ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రకృతి


ప్రకృతి ప్రకోపాలు :
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ప్రకృతి మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదని అనిపిస్తున్నది. 2013లో జరిగిన కేదార్‍ నాథ్‍ దుర్ఘటన, మొన్న ఫిబ్రవరి 8న జరిగిన రిషిగంగా నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలు, అమెరికా దక్షిణ రాష్ట్రాలైన టెక్సాస్‍, మిసిసిపి తదితర రాష్ట్రాలలో సంభవిస్తున్నకనీవినీ ఎరుగని మంచు తుఫానులు, 2020 అక్టోబర్లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, 2019లో కేరళలో సంభవించిన వరద విధ్వంసం ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్నఅనేకానేక ప్రకృతి విపత్తులు.
ఉత్తరాఖండ్‍ రాష్ట్రంలో మంచు గ్లేసియర్‍ కూలిన కారణంగా రిషి గంగా నదికి వచ్చిన ఆకస్మిక వరదల వలన 200 పైగా ప్రాణాలు కొట్టుకు పోయాయి. అపారమైన ఆస్తి నష్టం వాటిల్లింది. రిషి గంగ జల విద్యుత్‍ ప్రాజెక్టు మునిగిపోయింది. అమెరికాలో టెక్సాస్‍ రాష్ట్రం ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవంలోకి రాని మంచు తుఫానులో కొట్టుమిట్టాడుతున్నది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా -10 డిగ్రీల సెంటీగ్రేడ్‍ కు పడిపోవడం వలన నీటి సరఫరా దారుణంగా దెబ్బ తిన్నది. కరెంట్‍ వినియోగం అనూహ్యంగా పెరగడంతో విద్యుత్‍ గ్రిడ్‍ ట్రిప్‍ అయి విద్యుత్‍ సరఫరాకు తీవ్ర అంతరాయ కలిగింది. ప్రజలు నీరు లేక, కరెంటు లేక గడ్డకట్టే చలిలో బతుకుతున్నారు. అమెరికా దక్షిణ రాష్ట్రాలు అన్నిటిలో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి.


పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలు :
ఈ పరిస్థితిని పర్యావరణ శాస్త్రవేత్తలు, సంబంధిత నిపుణులు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ వేదికల మీద విస్తృతంగా చర్చిస్తున్నారు. భారత్‍ లో కూడా ఈ చర్చ జరుగుతున్నది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్న సంగతిని వారు గుర్తు చేస్తూనే ఉన్నారు. భూగోళం మీద రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వరుస కరువులు లేకపోతే అతి వరదలు సంభవించి ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ఈ వాతావరణ మార్పులకు (Climate Changes) అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది చదరపు కిలోమీటర్ల మేర అడవుల నరికివేత ప్రధానమైన కారణంగా ముందుకు వచ్చింది. 2000 నుండి 2012 వరకు ప్రపంచ వ్యాప్తంగా 2.30 మిలియన్‍ చదరపు కిలోమీటర్ల అడవి మాయం అయ్యిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రతీ నిమిషం ఒక ఫుట్‍ బాల్‍ మైదానం అంత అడవి అమెజాన్‍ అడవుల నుంచి మాయం అవుతున్నది. 2018లో సుమారు 3.60 మిలియన్‍ హెక్టార్ల ఉష్ణ మండల అడవులు (Tropical Forests) భూమి మీద నుంచి మాయం అయినట్టు ఒక అంచనా. అడవుల నరికివేత వలన భూగోళంపై ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి.ఈ మార్పులు ఋతు పవనాల గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయిక దేశాలైన భారత్‍, పాకిస్తాన్‍, బంగ్లాదేశ్‍, శ్రీలంక, నేపాల్‍, మయాన్మార్‍ తదితర దక్షిణాసియా దేశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు వానాకాలం నాలుగు నెలల పాటు వర్షపాతం ఉండేది. ఇప్పుడు వార్షిక సగటు వర్షపాతంలో తగ్గుదల లేకపోయినా వర్షం కురిసే రోజులు సుమారు 25 నుంచి 30 రోజులకు పడిపోయింది. వర్షం నెల, నెలన్నర రోజులు అసలే కురువదు. కురిస్తే రెండు మూడు రోజుల్లో భారీ కుండ పోత వర్షం కురిసి పోతుంది. అనంతరం మళ్ళీ వర్షం పత్తా ఉండదు. ఈ దోబూచులాట మనం గత కొన్నెండ్లుగా చూస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితి 2020లో కూడా మన అనుభవంలోకి వచ్చించి. జూన్‍, జూలై, ఆగస్టు నెలల్లో వర్షం లేక కరువు పరిస్థితులను చూసాము. సెప్టెంబర్‍, అక్టోబర్‍ నెలల్లో భారీ వర్షపాతం, నదుల్లో వరద భీభత్సం చూసాము. ఫిబ్రవరి నుంచి తిరిగి ఎండలు దంచి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఈ కారణంగా దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంటున్నది. కరువులు – వరదలు – కరువులు దాదాపు ప్రతీ ఏటా పునరావ•తం అవుతున్నాయి.


వాతావరణ పునరుద్దరణకు మార్గాలు :
వాతావరణ మార్పులను నియంత్రించి తిరిగి గాడిలో పడేయాలంటే భూగోళం మీద అడవుల నరికివేతను నియంత్రించడం, నరికివేతకు గురి అయిన అడవులను తిరిగి పునరుజ్జీవింపజేయడం, కర్బన ఉద్ఘారాలను నియంత్రించడం తప్పనిసరి అవసరమని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన వృక్షవేదం పుస్తకంలో రాసిన పీఠికలో విలువైన సమాచారం పొందుపర్చారు. 10 వేల ఏండ్ల క్రితం భూగోళం 45 శాతం అంటే 60,000 లక్షల హెక్టార్ల అడవులతో నిండి ఉండేది. ఇప్పుడు అది 31 శాతానికి అంటే 40,000 లక్షల హెక్టార్లకు పడిపోయింది. గడచిన 10 సంవత్సరాలలో ఏటా 5.20 మిలియన్‍ హెక్టార్ల అడవిని మనం భూమి మీద నుంచి మాయం చేస్తున్నాము. కాబట్టి భూమి మీద అడవులను పునరుజ్జీవింపజేయడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, వాతావరణ ఉష్ణోగ్రతను పెంచే కర్బన ఉద్ఘారాలను (Carbon Emissions) తగ్గించడం మానవాళి ప్రథమ కర్తవ్యం పర్యావరణ శాస్త్రవేత్తలు దశాబ్దకాలంగా చెపుతున్నారు. లేనిచో మానవుడు సహ అన్నీ జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడిపోతుంది.


అతి పెద్ద మానవ ప్రయత్నాలు :
భూగోళంపై గ్రీన్‍ కవర్‍ ను పెంచడానికి, కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మానవ ప్రయత్నాలుఅనేక రూపాలలో జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇటువంటి ప్రయత్నాలు చైనా, బ్రెజిల్‍, ఆఫ్రికా, చీలి తదితర దేశాలలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అతి పెద్ద మానవ ప్రయత్నాలలో చోటు సంపాదించుకున్నది. వాటి సంగతులు సంక్షిప్తంగా తెలుసుకుందాం.


గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ చైనా:
చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలలో గోబి ఎడారి విస్తరణ ప్రమాడకరమైన స్థాయికి చేరుకున్నది. వారావరణ ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గిపోవడం వంటి పరిణామాలతో గోబి ఎడారి 1975 నుంచి ఇప్పటివరకు 55,000 చదరపు కిలోమీటర్లు విస్తరించినట్టు ఒక అంచనా. గోబి ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫానుల వలన 400 మిలియన్ల ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ప్రజలను ఈ ఉపపాతం నుంచి రక్షించడానికి గోబి ఏడారికి చెట్లతో ఒక గోడను నిర్మించాలని చైనా ప్రభుత్వం తలపెట్టింది. 1979 లో గోబి ఎడారి విస్తరణను నివారించడానికి 500 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం చైనా ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. దీన్ని ది గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ చైనా అని పేరు పెట్టారు. 4500 కిమీ ల పొడవున, 3,50,000 చదరపు కిమీ విస్తీర్ణంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని 2050 వరకు పూర్తి చేయాలని సంకల్పించింది. ఇది మొక్కలు నాటడానికి చేస్తున్నఅతిపెద్ద మానవ ప్రయత్నంగా ప్రసిద్ది చెందింది.


కర్బన ఉద్ఘారాలను తగ్గిస్తున్న చైనా త్రీ గార్జెస్‍ డ్యాం :
చైనా ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశం. తన ఆర్థిక కలాపాలతో 40 ఏండ్లలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే దశకు ఎదిగింది. ప్రపంచ దేశాలు వాతావరణంలోకి వదిలే కర్బన ఉద్ఘారాల్లో చైనా వాటా 28.5%. కర్బన ఉద్ఘారాలను తగ్గించే దిశగా ఇంధన రంగంలో చైనా విశేషంగా కృషి చేస్తున్నది. బొగ్గు ఆధారిత విద్యుత్‍ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకొని జల విద్యుత్‍ ఉత్పత్తిని, సౌర విద్యుత్‍ ఉత్పత్తిని పెంచుకుంటున్నది. 2015 నాటికి చైనా సౌర విద్యుత్‍ ఉత్పత్తిని 74 శాతానికి, వాయు విద్యుత్‍ ఉత్పత్తిని 34 శాతానికి పెంచుకోవడంతో పాటు బొగ్గు ఆధారిత విద్యుత్‍ ఉత్పత్తిని 3.7 శాతానికి తగ్గించుకున్నది. దక్షిణ చైనాలో యాంగ్సీ నదిపై చైనా నిర్మించిన జల విద్యుత్‍ ప్రాజెక్ట్ ‘‘త్రీ గార్జెస్‍ డ్యాం’’ గురించి అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచంలో నిర్మితమైన అతి పెద్ద ఉత్పాదక సామర్థ్యం కలిగిన జల విద్యుత్‍ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 22,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నది. ఇంత భారీ జల విద్యుత్‍ ప్రాజెక్ట్ వలన థర్మల్‍ విద్యుత్‍
ఉత్పత్తికి ఏటా 31 మిలియన్‍ టన్నుల బొగ్గు వినియోగం తగ్గనున్నది. ఫలితంగా 100 మిలియన్‍ టన్నుల గ్రీన్‍ హౌజ్‍ గ్యాస్‍ ఉద్ఘారాలు, కొన్ని మిలియన్‍ టన్నుల పొడి రేణువులు (Dust),ఒక మిలియన్‍ టన్నుల సల్ఫర్‍ డై ఆక్సైడ్‍, 3,70,000 టన్నుల నైట్రిక్‍ ఆసిడ్‍,10000 టన్నుల కార్బన్‍ మోనాక్సైడ్‍, తగినంత పరిమాణంలో పాదరసం వాతావరణంలోనికి పోకుండా నిరోధించగలుగుతుంది. 660 కి.మీ పరిధిలో అంతర్గత నౌకాయానం అభివ•ద్ది అయ్యింది. చవకైన రవాణా మార్గాలు ఏర్పడినాయి. టూరిజం గణనీయంగా పెరిగి ప్రజలకు ఉపాధి కలుగజేస్తున్నది. జలాశయం నిర్మాణం వలన ముంపు బారినపడిన ప్రాంతంలో 1990 వ దశకంలో 13,000 చదరపు కి .మీ. గ్రీన్‍ కవర్‍ ని కోల్పోయింది. చైనా ప్రభుత్వం చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమం వలన గ్రీన్‍ కవర్‍ 2008 నాటికల్లా 6000 చదరపు కి.మీ. పెరిగినట్లు ఇక్యరాజ్య సమితి ఆహార & వ్యవసాయ సంస్థ ప్రకటించింది.


గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ ఆఫ్రికా :

చైనా గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ స్పూర్తితో ఆఫికన్‍ యూనియన్‍ దేశాలు కూడా సహారా మరియు సాహెల్‍ ఎడారుల విస్తరణను ఆపడానికి 8000 కిమీ పొడవున గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ ఆఫ్రికా ప్రాజెక్టును 2007లో ప్రారంభించారు. 2030 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారు. ఇది పూర్తి అవుతే ఇది మరొక మానవ మహా నిర్మాణంగా నిలచి పోతుందని ప్రాజెక్ట్ నిర్వాహకులు భావిస్తున్నారు. చెట్లు నాటడంలో చైనా తర్వాత ఇది రెండవ అతి పెద్ద మానవ ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.


బ్రెజిల్‍ అట్లాంటిక్‍ అడవుల పునరుద్దరణ :
బ్రెజిల్‍లో అట్లాంటిక్‍ వర్షాధారిత అడవుల పునరుద్దరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. 1500 సంవత్సరంలో పోర్చుగీసు నావికులు బ్రెజిల్‍ తూర్పు తీరం చేరుకున్నప్పుడు వారికి ఈ అట్లాంటిక్‍ అడవులు ఒక గ్రీన్‍ వాల్‍ లాగా కనిపించాయి. వాటిని దాటుకుని బ్రెజిల్‍ లోపలికి ప్రవేశించడం దుర్లభంగా ఉండింది. ఈ అడవులు బ్రెజిల్‍ తూర్పు తీరాన్ని దాటుకొని అర్జెంటీనా, పేరాగ్వె తీరం దాకా సుమారు 10 లక్షల చదరపు కిమీ మేరకు విస్తరించి ఉండేవి. 16 వ శతాబ్దం చివరి నాటికి యూరప్‍ వలసవాదుల దాడికి గురి అయి ఈ అట్లాంటిక్‍ అడవులు నాశనమై చెరుకు, కాఫీ, కోకో, నీలి మందు ప్లాంటేషన్‍ కు నిలయమైనాయి. బొగ్గు ఉత్పత్తి కోసం, పరిశ్రమలు, గృహ నిర్మాణం, వ్యవసాయ విస్తరణ.. తదితర మానవ అవసరాల కోసం వేలకు వేల చదరపు కిలోమీటర్ల అట్లాంటిక్‍ అడవులు నాశనం అయినాయి. బ్రెజిల్‍ చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలచింది. 20 శతాబ్దంలో అడవుల నరికివేత పెద్ద ఎత్తున సాగినట్టు రికార్డులు చెపుతున్నాయి. యూరప్‍ వలసవాదులు బ్రెజిల్‍ తూర్పు తీరం చేరిన 500 వందల ఏండ్ల తర్వాత మిగిలిపోయిన అట్లాంటిక్‍ అడవులు 7% మాత్రమే. అదే సమయంలో అమెజాన్‍ అడవులు 19% నాశనం అయినాయి. అట్లాంటిక్‍ అడవుల విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు బ్రెజిల్‍ తూర్పు తీరంలో అట్లాంటిక్‍ వర్షాధారిత అడవుల పునరుద్దరణ కార్యక్రమం మొదలయ్యింది. 2020 నాటికి 35 లక్షల ఎకరాలలో అట్లాంటిక్‍ ఆడవువుల పునరుద్దరణ జరిగినట్టు పరిశీలకులు అంచనా వేశారు. ఈ ప్రయత్నం బ్రెజిల్‍తో పాటు మొత్తం లాటిన్‍ అమెరికా దేశాల వాతావరణ పునరుద్దరణకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తల అంచనా.


తెలంగాణకు హరిత హారం :
అడవులను తిరిగి పునరుజ్జీవింపజేయడం తప్పనిసరి అవసరాన్ని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‍ ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ అడవుల పాలసీలో (National Forest Policy) పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచడం హరితహారం లక్ష్యం. ఐదు దశలలో 230 కోట్ల మొక్కలను నాటడం, వాటిలో 80 శాతం మొక్కలను రక్షించుకునే విధంగా జూలై 2015లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన హరితహారం కార్యక్రమం జయప్రదంగా అమలు అవుతున్నది. ఈ 5 ఏండ్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 211.74 కోట్ల మొక్కలను నాటినట్టు తెలుస్తున్నది. ఇందులో 140 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతానికి ఆవల, 71.74 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతంలో నాటినట్టు తెలుస్తున్నది. ఈ ఇదేండ్ల హరితహారం అమలు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2015తో పోల్చినప్పుడు గ్రీన్‍ కవర్‍ 3.70 శాతం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్‍ ఇండియా వారు 2019 లో నిర్వహించిన సర్వేలో నిర్ధారించినారు. హరితహారం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదేండ్లలో రూ. 5,230.06 కోట్లు ఖర్చు చేసింది. మొక్కల సరఫరా కోసం రాష్ట్ర వ్యాప్తం మొత్తం 14,926 నర్సరీలను ఏర్పాటు చేసారు. 9.63 లక్షల ఎకరాల్లో అడవుల పునరుద్దరణ జరిగింది. మొక్కల రక్షణ కోసం పంచాయతీ రాజ్‍, మునిసిపల్‍ చట్టాల్లో నిబంధనలు చేర్చడం జరిగినది. ఈ చట్టాలలో మొక్కల పెంపకానికి, నర్సరీల నిర్వాహణకు స్థానిక సంస్థలు గ్రీన్‍ ఫండ్‍ పేరిట తమ నిధుల్లో 10 శాతం కేటాయించమని నిర్దేశించారు. ఇది హరితహారం సాధించిన విజయంగా చెప్పవచ్చు. గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ చైనా, గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ ఆఫ్రికా ప్రాజెక్టుల తర్వాత అతి పెద్ద మానవ ప్రయత్నంగా తర్వాతి స్థానం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమానిదే.


గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ ఇండియా :
రాజస్తాన్‍లో ఉన్న థార్‍ ఎడారి విస్తరణను నిరోధించడానికి గుజరాత్‍ పోర్‍ బందర్‍ నుంచి హర్యానా పానిపట్‍ వరకు 1400 కిమీ పొడవున గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ ఇండియా ప్రాజెక్టు ను భారత ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తున్నది. దిద్దుకోబోతున్నది. ఆరావళి పర్వత సానువులల్లో ఒకప్పుడు ఉండిన అడవిని పునరుద్దరించడం ఈ ప్రాజెక్టులో భాగం. థార్‍ ఎడారి వచ్చే ఇసుక తుఫానులను, దుమ్మును ఈ గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ అడ్డుకోనున్నది. ఈ ప్రాజెక్ట్ ఇంకా అధ్యయన దశలోనే ఉన్నది. ఇది పూర్తి అవుతే గ్రేట్‍ గ్రీన్‍ వాల్‍ ఆఫ్‍ ఇండియాగా ప్రసిద్దికెక్కనున్నది.


మానవాళి కండ్లు తెరుస్తుందా?
ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నామనం పర్యావరణానికి చేస్తున్న హానిపరిమాణం ముందు ఇవి చాలాచాలా చిన్నప్రయత్నాలుగా మిగిలిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 229 హెరిటేజ్‍ సైట్స్లో 114 అభివ•ద్దికి బలిపోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల ఆవేదన. తాత్కాల ప్రణాళికలు, ధీర్గ కాల ప్రణాళికలు.. చిత్తశుద్దితో అడవుల నరికివేతను తగ్గించుకోవడం, అటవీ భూములను పునరుద్దరించుకోవడం, పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టడం (దీన్ని New Generation Plantation అంటున్నారు), కర్బన ఉద్ఘారాలను గణనీయంగా తగ్గించుకోవడం, ఫాసిల్‍ ఇంధన వినియోగం నుంచి ఇతర రెన్యూయెబుల్‍ ఎనర్జీ (Renewable Energy) వినియోగం వైపుకు మళ్లడం.. ఈ ప్రయత్నాలు అన్నిదేశాలు ఏకోన్ముఖంగా సుధీర్ఘ కాలం పెద్ద ఎత్తున జరిపితే తప్ప ప్రకృతి ప్రకోపం తగ్గే అవకాశం లేదు. రెండు దశాబ్దాలుగా పర్యావరణ శాస్త్రవేత్తలు చేస్తున్నహెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మానవాళి ఇప్పుడైనా కండ్లు తెరుస్తుందా?


రెఫరెన్సులు :

  1. Harita Haram , Coffee Table Book Published by Forest Department, Govt. of Telangana
  2. Reports of Forest Survey of India, 2015, 2017, 2019
  3. Vrikshavedam, 2020
  4. Plantation for People, Planet for prosperity, Document published New Generation Plantation Platform, 2017
  5. Three Gorges Dam – Dam China, Document published by The Editors of Encyclopaedia Britannica
  6. Information supplied by Wikipedaedia.
  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *