బెస్తవాడు నీటిదయ్యం


చైనా దేశంలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చుట్టూ ఒకనది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక నీటి దయ్యం ఉండేది. ఆ దయ్యం ఏ మనిషి నయినా నదిలోకి లాగి చంపితేచాలు. దాని దయ్యం బతుకు ఆ మనిషికి వస్తుంది. అదేమో మళ్లీ మనిషిగా పుడుతుంది. అయితే ఆ ఊరు మరీ గొడ్డు పల్లెటూరు కావడం వల్ల పొరుగూరు వారెవ్వరికీ ఆ ఊరికి వచ్చే అవసరమే ఉండేది కాదు. ఇహ ఆ ఊరివారు ఎన్నడయినా నది దగ్గరకు వచ్చినా ఏదో ఒడ్డున కాసేపు కూర్చుని పోయేవారు కానీ, లోపలికి దిగేవారు కాదు. దాంతో ఆ దయ్యానికి తన దయ్యపు బ్రతుకు వదిలించుకోవడానికి వీలు లేకుండా పోయిది.
ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక బెస్తవాడు మటుకు వారానికి రెండు రోజులు చేపలు పట్టడానికి నదిమీదకు వచ్చేవాడు. వాడిని చంపడానికి దయ్యం నానా తిప్పలూ పడేది. వాడు నదిమీద ఉన్నప్పుడు నదికి పొంగు తెప్పించి, వాడి పడవకు కన్నంపెట్టి ఇలా నానా తంటాలు పడేది. ఆ బెస్తవాడు చాలా తెలివిగలవాడు. అందువల్లే వాడు ప్రతీసారీ ఎలాగో అలాగ ప్రాణాలు దక్కించుకొనేవాడు.


ఒకనాడు మామూలుగానే బెస్తవాడు చేపలు పట్టడానికి నది మీదకు వచ్చాడు. ఆ రోజు వాడిని ఎలాగయినా చంపి తన దయ్యం బతుకు వాడికి అంటగట్టాలని దయ్యం తీర్మానించుకొంది. అందుకే ఆ రోజు ఒక్క చేపను కూడా వాడి వల దగ్గరకు రానీయకుండా తరిమికొట్టింది. చేపలు దొరికితేగానీ తిండి గడవని ఆ బెస్తవాడు పొద్దు పోతున్నా చేపలకోసం నది మీదే ఉండిపోయాడు. బాగా చీకటి పడ్డాక ఆ దయ్యం వాడి పడవలోకి ఎక్కింది. అడుగులో అడుగు వేసుకుంటూ వాడి వెనక్కి వెళ్ళి, దభీమని వాణ్ణి నీళ్ళలోకి తోసేసింది. వెంటనే తనూ దూకి వాణ్ణి బుడుంగు బుడుంగుమని మూడుసార్లు నీళ్ళలో ముంచింది. తరవాత వాణ్ణి ఒడ్డుకు లాక్కొచ్చి వాడి మొహానికి ఇంత బురద పులిమి వాడినోట్లో దయ్యపు గుర్తింపు పత్రం పెట్టింది.


వెంటనే సంతోషంతో దయ్యాల రాజు వద్దకు పరుగులు తీసింది. అయితే బెస్తవాడు నిజంగా చావలేదు. దయ్యం తనని నీళ్ళలోకి ముంచినప్పుడు ఊపిరి బిగబట్టి చచ్చిపోయినట్టు నటించాడు. అంతే. దయ్యం కనుమరుగవగానే వాడు గభాలున లేచి కూర్చున్నాడు. నోట్లో ఉన్న దయ్యపు గుర్తింపు పత్రాన్ని బొడ్లోదోపుకొని ఉరుకులు పరుగుల మీద ఇంట్లోకి వచ్చిపడి తలుపులు బిడాయించు కొన్నాడు.


ఇంతలో దయ్యాలరాజు సభకు వెళ్ళిన నీటిదయ్యాన్ని ఆరోజు తలవాచేటట్లు చీవాట్లు పెట్టాడు. బెస్తవాడు చచ్చిపోలేదని చెప్పాడు. మనుషుల దగ్గర దయ్యపు గుర్తింపు పత్రం ఉండకూడదనీ అదిగనక బెస్తవాడి దగ్గరే ఉండిపోతే నీటి దయ్యం ఎప్పటికీ దెయ్యంగానే ఉండిపోతుందనీ భయపెట్టాడు. దాంతో దయ్యం గుండెలు గుభేలు మన్నాయి. అది ఒక్క అంగలో నది దగ్గరికి వచ్చింది. అక్కడ దానికి బెస్తవాడు కనిపించలేదు. వెంటనే బెస్తవాడి ఇంటికి వెళ్ళింది. తన గుర్తింపు పత్రం ఇచ్చేయమని వాడి కాళ్ళా వేళ్లా పడింది. బెస్తవాడికి కూడా దయ్యాన్ని చూస్తే జాలి వేసింది. అయినా తను చేపలు పట్టడానికి వచ్చిన ప్రతీసారీ తన వలను చేపలతో నింపుతానని మాట ఇస్తేనే గుర్తింపు పత్రం ఇస్తానని షరతు పెడతాడు. మరో గత్యతంతరం లేక నీటి దయ్యం అందుకు ఒప్పుకుంది.


కాలం గడిచే కొద్ది బెస్తవాడు, దయ్యం మంచి మిత్రులయ్యారు. మంచి రుచికరమైన చేపల్ని దయ్యం వాడి వలలోకి తరిమేది. వాడి పడవలో కూర్చుని వాళ్ళిద్దరూ గంటలకొద్దీ ముచ్చట్లు చెప్పుకొనేవారు. అప్పుడప్పుడు బెస్తవాడు దయ్యాన్ని తన ఇంటికి భోజనానికి కూడా పిలిచేవాడు. భోజనం చేస్తూ ఇద్దరూ కష్టం సుఖం చెప్పుకునేవారు. ఒకనాడు బెస్తవాడి ఇంటికి భోజనానికి వచ్చిన నీటిదయ్యం ఇలా అంది.
‘‘మిత్రమా! ఇహ రేపటితో నాకు ఈ దయ్యపు చెర వదిలి పోతుంది. రేపు ఓ ముసలావిడ నదిదాటి పొరుగూరు వెడుతోంది. ఆవిడ తెప్ప నది మధ్యకు రాగానే, ఆవిణ్ణి నీళ్ళలోకి లాగి చంపేస్తాను’’.
ఈ సంగతి వినగానే బెస్తవాడి గుండెల్లో రాయి పడింది.
‘‘మిత్రమా! నీకు దయ్యపు బతుకు కష్టంగానే ఉంటుంది. ఒప్పుకుంటాను. కానీ మన స్నేహం గురించి ఆలోచించు. అదీగాక నువ్వెళ్ళిపోతే నాగతేమవుతుంది. చెప్పు’’ అన్నాడు.


నీటి దయ్యం కాసేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చుండి పోయింది. తరవాత గిన్నెలో ఉన్న చేపల పులుసును గడగడా తాగేసింది. గొంతు సర్దుకుని.
‘‘సరే, ఇంకో మూడేళ్ళపాటు దయ్యంలాగే ఉండిపోతాను’’ అంది. ఆ మూడేళ్ళలో వాళ్ళిద్దరూ ప్రాణమిత్రులయ్యారు. రోజూ దయ్యం బెస్తవాడి ఇంటికి వచ్చేది. వాడు చేపలతో రకరకాల వంటలు చేసి దానికి పెట్టేవాడు. భోజనం అయిపోయిన తరవాత కూడా, బాగా పొద్దు పోయేదాకా ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకొంటూ కూర్చునేవారు.


మూడేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఒకనాడు దయ్యం నీటి అడుగున ఉన్న తన ఇంటికి బెస్తవాణ్ణి విందుకు పిలిచింది. ‘‘మిత్రమా! ఇదే ఆఖరి విందు. రేపు మీ పక్కింటావిడ చాంగ్‍షాన్‍ నదిలో దూకి చస్తోంది. ఇహ నా దయ్యపు బతుక్కి తెరపడుతుంది’’ అంది.
బెస్తవాడికి ముద్ద నోటికి పోలేదు. విచారంతో మొహం రంగులు మారింది.
‘‘ఏం ఎందుకు చస్తోంది ఆవిడ?’’ అన్నాడు.
‘‘ఏం లేదు, మొగుడూ’ పెళ్ళాల కీచులాట.’’
రేపు బాగా ముదిరి పాకాన పడుతుంది. అందుకే ఆవిడ వచ్చి నదిలో దూకుతుంది’’.


ఇంటికి వెళ్ళిన బెస్తవాడికి, మనసు మనసులో లేదు. పక్కింటి చాంగ్‍షాన్‍ వాడికి బాగా తెలుసు. ఆవిడ చస్తే ఆవిడ భర్త రెక్కలు విరిగిన పక్షిలా అవుతాడు. పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు. అందుకే చాంగ్‍షాన్‍ని ఎలాగయినా కాపాడాలనుకున్నాడు. నీటి దయ్యానికి కోపం వచ్చి తనకు చేపలు అందనీయక పోయినా పరవాలేదను కున్నాడు. తెల్లవారకముందే వెళ్ళి నది ఒడ్డున కూర్చున్నాడు. కాస్త పొద్దు తిరగగానే చాంగ్‍షాన్‍ ఏడుస్తూ నది దగ్గరికి వచ్చి ఒక్క గెంతులో నదిలోకి దూకింది. బలమైన కెరటాలు ఆమెను లోపలికి లాగివేశాయి. ముందూ వెనకా చూడకుండా బెస్తవాడు కూడా నదిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి మునిగిపోతున్న చాంగ్‍షాన్‍ను బయటికి లాగాడు. దయ్యం ఇదంతా చూస్తూనే ఉంది. ఆ ఇద్దరిని దయ్యం ఒక చిటికెలో చంపకలిగేది. కానీ చంపడానికి దానికి మనసు రాలేదు. అసలు ఇంకెవరినీ కూడా చంపకూడదనుకొంది. బతుకంతా దయ్యంగానే వెళ్లదీద్దామనుకొంది.


నీటిదయ్యం, ఒక్కరిని కాదు – ఇద్దరిని చంపే అవకాశం వచ్చి కూడా చంపకుండా విడిచి పెట్టిందన్న సంగతి దయ్యాల రాజుకు తెలిసింది. ఆ విషయాన్ని ఆయన దేవతల రాజుకు జరూరు వర్తమానం పంపించాడు. దేవతల రాజుకు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన ఆ నీటి దెయ్యాన్ని ఒక దేవతగా మార్చేశాడు. దేవతగా మారిపోయిన నీటిదయ్యం స్వర్గానికి వెళ్ళి పోయింది. అయితే వెళ్ళేముందు తన మిత్రుడైన బెస్తవాడికి ఒక బంగారు నాణాల సంచి ఇచ్చింది. ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ బెస్తవాడు సుఖంగా బతికాడు.


సురేష్‍ ఆత్మారామ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *