మరుపురాని మాదన్నపేట

ఇద్దరు మంచి మిత్రులు ఒక జంటగా క్షణం కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా తిరుగుతుంటే వారిని చూసి ‘‘వీరిద్దరూ అక్కన్న మాదన్నలురా’’ అని అరవై ఏండ్ల క్రిందట హైదరాబాద్‍ పాత నగరంలోని ముసలివారు ముచ్చటపడేవారు. కుతుబ్‍షాహీల కాలంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఏకాత్మస్వరూపులుగా, కృష్ణార్జునులుగా కలసి బ్రతికి కలిసి చనిపోయారు. మహామంత్రి మాదన్న నివసించిన ప్రాంతమే ‘‘మాదన్నపేట’’గా తర్వాత కాలంలో వర్దిల్లింది. పాతనగరం శాలిబండలో వీరు కట్టించిన అమ్మవారి దేవాలయాన్ని ప్రజలు ఇప్పటికీ అక్కన్న మాదన్నల దేవాలయమనే పిలుస్తారు. ఆ రోజులలో ఛత్రపతి శివాజీ మహారాజ్‍ కూడా ఆ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. శ్రీశైలంకు వెళ్లే దారిలో బార్కాస్‍ దాటిన తర్వాత వచ్చే మహేశ్వరం గ్రామంలో ‘‘మాదన్న సరాయి’’ (సత్రం) చాలా కళాత్మకంగా, విశాలంగా దారిన వెళ్లే యాత్రికులకు అలసట నుండి విశ్రమించే చల్లని చలువపందిరిలాగా దర్శనమిస్తుంది. చంచల్‍గూడా దాటి సైదాబాద్‍కు వెళ్తుంటే మార్గమధ్యంలో ఈ మాదన్న పేట బస్తీ వస్తుంది. ఇంతకూ ఎవరీ మాదన్న? ఏమా కథ?
కుతుబ్‍ షాహీ నవాబులలో ఆఖరివాడైన అబుల్‍ హసన్‍ తానీషాకు ఈ మాదన్న ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆ రోజులలో ప్రధాన మంత్రి పదవిని పీష్వాఅని లేదా మీర్‍ – జుమ్లా అని అనేవారు. ఈ పదం ఆసఫ్‍జాహీ నవాబుల కాలంలో దివాన్‍గ మారింది. ‘‘ఇంతింతై వటుడింతై’’ అన్నట్లు పిన్న వయస్సులోనే అతి చిన్న ఉద్యోగిగా సర్కారు వారి కొలువులో జీవితాన్ని ప్రారంభించిన మాదన్న 34 సంవత్సరాల తర్వాత 1674 నుండి 1686 వరకు పుష్కర కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసి తెలంగాణా చరిత్రకు తిలకం దిద్దాడు. కాని ఏం లాభం! మధురమైన జీవితాల కథ ఇంతేనా అన్నట్లు ఆయన అంతిమ జీవితం విషాదాంతంగా ముగిసింది.


హనుమకొండలో బానయ్య బానమ్మ అను బ్రాహ్మణ దంపతులకు నలుగురు కొడుకులు. అక్కన్న, మాదన్న, విస్సన్న, మల్లన్న, బానయ్య రెవెన్యూశాఖలో గిర్దావర్‍గ అంటే రెవెన్యూ ఇన్‍స్పెక్టరుగ పనిచేసేవాడు. వీళ్లు పదహారణాల తెలుగువారు. అక్కన్న మాదన్నల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మెదక్‍ జిల్లా సిద్ధిపేట తాలూకాలోని అనంతగిరి వీరి స్వగ్రామమని, పట్వారీల కుటుంబమని ఒక కథ ప్రచారంలో ఉంది. అసలు అక్కన్న, మాదన్నలు అన్నదమ్ములే కాదని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది.


మాదన్న చాలా పెద్ద హృదయంతో అనంతగిరిలో ఒక సత్రాన్ని నడుపుతూ ఉండేవాడట. చాలా మంది యాత్రికులు వచ్చి స్నానాలు, భోజనాలు కానిచ్చి విశ్రాంతి తీసుకుని తెల్లారి వెళ్లిపోయేవారట. కాని అక్కన్న అనే యాత్రికుడు వచ్చి షడ్రసోపేతమైన భోజనాలను ఆరగించి అక్కడే తిష్టవేసి కదలకుండా ఎక్కడికీ వెళ్లకుండా పనివాళ్లపై, వంటవాళ్లపై పెత్తనాలు చేస్తూ ఆజ్ఞలు జారీ చేయటం ప్రారంభించాడు. అతను యజమాని మాదన్నకు దగ్గరి బంధువు కాబోలు అనుకుని పనివారందరూ బెదిరిపోయి చెప్పిన పని కిక్కురుమనకుండా చేసేవారట. అతడి పెత్తనాలను గమనించిన మాదన్న తన భార్యవైపు బంధువు అనీ, ఆ ఇల్లాలేమో భర్తవైపు దగ్గర చుట్టమని అనుకున్నారట. కొన్ని రోజుల తర్వాత ‘‘అనుకోకుండా అకస్మాత్తుగ ఊడిపడిన ఈ అతిథికి’’ ఎవరివైపు ఏ చుట్టరికమూ లేదని తెలుసుకున్న మాదన్న ‘‘అయ్యా మహానుభావా తమరు ఎవరు?’’ అని ప్రశ్నించాడట. దానికి అక్కన్న చాలా ధాటీగా ‘‘మనమిద్దరం అన్నదమ్ములం కాదా? నేను పెద్దక్క పెద్దకొడుకును. నీవు చిన్నక్క చిన్న కొడుకువు’’ అని గడుసుగా జవాబిచ్చాడట. అతని సమయస్ఫూర్తిని, చాతుర్యాన్ని మెచ్చుకున్న మాదన్న అతనిని తన దగ్గరే పెట్టుకున్నాడట. అట్లావారు ఉదరపోషణార్థమై పిన్న వయసులోనే హైద్రాబాద్‍ నగరానికి వలస వచ్చి నవాబు అబుల్‍ హసల్‍ తానీషా వారి దర్బారులో 1640 సం।।లో చిరుద్యోగులుగా చేరారట. అప్పుడు వారి నెలజీతం పది రూపాయలు. ఒకొక్క అడుగు భద్రంగా వేసుకుంటూ గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆ సోదరులిద్దరూ నీతి, నిజాయితీ అంకిత భావాలతో, కష్టపడి 34 సంవత్సరాలు సర్కారీ కొలువులు చేసి 1674లో మాదన్న ప్రధానమంత్రిగా, అక్కన్న పేష్కారుగా అంటే ఆర్థిక శాఖా మంత్రిగా స్థిరపడినారు.

ఆనాటి నవాబు అబుల్‍ హసన్‍ తానీషా ‘‘షియా’’ మతస్తుడు. షియాలకు పరమత సహనం ఎక్కువ. హిందూ ముస్లింలను రెండు కండ్లుగా భావించటం వలన వారికి ప్రతిభ ఆధారంగా ప్రభుత్వంలో అత్యున్నత కొలువులు అందివచ్చాయి.
పన్నెండు సంవత్సరాల ‘‘పుష్కరకాలం’’ కొలువులో ఆ అపూర్వసోదరులు రాజకీయాలు, పరిపాలన, ఆర్థిక రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. వారి పాలనలో రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లింది. ప్రజలు సుఖశాంతులతో జీవించారు.


ఢిల్లీ చక్రవర్తి ఆలంగీర్‍ ఔరంగజేబు పాదుషాకు గోల్కొండ రాజ్యంపై కన్నుకుట్టింది. దక్కన్‍లో ఇటు శివాజీ అటు గోల్కొండ నవాబులు కంటిలో నలుసులుగా మారారు. కోడిపిల్లలను తన్నుక పోయే గ్రద్ధలాగా కుట్రలు, కుతంత్రాలు ప్రారంభించాడు. తానీషా నవాబుకు కుడి ఎడమలా నిరంతరం కాపలా కాస్తున్న అక్కన్న మాదన్నలను అంతమొందిస్తే గోల్కొండ రాజ్యలక్ష్మి తన వశమౌతుందని తెలుసుకున్నాడు. సైన్యాన్ని మొహరించి కోటను చుట్టుముట్టి భీకరమైన దాడులు చేయటమే గాక కోటలోపల అంతపురంలో అంతరంగిక కలహాల ‘‘చాణక్య చిచ్చును’’ రగిలించాడు. అంతూపొంతూ లేని తమ భోగ, విలాసాలపై, ఖర్చులపై పొదుపు చర్యల క్రింద వారు కోతలు విధించారని రాణులందరికీ అక్కన్న మాదన్నలంటే మహాకోపం. ఔరంగజేబుకు అమ్ముడు పోయిన సైన్యాధికారులు కొందరు కోటలోపల చాపక్రింద నీరులా విస్తరించ సాగారు. వారందరూ కల్సి ఆ అపూర్వ సోదరులిద్దరినీ అంతమొందించాలని కుట్రపన్నారు.


ఔరంగజేబు తన ఆఖరిపాచికగా మతాన్ని రెచ్చగొట్టాడు. అతను సున్నీమతస్తుడు. షియాకు వ్యతిరేకి. షియా పాలకుడైన తానీషా హిందూ కాఫిర్‍లను మంత్రులుగా నియమించుకుని ఇస్లాం మతాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడని గోల్కొండ కోటలోపల తన రహస్య అనుచరులతో చిచ్చు రగిలించాడు. తక్షణమే అక్కన్న మాదన్నలను మంత్రి పదవులనుండి తొలగించాలని తానీషాకు హుకుంజారీ చేశాడు. ప్రతి సంవత్సరం భదాద్రిలో జరిగే సీతారామ కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపే తానీషా నవాబు ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేశాడు.
కాని క్యా ఫాయిదా?
దుష్ట శక్తులన్నీ ఏకమయ్యి జమ్షీద్‍ అను ఒక హబ్సీ సైనికుణ్ణి అన్నదమ్ముల హత్య కోసం నియమించారు. డబ్బు నీళ్లలా ఖర్చుచేశారు. అక్కన్నమాదన్నల అంగరక్షకుల్ని, వారి పల్లకీ మోసే బోయీలను కూడా డబ్బులతో కొనేసారు. కుట్ర అమలు చేయటానికి సర్వం సిద్ధం అయ్యింది.
ఒకానొక అసురసంధ్యవేళ, నలుమూలలా సంజెచీకట్లు కమ్ముకుంటున్న వేళ, పక్షులన్నీ తమ తమ నెలవులకు చేరుకుంటున్న వేళ, పసువులు ఇండ్లు చేరుతున్న గోధూళి వేళ, మసీదులతో అజాలు, నమాజులు వినవస్తున్న వేళ, గుడులలో గంటలు గణగణ మ్రోగుతున్న వేళ, పనులు ముగించుకుని పల్లకీలో అన్నదమ్ములిద్దరూ తమ ఇంటికి తిరిగి వెళ్లుతున్న వేళ విశృంఖలంగా విచ్చుకత్తులతో దాడి జరిగింది. తల్వార్లు, జంబియాలు వికటాట్టహాసం చేసాయి. స్వామి భక్తిపరాయణులైన ఆ ఇద్దరి తలలు క్రిందికి రాలి నేలతల్లికి రక్తాభిషేకమూ, పాదాభివందనమూ చేసాయి. ఆ దుర్దినాన్ని 1687 సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ అంటారు.


పగ, ప్రతీకారాలు చల్లారని ఆ ముష్కర మూక తలలు లేని ఆ మొండాలను త్రాళ్లతో గుర్రాలకు కట్టి పురవీధులలో అటు, ఇటూ ఈడ్చుకెళ్లి గోల్కొండ కోట గుమ్మం వద్ద తలుపులకు తల క్రిందులగా వ్రేలాడదీసారు. షోలాపూర్‍లో విడిది చేసిన ఔరంగజేబుకు వారి తలలను మూటగట్టి కానుకగా పంపారు. ఆనందం భరించలేని ఔరంగజేబు వారి తలలను మళ్లీ మదపుటేనుగులతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు. ఆ తారీఖు మార్చి 23. చనిపోయిన తర్వాత శత్రువునైనా గౌరవించి ఉచిత లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలన్న ఇంగిత జ్ఞానం ఆ ఆలంగీరు చక్రవర్తికి లేకపోయింది. అబుల్‍ హసన్‍ తానీషా రెక్కలు తెగిన పక్షిలా మూలకొరిగాడు.


అంతర్జాతీయంగానే అందమైన భాగ్యనగరం, పూదోటల పొదరిల్లు భాగ్‍నగర్‍, విశాలమైన విఫణి వీధులతో, అంగళ్లలో వజ్రాలు, ముత్యాలు, అగరుపొగల అత్తరులు అమ్మబడిన హైద్రాబాద్‍ నగరం రెండు మేరు శిఖరాలు నేలకూలగానే దోపిడీలకు, దౌర్జన్యాలకు ఆలవాలమయ్యింది. గుండాలు, సంఘవ్యతిరేక శక్తులు నగరాన్ని విచక్షణా రహితంగా దోచుకున్నాయి. రాజభవనాలు, దేవుడీలు, మహళ్లు, ధనికుల గృహాలు దోపిడీలకు గురైనాయి. గృహదహనాలు జరిగాయి. ప్రజల మానప్రాణాలు గాలిలో కలిసాయి.

అంతా కలిపి ఐదుకోట్ల వరహాల నష్టం జరిగిందని ఒక అంచనా. అది ఒక్కరోజులో జరిగిన నష్టం. అప్పుడు ఔరంగాజేబు నగర ప్రవేశం చేసి గోల్కొండ కోటపై తన ఆఖరి దాడిని ప్రారంభించాడు. అయినా గొప్ప ప్రతిఘటన ఎదురైంది. చివరికి ఒక చీకటి రాత్రి కోట తలుపువద్ద కాపలా ఉన్న ఒక ద్వారపాలకుడికి లంచం ఆశ చూపించి తలుపులు తెరిపించి ఢిల్లీ సైన్యం కోట లోపలికి చొచ్చుక పోయింది. విజయం సాధించిపెట్టిన ఆ దర్వాజాకు ఔరంగజేబు ‘‘ఫతేదర్వాజా’’ అని నామకరణం చేసాడు. అది హుసేనీ ఆలంకు దగ్గర ఉంటుంది.


తమ కన్రెప్పల్ని కత్తిరించుకుని కాలానికి కాపలాకాసిన ఆ అపూర్వసోదరులు అక్కన్న మాదన్నల సమాధులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కాని వారి స్మృతులు పురజనుల మనసులలో భద్రంగా వసివాడకుండా ఉన్నాయి. ఒక మాదన్న పేట, ఒక మహేశ్వరం సరాయి, ఒక అక్కన్న మాదన్నల దేవాలయం వారి తీపిగుర్తులకు కొండగుర్తులుగా మిగిలి ఉన్నాయి.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *