బాసర ప్రస్తుతం నిర్మల్ జిల్లా(ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా)లో వుంది. బాసర నిజానికి ఒక ఊరు కాదు. ఐదు గ్రామాల సముదాయం. 1. బాసర, 2. రేణుకాపురం, 3. మహదాపురం, 4. రత్నాపురం, 5. మయిలాపురం. ప్రస్తుతం బాసర, మయిలాపురం మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన ఊర్లు రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి.
బాసరలో జ్ఞానసరస్వతిని వ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పబడుతున్నది. కాని, ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన కరికాళచోళ రాజైన రెండవ బిజ్జలదేవుడే ఇక్కడ ఆలయాలను నిర్మించినాడని చరిత్రకారులు అభిప్రాయం. తాను జైనుడు. అతని బావ వీరశైవప్రవక్త బసవేశ్వరుడు. వారి కాలంలో వీరశైవ ప్రాబల్యంవల్ల జరిగిన జైనం, శైవాల సంఘర్షణలకు దర్పణంగా వుంది బాసర. బాసర జ్ఞానసరస్వతి దేవాలయానికి వెనుకగా చిన్నగుట్ట మీద పాపహరేశ్వరాలయంగా పిలువబడే పురాతన శివాలయముంది. ఈ దేవాలయావరణలోని స్తంభశిలలు, శాసనస్తంభాలు, శిల్పాలు అన్నీ వేటికవి ప్రత్యేకమైనవి. రాష్ట్రకూటుల కాలం నుంచి వేములవాడ చాళుక్యుల వరకు వివిధ సందర్భాలలో ప్రతిష్టించబడిన దేవాలయాలు, కూల్చబడిన, మార్చబడిన జైనబసదులు, వీరశిలలు, సతిశిలలు, శాసనాలు, శిథిలాలు ఒకేచోట అగుపిస్తున్నాయి.

శిథిలాలయం: రాష్ట్రకూటుల నుంచి (అంతకుముందు కూడా) కాకతీయుల దాక లలాటబింబంగా చెక్కబడిన గజలక్ష్మి ఇక్కడి శిథిలదేవాలయపు ద్వారం మీద వుంది. జైనులైన రాష్ట్రకూటులు తాము నిర్మించిన గుడులమీద, శాసనాలమీద తామరపూలరేకులను చెక్కించడం ఒక ప్రత్యేకశైలిగా మనం గుర్తించవచ్చు. అదే శైలి ఈ దేవాలయం ఉత్తరాశిమీద కనిపిస్తుంది. సాధారణంగా జైన బసదుల ముందర వుండే శంఖలతాతోరణం, ఏనుగులున్న చంద్రశిల ఇక్కడ కనిపిస్తున్నది. ఏక, త్రికూట దేవాలయాల దేవతాధిష్టాన పీఠాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. రెండుచేతులున్న జైన గణపతి బయట కనిపిస్తున్నాడు. జైన నిశీథులు కూడా ఇక్కడ కనిపించాయి. జైన గురు పరంపరను తెలిపే జైన స్తంభమొకటి వుంది. రాష్ట్రకూటులకాలం నాటి రెండు గణపతివిగ్రహాలు అక్కడున్నాయి.
శైవం: రాష్ట్రకూటుల పిదప చాళుక్యులు రాజ్యపాలనకు వచ్చే సంధికాలంలో వీరశైవం విస్తరిం చింది. వీరశైవులు జైనులనెందరినో పట్టి పరిమార్చినట్టు శాసనాలు, గ్రంథాలు చెపుతున్నాయి. జైనబసదులెన్నో కూల్చబడ్డాయి లేదా శైవాలయాలుగా మార్చబడ్డాయి. ఇక్కడ కూడా అట్లాంటి సాక్ష్యాలు మనకు లభిస్తున్నాయి. ఎక్కడెక్కడో బయటపడివున్న విగ్రహాలను ఈ పాపహరేశ్వరుని ప్రాంగణంలోనికి చేర్చినట్టున్నారు. శైవానికి సంబంధించిన భైరవుడు, చాముండి దేవతలు, రెండు సమలింగాలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర భాగాలతో), నాగశిల్పాలు, పాతగర్భాలయానికి పెంచి కట్టిన రంగ, ముఖ మంటపాలు అగుపిస్తున్నాయి. దూరంగా దీపస్తంభమొకటున్నది.
వీరశిలలు: స్తంభం అడుగున ఒక కోడెదూడ, పైన చేతులు జోడించి కూర్చున్న భక్తురాలు, వీటిపైన శివలింగం, శివార్చన చేస్తున్న శైవగురువు కనిపిస్తున్న మూడు అంతస్తుల శిల్పాలున్న ఒక వీరశిలాస్తంభం కనిపిస్తున్నది. మరొక స్తంభం కూడా శాసనం, మూడు అంతస్తుల శిల్పాలున్నదే. ఈ స్తంభం మీద అడుగున ఇద్దరు ఖడ్గధారులు కుక్కతోపాటు కనిపిస్తున్నారు. 3వ మనిషి ఏదో ఆయుధంతో కనిపిస్తున్నాడు. వీరికి పక్కన కర్రకు తలకిందులుగా వేలాడదీయబడిన మరొక మనిషి వున్నాడు. శాసనంలో ఏమున్నదో తెలిస్తే ఈ శిల్పానికి అర్థం చెప్పవచ్చు. కాని, గద్వాలకు సమీపంలోని పూడూరులో జైనులను వధిస్తున్న శిల్పాలున్నాయి. శాసనాలున్నాయి. ఇక్కడ శిల్పాలకు వాటికి పోలికలు కనిపిస్తున్నాయి. ఇందులో వధింపబడుతున్నది జైనుడే కావచ్చు. రెండో అంతస్తులో ఒక భక్తుడు ఇద్దరు పరిచారకులు (అప్సరసలు)న్నారు. పై అంతస్తులో లింగం ముందర అర్చన చేస్తున్నట్టున్న భక్తుడు, లింగం వెనక లగుడధారి (లకులీశుడు?) కనిపిస్తున్నాడు. గుడిమంటపంలోని ఒక స్తంభంపై శివభక్తుడొకరిని చెక్కారు.
శాసనాలు: అక్కడి స్తంభాలమీద చెక్కిన శాసనాలలో 9వ శతాబ్దపు తెలుగులిపిలో 1. శ్రీవైశ్య కులతిలక… పయ సెట్టి, 2. స్వస్తిశ్రీ రేచయ్య కొట్టద్రమ్మ నూరు, 3. స్వస్తిశ్రీ బిజ్జకప్పియ్య కొట్టద్రమ్మ నూరు, (4. లిపి స్పష్టంగా కనిపించడం లేదు) అని వుంది. బినోలలో బాహుబలి అని అనుకుంటున్న శిల్పం బాహుబలిది కాదు, జైన తీర్థంకరుడు శాంతినాథునిది. శిల్పపాదపీఠం మీద ఒక ‘వైశ్యకులతిలకుడు’ చేయించిన శాంతినాథుని శిల్పమని రాసున్నది. ఇక్కడ కూడా ఒక శాసనంలో వైశ్యకులతిలక అనే మాట వుంది. గోదావరి అవతల బినోల, ఇవతల బాసరలలోని ఈ శాసనలిపులు ఒకే కాలానికి చెందినవి.

సతిశిలలు: అన్నింటి కన్నా ప్రత్యేకమైనవి ఇక్కడ కనిపిస్తున్న సతిశిలలు. తెలంగాణలో అరుదుగా కనిపించేవి సతి శిలలు. భర్తలు వీరమరణం పొందినపుడు సతీసహగమనం చేసిన స్త్రీలకు, ఆత్మాహుతి చేసుకున్న స్త్రీలకు సతిశిలలను నిలుపుతుంటారు. ఈ సతిశిలలను నిలిపే ఆచారం మనకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాతులలో ఎక్కువగా కనిపిస్తుంది.
మహిషాసురమర్దిని: ఇక్కడ కనిపించిన అన్నిశిల్పాలకన్న మిన్నయైన శిల్పం రాతిగుండుకు చెక్కిన మహిషాసురమర్దిని విగ్రహం. చతుర్భుజియైన ఈ దేవతకు వెనక కుడిచేతిలో గంట, ఎడమచేతిలో శంఖు వున్నాయి. ముందరి రెండుచేతులలో కుడిచేతిలోని శూలంతో మహిషాసురుని వధిస్తున్నట్టుంది. ఎడమచేయి దున్నపోతు రూపంలో వున్న మహిషాసురుని తోకపట్టి పైకిలాగినట్టుంది. ఎడమకాలితో మహిషం తలను తొక్కిపట్టినట్లున్నది. ఇటువంటి శిల్పం చాలా అరుదైనటువంటిది. తాంత్రికపూజలు చేసే వారు ఆరాధించే రూపమిది. సాధారణమైన మహిషాసురమర్దిని శిల్పానికి ఈ విగ్రహం భిన్నంగా వుంది.
బాసరకు వ్యాసపురి అని పేరుందని, వ్యాసుడిక్కడ తపస్సు చేసుకుంటు నివసించినందువల్ల ఆ పేరు వచ్చిందని జనాభిప్రాయం. అయితే జైన బసదులిక్కడ ఎక్కువగా వుండటంవల్ల బసది అనే పిలుపు ‘బాసర’ కావడానికి కూడా అవకాశముంది. ఈ శిల్పాలన్నింటిని తన క్షేత్రపర్యటనలో చూసింది, ఫోటోలు తీసింది మిత్రులు బాసర వాసి టీచర్ రామ్మోహన్, టీచర్ మాదారపు రామయ్య, భూపాలపల్లి గారలు. వారికి అభినందనలు.
బాసర-నల్లహనుమాన్ గుడి జైన శాసనం:
బాసరలోని నల్ల(కాలా)హనుమాన్ గుడిలో వీరగల్లుల పక్కన, ఒకమూల గోడకు ఒరిగించిపెట్టిన శాసన స్తంభాన్ని ఉపాధ్యాయుడు, చరిత్రాన్వేషి బలగం రామ్మోహన్ సార్ గుర్తించాడు. ఈ శాసనం గ్రానైట్ రాతిస్తంభం మీద చెక్కబడింది. శాసనం 14 పంక్తుల్లో వుంది. భాష కన్నడం. లిపి తెలుగన్నడం. శాసనలిపిని బట్టి ఈ శాసనం కళ్యాణీ చాళుక్యులకాలం నాటిది. గతంలో బాసరలో దొరికిన గుడిస్తంభాల మీద చెక్కబడ్డ లఘుశాసనాలలోని లిపిని పోలివుంది. శాసనంలో ఎక్కడా సం. పేర్కొనబడలేదు. ‘యమనేమ స్వాధ్యాయ ధ్యాన మోనానుష్టా(న) జప నేమ హోమసమాధి సంపన్నుడైన శ్రీమతు తామదత్తికి దాత రామస్వామి తాను బాసరలో కట్టించిన బసది, చేసిన ఈ ధర్మ(దాన) శాసనం ఆచంద్రార్కతారంబరాలుండేంత వరకు, 364దినాలు నిలిచివుండాలని కోరుకున్నట్టుగా శాసనంలో చెప్పబడ్డది. ఈ శాసనం వరంగల్ జిల్లా శాసనసంపుటిలో పేజీనం. 45లో, శాసన సంఖ్య 19, 2వ బైరాన్ పల్లి శాసనాన్ని పోలివుంది. 2వ బైరాన్‍పల్లి శాసనంలోని రెండవపక్క 4,5,6 పంక్తుల్లో ‘స్వస్తి యెమ నియమ స్వాధ్యాయ ధ్యాన మోనానుష్టాణ జప సమాధి శీల సంపన్నరప్ప శ్రీమతు గుణసేన’(జైనగురువు)కు ధారాపూర్వకంగా దానమిచ్చి నట్లుగా పేర్కొనబడింది. అందువల్ల ఈ శాసన విషయంతో పోలికవున్న బాసర శాసనం కూడా జైనశాసనమే. బాసరకు ఆ పేరు జైనబసదుల నుంచే వచ్చింది. బసదే కాలక్రమాన బాసరగా మారిపోయింది. శాసనపంక్తుల కింద ఆవు,దూడబొమ్మలు చెక్కివున్నాయి.

బాసర నల్ల(కాలా)హనుమాన్ గుడి శాసనపాఠం:
- స్వస్తి యమనేమ స్వాధ్యా
- య ధ్యాన మోనాను
- ష్టా(న) జప నేమ హోమ
- సమాధి సంపన్నరప్ప
- శ్రీమతు తామదత్తి బా
- సరేయ మున్నూఱ..
- అఱువత్తనాల్కునామా..
- హకేమాడిద దమ్మశాస
- న మీ(డేం)దాదిచంద్రార్కతార(0)
- బర రామస్వామి…డి కొట్ట
- దమ్మమన్తినేమనిలడపొరి
- ఖాయమ…నిన్నుమాడిదగొ
- క విలియునరెట్టయు
- మనెళి దిపొస…
శ్రీ రామోజు హరగోపాల్,
99494 98698