చెక్కబొమ్మలు


యువకులు ఆడుకునే బొంగరం, బుడిబుడి నడకలు నేర్చే చిన్నారులు ఆడుకునే మూడు చక్రాల బండి, కోలాటం ఆడే రంగుల కట్టెలు, పిల్లలు ఆడుకునే వివిధ రకాల చెక్క బొమ్మలు, పీటకోల, పచ్చిస్‍కాయలు, కోలలు, వీణ, దొంతులు, ఇసుర్రాయి, చేదబావి, చల్లకవ్వం, కుంకుమ భరణి, పిడికిల్లు, చపాతి కోలలు.. ఇవన్నీ ఒకప్పుడు ప్రతిఇంట్లో కనిపించే హస్తకళకు రూపాలు. ఆ హస్తకళనే చెక్కబొమ్మల తయారీ.


నేటికీ ఈ హస్తకళను నమ్ముకొని.. వృత్తిని కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నాయి హైదరాబాద్‍ సమీపం లోని జిన్నారం మండలం బొంతపల్లి, గుమ్మడిదల, మంగం పేట గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు.. ఈ గ్రామాలలో దాదాపు 30 కుటుం బాలు హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్నాయి. నేటికీ కర్ర బొమ్మలను తయారు చేసి అమ్మడమే వారి ఆదాయవనరు. నిజాం కాలంలో బొంతపల్లి లోని వీరభద్రస్వామి దేవస్థానానికి వచ్చిన ఈ కళాకారులు స్వామి వారి సన్నిధిలోనే తయారు చేసిన బొమ్మలు, ఇంటి, వంట సామగ్రిని అమ్ము కొని బతుకీడుస్తున్నారు.


దాదాపు ఎనభై ఏళ్ల క్రితం నిజాంకాలంలో గుమ్మడిదల ప్రాంతంలో హస్తకళలు గొప్ప ఆదరణ పొందాయి. ఆ సమయంలో బొంతపల్లి వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి రథం తయారు చేసే బాధ్యతను బొంగరాల బాషు మియాకు అప్పటి పాలక మండలి అప్పగించింది. బాషుమియా తన తమ్ముళ్లతో కలసి టేకు కట్టెతో భారీ రథాన్ని తయారు చేసి దేవస్థానానికి అప్పగించాడు. రథం తయారీలో వారు చూపిన ప్రావీణ్యం అద్భుతంగా ఉండడంతో అప్పటి దేవస్థాన పాలకమండలి బాషుమియా సొదరులను దేవస్థానం సమీపంలోనే ఉండాలని కోరారు. అక్కడే కొంత స్థలం ఇచ్చి నివాసాలు ఏర్పరుచుకునేలా చూశారు.


తదనంతర కాలంలో ప్లాస్టిక్‍తో పోటీ పడలేక.. అన్నదమ్ముళ్ల లో కొందరు ఈ పనిని వదిలేసి.. స్థానిక పరిశ్రమల్లో పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. మిగతా కొన్ని కుటుంబాలు చెక్క వస్తువులను తయారు చేసి దేవాలయ ప్రాంగణంలో కొంత, నగరంలోని హోల్‍సెల్‍ వ్యాపారులకు కొంత అమ్ముకుని జీవిస్తున్నాయి. తమ ఉత్పత్తులకు మధ్యదళారీల బెడద కూడా ఎక్కువవడంతో వచ్చే కొద్దిపాటి లాభాలు కూడా రావడం లేదని ఈ వృత్తినిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బొమ్మకు ప్రాణం పోసే పాలకొడిశె కట్టె హస్తకళకు ముఖ్యమైంది పాలకొడిశె కట్టె. ఈ కట్టె ఇదివరకు బాగానే దొరికినా.. ఇప్పుడు కష్టంగా మారింది. నర్సాపూర్‍ అడవుల్లో ఇది లభిస్తున్నా అటవీ శాఖ అధికారులు ఈ కట్టెను తెచ్చేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో కళాకారులు అతికష్టం మీద కట్టెను సేకరించి వివిధ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. పాలగొరిశె కట్టెలే బొమ్మల తయారీకి అవసరం. పైగా పచ్చికట్టెలు కావాలి. వీటితో పూరి చేసే బేలం కట్టెలు, పిల్లలు ఆడుకునే మూడు పయ్యల బండి, దేవతలకు సమర్పించే తొట్టెల, కోలలు, బొంగురాలతో పాటు ఇంట్లో అమర్చుకునే వస్తువులను తయారు చేస్తారు. పచ్చిగా
ఉన్నప్పుడే చేతితో, యంత్రంపైన వస్తువులను తయారు చేస్తారు. ఏ వస్తువు చేయాలనుకున్నామో అది చేయడానికి ఈ కట్టె సు లువుగా ఉంటుంది. వస్తువులు చేసిన తరువాత అవి పచ్చిదనం పోయి ఎండే వరకు ఎండలో ఆరబెడతారు. తరువాత లక్కతో యంత్రంపైనే రంగులు వేస్తారు. తయారు చేసిన వాటిని అమ్మడానికి ఒప్పందం చేసుకున్న వ్యాపారులకు పంపిస్తుంటారు.


కట్టెతో తయారు చేసిన సామగ్రిని అందంగా తీర్చిదిద్దేందుకు లక్క రంగులను ఉపయోగిస్తారు. రంగులను అద్దే సమ యంలో వారు మొగలి ఆకును వాడుతారు. దీంతోనే మంచి మెరుపు వస్తుంది. ఈ ఆకును వారు భద్రాచలం అడవులకు వెళ్లి తెచ్చుకుంటారు.


అధునాతన శిక్షణ..
హస్తకళాకారులు గతంలో చేతితోనే వివిధ రకాల వస్తువులను తయారు చేసేవారు. పదేళ్లక్రితం బెంగళూరుకు చెందిన రీజనల్‍ డిజైన్‍, టెక్నికల్‍ డెవల్‍మెంట్‍ సెంటర్‍ వారు వీరికి శిక్షణను ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు. మెషీన్లతో ఆయా వస్తు వులను ఎలా ఉత్పత్తి చేయాలో కూడా నేర్పించారు. దీంతో ఇప్పుడు కొందరు కళాకారులు విద్యుత్‍ మోటర్లు వాడి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వినాయకుడు, వేంకటేశ్వరస్వామి, ఊయలలు, ల్యాంప్‍స్టాండ్‍, పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలు, బోనాల కుండలు, డెకరేషన్‍ వస్తువులు, వంట సామగ్రి వంటివి ఆధునికంగా తయారు చేసి అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో దాండియా నృత్యం, కోలాటం ఆడడం వల్ల కోలలకు కాస్త డిమాండ్‍ పెరిగింది.


ఈ ప్రాంతపు వృత్తినిపుణుల ప్రతిభ రాష్ట్రసాయిలో పేరుగాంచింది. ఎండీ గౌస్‍ తయారు చేసిన చెక్క విమానం రాష్ట్ర స్థాయిలో బహుమతి అందుకుంది. 2007లో సికింద్రాబాద్‍లోని వైస్రాయ్‍ హోటల్లో గౌస్‍ లేపాక్షి సంస్థ నుంచి ఈ పురస్కారం పొందారు.


కట్టె ఇప్పించండి
‘‘పాలకొడిశు కట్టె మా పనికి ప్రాణం. ఫారెస్టు ఆఫీసర్లు వీటిని తేనీయడం లేదు. ప్రభుత్వం తునికాకు లాగా మాకు ఈ కట్టెను సేకరించుకునే అవకాశం ఇవ్వాలి. లేదంటే మాకు కొంత భూమిని ఇచ్చినా.. పాలకొడిశె చెట్లను పెంచుకుంటం. మా తాతల కాలం నుంచి ఈ వృత్తిని నమ్ముకునే బతుకుతున్నాం. ఇప్పుడు మా పనికి ఆదరణ లేకుండా పోతున్నది. ఇప్పటికే సగంమంది వేరే పనులను పోతున్నరు. మా తరువాత మా పిల్లలు ఈ వృత్తి చేస్తారో లేదో.. బొంతపల్లి గుడికాడికి వస్తున్న భక్తులు వీటిని కొని మాకు ఆసరా కల్పిస్తుండ్రు. ప్రభుత్వం మా కళను గుర్తించి మా బొమ్మలను మంచి ధరకు అమ్ముకునే ఏర్పాటు చేయాలి’’ అని వీరు కోరుతున్నారు.

  • సువేగా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *