మూసిలావిడ-సొరకాయ బుర్ర

చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక ముసలావిడ ఉండేది. ఆమెకు పుట్టెడు గూని ఉండేది. ఆ ముసలావిడ రెండు కుక్కలను పెంచేది. వాటిని లింగు, లిటుకు అంటూ ముద్దుగా పిలిచేది. ఒకసారి ఆ ముసలావిడకి తన మనుమరాలిని చూడాలనిపించింది. మనుమరాలి ఊరికి వెళ్లాలంటే అడవిదాటి వెళ్లాలి.


‘ముసలిదాన్ని, నన్నెవరేం పీక్కుతింటారు’ అని బయలు దేరింది. వెళ్ళేముందు తన కుక్కలను పిలిచి ‘‘నేను లేనని ఊరు పట్టుకు తిరగకండి. ఇంటి పట్టునే ఉండండి’ అని చెప్పింది. ‘సరే’ అంటూ లింగు, లిటుకు తలూపాయి.


ముసలావిడ బయలుదేరింది. కర్రపోటు వేసుకొంటూ అడవిదారిలో నడవ సాగింది. నాలుగడుగులు వేసిందో లేదో ఎక్కడ నుంచో వచ్చి ఒక నక్క ఆమెకు అడ్డంగా నించుంది. నక్కనుచూసి ముసలావిడ ఒక బోసి నవ్వు నవ్వింది.


‘పదిరోజుల నుంచీ ఆకలితో నకనకలాడి పోతున్నాను. దేవుడు పంపినట్లు వచ్చావు. నిన్ను తినేసి మూడురోజులపాటు హాయిగా నిద్దరపోతాను’ అంది నక్క.


ముసలావిడకి కాళ్ళలో వణుకు పుట్టింది. తెలివిగల ఘటం కాబట్టి వెంటనే సర్దుకుంది. ‘నన్ను సరిగ్గా చూడు, నా వంట్లో చటాకు మాంసం లేదు. గిద్దెడు నెత్తరు లేదు. నన్ను తింటే నీ ఆకలి తీరదు. నాలుగు రోజులు ఓపిక పట్టు. నా మనుమరాలి ఇంటికి వెళ్ళి బాగా తిని బలిసి వస్తాను. నా కోసం ఇక్కడే కనిపెట్టుకొని ఉండు. అప్పుడు నన్ను తిందువుగాని’ అంది.


నక్క కాసేపు ఆలోచించింది. చివరికి ‘సరే, నీ మాట నమ్మి నిన్ను వదిలిపెడుతున్నాను. బాగా తిని బలిసి రావాలి’ అంటూ చెట్లలోకి వెళ్ళి పోయింది.


‘హమ్మయ్య. గండం గడిచింది’ అనుకొంటూ ముసలావిడ ముందుకు పోసాగింది. కాస్త దూరం నడిచిందో లేదో, పెద్దగా గాండ్రిస్తూ ఒక పులి వచ్చింది. ముసలావిడని చూడగానే పులికి నోట్లో నీళ్ళూరాయి. ‘నరమాంసం తిని నాలుగు నెలలయింది. నిన్ను వదలను. కమ్మగా భోంచేస్తాను’ అంది పులి.


పులి మాటలు వినగానే ముసలావిడకి ప్రాణం పోయినంత పని అయింది. అయితే వెంటనే తేరుకొంది. ‘చూడు పులిరాజా, ఎముకల పోగులాగ ఉన్న నన్ను తింటే నీకు రుచీ పచీ ఉండదు. నేను నా మనుమరాలింటికి వెడుతున్నాను. అక్కడ ముప్పొద్దులా సుష్టుగా తిని వంటికి కాస్త కొవ్వు పట్టించుకొని వస్తాను. అందాకా నా కోసం ఇక్కడే వేచివుండు. అప్పుడు నీకు నేను నోటికి హితవుగా ఉంటాను’ అంది.


కళ్ళలో ప్రాణాలు పెట్టుకొన్న ఆ ముసలావిడని చూశాక, పులికి ఆవిడ మాటలు వచ్చాయి. ‘సరే, ఇక్కడే నీ కోసం కాచుకొని ఉంటాను’ అంటూ వెళ్ళి పోయింది.

‘బ్రతుకు జీవుడా’ అనుకొంటూ ముసలావిడ ముందుకు కదిలింది. కర్ర ఊతంతో మెల్లిమెల్లిగా నడుస్తూ అడవి చివరకి వచ్చేసింది. ‘ఏలాగో అలాగ అడవిదాటి నట్టే’ అనుకొంటూ, ఆయాసం తీర్చుకోవడానికి కాసేపు ఒక చెట్టు క్రింద చతికిలపడింది.


చెట్టుమీంచి ఒక ఎలుగుబంటి ఆమె ముందుకి దూకింది. ముసలావిడని చూస్తూనే లొట్టలు వేసింది. ‘‘నిన్ను ఇప్పుడే తినేస్తాను’’ అంటూ ఆమెమీద పడబోయింది.


‘ఆగు! తొందరపడకు. నన్ను చూడు ఎలా ఎండి పోయి ఉన్నానో! నన్ను తింటే నీకు పళ్ల నొప్పులు తప్ప ఆకలి తీరదు. కాస్త ఓపిక పట్టు. అదిగో ఆ కనిపించేదే నా మనుమరాలి ఊరు. నేను అక్కడికే వెడుతున్నాను. అక్కడ నాలుగు రోజులపాటు బాగాతిని రుబ్బురోలులా తయారయి వస్తాను. అప్పుడు నన్ను తిందువుగాని’ అంది ముసలావిడ.


ఎలుగుబండి కాసేపు బుర్ర గోక్కుంటూ ఆలోచించింది. తరువాత ముసలావిడ కళ్ళలోకి చూస్తూ ‘సరే అలాగే కానీ, నీ కోసం ఎదురుచూస్తూ ఈ చెట్టుమీదే ఉంటాను. నువ్వు మటుకు బాగా తిని బలిసిరావాలి’ అంది.


‘తప్పకుండా వస్తాను’ అంటూ ముసలావిడ అడవి దాటిది. మనుమరాలి ఇంటికి వెళ్లింది. అక్కడ రోజూ మిఠాయిలు, పెరుగు, నెయ్యి విసుగు విరామం లేకుండా తింది. దాంతో ఆవిడ బాగా లావయింది. ఇంకా తింటూ కూచుంటే ఫఠ్‍మని పేలి పోతానేమోనని ముసలావిడకి భయం పట్టుకొంది. అందుకే ‘ఇహ నేను మా ఊరు పోతాను. ఇంతలావు శరీరాన్ని మోసుకొంటూ నడవలేను. దొర్లుకొంటూ పోతాను. అయితే తోవలో నా కోసం ఎలుగు బంటి, పులి, నక్క ఆవురావురు మంటూ ఎదురుచూస్తున్నాయి. ఏదో ఒక దాని నోట్లో పడి చావక తప్పదు’ అంటూ ముసలావిడ కళ్లనీళ్లు పెట్టుకొంది.


నువ్వు బెంగ పెట్టుకోకు. నిన్ను మీ ఊరు క్షేమంగా చేర్చే పూచి నాది’ అంది మనుమరాలు. తరవాత ఆ అమ్మాయి అడవి లోంచి ఒక రాక్షసి సొరకాయ బుర్రను తెప్పించింది. ముసలావిడను దాంట్లో పడుకోమంది. ఆవిడ కిందామీదాపడి ఎలాగయితేనేం, ఆ సొరకాయ బుర్రలో ఇరికింది. తోవలో తినడానికి ఇన్ని ద్రాక్షపళ్లు ఆ సొరకాయ బుర్రలో పెట్టింది మనుమరాలు. తరవాత దానిమూతి మందపాటి బట్టతో మూసేసింది. ఆ బుర్రను అడవి అంచుకు దొర్లించుకుంటూ వెళ్ళింది. అక్కడ దాన్ని గట్టిగా ఒక తాపు తన్నింది. వెంటనే ఆ బుర్ర గునగున దొర్లుకొంటూ అడవి తోవలో పోసాగింది.


దొర్లూ దొర్లూ సొరకాయబుర్రా
తోవంతా నీదే సొరకాయబుర్రా
ద్రాక్షలు తింటా సొరకాయబుర్రా
గింజలు ఊస్తా సొరకాయబుర్రా
ఇంటికి చేరేను ముసల్దీ
బాగా బలిసిన ముసల్దీ

అని పాడుకొంటూ ఆ ముసలావిడ సొరకాయ బుర్రలో దొర్లుకొంటూ పోసాగింది. కొంతదూరం పోగానే ముసలావిడ కోసం ఆబగా ఎదుచుచూస్తున్న ఎలుగుబంటి ఎదురయింది. దానికి ముసలావిడ కనిపించలేదు. కానీ దొర్లుకుంటూ పోతున్న సొరకాయ బుర్రకనిపించింది. సొరకాయ బుర్రను ఆపి అటూ ఇటూ దొర్లించింది. ఏమీ కనిపించలేదు. ముసలావిడ పాట మటుకు వినిపించింది. బాగా బలిసిన ముసల్ది ఇంటికి పోయిందని వినిపించగానే ఎలుగుబంటికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ కోపంతో సొరకాయ బుర్రను సాచి ఒక్క తన్ను తన్నింది. వెంటనే సొరకాయ బుర్ర దొర్లుకుంటూ ముందుకు పోయింది.


అలా సొరకాయ బుర్ర దొర్లుకుంటూ పోతూనే ఉంది. ఇంతలో హఠాత్తుగా పులివచ్చి సొరకాయ బుర్రకు ఎదురుగా నించుని దాన్ని ఆపింది. పులికి పాట వినిపిస్తోంది. కానీ మనిషి కనిపించటం లేదు. ముసల్ది ఇంటికి చేరింది అని వినగానే కోపంతో గట్టిగా గాండ్రించింది. ‘ఈ పనికిరాని సొరకాయ బుర్రనాకెందుకు’ అని దాన్ని బలంగా ఒక్క తన్ను తన్నింది. సొరకాయ బుర్ర వేగంగా దొర్లుకుంటూ ముందుకు పోయింది.
‘ఇహ ఊరు దగ్గరపడ్డటే’ అని హాయిగా నిట్టూర్చింది ముసలావిడ. ఇంతలో నక్క వచ్చి సొరకాయ బుర్రకు ఎదురుగా నించుంది. పాటను అది శ్రద్ధగావింది. మనిషి కోసం అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. ‘ఆ ముసల్ది ఈ సొరకాయ బుర్రలోనే దాక్కొని ఉంటుంది. ప్రపంచం లోని జిత్తులన్నీ తెలిసిన నాకే టోకరా ఇద్దామను కొంటోంది’ అనుకొంటూ ఆ సొరయా బుర్రను గోళ్ళతోగీకి, పళ్ళతోపీకి పగల గొట్టింది. దాంతో ఆ బుర్రలో ఉన్న ముసలావిడకి బయటకు రాక తప్పలేదు.


‘బలే బలిశావు. నిన్ను చూస్తుంటే నోరు ఊరి పోతోంది. ఇహనా కన్ను కప్పిపారిపోలేవు. నిన్నిప్పుడే తింటాను’ అంటూ ముసలావిడ మీద పడింది.
ముసలావిడ ప్రాణం మీద ఆశవదులుకుంది. ఎలాగో తంటాలు పడి గొంతు పెగుల్చుకొని నక్కతో ఇలా అంది ‘నన్ను నువ్వు నిక్షేపంగా తినవచ్చు. అసలు నేను అందుకేగా వచ్చింది. అయితే ఒక్క మనవి. చచ్చేముందు దైవప్రార్థన చేసుకొని చచ్చిపోవడం మా ఆచారం. ఒక్కసారి నా ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటాను’’.


‘సరే, ఏ దేవుణ్ణి తలుచుకుంటావో నీ యిష్టం. అదేదో తొందరగా కానీ’ అంది నక్క.
ముసలావిడ నక్కకు కొంచెం దూరంగా వెళ్లింది. కళ్ళు మూసుకుంది.
‘‘లింగూ, లిటుకూ రారండీ
మీ అమ్మను తీసుకుపోరండీ’’
అంటూ గట్టిగా పాడింది. ఆ పాట లింగు, లిటుకులకు వినిపించింది. అవి భీకరంగా అరుస్తూ క్షణాలమీద ముసలావిడ దగ్గరకు వచ్చాయి. వాటిని చూస్తూనే నక్క హడలిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. ముసలావిడ లింగు, లిటుకులను ప్రేమగా దువ్వింది.


చౌదరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *