పాఠశాలల పునఃప్రారంభం అభినందనీయం


దాదాపు సంవత్సరం తర్వాత పిల్లలు బడిబాట పట్టారు. కరోనాతో అతలాకుతలమైన అనేక రంగాలలో విద్యారంగం ప్రధానమైనది. లాక్‍డౌన్‍ ఎత్తివేసిన తరువాత ఉత్పత్తి, ఉపాధి, పాలనా రంగాలలో వీలును బట్టి వరుస వారీగా కార్యకలాపాలు మొదలైనప్పటికీ, విద్యారంగంలో త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోయాయి. ఆన్‍లైన్‍ క్లాసులు అన్ని వర్గాల విద్యార్థులు ఉపయోగించుకోలేక పోయారు. ఆన్‍లైన్‍ క్లాసులు ప్రత్యక్ష బోధనకు సమానం కాకపోయినప్పటికీ తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గంగా అవసరమయ్యాయి.


సంవత్సర కాలం పిల్లలు చదువు అనే అంశానికే దూరమయ్యారు ముఖ్యంగా పేద వర్గాల పిల్లలు. చదువుతోపాటు తోటి విద్యార్థులతో ఆటపాటలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులూ దీనికి తోడయ్యాయి. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
పిల్లలు పాఠశాలకు ఇంతకాలం దూరమవ్వడం సరికాదని, పాఠశాలలు పునఃప్రారంభం కావాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యితర సామాజిక రంగ నిపుణులు కోరుతూనే వున్నారు. ఫిబ్రవరి నుంచి 9, 10 తరగతులకు క్లాసులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ స్వాగతించారు.


ఇదే సందర్భంలో తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వార్తలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపాలని ఉన్నా సహజ ఆందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీటవేయడం. సిలబస్‍ దగ్గర్నుంచి, ఉన్నత ప్రమాణాలతో పాఠశాలల నిర్వహణ వరకు, కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తూ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న కృత నిశ్చయంతో విద్యాభివృద్ధికి కృషి చేస్తుండటం మనందరికీ తెలుసు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా పాఠశాలల పునఃప్రారంభానికి తగు జాగ్రత్తలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.


తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్‍ చేయడం, మంచినీరు, పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యాలు, మంచిగాలి, ప్రమాదరహిత రవాణా, మాస్క్లు ధరించడం, సరిపోను గదులు లేనిచోట షిప్ట్ విధానాన్ని పాటించడం, తల్లిదండ్రుల అనుమతి కోరటం, స్కూలుకు రావడం తప్పనిసరి కాదని చెప్పడం, పై తరగతులకు ప్రమోట్‍ చేయడం వంటి అనేక బాధ్యతాయుత చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
డ్రాఫౌట్స్ విపరీతంగా పెరిగే సందర్భం యిది. దీనిని అధిగమించి పిల్లలు మళ్లీ బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆలోచనలను చదువు వైపు మళ్లించి వారికి పునశ్ఛరణ క్లాసులు నిర్వహించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లల, సామర్థ్యం తక్కువగా వున్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చదువు పట్ల వారికి మళ్లీ ఆసక్తిని పెంపొందించాలి.


పాఠశాలల నిర్వహణ మళ్లీ సజావుగా సాగేందుకు తల్లిదండ్రుల, ఇతర సామాజిక రంగ నిపుణుల, సంస్థల సహకారం అత్యంత అవసరం. వీరితో పర్యవేక్షక కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పిల్లల రక్షణకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్న భరోసాను తల్లిదండ్రులకు యివ్వగలగాలి. అప్పుడే పిల్లలు పూర్తిస్థాయిలో హాజరయ్యే అవకాశాలుంటాయి. ఈ దిశగా ప్రస్తుత విద్యా ప్రయాణం సాగుతుందని ఆశిద్దాం.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *