జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు


కస్తూరిరంగన్‍ కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. ఈ విధాన ప్రకటనలో పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యకు 2040 సంవత్సరం నాటికి లక్ష్యాలను నిర్దేశించింది. పౌరుల మధ్య సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా, సమానత్వం ప్రాతిపదికన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి విద్య కీలకమయినది అని చెబుతూ జాతీయ విద్యావిధానం ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. అంతే కాకుండా, నాణ్యమైన విద్యను అందరికి అందించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వం, శాస్త్రీయ పురోగతిని సాధించడం జాతీయ విద్యా విధానం ధ్యేయంగా పేర్కొనడం హర్షణీయం. దేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దు కుంటుందని బలమైన వాదనను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యలో ప్రతిపాదించిన అంశాలను కొంత లోతుగా అధ్యయనం చేయ వలసిన అవసరం ఉంది.


జాతీయ విద్యా విధానం 5+3+3+4 అనే కొత్త విద్యా వ్యవస్థలను ప్రతిపాదిస్తూ, పూర్వ ప్రాధమిక విద్యను, 15 నుండి 18 సంవత్సరాల వరకు పాఠశాల విద్యను విస్తరించడం, సార్వత్రీకరించడం వంటి కీలకమయిన ప్రతిపాదనలను చేసింది. ఈ ప్రతిపాదనల ఆధారంగా తెలంగాణా రాష్ట్రంలో ఈ సమూహాల బాలల విద్యా స్థితిగతులను మరియు దీనిని అమలుపరచడానికి ఉన్న అవకాశాలను, సవాళ్ళను పరిశీలించడం తగు సూచనలు చేయడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


జాతీయ విద్యా విధానం – ప్రతిపాదిత మార్పులు: జాతీయ విద్యా విధానం పాఠశాల విద్యను వచ్చే 20 సంవత్సరాలకు చేరుకోవాలసిన లక్ష్యాలను చేరుకోవడానికి దిశా నిర్దేశం చేసింది. ఇప్పుడు అమలులోనున్న 10+2+3 స్థానే నూతన విద్యా విధానంలో పూర్వ ప్రాధమిక విద్యను, సీనియర్‍ ఉన్నత పాఠశాల విద్యను పాఠశాల విద్యా పరిధిలోకి తీసుకు వచ్చి కొత్త విద్యా విధానంగా 5+3+3+4 అనే నాలుగు దశాలుగా విభజించారు. అవి 1. పునాది దశ 2. పాఠశాల సంసిద్ధతా దశ 3. మాధ్యమిక దశ 4. ఉన్నత పాఠశాల దశగా వీటిని వర్గీకరించారు.


తెలంగాణలో జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న పలు అంశాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. అంతే కాకుండా సామాజికంగా, ఆర్ధికంగా వెనుక బడిన వర్గాల పిల్లల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, బ్రిడ్జి కోర్సుల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలకు హాస్టళ్లు మొదలగునవి. అయినా రాష్ట్రంలో ఈ వర్గాలలోని పిల్లలు చాలా మంది విద్యకు దూరంగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బాలలకు నాణ్యమైన విద్యను అందించాలంటే గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు వాటి వలన ఎంత స్థాయిలో విద్యను అందించగలిగాము, మరియు ఇంకా విద్యకు దూరంగా ఇతర సమూహాల పిల్లలకు విద్యను అందించదానికి తీసుకోవలసిన తగు చర్యలను పరిశీలించవలసిన అవసరం ఉన్నది. పిల్లలకు విద్యా హక్కును అందించడమే కాకుండా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ‘సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం మరియు హోదా అవకాశాల సమానతలను, స్వేఛ్చను పౌరులందరికీ సునిశ్చితం చేయడానికి’ అనే మూల ప్రజాస్వామిక సూత్రాలకు కట్టుబడిన రాష్ట్రంగా ముందు నిలపాలనేదే ఈ ప్రయత్నం.


పాఠశాల విద్య :
రాష్ట్రంలో ఆరు నుంచి 15 సంవత్సరాల పిల్లల జనాభా 2017-18 అంచనాలు మరియు విద్యా శాఖ లెక్కల ప్రకారం 63,24,279 (బాలురు 32,66,097 మరియు బాలికలు 30,58,182) ఉండగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొత్తం 58,36,310 విద్యార్థులు చదువుతున్నారు. అందులో బాలికలు 29,34,401, బాలురు 31,02,135 మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నారు. ఈ లెక్కల బట్టి చూస్తే ఇంకా బడిలో చేరవలసిన పిల్లలు చాలమందే ఉన్నారని గమనించాలి.


ప్రైవేటు విద్య :
ప్రభుత్వ మరియు ప్రైవేటు బడులు కలుపుకుని మొత్తం 40,841 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు రంగంలో కేవలం 10,526 (26%) బడులే ఉండగా విద్యార్థులు మాత్రం 53.18% ఉండడం. ప్రైవేటు విద్య అంటే ఇంగ్లీష్‍ మీడియం చదువులు అని అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్‍ మీడియంలో చదువుతున్న పిల్లలతో కలుపుకుంటే దాదాపు 39,15,838 మంది పిల్లలు (66.54%) విద్యార్థులు ఇంగ్లీష్‍ మీడియంలో17,94,294 మంది (30.49%) విద్యార్థులు తెలుగు మీడియంలో చదువు చున్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య మరియు ఆంగ్ల మాధ్యమం లేదనే కారణంతోనే ఆర్ధికంగా కుటుంబంపై భారం పడినా ప్రైవేటు బడులు వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక పోతే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని 26,050 ప్రభుత్వ బడులలో కేవలం 20 లక్షల 47 వేల మంది విద్యార్థులు (37%) మాత్రమే చదువుతున్నారు. ఎస్సీ బాలలు 5 లక్షలు (24%), ఎస్టీ బాలలు 2.82 లక్షలు (13.8%), బి.సి. బాలలు 11 లక్షల (54%) మంది చదువుతుండగా ఇతరులు కేవలం 1.56 లక్షల (8%) మంది ఈ బడులలో చదువుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే పేదల పిల్లలు మాత్రమే ప్రభుత్వ బడులపై ఇంకా విశ్వాసం ఉంచారని అనిపిస్తుంది.


సంక్షేమ గురుకుల హాస్టళ్లు :
రాష్ట్రం ఏర్పడగానే తొలి నడకలలోనే గురుకులాలపై శ్రద్ద వహించి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవ్వరికీ తీసిపోని విధంగా తీర్చిదిద్దడానికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ అంకితభావం గల అధికారులను నియమించి పదేపదే ట్రాన్స్ఫర్‍లు చేయకుండా గురుకులాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దిని చాటింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న 296 గురుకుల విద్యాలయాలు నేడు ఏకంగా 744 కి పెరిగాయి. ఇవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్నాయి. ఇందులో 3,17,135 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు 475 కేజీబీవీలలో 74,279 మంది బాలికలు, 194 లో 1,17,319 మంది విద్యార్థులు చదువుతున్నారు.


సంక్షేమ హాస్టళ్లు :
వీటితో పాటు రాష్ట్రంలో ఎస్సి 888, ఎస్టి 170 , బిసి 454, మొత్తం 1512 హాస్టల్స్ లో 1,47,095 విద్యార్థుల కు ప్రీ మెట్రిక్‍ హాస్టల్స్ను నిర్వహిస్తుంది. అలాగే ప్రైవేటు బడిలో చేరిన ఎస్సీ, ఎస్టీ బాలలకు (బెస్ట్ ఆవియాలబలే స్కూల్‍) అనే పథకం కింద దాదాపు 8000 మంది ఎస్టీ పిల్లలు 6000 మంది ఎస్టీ పిల్లలు చదువు కుంటున్నారు.
జాతీయ విద్యా విధానం సరిగ్గా ఈ వర్గాల పిల్లల కోసమే ప్రత్యేక శ్రద్ద పెట్టాలని విధానపత్రంలో రెండు అధ్యాయాలు కేటాయించి ఈ వర్గాలలోని అందరి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని స్పష్టం చేసింది. గురుకులాల ప్రయోగం ఒక వైపు హర్షించ దగ్గ విషయమే అయినా ప్రభుత్వం పర్యవేక్షణ విషయం లో కానీ, నిధుల కేటాయింపు విషయంలో కానీ గురుకుల విద్య మీద పెట్టిన దృష్టి స్థానిక ప్రభుత్వ విద్యా సంస్థల మీద పెట్టడం అత్యవసరము. పిల్లలందరికీ ప్రభుత్వ విద్యా ఫలాలు అందకపోతే సామాజిక న్యాయపు మౌలిక సూత్రాలను ఉల్లంఘించి నూతన అసమానతలకు బాటలు వేసిన వాళ్ళమవుతాము.


పూర్వ ప్రాథమిక విద్య (3 నుండి 5 సంవత్సరాల పిల్లలు):
జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అనుబంధంగా ఉన్న పూర్వ ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక విద్యని మాత్రమే అందించే పాఠశాలలలో ఇలా నాలుగు రకాల వ్యవస్థలలో పూర్వ శిశు విద్య నందించాలి. పూర్వ ప్రాథమిక విద్యను మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు విద్యాశాఖల సమన్వయంతో నిర్వహిస్తారని జాతీయ విద్యా విధానం సూచించింది.
రాష్ట్రంలో మూడు నుండి అయిదు సంవత్సరాల బాలలు 17,32,941 మంది బాలలు ఉన్నారు. మన రాష్ట్రంలో, మొత్తం 149 ICDS ప్రాజెక్ట్ల ఆధ్వర్యంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో దాదాపు 4,80,946 మంది పిల్లలకు సేవలు అందుతున్నాయి. అందులో 3,29,712 పిల్లలకు పూర్వ ప్రాధమిక విద్యను అందిస్తున్నారు. జాతీయ విద్యా విధానంలో సూచించిన విధంగా పూర్వ ప్రాధమిక విద్యను అందించదానికి ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు మౌలిక వసతులు సరిపోవు. ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు పెంచాలి. అదనపు వనరుల సమీకరణ చాలా అవసరం.


డ్రాపవుట్స్ :
డ్రాపౌట్ల విషయంలో గత పది సంవత్సరాలలో కొంత పురోగతిని సాధించినా ఎస్సీ ఎస్టీ పిల్లల విషయంలో చేయవలసిన పని చాలా ఉంది. ఒకటవ తరగతి లో వంద మంది పిల్లలు చేరితే పదవ తరగతి చేరేసరికి ఎస్‍ సి బాలలు 38 శాతం బాలికలు 34శాతం బడి మానివేస్తుండగా, ఎస్‍టి బాలలు అధికంగా 58 శాతం బాలికలు 60 శాతం బడి మానివేస్తున్నారు.
ఇక జిల్లాలవారీగా ఎస్సీ పిల్లలను చూస్తే రాష్ట్రంలో 10 జిల్లాలు అంటే కొమురంభీం, జోగులాంబ, జయశంకర్‍, మహబూబాబాద్‍, సంగారెడ్డి, మెదక్‍, వికారాబాద్‍, వనపర్తి, నాగరకర్నూల్‍, సూర్యాపేట జిల్లాలలో 47 శాతం నుండి 65 శాతం బడి మానివేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అలాగే ఎస్టీ విద్యార్థుల విషయానికి వస్తే ఖమ్మం, రంగారెడ్డి, మెదక్‍, సూర్యాపేట, వరంగల్‍ అర్బన్‍ మరియు కరీంనగర్‍ జిల్లాలు తప్ప మిగతా 25 జిల్లాలలో 60 శాతం నుండి 75 శాతం మంది పిల్లలు బడి మానివేస్తున్నారు. ఇది మరింత తీవ్రమైన సమస్య. ఈ గణాంకాలను చూస్తే బడిలో చేరిన వాళ్ళే తక్కువ అంటే చేరిన వారిలో సరాసరి 50 శాతం నుండి 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలు బడి మధ్యలో మానివేస్తున్నారని అర్ధం అవుతుంది.


ఇంటర్‍ విద్య – 11, 12 తరగతులు:
జాతీయ విద్యా విధానం 15 నుండి 18 సంవత్సరాల వరకు పాఠశాల విద్యను సార్వత్రీకరించడం వంటి కీలకమయిన ప్రతిపా దనలను చేసింది. మన రాష్ట్రంలో 11 మరియు 12 తరగతులు పాట శాలలను విద్యకు అనుబంధంగా కాకుండా ఇంటర్‍ విద్యగా ఒక ప్రత్యేక ఇంటర్‍ బోర్డు ఆధ్వర్యయంలో నిర్వహించ బడుతుంది. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందని దూరంలో ఉంది.
ప్రభుత్వ కళాశాలలన్నీ తగినంత మంది బోధనా సిబ్బంది లేకుండా నడుస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 6719 మంజూరైన లెక్చరర్‍ పోస్ట్లు ఉండగా కేవలం 1040 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 5679 ఖాళీలు ఉన్నాయి. 3880 మంది సిబ్బంది కాంట్రాక్ట్ బేసిస్‍ మీద పని చేస్తున్నారు. అయినప్పటికీ, ఇంకా 1779 ఖాళీలతో జూనియర్‍ కాలేజీలునడుస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది పిల్లలు ప్రైవేటు జూనియర్‍ కాలేజీలలో చదువుతున్నారు. ఈ కాలేజీలు కూడా ఆరకొర వసతులతోనే నడుస్తాయి. ఫీజులు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో దండుకుంటాయి. ప్రభుత్వ ఇంటర్‍ విద్య అందుబాటు లేని కారణంగా గత్యంతరం లేక అటు తల్లిదండ్రులకు ఆర్ధిక భారం ఇటు విద్యార్థులకు మానసిక ఒత్తిడి తప్పడం లేదు. జాతీయ విద్యా విధాన లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్రం లో ఉన్న ఉన్నత పాటశాలలను 11 మరియు 12 తరగతులకు అప్గ్రేడ్‍ చేయ వలసిన అవసరం ఉంది.


బాలికల విద్య:
రాష్ట్రంలో 6-15 సంవత్సరాల బాలికలు 30,58,182, లక్షల మంది ఉండగా 1నుండి 10వ తరగతిలో కేవలం 28,31,466 బాలికలు మాత్రమే చదువుచున్నారు. అంటే దాదాపు 2లక్షల 26వేల మంది బాలికలు 2017-18 విద్యా సంవ త్సరంలో బడిలో లేరని తెలుస్తుంది. జాతీయ విద్యా విధానంలో అన్ని వర్గాల బాలికల విద్య మీద దృష్టి సారించాలని మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల బాలికలు ఎక్కువ శాతం బడిలో కొనసాగడం లేదన్న వాస్తవాన్ని అంగీకరించారు. ఆడపిల్లలు విద్యనభ్యసించడానికి ఉన్నసవాళ్లను ఎదుర్కోవడంలో మన కుటుంబాలు, సమాజం మరియు ప్రభుత్వాలు చూపవలసినంత సానుకూలత చూపడం లేదన్నది సుస్పష్టం.


ప్రత్యేక అవసరాలు గల పిల్లలు:
రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలు దాదాపు 2 లక్షల మంది బాలలు ఉంటారని ఒక అంచనా ఉంది. బడిలో చేరిన పిల్లలను చూస్తే 1-12 తరగతులలో కేవలం 45631 మంది బాలలు మాత్రమే బడిలో నమోదు అయినట్లు 2016-17 U- DISE నివేదిక ద్వారా తెలుస్తుంది.


బాలకార్మికులు:
బడికెళ్లని పిల్లలందరూ బాలకార్మికులే అన్న నిర్వచనం ఇప్పుడు సవరించిన బాల కార్మిక చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికి వర్తిస్తుంది. బాలలు బడిలో లేకపోతే ఏదో ఒక పనిలో చిక్కుకు పోతారు. ఒక్కసారి బడి నుండి బయటకు వచ్చారంటే నిరక్షరాస్యులుగా మిగిలిపోయి, నైపుణ్యం లేని కూలీలుగా మిగిలి పోతారు. బడికి మళ్ళీ రావాలని ఉన్నా ఆ విషవలయం నుండి తమం తట తాము రాలేని పరిస్థితులలో నిస్సహాయులుగా నిలిచిపోతారు.


ఆన్‍ లైన్‍ తరగతులు – నూతన అసమానతలు:
ప్రపంచం ఇరువది ఒకటవ శతాబ్దంలో డిజిటల్‍ యుగంలోకి పరుగులు తీస్తూ సమాజాన్ని మరో నూతన అసమానతలకు బాటలు వేసింది. ఈ సమయం లోనే కరొన వైరస్‍ రూపం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందులో విద్యా రంగం మొత్తం మూతబడి మన రాష్ట్రం లోని పిల్లలందరూ బడులకు దూరం అయ్యారు. ఆన్‍ లైన్‍ తరగతులకు గిరాకీ పెరిగింది. పేదలకు తమ ఇంటి పరిసరాలలో ఉచితంగా అందె విద్య డిజిటల్‍ విద్య తో దూరం అయ్యింది. డిజిటల్‍ వనరులు అయిన స్మార్ట్ ఫోన్‍, డేటా అందుబాటులో ఉన్న వారికే విద్య అందే విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు కూడా డిజిటల్‍ విద్య వైపే మొగ్గు చూపడంతో సామాజికంగా, ఆర్ధికంగా వెనుక బాటులో ఉన్న విద్యార్థులు మరో నూతన అసమానతలకు గురి అవు తున్నారు.


రాష్ట్ర స్తాయి ప్రణాళికలు: సవాళ్ళు:
రాష్ట్రమంతటికీ ఒకే రకమైన విధానాలను రూపొందించడం వలననే ఈ సమూహాలు విద్యలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని గుర్తించాలి. జనాభా గణాంకాలు చూసినట్లయితే జిల్లా జిల్లాకు ఎస్సీ, ఎస్టీల జనాభాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి సంఖ్య కూడా రోజు రోజుకు మార్పులు జరుగుతున్నవి. ఇంతవరకు అదిలాబాదు, కరీంనగర్‍, నల్గొండ ఉమ్మడి జిల్లాలలో ఎస్సీ సామాజిక వర్గం రాష్ట్ర సగటు కంటే ఎక్కువగాను అదే విధంగా అదిలాబాద్‍, ఖమ్మం, వరంగల్‍, జిల్లా లలో ఎస్టీల జనాభా రాష్ట్ర సగటు కంటే ఎక్కువ గానూ ఉంది. పిల్లలు కూడా ఇదే దామాషా లో ఉంటారు.
ప్రాంతాలను బట్టి ప్రణాళికలు వేయడం అవసరం. ఉదాహరణకు అదిలాబాదు జిల్లా భౌగోళికంగా, నివాస ప్రాంతాల పరంగా కరీంనగర్‍ జిల్లాకు భిన్నంగా ఉంటుంది. జిల్లా జిల్లాకు ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించక పోవడం వలన ఈ వర్గాల పిల్లలకు విద్య అందించలేకపోయాము.


కమ్యూనిటీ భాగస్వామ్యం:
అన్ని సామాజిక వర్గాలకు సమానమైన నాణ్యమైన విద్య అందాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం, పిల్లలపై మరియు విద్య గురించి అభిరుచి చూపించే ఇతర పౌరుల పాత్ర చాలా ముఖ్యం. విద్య హక్కు చట్టం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. పిల్లల తల్లిదండ్రులను పాఠశాల నిర్వహణలో భాగ్యస్వాములను చేయడం, గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు చట్టం అమలులో అధికారిక బాధ్యులను చేయడం జరిగినది. ఈ దిశలో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ సవరణల ననుసరించి ఇతోధిక అధికారాలను బదలాయిస్తే స్థానికతకు తగిన పాత్ర లభిస్తుంది.


పాఠశాల యాజమాన్య కమిటీలు:

తమ పాటశాల పరిసర ప్రాంతంలో విద్యా హక్కు అమలు జరిగేలా పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా కల్పించింది. ఇది వారి సంపూర్ణ భాగస్వామ్యానికి ఒక మంచి అవకాశం. అతి ముఖ్యమైన బాధ్యతలు ఈ కమిటీలకు ఉన్నాయి. ఈ కమిటీ సభ్యులందరూ దాదాపు ఆర్ధిక సామాజిక వెనుక బడిన వర్గాలకు చెందిన వారే. మొదటి తరం బడికి పంపుతున్న తల్లిదండ్రులు అత్యధికం.
కానీ ఈ కమిటీ సభ్యు లకు తగినంత శిక్షణ ఇవ్వడం లేదు. వారి భాగస్వామ్యాన్ని విద్యాశాఖ ప్రోత్సాహిస్తున్నట్లు కనిపించదు. కొన్నిసార్లు కమిటీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వారి పేర్లు కమిటీలలో చేరుస్తారు. మరికొన్ని సందర్భాలలో ప్రశ్నించే కమిటీ సభ్యులను తిరిగి కమిటీలలో రాకుండా చూసే బడులు కూడా ఉన్నాయి. వీటిపై దృష్టి సారించినచో నాణ్యమైన విద్యను అందించగలుగుతాము.


స్థానిక ప్రభుత్వాలు:
(గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ): రాష్ట్రంలో ఉన్న12751 పంచాయతీలలో 6,378 పంచయతీలకు మహిళలు సర్పంచులు కాగా, 3394 ఎస్సీ, 1865 ఎస్టీ, 2345 బీసీ వర్గాలకు చెందిన వారు సర్పంచులుగా ఉన్నారు. అంటే దాదాపు 12,751 గ్రామ పంచాయితీలలో 60 శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు మరియు ఈ వర్గాల పిల్లలే ఎక్కువ శాతం బడిలో చేరని వారు, చేరి బడి మానివేసినవారు ఉన్నారు కానీ గ్రామ పంచాయితీల భాగస్వామ్యం అంతంత మాత్రమే ఉంది. రిపబ్లిక్‍ దినోత్సవాలకు, స్వతంత్ర దినోత్సవాల సందర్భంగానే పాఠశాలలు ఆహ్వానం పలుకుతున్నాయి గానీ, వారి భాగస్వామయాన్ని ఎంతమాత్రం అంగీకరించే పరిస్థితులు లేవు. వీరి భాగస్వామ్యాన్ని పెంచడంలో విద్యా శాఖ సఫలీకృతం అవుతుంది.


నాణ్య మైన విద్య – ఒక సంక్షోభం:
బాలలు విద్యా సామర్ధ్యాలు సాధించకపోవడాన్ని ఒక పెద్దసంక్షోభంగా జాతీయ విద్యా విధానం గుర్తించింది.పలు ప్రభుత్వ ప్రైవేటు నివేదికలు కూడా ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి కూడా. ఒక వైపు ప్రభుత్వం విద్యనందించడానికి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా మరో వైపు తమ రెక్కల కష్టాన్ని ధారపోసి ప్రైవేటు బడులకు ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు మరోవైపు. ఈ సంక్షోభం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో సమానంగా ఉంది. బడులు నడుస్తున్నతీరు, ప్రభుత్వ, ప్రైవేటు బడులపై అజమాయిషీ కొరవడిన తీరు, పిల్లల మూల్యాంకనానికి రాష్ట్రస్థాయి నుండి మండలస్థాయి వరకు జవాబు దారితనం లేని పరిస్థితిని గమనించవచ్చు.


బడ్జెట్‍ :
తెలంగాణ ఏర్పడిన తరువాత దాదాపు ఏడు బడ్జెట్లు ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి సంవత్సర లక్షా ఆరు వందల ముప్పై ఏడు కోట్ల (1,00,637) బడ్జెట్‍ ఏకంగా 2020 -21 బడ్జెట్‍ కు వచ్చే సరికి ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మినది వందల పద్నాలుగు (1,82,914.42) కోట్లకు పెరగడం హర్షించ దగ్గ పరిణామమే. ఈ నిధులు గతం కంటే ఎక్కువ కనిపించినా పెరిగిన రాష్ట్ర బడ్జెట్‍ లో చూస్తే ఇది తక్కువే. ఇంకొక విచిత్ర పరిస్థితి ఏమిటంటే ఈ నిధులు కూడా ప్రతి ఆర్ధిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు పెట్టక పోవడం. రకరకాల పరిపాలన నిబంధనలు, సిబ్బందిలో నైపుణ్యత లేకపోవడం, కేంద్రీక•త నిర్ణయ వ్యవస్థల వలన ఈ పరిస్థితి వస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పిల్లలందరికి నాణ్యమైన సమానమైన విద్యను అందించాలనే రాజకీయ సంకల్పం తీసుకోవాలి. అన్నీ రంగాలలో మౌలికమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు గానే విద్య మీద కూడా శ్రద్ద వహించి నట్లైతే తప్పక ఫలితాలు వస్తాయి. రాజకీయ సంకల్పం తో పాటు ప్రస్తుత పాటశాల స్థితిగతులను సమీక్షించుకొని ముందుకుపోవడానికి ఈ క్రింది సూచనలు పరిగణలోకి తీసుకుని నూతన ప్రణాళికలకు శ్రీకారం చూట్టాలి.

  • బడిలో లేని పిల్లలులను గుర్తించి బడికి రప్పించే వినూత్న మార్గాలు అన్వేషించాలి. బడిలో చేరని పిల్లలకు మరియు మధ్యలో బడిమానేసిన పిల్లలు బడికి తిరిగి వచ్చినప్పుడు వారిని వయసుకు తగ్గ తరగతికి సన్నద్ధం చేయడానికి ప్రతి పాఠశాలలో బ్రిడ్జ్ కోర్సు సెక్షన్‍ ఏర్పాటు చేయాలి.
  • ఎస్టీ సమూహాలలో ఉన్న ఇతర ఆదిమ జాతి తెగల పిల్లలను అనగా చెంచు, కొలమ్‍ మొదలగు సమూహాలు (ప్రిమటివ్‍ ట్రైబస్‍), ఆదివాసీ తెగల పిల్లలను అనగా గోండు, కోయ మొదలగు సమూహాల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి. వారి గణాంకాలను వేరుగా విద్యా శాఖ పొందుపరచాలి.
  • పిల్లల పట్ల వివక్ష చూపించకుండా వాళ్ళు విద్యను పూర్తి చేయడానికి బడులలోవారికి గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి విద్యాశాఖలో అన్ని స్థాయిలలోని అధికారులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలి. ఈ వర్గాలలో ఉన్నత చదువులు చదివిన వ్యక్తులను వారు పాఠశాల జీవితంలో ఎదుర్కొన్న మంచి చెడు అనుభవాలను శిక్షణ కోర్సులలో భాగం చేయాలి.
  • గ్రామ పంచాయితీ మరియు పట్టణ వార్డ్ స్థాయిలలో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఆ పంచాయితీ/వార్డు పరిధి లోని పిల్లల జాబితాను తయారు చేసి 3 నుండి 18 సంవత్సరాల పిల్లలందరిని ట్రాక్‍ చేయాలి.
  • పాఠశాల స్థాయిలో మూల్యాంకనం చేసి కనీస సామర్ధ్యాలు లేని పిల్లలందరికీ ఒక ప్రణాళికను సిద్దం చేయాలి. ఉపాధ్యాయులకు ఈ విషయంలో పూర్తి స్వేచ్చను ఇచ్చి లక్ష్యాలను చేరడానికి విద్యాశాఖలోని యంత్రాంగం సహాయపడాలి. విద్యా శాఖకు ఇంతకంటే ముఖ్యమైన పని మరొకటి ఉండకూడదు. విద్యాశాఖలో ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఒక మండల బాధ్యతను ఇచ్చి జవాబుదారీని నిర్దేశించాలి. ప్రతినెలా కేవలం సామర్ధ్యాల సాధన మీదనే రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరగాలి.
  • పూర్వ ప్రాధమికస్థాయి నుండి సీనియర్‍ సెకండరీ విద్యను అందరి పిల్లలకు అందుబాటులోకి తీసుకు రావాలంటే కేంద్రీయ విద్యాలయాల నమూనాలో మండలానికి ఐదు పాఠశాలలు నెలకొల్పాలి.
  • పూర్వ ప్రాథమిక విద్యను అందించదానికి అదనంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి.
  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు బాలలను తిరిగి బడికి తీసుకు రావడానికి సమాజాన్ని సమాయత్తపరచాలి. ప్రభుత్వ యంత్రాంగానికి యుద్దప్రాతిపదికన పనులను నిర్దేశించాలి. విద్యా శాఖ మరియు కార్మిక శాఖ ప్రతి మూడు నెలల కొక సారి సమీక్షలు నిర్వహించాలి.
  • ఆడపిల్లల చదువు, వారిపట్ల వివక్షను రూపుమాపడానికి ప్రభుత్వాలు కొన్ని రాజీలేని నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. బాలికలకు రవాణా, లేదా ఉచిత హాస్టల్స్ ఏర్పాటు చేసి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందించాలి.
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందరితో సమానంగా చదువు కొనుటకు కావలసిన అనుబంధ సహాయ పరికరాలు అందు బాటులో ఉంచాలి. ప్రతి పంచాయితీకి శిక్షణ పొందిన టీచర్‍ ను నియమించాలి.
  • రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ బడులన్నీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ల నుండి మరియు కొంత మేరకు కేంద్ర సహాయంతో నడుస్తున్నాయి. వనరులు రాష్ట్రమే సమకూరుస్తున్నప్పుడు వాటికి ఇచ్చే స్వయం ప్రతిపతిని ఇస్తూనే పర్యవేక్షణ, నాయకత్వం మరియు సమాన విద్య పిల్లలందరికి అందించడానికి విద్యాశాఖ గొడుగు కిందికి ఈ సంస్థలన్నిటిని తీసుకురావాలి. లేదా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి.
  • పట్టణ జనాభా దాదాపు 40 శాతానికి చేరుకుంటున్న కారణంగా విద్య కోసం జిల్లాలకు, పట్టణాలకు వేర్వేరుగా, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేయాలి.
  • సామాజికి ఆర్ధిక వెనుకబడిన వర్గాల బాలల విద్యను అధ్యయనం చేయడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి పరిధిలోని జిల్లాలలో పలు అధ్యయనాలు నిర్వహించాలి.
  • జిల్లాలలో ఉన్న డైట్లను పటిష్ఠ పరిచి పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలి. కొన్ని క్లస్టర్‍లను ఎన్నుకుని అధ్యనాలు చేయాలి.
  • ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని నియంత్రించడానికి ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రైవేటు పాఠశాలల నియంత్రణ కమిషన్‍ను ఏర్పాటు చేయాలి.
  • చివరగా బాలలకు రాజ్యాంగంలో పొందుపరిచిన విద్యాహక్కును అందించే బాధ్యత ప్రభుత్వాలది. అన్ని సామాజిక వర్గాల పిల్లలకు విద్య అందాలంటే ప్రభుత్వ విద్యను పటిష్ఠపరచడం చాలా ముఖ్యం. ఇందుకుగాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినట్లుగా జాతీయ ఆదాయంలో ఆరు శాతం నిధులను విద్యకు కేటాయించాలి. అంటే రాష్ట్ర బుడ్జెట్‍లో 20 శాతం నిధులు విద్య కు కేటాయించి రాజకీయ సంకల్పాన్ని ప్రకటించాలి. అప్పుడే జాతీయ విద్యా విధానం ఆశించినట్లుగా రాబోయే తరాలకు సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని పౌరులందరికీ కల్పించి నట్లవుతుంది.
  • ఆర్‍.వెంకట్‍రెడ్డి, ఎ : 9949865516

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *