అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-6 జినవల్లభుని మూడుభాషల కుర్క్యాల శాసనం (క్రీ.శ.940)


ఆ శాసనం ఎర్రటిరంగు పులుముకొన్న బొమ్మల నడుమ ఉంటుంది. కొంచెం కష్టపడి, కొండెక్కితేగానీ కనిపించదు. ఆ శాసనం క్రీ.శ.940-45 మధ్య కాలంలో చెక్కబడింది. అప్పటి ప్రజలకు అర్థమయే తెలుగు, కన్నడ భాషల్లోనూ, పండితులకర్థమయే సంస్కృతంలోనూ, అధికారిక సమాచార పత్రంగా ప్రకటించబడింది. వెయ్యేళ్లకు పైగా, అక్కడే అక్షర రూపంలో నున్న ఈ శాసనం, ఒకనాటి చారిత్రక సంఘటనకు మౌనసాక్షిగా ఇప్పటికీ నిలిచే ఉంది. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే జానపద గాధల్ని, పాటల్ని సేకరించే నిమిత్తం తెలంగాణలోని ఊరూ, వాడా తిరుగుతున్న ఆచార్య బిరుదురాజు రామరాజుగారి దృష్టికి రాగా, ఆయన ద్వారా తెలుసుకొన్న. డా. నేలటూరు వెంకటరమణయ్యగారు ఆ శాసన వివరాలను ‘భారతి’లోనూ, డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు, ఇన్సుక్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍ : కరీంనగర్‍ డిస్ట్రిక్టు (1974) లోనూ, ఆ తరువాత, డా. మలయశ్రీ, మోదుగుల రవికృష్ణ లాంటి పరిశోధకులు ఎంతో మంది ఈ శాసనంపై వ్యాసాలను ప్రచురించారు. వివరాల్లోకెళితే..


క్రీస్తు శకారంభంలో విదేశీపాలకులు మనదేశాన్ని ఏలినపుడు, స్థానిక ప్రజల సౌకర్యం కోసం, ఇంకా వారి అభిమానాన్ని సంపాదించటం కోసం స్థానిక భాషతో పాటు మరో భాషను కూడా ముద్రించిన నాణేలను చలామణిలోకి తెచ్చిన చారిత్రక ఆధారాలున్నాయి. మనదేశంలో గ్రీకు రాజ్యాన్ని సుస్థిరపరచిన వాడు డెమెట్రియస్‍. క్రీ.పూ. 1శతాబ్దిలో, అతడు విడుదల చేసిన నాణేల పైన ఒక వైపు విదేశీ గ్రీకు, మరో వైపు దేశీయ ప్రాకృత భాషల్లో చిన్నశాసనాలు ముద్రించటం ప్రారంభమైంది. ఇదే సంప్రదాయాన్ని కుషాణులు కూడ అనుసరించారు. మనదేశంలో తొలిసారిగ బంగారు నాణేల్ని విడుదల చేసిన కుషాణరాజు వీమాకాడపైసిస్‍, తన నాణేలపైన ఒకవైపు గ్రీకు భాషలో ‘బసిలియోస్‍ ఓమాకాడ్‍ఫైసిస్‍’ అనీ, రెండో వైపు ఖరోష్టి లిపి, ప్రాకృతభాషలో ‘రాజాధి రజస సర్వలోక ఈశ్వరస మహాశ్వరస ‘వీమాకాడ్‍ఫైసిస్‍’ అన్న శాసనాలున్నాయి. ఎక్కడదాకో ఎందుకు? తెలుగునేలను పాలించిన శాతవాహన చక్రవర్తి వాశిష్టీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.90-116) విడుదల చేసిన వెండినాణెం ఒక వైపు రాజు బొమ్మ, బ్రాహ్మీలిపి, ప్రాకృత భాషలో ‘సిరిశాతకనిస రణో వసిటిపుతస’ అనీ, రెండో వైపు బ్రాహ్మీలిపి, దేశీభాషలో ‘అరహనకు వహిమకనకు తిరుపుడుమావిస’ అన్న శాసనాలున్నాయి. ఇలా రెండు భాషల శాసనాలున్న నాణేలు బ్రిటీషు ఇండియా పాలన వరకూ కొనసాగాయి.


ఇక శాసనాల విషయానికొస్తే శాత వాహనులు, ముందు ప్రాకృతం తరువాత సంస్కృత భాషల్లో, విడివిడిగా శాసనాలను విడుదల చేయగా, ఇక్ష్వాకులు, ఆ తరువాతి రాజులు అదే ఒరవడిని కొనసాగించారు. తెలంగాణ నుంచి క్రీ.శ.4-6 శతాబ్దాల్లో పాలించిన విష్ణుకుండిలు, ప్రాకృత, సంస్కృత మిశ్రమంగా ద్విభాషా శాసనాలను విడుదల చేశారు. విష్ణుకుండి విక్రమేంద్రవర్మ చిక్కుళ్ల రాగిరేకు శాసనంలో, ప్రాకృత, సంస్కృత భాషలతో పాటు, తొలిసారిగా ‘విజయరాజ్య సంవత్సరంబుల్‍’ అన్న రెండు తెలుగు పదాలు కనిపించటంతో, కొందరు పరిశోధకులు ఇదే దక్షిణ భారతదేశంలో విడుదలైన తొలి త్రిభాషా శాసనమని ప్రతిపాదించారు. ఈ శాసనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.


ఇక, ఇప్పటి కుర్క్యాలశాసనం, మునుపటి కరీంనగర్‍ జిల్లా, గంగాధర మండలం కుర్యాలలో (జిన) బొమ్మలగుట్టపై చెక్కబడింది. వేములవాడ చాళుక్యరాజైన రెండోఅరికేసరి (క్రీ.శ.930-58) ఆస్థానకవి, కన్నడంలో మహాభారతాన్ని విక్రమార్జున విజయం పేరుతో రచించిన పంపకవి సోదరుడైన జినవల్లభుడు వేయించిన శాసనం. ఈ శాసనం, తెలుగునేలపై సంస్కృత, కన్నడ, తెలుగు భాషల్లో వెలువడిన పూర్తి నిడివిగల తొలి శాసనంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ కంటే వందేళ్ల ముందే తెలంగాణాలో మొట్టమొదటిసారిగా, కంద పద్యాలనందించిన శాసనం, నన్నయ ఆదికవి కాదన్న నిజాన్ని నిరూపించిన శాసనం. ఈ మాట నేనంటున్నది కాదు. మహామహులైన డా. నేలటూరి వెంకటరమణయ్య, డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి లాంటి ప్రామాణిక శాసన పరిశోధకులన్నమాట. ఇదే బాట పట్టిన తెలుగు భాష పండితులంటున్న మాట. ఈ సందర్భంగా, వేంగీచాళుక్య రాజైన గుణగవిజయాదిత్యుని (క్రీ.శ.848-892) సేనానాయకుడైన పండరంగడు, ఆంధప్రదేశ్‍లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో వేయించిన శాసనంలో ‘తరువోజ’ చందస్సులో తెలుగు పద్యాలు ఉండటం వల్ల, అద్దంకి శాసనమే తొలి తెలుగు పద్య శాసనంగా గుర్తింపు పొందిన విషయాన్ని ప్రస్తావించాలి.


ఆ తరువాత సీసం, మధ్యాక్కర ఛందస్సులో పద్యాలున్న ప్రకాశం జిల్లా కందుకూరు, ధర్మవరం, కృష్ణా జిల్లా బెజవాడ యుద్ధమల్లుని శాసనాలను కూడ చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా క్రీ.శ.9-10 శతాబ్దాలకు చెందినవే.
11 పంక్తుల కుర్క్యాల శాసనం, 14 అడుగుల 5 అంగుళాల పొడవు, 4 అడుగుల వెడల్పుతో చెక్కబడింది. అర అంగుళం ఎత్తున్న అక్షరాలు రెండో అరికేసరి వేములవాడ శాసనాక్షరాల్ని పోలి ఉన్నాయి. ‘ఓం నమఃసిద్ధేభ్యః’ అన్న సంస్కృత నమస్కార పదంతో ప్రారంభమై, కన్నడ వచనం, తరువాత రెండు శార్దూల విక్రీడితాలు, ఒక సంస్కృత వృత్తాలు, తరువాత నాలుగు చంపకమాల, ఒక మత్తేభ విక్రీడితం, ఒక తరళంతో కన్నడ వృత్తాలు, మూడు కందపద్యాలతో తెలుగు, చివరగా మళ్లీ కన్నడ వచన భాగాలను కలిగి ఉంది. శాసనాక్షర స్వరూపంలో, ఐ, ఈ లలో పెద్ద తేడా లేక పోయినా, ఒక్కోసారి ‘ఈ’ అక్షరం గుడి కిందికి తిరిగినట్లుగా ఉంది. ‘మ’ ‘వ’ అక్షరాలు విడిగానూ, రేఫంతో కలిసినపుడు భిన్న రూపాల్లో ఉన్నాయి. ‘ర’ అక్షరం, ‘ఈ’ అక్షరానికి దగ్గరగా ఉంది.


శాసన మూలపాఠం
ఓం నమః సిద్ధేభ్యః! స్వస్తి సమస్త సకళ కళా కళాప ప్రవీణం భవ్యరత్నాకరం
గుణ పక్షపాతి బెంగినాడ సప్తగ్రామ గళొళ గణ వంగిపఱ్ఱ
కమ్మె బ్రాహ్మణం జమదగ్ని
పంచార్షేయం శ్రీవ్సతగోత్రం గుణ్ణికఱ్ఱ నిడుంగొణ్ణె యభిమాన
చన్ద్రన మమ్మo
భీమపయ్యన బెళ్వొల దణ్ని గెఱ్ఱెయ జోయిస సింగన మమ్మ
ళబ్బణబ్బెయ మగం
కొణ్డకున్దెయ్య దేసిగ గణద పోత్థగెయ బఱియ పండరంగ
పల్లియ జయణన్ది సిద్ధాంతి
భటారర గుడ్డం జినవల్లభం సబ్బినాడ నట్టునడువణ
ధమ్మపురదుత్తర దిగ్భాగద
వృషభగిరి యెంబ నాది సంసిద్ధ తీత్థ ద దక్షిన దిశా భాగదీ
సిద్ధ శిలె యెళ్తమ్మ
కులదైవ మాద్యస్త జినబింబగళుమం చక్రేశ్వరి యుమం
పెఱవుం జిన ప్రతిమెగళు
మం త్రిభువన తిలకమెంబ బసతి యుమం కవితా గుణాణ్న
వమెంబ కెరెయుమం
మదన విళాసమెంబ బనముమం మాడిసిదం!

 1. భ్రాత ద్ధమ్మ పురం ప్రయామకిమతో జైనాభిషేకోత్సవ
  క్షీర ప్లావిత తుంగ శృంగ వృషభ క్షోణీంద్ర మీక్షామహో
  యాత్రా యాత సమస్త భవ్య జనతా సన్మాన దానోధ్యతం
  పంపాయ్యా నుజమత్రభీమతనుజం సమ్యక్త్వ రత్నాకరం।।
 2. గీతం గాతుమనేక భేద సుభగం కావ్యాని సోచ్చావచం
  వాచావాచయితుం ప్రియాణివదితుం సాధూపకర్తుం సతాం
  భోగ్యాన్సేవితుమంగనా రమయితుం పూజా విధాతం జినే
  జానీతే జినవల్లభఱ్పిర మితం పంపాభిదానానుజః।।
 3. అజస్ర జిన వన్దనాగత మునీశ్వర శ్రావక
  ప్రజాస్తవ రవ ప్రతి ధ్వనిత శబ్ద కోళాహళైః
  అధిష్ఠిత దిగంబరో వృషభ శైల ఏష
  స్వయం వరాం వదతి వాచకాభరణ కీతి మాకళ్పతః।।
 4. బగెయ లళుంబమీ బగెయ నాబ్బ గెవొబ్బ గె గాసె యల్తుది
  ట్టగె పొలనల్తు నీళ్దసఱిమోళ్జిన బింబమ నీత నీగళె
  న్తగఱిసి దొప్పనెన్దు బగెవన్నె వరం జిన బింబమల్లి తొ
  ట్టిగె నెగఱ్దిఱ్దివేం చరిత మచ్చరియో జినవల్లభంద్రనం।।
 5. ఇదు కవితా గుణార్ణవన కీర్తియ మూర్తి వొలాగి దక్షిణా
  ర్ధద వృషభాద్రి యక్కె వృషభేశ్వర బింబ సనాధమెంబలం
  పొదవె నిజ ద్విజావసధ పర్వతమం జిన చైత్యమాగె మా
  డిద జినవల్లభంగె జినవల్లభు నప్పుదు మొన్దు చోద్యమో।।
 6. చదురమమ్మెయ సత్కవిత్వద సన్దీ పంపన తమ్మనో
  ర్వదె పొగఱ్తెయ బాజి సల్పరె యల్కవిత్వద తత్వ దొ
  ళ్పుదిదు నేర్వడె పేఱిలుర్విగ పూర్వమాగిరె బల్లొన
  ప్పుదఱి నొర్వనె వాగ్వధూవర వల్లభం జినవల్లభం।।
 7. వినుత చళుక్య వంశపతి మిక్కరి కేసరి సన్ద విక్రమా
  ర్జున విజయక్కె ధర్మపుర మెన్దు మదేయమిదెన్దు కీర్తి శా
  సన మెనె కొట్టి శాసనద పంపన నంబిదుదొన్దు జైన శా
  సనద నెగఱ్తెయం వృషభ పర్వత మన్తదు తానె పేఱితే।।
 8. ఎసగెల్లాళితపు గల్పతంగ కిరణం సారల్మిగం పాఱలా
  గసదొళ్పక్కి గళల్లి సల్ల వెనిసిఱ్రిన్యోదయం ధర్మదొ
  ళ్జసమయం పొపురి మాడె మెచ్చి హరిగం పంపంగె గొట్టా ద్విజా
  వసధ గ్రామ మదేన్నెగఱ్తెయ కళాప గ్రామయం పొల్తుదో।।
 9. బరదుదెతాంబ్ర శాసమదేయమె ధర్మపురం నెగఱ్తె వె
  త్తరిగ (న?) కొట్టుదే నెగఱ్దిద పంపన పెత్తుదె పేఱి మెన్దు నీ
  మ్మరుళె పలర్మెయుం పలబరం బెసగొళ్ళదె పోగినోడ సు
  న్దర వృషభాచళోన్నత శిళాతళ డొళ్బరె దక్కరంగళం।।
 10. కన్దం।।జినభవనంబు లెత్తించుట జినపూజల్సేయు చున్కి
  జినమునులకు నత్తిన యన్నదానం బీవుటం జినవల్లభు
  బోలంగలరె జినధమ్మ పరుల్‍ ।।
 11. దినకరు సరి వెల్గుదుమని జినవల్లభు నెట్టు నెత్తు
  జిత కవిననను మనుజుల్గలరే ధాత్రిం వినతిచ్చుదు
  ననియ వృత్త విబుధ కవీంద్రుల్‍ ।।
 12. ఒక్కొక్క గుణంబు కల్గుదు రొక్కణ్డిగా
  కొక్కలక్క లేవెవ్వరి కిం లెక్కింప
  నొక్కొ లక్కకు మిక్కిలి గుణపక్షపాతి
  గుణమణి గుణంబుల్‍ ।


పై శాసనం ప్రకారం, జినవల్లభుడు, వేంగినాడులోని వంగిపఱకు చెందినవాడు, గుండికఱ సీమలోని నెడుంగొండకు చెందిన అభిమానచంద్రునికి బెల్వొలలోని అణ్ణిగెరెకు చెందిన జ్యోతిష్యుడు సింగుని మనుమడు. భీమపయ్య, వబ్బణబ్బేల కుమారుడు. కొండకుందాన్వయ, దేశిగణ, పొత్తిగబళి అనుబంధంగా, పండరంగవల్లికి చెందిన జయంగొండ సిద్ధాంత భటారుని శిష్యుడు, విక్రమార్జున విజయం రాసిన పంపకవి సోదరుడు. అతనికి సకలకళాప్రవీణ, భవ్యరత్నాకర, గుణపక్షపాతి అనే బిరుదులున్నాయి. అతడు సంగీత విద్వాంసుడు. పద్యాలను హృద్యంగా చదువగల నేర్పరి. జినవల్లభుడు అన్ని కళలలో ఆరితేరినవాడు. అందుకనే అతన్ని వాగ్వధూవరవల్లభుడంటారు.


జనవల్లభుడు జైన దేవాలయాలను నిర్మించి, కులదైవాలైన ఆద్యంత జినులు (ఆదినాధ, మహావీరులు), చక్రేశ్వరి, ఇంకా ఇతర దేవతలను సబ్బినాడులోని ధర్మవురానికి ఉత్తరంగా ఉన్న సిద్ధశిల పైన ప్రతిష్టించాడు. జినునికి చైత్యాలయాన్ని కట్టించాడు. ఆ కొండపైన వృషభేశ్వరుణ్ణి (ఆదిజినుడు) చెక్కించి, భరతఖండం దక్షిణాన వృషభ గిరిగా పేరొచ్చేట్లు, ఇంకా ‘కవితాగుణార్ణవ’ బిరుదాంకితుడైన పంపని సంతోషింప జేశాడు. వృషభగిరికి సమీపంలో, త్రిభువన తిలకమనే బసదిని నిర్మించి, కవితాగుణార్ణవ అనే చెరువును తవ్వించి మదన విలాసమనే ఉద్యానవనాన్ని పెంచాడు. జినభక్తుడైన జినవల్లభుడు, జైనమునులను సత్కరించి, వారికి ఇష్టమైన ఆహారసదుపాయాన్ని కల్పించాడు. వృషభాద్రి దగ్గర, జైన అభిషేక ఉత్సవాన్ని నిర్వహించి, అక్కడికొచ్చిన భవ్యజనులైన జైనులకు కానుకలందించాడు. హరిగ, అరిగ అని పిలువబడిన చాళుక్యవంశస్తుడైన అరికేసరి, విక్రమార్జున విజయాన్ని రాసిన పంపకవికి, కలాపగ్రామాన్ని తలపించేట్లు, బ్రాహ్మణులుండే అగ్రహారంగా ప్రకటించి, ధర్మవురాన్ని దానం చేశాడు. ఎవరైనా, ఈ దానాన్ని గురించి రాగిరేకు శాసనముందా అని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నించిన వారికి ఈ శాసనాన్ని చూపించమని సలహా నిచ్చాడు. ఎవరు రాశారో తెలియదుగానీ, ఈ శాసనాన్ని ఎఱియమ్మ అనే శిల్పి చెక్కాడని చెప్పబడింది.


కన్నడ ఆదికవిగా పేరుగాంచిన, పంపని గురించి సమాచారా న్నందిస్తున్న ఈ తెలంగాణ శాసనం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చారిత్రక ప్రాధాన్యతని సంతరించుకొంది. జినవల్లభుని లేక పంపని వంశాను క్రమణికను, ఇంకా పంపని కులం, మతం, జన్మ స్థలం, ఆయన పూర్వకుల గురించిన వివరాలను తొలిసారిగ అందిస్తున్న శాసనంగా, ఈ శాసనం గుర్తింపు పొందింది. ఈ శాసనంలో, జినవల్లభుడు కమ్మె – బ్రాహ్మణ కులానికి చెందినట్లు చెప్పబడింది. అంటే గుండ్లకమ్మ ప్రాంతపు కమ్మనాటికి చెందిన బ్రాహ్మణుడని అర్థం. జినవలభుడు, పంపనలు, విశ్వబ్రాహ్మణ కులానికి చెంది ఉంటారన్న శ్రీరామోజు హరగోపాల్‍ గారి అభిప్రాయాన్ని కూడ పరిశీలించాల్సి ఉంది.
ఈ శాసనంలోని వేంగినాడు, గోదావరికృష్ణా నదుల మధ్య ప్రదేశంగానూ, గుండికఱ, గుంటూరు జిల్లాలోని గుండికర్రుగానూ, సబ్బినాడు, సబ్బిసాయిరంగా పేర్కొనబడిన కరీంనగర్‍ ప్రాంతంగానూ, బెల్వొల, కర్ణాటకలోని ధార్వాడ్‍ జిల్లాలోని బెలువలగానూ, అణ్ణిగెరెని, ధార్వాడ్‍ జిల్లా, నావులగుండ తాలూకాలోని అణ్ణిగెరెగానూ వెంకట రమణయ్యగారు గుర్తించారు.


శాసనంలోని వృషభాద్రిని, కరీంనగర్‍ – కామారెడ్డి మార్గంలోని బొమ్మలగుట్టగానూ, అలానే, ధర్మవురాన్ని, ధర్మపురిగానూ అను కొన్నారు. శాసనంలోని త్రిభువనతిలకమనే జైనబసది ఆనవాళ్లు కోల్పోయింది. బొమ్మలగుట్టకు దిగువన ఉత్తరంవైపున గల చెరువును కవితాగుణార్ణవ తటాకంగా గుర్తించారు. వంగిపఱను, గుంటూరు జిల్లా, బాపట్ల సమీపంలోని వంగిపఱ్ఱుగా గుర్తించినా, నిడుగొండి ఆచూకీ ఇంకా తెలియటంలేదు. ఇక శాసనంలో పేర్కొన్న అరికేసరి, వేములవాడ చాళుక్యరాజైన రెండోఅరికేసరి, రెండో నరసింహుడు, జాకవ్వెల కుమారుడు.
కన్నడ ఆదికవి పంపని గురించి, ఆయన పూర్వీకుల గురించే కాక, తెలుగు భాష, పద్య పక్రియ గురించిన అమూల్యమైన సమాచా రాన్నిచ్చి, ఆంధ్రుల ఆదికవి నన్నయ కంటే నాలుగు తరాల ముందే తెలంగాణలో పద్యకవిత్వం ఉందన్న నగ్న సత్యాన్ని అందించి, మొదటి సారిగ మూడు భాషలకు పట్టం కట్టిన ఈ శాసనం, అలనాటి తెలంగాణ మేటి శాసనంగా తన కీర్తిని మరింత ఇనుమడింజేసుకొంది. శాసన పరిశోధకులు కీ.శే.బిరుదురాజు రామరాజు, ఎన్‍. వెంకటరమణయ్య, పి.వి. పరబ్రహ్మశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, బి.ఎన్‍.శాస్త్రి, డా. కె. మునిరత్నంరెడ్డి, ఇంకా ప్రముఖ సాహితీవేత్త డా. మలయశ్రీ, శ్రీరామోజు హరగోపాల్‍, మోదుగుల రవికృష్ణ గార్లకు నాకృతజ్ఞతలు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *