ప్రకృతే నియంత్రిస్తుంది! 7 ప్రకృతే శాసిస్తుంది!! విజ్ఞానశాస్త్ర ప్రయోగాలు వెన్నెల్లో విహారం కాదు!!

ఓ నిజాన్ని గుర్తించడానికి, గుర్తించిన దాన్ని సిద్ధాంతీక రించడానికి, ఆ సిద్దాంతాన్ని ప్రయోగ పూర్వకంగా నిరూపించడానికి, నిరూపించిన దానికి సామాజిక ప్రయోజనం చేకూర్చడానికి విజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక తత్వవేత్తలు జీవితాల్నే ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వెంటాడుతుంటే చుట్టూ వుండే సమాజం పిచ్చివారిగా ముద్రవేస్తుంది. నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, సమస్యకు దొరకని గమనం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారు తాయి. ఇలా ఎంతోమంది శాస్త్రజ్ఞులు సామాజిక వికాసానికై, అభివృద్ధికై సమిధలైనారు.


అన్నింటికి మించి పరిశోధనకు సంబంధించిన పరికరాలు, ముడిసరుకులు, రసాయనిక పదార్థాలు ప్రధాన సమస్యలైతే, వీటిని ప్రయోగించడానికి క్షేత్రస్థాయి సమస్యలు అంతా ఇంతాకాదు. నిరంతర తపన, తర్కం, సమాధానం దొరకని సమస్యల్ని, ఈ సమస్యలు ఇతరులతో పంచుకోలేని పరిస్థితి, పంచుకున్నా అవహేళనగా చూసే సమాజం! వృక్ష, జంతు శాస్త్ర ప్రయోగాలు అనేక వ్యవస్థలతో అనుబంధాన్ని కలిగి వుంటాయి. ముఖ్యంగా మానవులకు సంబంధించిన పరిశోధనలైతే అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనుషులపై ప్రయోగించడానికి ముందు అనేక దఫాలుగా జంతువులపై (ఎలుకలు, కుందేళ్ళు, గునియా పందులు మొ।।) ప్రయోగించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భా లలో జంతు ప్రేమికుల నుంచి వ్యతిరేకతను, నిరసనల్ని ఎదుర్కోవడంతో పాటు చట్ట సమస్యలుంటాయి. అన్నీ అనుకూలిస్తే మనుషులపై ప్రయోగించడానికి ప్రభుత్వ అనుమతులు, ప్రయోగానికి ఒప్పుకొని నిలబడేవారు (ప్రాణాంతకం కూడా కావచ్చు!) ఇతర వైద్య యంత్రాంగం, వైద్యశాలలు అవసరం వుంటాయి. ఇవన్నీ సమకూరినా, సంబంధిత ప్రయోగం విజయవంతమైతే సరే! లేదంటే పడిన శ్రమంతా నిరుపయోగంగా మారి అర్థరహితంగా మారుతుంది. వికటించి ప్రాణనష్టం జరుగుతే, చట్టాల్ని ఎదుర్కోవడమే కాక, సమాజ క్రోధాన్ని చవి చూడాల్సి వస్తుంది.


మానవ, సామాజిక వికాస ప్రదాతలు :
రేబిస్‍ వ్యాక్సిన్‍ను కనిపెట్టిన లూయిస్‍ పాశ్చర్‍ (1822-1895) – ఫ్రెంచ్‍ జీవ శాస్త్రజ్ఞుడు. పాలు చెడిపోకుండా చేసినందుకు ఈయన పేరుననే పాశ్చరైజేషన్‍ అనే పేరు వచ్చింది. అలాగే వాక్సినేషన్‍ సిద్దాంతకర్తగా గుర్తింపు పొందాడు. పాశ్చర్‍ ముందు వ్యాధి కారకాలైన వైరసును కుందేళ్ళలో ప్రవేశపెట్టాడు. (అందుకే రాబిట్స్ నుంచి రేబిస్‍ అనే పేరు) ఇది విజయవంతం కావడంతో మొదట ఎవరికి ఇవ్వాలనేది సమస్య. పైగా లూయిస్‍కు వాక్సిన్‍ ఇచ్చే చట్టబద్ద అర్వతలేదు. జోషెప్‍ మియిస్టర్‍ అనే 9 సం।।ల బాలునికి కుక్క కరువగా (వీధి కుక్కలు కరవడం సర్వసాధారణమే అయినా, ప్రపంచమంతా నాటువైద్యాన్నే నమ్మేవారు) అబ్బాయి తల్లిదండ్రుల్ని ఒప్పించి మొదటి వాక్సిన్‍ను 6.7.1885 ఇవ్వడం జరిగింది. అది విజయ వంతం కావడం, అబ్బాయి హాయిగా వుండడంతో లూయిస్‍కు ప్రపంచఖ్యాతి దక్కింది. లేకుంటే చట్టపరంగా శిక్షకు గురైయ్యేవాడు. (ముందుగా ఆయన కొడుక్కే ఇచ్చాడనే కథనం కూడా వుంది).


మశూచి మూడువేల సం।। క్రితమే భారత్‍లో, ఈజిప్టులో దాడి చేసినట్లు ఆధారాలున్నాయి. క్రీ.పూ. 1157 సం।।లో పరోహ రెన్స్ (Pharaoh Ranes-v) అనే రాజు మశూచి సోకి మరణించినట్లు ఈజిప్టు పిరమిడ్లలోని ‘మమ్మి’ ఆధారంగా గుర్తించారు. ఎడ్వర్డ్జెన్నర్‍ (1749-1823- ఆంగ్ల వైద్యుడు. మొదటి వాక్సినేషన్‍ను గుర్తించిన వ్యక్తి). టీకా (Vaccination) అనే విధానాన్ని గుర్తించి, ముందుగా మశూచికి టీకాను కనుగొన్నాడు. ఆవు పొదుగులో ఈ వైరసును గుర్తించి, అభివృద్ధి చేసి మనుషులపై ప్రయోగించాడు. ఇది రేబిస్‍కు ముందు ప్రయోగం కాబట్టి, టీకా ఎవరికి ఇవ్వాలనేది జెన్నర్‍కు సమస్యగా మారింది. జేమ్స్ పిప్స్ అనే 8 సం।। బాలునికి ముందుగా 14.5.1796న ఇవ్వడం జరిగింది. దీనికై నాటి సమాజాన్ని, తల్లి దండ్రుల్ని ఒప్పించడం జెన్నర్‍కు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే మశూచి టీకా ముందు మశూచిని కల్గిస్తుంది కాబట్టి!
ఇప్పుడు ఈ టీకా మందును పసిపిల్లలందరికి వేయిస్తున్నా, 1960-70 దశకం దాకా ఈ టీకాల్ని వేయించుకోవడానికి జనాలు ఇష్టపడక పోగా, పారిపోవడం, దాక్కోవడం జరిగేది. ఈ టీకా మందు కనిపెట్టిన 150 సం।।కు కూడా జనాలకు దీనిపట్ల అనేక అపోహలు వుండేవి. పైగా ఈ టీకాతో మశూచిని కల్గించి పిల్లల్ని చంపుతారనే వదంతులుండేవి. ఈ టీకా వేస్తున్నారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపేవారు కాదు.


(ఈ వ్యాస రచయిత కూడా బాల్య దశలో ఈ వదంతితో టీకాలు వేసుకోపోవడంతో తీవ్రమైన మశూచి వ్యాధికి గురైయ్యాడు). పిల్లలు అల్లరి చేస్తే టీకాలు వేయిస్తారని బెదిరించడం ఇప్పటికీ చూస్తాం. అలాగే చికెన్‍పాక్స్ లాంటి వ్యాధులు సోకితే ఆటలమ్మ, పోశమ్మ, కాశమ్మ కోపం అంటూ ముడుపులు కట్టే వారు. అత్యధికులు విద్యావంతులే కావడం గమనార్హం!
ఇలా అనేక ప్రయోగాల ఫలితంగా అభివృద్ధి చేసిన వివిధ రకాల టీకాలు, చుక్కల మందులు 21వ శతాబ్దపు మొదటి భాగం వరకు పిల్లలందరికి అందుబాటులోకి రాలేదు. దాదాపు 1980-90 దాకా పుట్టిన పిల్లలకు వేయించని స్థితే అధికం. ఇప్పటికి హెపటైటిస్‍ బి వ్యాధి సంబంధిత టీకాలు అందరికి అందు బాటులోకి రాలేదు. అలాగే హెచ్‍ఐవి (HIV) కి ఇంకా వ్యాక్సిన్‍ రాలేదు. ఇక కరోనా వాక్సిన్‍ గురించి తెల్సిందే! చాలా దేశాలు పోలియోకు సూది మందు వాడుతుంటే నిషేధిత చుక్కల మందుతోనే భారత్‍ కాలం గడుపుతుంది. రేబిస్‍, పాముకాటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే వుంటున్నది. దీనికి ప్రభుత్వం సంబంధిత మందుల్ని అందుబాటులో వుంచకపోవడమే కారణం! పాము కాటుకు మంత్రాలు పనిచేస్తాయని నమ్మే విద్యాధికులు కూడా అధికంగానే వున్నారు.


పెన్సిలిన్‍ సూదిమందు గూర్చి తెలిసిందే! ఇదో శిలీంద్ర సంబంధమైనది. రోగనిరోధక పరమైన ఈ మందు అందరికి ఇమడదు. డాక్టర్‍ పర్యవేక్షణలోనే దీన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని అభివృద్ధి చేసిన అలెగ్జాండర్‍ ప్లెమింగ్‍ (1881-1955 – స్కాటిష్‍ భౌతిక, సూక్ష్మజీవ శాస్త్రజ్ఞుడు) కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఇది వికటించి చనిపోవడం కూడా తెలిసిందే!


పై ఉదాహరణలు వేలాది శాస్త్రపరిశోధనలలో ఒకటి, రెండు మాత్రమే! క్రీ.పూ. నుంచి 19వ శతాబ్దం దాకా జరిగిన శాస్త్ర పరిశోధనలు, సిద్ధాంతాలు ఎన్ని రకాల అవాంతరాల్ని, ప్రాణత్యాగాల్ని చవిచూసాయో! ఎన్ని అగ్ని పరీక్షలకు నిలబడ్డాయో చెప్పడం కష్టమే! దీనికి చక్కని ఉదాహరణ రాజు పెట్టిన పరీక్షకు ఆర్కిమెడిస్‍ (క్రీ.పూ.288-212 – గ్రీక్‍ గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రజ్ఞుడు) నిలబడడమే. గణిత పితామహుడుగా గుర్తించబడ్డ ఈ శాస్త్రజ్ఞుడు భౌతిక, ఖగోళ శాస్త్రాల్లో కూడా ఆరితేరినాడు. గ్రీకు రాజు చేయించిన బంగారు కిరీటం స్వచ్ఛమైందో కాదో గుర్తించాలని ఆర్కిమెడిస్‍ను కోరగా, ఆ కిరీట స్వచ్ఛతను ఎలా పరీక్షించాలో మదన పడుతుంటే, నిత్యజీవిత అనుభవంతో అది కల్తీదని తేల్చాడు.

తాను రోజు స్నానం చేసే నీటి తొట్టిలో ఆర్కి మెడిస్‍ దిగినప్పుడు కొంత నీరు బయటికి దొర్లడం, అలా దొర్లిన నీటి ఘణపరిమాణానికి, తన శరీర ఘన పరిమాణానికి సమానమని, అలాగే నీటిలో వస్తువు మునిగినప్పుడు కొంత బరువును (ఊర్ధ్వముఖ పీడనం) కోల్పోతుందని, అలా కోల్పోయిన బరువు, ఆ వస్తువుచే తొలగించబడిన నీటి ద్రవ్యరాశికి సమానమని గుర్తించి, ఇదే సూత్రాన్ని కిరీటాన్ని పరీక్షించడానికి ఉపయోగించి, కల్తీదని తేల్చిన తెలివైన పరిశోధకుడు ఆర్కిమెడిస్‍. లీవర్‍ (lever), కప్పి (pulley) సూత్రాలకు ఆధ్యుడు. అద్దంతో సూర్యకిరణాలను పరావర్తనం చెందించి శతృ ఓడల్ని మండించిన సూత్రదారి. చివరికి రోమ్‍ జరిపిన దాడిలో ఆర్కిమెడిస్‍కు హాని తలపెట్టవద్దని రోమ్‍రాజు కోరినా సిపాయిలు ఆర్కిమెడిస్‍ను కూడా వదల కుండా చంపివేసారు.

తన ఆలోచనలకు గుర్తుగా తన సమాధిపై ఈటెను (spear), ఓ గొట్టాన్ని (cylinder) గుర్తులుగా పెట్టాలని కోరడం, ఆయన శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం. ఈ దృఢ సంకల్పమే ఆయన భూమిని ఎత్తి చూపుతాననే సవాళ్ళు విసిరేలా చేసింది. (తరువాయి వచ్చే సంచికలో)

డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *