్యాల పెయింటింగ్స్గా మారిన వైనం
ఇలా ఒక్కసారి చేసి ఇచ్చిన పటాలు వందల ఏళ్లపాటు ఉండటం, ఆ ఒక్క చిత్రపటంపైనే పదుల కుటుంబాలు ఆధారపడటం వల్ల… చిత్రపటాల కొనుగోలు అంతంత మాత్రమే. దీనికితోడు ఆధునికత నకాశి కళపై ప్రభావం చూపింది. ఫొటోస్‍ వచ్చాయి. సిమెంట్‍, ప్లాస్టర్‍ ఆఫ్‍ పారిస్‍ వర్క్, ఎనామిల్‍ కలర్స్ వాడకం పెరిగింది. దీంతో రానురాను నకాశి పని తగ్గిపోయింది. వివిధ ఆశ్రిత కులాల కళాకారులు కూడా ఆ వృత్తిలో నుంచి బయటకు వస్తున్నారు. దీంతో నకాశీ కళాకారులు బతుకు దెరువు నిచ్చే ఇతర పనులను ఆ శ్రయించారు. 1942లో ఒకరిద్దరు కళాకారులు వరంగల్‍ జిల్లా చేర్యాలకు వలస వచ్చి తమ కుటుంబసభ్యులకు నకాషి నేర్పించారు. ఆ విధంగా కొన్నేళ్ళ తరువాత నకాశి పటచిత్రాలు కాస్తా చేర్యాల పెయింటింగ్స్గా మారి పోయాయి.


1978లో ప్రభుత్వం వీరిని గుర్తించింది. ఆ గుర్తింపే వీరి జీవితాలను మలుపు తిప్పింది. లేపాక్షితో అనుబంధంతో కొంత మార్పు వచ్చింది. ప్రాచీనతకు ఆధునికతను జోడించడం మొదలుపెట్టారు. రామాయణ, మహాభారతాలను చిత్రీకరించి ఇవ్వడం, ఫొటో ఫ్రేమ్స్ను తయారు చేయడం, విగ్రహాలను తయారు చేసే పద్ధతిలోనే మాస్క్లను తయారు చేయడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జ్బిషన్స్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ 500 ఏళ్ల చరిత్ర ఉన్న కళకు రావాల్సి నంత ప్రచారం రాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్తంత మెరుగు పడుతోంది.


సహజమైన రంగులు
నకాశి కళలో సహజసిద్ధ రంగులకే పెద్దపీట. మొదట ఖాదీ కాన్వాస్‍ను పెయింటింగ్‍కోసం సిద్ధం చేసుకుంటారు. సహజంగా తయారు చేసిన రంగులను ఉపయోగించి పెయింటింగ్స్ వేస్తారు. రంగురాళ్లను కొనుగోలు చేసి… వాటిని నూరుకొని రంగులు తయారు చేసుకుంటారు. తిరుమని చెట్లనుంచి తీసిన బంకను నూరి నీళ్లు కలిపి సిద్ధం చేసుకుంటారు. ఈ రెంటిని కొంచెంకొంచెంగా కలిపి రంగులద్దుతారు. ఒక్కో పెయింటింగ్‍ కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. ఇక మాస్క్లు, విగ్రహాల తయారీ పెద్ద తతంగమే. ఒక్క మాస్క్ తయారీకి వారం రోజుల సమయం పడుతుంది. ముందుగా బుర్కపెడ్డల మట్టి, కోడిగుడ్డు సొన, బంక కలిపి బొమ్మను తయారు చేస్తారు. ఇది ఆరడానికి రెండు రోజులు పడుతుంది. దానికి చింత అంబలితో బట్టను అతికిస్తారు. అతికించిన బట్టపై రెండుమార్లు సున్నం నీటిని అద్దుతారు. ఆ తరువాత వాటర్‍ కలర్స్ వేస్తారు. ఈ పక్రియ అంతా పూర్తయితే గానీ ఆకట్టుకునే కళాఖండాలు తయారుకావు.


కాలంతోపాటు మారుతూ…
ఇప్పుడు కృష్ణలీల, రామాయణ, మహాభారతాలకు డిమాండ్‍ ఎక్కువగా ఉంది. కృష్ణుడి పటాలను ఇళ్లలో ఇంటీరియర్‍ డెకరేషన్‍ కోసం వాడుతున్నారు. నగరాల్లో పెరుగుతున్న ఇప్పటి తరానికి గ్రామీణ వాతావరణం గురించి తెలుసుకోవాలన్న తపన మొదలైంది. తమ మూలాల గురించి అన్వేషణ ప్రారంభమైంది. అందుకే కులవృత్తులు, వ్యవసాయం, గ్రామీణ వాతావరణం, గంగి రెద్దులు, హరిదాసులు, బతుకమ్మ, బోనాలు, ముగ్గులు వంటి చిత్రపటాలకు డిమాండ్‍ ఎక్కువ ఉంటోంది. ఆయా సంస్థల ఆవరణలలో హ్యాంగ్‍ చేయడానికి, హోటల్స్లో ఇంటీరియర్‍ డిజైనింగ్‍ కోసం కూడా ఈ పెయింటింగ్స్ను వాడుతున్నారు. కళ మీద ఉన్న మక్కువతో ఇంట్లో మార్బుల్స్పైనా ఈ పెయింటింగ్‍ను వేయిస్తున్నారు. వాటర్‍ప్రూఫ్‍ కోసం వార్నిష్‍ కోటింగ్‍ ఇస్తారు.


ఆధునికత మోజులో పడి పురాతన కళారూపాలను మర్చిపోతున్న తరుణంలో ఏదోవిధంగా వాటికి జీవం పోస్తున్న వారికి యావత్‍ తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. అలాంటి వారి చరిత్రలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.


-చరిత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *