వరిలో వచ్చే చీడ పీడలు – నివారణ

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంటలలో విస్తీర్ణం పరంగా వరి మొదటిస్థానంలో ఉంటుంది. వరిని వివిధ జిల్లాల్లో వాటికి అనువైన నేలల్లో సాగుచేస్తారు. తెలంగాణలో ప్రధానమైన ఆహారపంట కాబట్టి వరిలో అధిక దిగుబడినిచ్చే రకాలు వాడకంలోకి వస్తున్నాయి. (ఆర్‍ఎన్‍ఆర్‍15048, కెఎన్‍ఎం 118, జెజిఎల్‍ 18047)
వరిని ఖరీఫ్‍, రబీ కాలంలో సాగుచేయడం వలన వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ళు ఆశించడం వలన దిగుబడులు తగ్గుటకు కారణమవు తున్నాయి. అందులన అధిక దిగుబడులను సాధించడానికి చీడపీడలను, తెగుళ్ళను నివారించాలి.


వరిని ఆశించే పురుగులు, నివారణ:
వరిని ఆశించే పురుగులలో చాలా ముఖ్యమైనది ‘కాండం తొలుచు పురుగు’ ఈ పురుగు ఖరీఫ్‍ మరియు రబీ పంటపై ఆశిస్తూ ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది ఒకేపంటపై ఆశించడం వలన దీనిని ‘మోనోఫాగస్‍ పెస్ట్’ అంటారు.
ఈ పురుగు వరి పంటను ‘పిలకలు వేసే దశ’ లేదా ‘చిరుపొట్ట దశ’లో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. పిలకలు వేసే దశలో ఆశించిన యెడల మొవ్వలు ఎండిపోతాయి. దీనినే ‘డెడ్‍హార్టస్’ అంటారు. ఈ మొవ్వలను లాగితే తేలికగా ఊడివస్తాయి.
ఈ పురుగు చిరుపొట్ట దశలో లేదా కంకి బయటకు వచ్చే దశలో ఆశించినట్లయితే తయారవుతున్న గింజలకు పోషకాలు అందక తాలు గింజలుగా మారి ‘తెల్లకంకి’ ఏర్పడుతుంది.
నివారణ:
వేసవి లోతు దుక్కులు చేయాలి. వరి నాటడానికి ముందు నారు కట్టల కొనలను త్రుంచి నాటినట్లయితే ఆకు చివరభాగానపెట్టిన గుడ్లను నాశనం చేయవచ్చు.
వరి పంటను కోసేటప్పుడు, మొక్క మొదళ్ళ వరకు ముందు కోసినట్లయితే తర్వాత పంటపై ఆశించే కాండము తొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
ఈ పురుగు నివారణకు రసాయనిక మందులైన క్లోరిపైరిఫాసి 2.5 మి.లీ. మోనోక్రోటోఫాస్‍ 2. మి.లీ. ఎసిఫేట్‍ 1.5 గ్రా। లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


వరి ఉల్లికోడు :
ఈ పిల్లపురుగులు గ్రుడ్డు నుండి బయటికి వచ్చిన వెంటనే కాండంలోకి చొచ్చుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతాయి. ఈ పురుగు సోకిన అంకురం ఆకుగా అభివృద్ధి చెందక ఉల్లికాండం మాదిరి పొడవుగా గొట్టం లాగా మార్పు చెంది బయటకు వస్తుంది. ఈ గొట్టం చివర చిన్న ఆకు ఉంటుంది. దీనిని ‘సిల్వరఘాట్‍’ అంటారు.
ఈ పురుగు పైరు లేత దశలో ఆశించినట్లయితే పురుగు సోకిన దిగువ నుండి ఎక్కువగా పిలకలు వస్తాయి. ఈ దుబ్బుల నుండి కంకులు రావు.
ఈ పురుగు నారుమడి నుండి పిలక దశ వరకు పంటను ఆశించి నష్ట పరుస్తాయి. ఉల్లికోడు తీవ్రత ఆలస్యంగా నాటిన వరిపైరులో ఎక్కువగా ఉంటుంది.
నివారణ:
వరి పైరును ముందుగా నాటుకోవాలి. వరి నాటిన 10-15 రోజుల తర్వాత 1 ఎకరాకు 10-12 కిలోల కార్భొప్యూరాన్‍ 3 గ్రా।। గుళికలు లేక 5-6 కిలోల ఫారేట్‍ 10-గా గుళికలను వేయాలి.


సుడిదోమ:
పిల్ల & పెద్ద పురుగులు వరి దుబ్బు మొదళ్ళకి అనగా నీటి పై భాగాన ఉన్న మొదళ్ళకు గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చుట వలన మొక్కలు మొదట పసుపు రంగులోకి మారి తర్వాత సుడలుగా ఎండిపోతాయి. దీనిని ‘హాపర్‍బర్న్ లేక సుడితెగులు’ అంటారు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పైరు మొత్తం ఎండిపోతుంది.

నివారణ:
సుడిదోమను నివారించుటకు ప్రతి 2 మీటర్లకు 20 సెంటిమీటర్ల కాలిబాటను వదలాలి. దీనినే ‘అల్లీస్‍’ అంటారు.


తాటాకు తెగులు / హిస్పా :
గ్రుడ్డు నుండి బయటకు వచ్చిన గొంగళిపురుగు ఆకు పొరల మధ్యలోకి చేరి ఆకుపచ్చని పదార్థాన్ని గోకి తింటుంది. దీనివలన ఆకుపై దీర్ఘచతురస్రాకారపు చారలు గమనించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండిపోతాయి. దీనివలన పొలంను దూరం నుండి చూసినట్లయితే సున్నం వేసినట్లుగా కనిపిస్తుంది. దీనినే ‘సున్నపు తెగులు’ అంటారు.

నివారణ:
ఈ పురుగు నారుమడిలా ఆశించినట్లయితే నారు నాటే ముందు కొనలను త్రుంచి వేయాలి. రసాయనిక పురుగు మందులైన మోనోకోటోఫాన్‍ 2. మిలీ. క్లారిఫైరిఫాస్‍ 2.5 మిలీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


రెల్లారాల్చు పురుగు / ఆర్మివార్మ్:
గొంగళిపురుగు గింజగట్టిపడే దశలో పైరును రాత్రివేళలో ఆశించి కంకులను కత్తిరించివేస్తాయి. కంకులు రాలిపోతాయి.
గొంగళిపురుగులు పగటి పూట మొక్క మొదళ్ళలో పిలకల మధ్య దాగి రాత్రిపూట పైరుపై ఆశించి ఎక్కువనష్టాన్ని కలుగ జేస్తాయి.
గొంగళిపురుగులు కంకులు బయటకు రాకముందు ఆకులను ఆశించి నష్టపరుస్తాయి.
నివారణ:
ఈ పురుగు నివారణ కోసం చేసే ఏ పద్ధతులైననూ సాయంత్రం వేళలో చేపట్టాలి.
రసాయనిక పురుగు మందులైన క్లోరిఫైరిఫాస్‍ 2.5 మి.లీ., మోనోక్రోటాఫాస్‍ 2.మి.లీ. క్వినాల్‍ఫాస్‍ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


ఆకుచుట్టుపురుగు:
గొంగళిపురుగు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి గొట్టంలాగా చుట్టుకొని అందులో ఉంటుంది. ఈ గొట్టము సన్నటి ఊలుదారంతో నీటిపై తేలుతూ వ్రేలాడుతుంది. ఈ విధంగా పురుగు ఒక దుబ్బునుండి మరొక దుబ్బుకు చేరుకుంటుంది.
పురుగులు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై అడ్డంగా చారలు ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు నీటిపై తేలియాడుతున్న గొట్టాలను గమనించవచ్చు.
నివారణ:
పైరు పిలక దశలో ఉన్నపుడు కొబ్బరితాడుతో చేనుకు అడ్డంగా 2-3సార్లు లాగితే పురుగులు క్రింద పడిపోతాయి. తర్వాత నీటిని తీసివేయాలి.
పురుగుమందులైన క్లారిఫైరిఫాసి 2.5 మి.లీ., మోనో 2 మిలీ /లీటర్‍కు పిచికారి చేయాలి.
వరిపై ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనది అగ్గి తెగులు.


అగ్గితెగులు వరిపై మూడు దశలలో ఆశిస్తుంది. నారుమడి, పిలకదశ, వెన్నువేసే దశలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది.
లీఫ్‍ బ్లాస్ట్, నోడి బ్లాస్ట్, నెక్‍ బ్లాస్ట్ ఈ ‘3’ దశల్లో లక్షణాలను చూపిస్తుంది. మొదటి దశలో ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుమొత్తం ఎండిపోతుంది. రెండవదశలో కణుపుల వద్ద గోధుమరంగు మచ్చలు ఏర్పడి కృశించిపోతుంది. మూడవదశ చాలా ప్రమాదకరమైనది. ఇది దిగుబడిని తగ్గిస్తుంది. పంటకోతకు వచ్చే దశలో వెన్ను చివర గోధుమరంగు మచ్చ ఏర్పడి అక్కడ నుండి కంకి విరిగిపోతుంది. దీనివలన దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.


అగ్గితెగులు నివారణకు ట్రైస్లైక్లజాతి 06.గ్రా.ను పిచికారి చేయాలి. వరిలో ఆశించే తెగుళ్ళను నివారించడానికి విత్తనాలను విత్తేముందు థైరామ్‍ లేదా కాప్టాన్‍ 3 గ్రా।7 / కి.గ్రా విత్తనాలను కలిపి విత్తనశుద్ధి చేయాలి. దీనివలన విత్తనం ద్వారా వ్యాప్తిచేందే తెగుళ్ళను నివారించ వచ్చు. పంటపై ఆశించే పురుగులను నివారించుటకు కొన్ని రకాల పంటలను పర పంటగా అక్కడక్కడా వేయడం వలన ఉధృతి తగ్గించవచ్చును.
పొగాకు లద్దె పురుగు నివారణకు ‘ఆముదం’ వేసుకోవాలి. శనగపచ్చ పరుగుకు ‘బంతి’ని పత్తిలో లేతదశలో పచ్చదోమను నివారించుటకు ‘బెండ’ను వేసుకోవాలి.


-కుల శ్రీనివాస్‍, ఆర్‍. శ్రీనివాస్‍,
బి.విఎస్‍ కిరణ్‍
ఫోన్‍: 8121990380,
944183748

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *