లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ


పాడిపశువుల రవాణాలో జాగ్రత్తలు
పశువుల శరీరలక్షణాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పశువులను, శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
15-20 కి.మీ. లోపు దూరం ప్రయాణానికి ఎలాంటి వాహనం అవసరం లేదు. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ, కాలి నడకన తీసుకొని రావాలి. నడిపించే సందర్భాలలో ఒకేసారి చాలా దూరం నడిపించకూడదు. అలా చేస్తే పశువుల కాళ్ళ నొప్పితో బాధపడతాయి. కాళ్లు మెత్తబడి, మేత తినలేక, నడవలేక నీరసపడతాయి.


వాహనాల లోపల అంచులకు మేకులు, చీలిన రేకులు, చెక్కలు ఉండకూడదు. లోపలి అంచులకు గడ్డితో నింపిన బస్తా లను కట్టినచో వాహనానికి అడ్డంగా కట్టిన వాసాలు, వెదు రుగడలపైన, పశువు తలభాగం ఉంచి కట్టివేయాలి. ఒకే పరిమాణం కల పశువులను ఒకే వరుసలో కట్టి వుంచాలి.
పశువు కాళ్ళ క్రింద వరిగడ్డి మందంగా పరవాలి. లేగదూడలను పశువుల కాళ్ళ దగ్గర ఉంచకుండా వాహనంలో విడిగా ఉంచాలి. లేకుంటే దూడలు కాళ్ళ క్రింద పడి, నలిగిపోయే అవకాశాలు ఉంటాయి.


రవాణా చేసేముందు పశువులకు ఒకేసారి ఎక్కువగా మేత, నీరు ఇవ్వకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అందివ్వాలి. రవాణా సమయంలో వాహనాలను, నెమ్మదిగా, ఎక్కువ కుదుపులు లేకుండా నడుపాలి.


ఒకలారీలో సాధారణంగా 8-10 పెద్ద పశువులను రవాణా చేయవచ్చును. ఒకటి, రెండు పశువులకు మినీ లారీలు సరిపోతాయి. వేసవిలో చల్లగా వుండే రాత్రి వేళల్లో పశువులను రవాణా చేయాలి. మధ్యాహ్నం విశ్రాంతినివ్వాలి. మధ్య మధ్యలో పశువులపై నీళ్ళు చల్లుతూ, వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి. పశువులను లారీల్లో రవాణా చేసే సమయంలో పడుకోనివ్వకూడదు. చూలి పశువుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పశువులతో పాటు ఒకరిద్దరు వ్యక్తులు వెంట వుండి అప్రమత్తంగా వుండాలి.


పశువుల రవాణా సందర్భంగా ఏదైనా ప్రమాదాలు సంభవించి పశునష్టం సంభవిస్తే, నష్టపరిహారం పొందటానికి ‘‘ట్రాన్సిట్‍ కవరేజి’’తో కూడిన ఇన్సూరెన్స్ చేయించడం మంచిది.


పశువులు ఇంటికి చేరాక, కొత్త వాతావరణానికి అలవాటు పడేలా ఓర్పుతో, ప్రేమతో మచ్చిక చేయాలి. ప్రయాణపు బడలిక నిర్మూలణకు అనాలిస్టిక్స్, విటమిన్లు, ఖణిజ లవణాలను వాడవలసి వుంటుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. క్రొమ్‍లాక్ట్ (కెమిన్‍) ద్రావణంను రోజుకు 100 మి.లీ. చొప్పున వారం రోజుల పాటు త్రాగిస్తే, రవాణా ఒత్తిడి నుండి పాడిపశువులు బయటపడి, పాల దిగుబడి చక్కగా ఉంటుంది.


పశువులకు గృహవసతి
శ్రేష్ఠమైన జాతి పశును ఎంపిక చేసుకొని, ఖరీదు చేసిన తరువాత జాగ్రత్తగా రవాణాచేసి ఇంటికి తీసుకొని రావాలి. తీసికొచ్చిన పశువుకు మంచి గృహవసతి కల్పించాలి. ప్రజానీకం సౌకర్యవంతమైన, సుఖమైన జీవనం కొరకు ఇంటికి ఎంతటి ప్రాముఖ్యత నిస్తారో, అదే విధంగా పశుసంపదకు కూడా సరైన వసతి కల్పించడం చాలా అవసరం. పశువులు ఎండ, వాన, చలి వంటి వాతావరణ తీవ్రతలకు గురికాకుండా ఉండాలంటే, తగిన విశ్రాంతి పొందాలంటే, వ్యాధినిరోధకశక్తి బాగుండి, ఆరోగ్యంగా ఉండాలంటే, దూడలు ఆరోగ్యంగా పెరగాలంటే, జంతువుల బారిన పడకుండా ఉండాలంటే, పాడి ఆవులు, గేదెలో పాలసామర్థ్యం తగ్గిపోకుండా ఉండాలంటే, వాటికి చక్కటి గృహవసతి కల్పించడం చాలా అవసరం. అందుకు సరైన ప్లానింగ్‍, చక్కటి డిజైనింగ్‍ అవసరం.


పశువుల ఫారాల్ని / పాకల్ని
ఎక్కడ నిర్మించుకోవాలి?

  1. గాలి, వెలుతురు ధారాళంగా వీచే ఎత్తైన, సమతులం ఉన్న ప్రదేశంలో పాకల్ని నిర్మించుకోవాలి. ఆ ప్రదేశం నీరు నిలుస్తూ, బురదలాగా కాకుండా, నీరు త్వరగా ఇంకిపోయి, ఆరిపోయే స్వభావం కలిగి వుంటే మంచిది.
  2. ఎంపిక చేసే ప్రదేశం, రైతు ఇంటి దగ్గరలో వుంటే పర్యవేక్షణ సులభంగా వుంటుంది.
  3. ఫారాలు నిర్మించే ప్రదేశం రోడ్డుకు దగ్గరగా వుంటే పాలు, దాణా, గ్రాసం రవాణాకు సౌకర్యంగా వుంటుంది. అలాగని హైవేలను, రైలు లైన్లను ఆనుకొని నిర్మిస్తే, ప్రశాంతత కరువైపోతుంది.
  4. పశువుల పాక వరకు 2.5 మీ వెడల్పుతో రహదారి సౌకర్యం ఉండాలి.
  5. పశువుల శాలను, స్థలాన్ని, పశువుల సంఖ్య, రాబోయే కాలంలో విస్తరణను దృష్టిలో ఉంచుకొని, స్థల పరిమాణాన్ని నిర్ణయించు కోవాలి.
  6. పశుగ్రాసాల పాకకు వినియోగించే స్థలం, పశువుల ఫారాల దగ్గరలో ఉంటే రవాణా ఖర్చులు తగ్గుతాయి. లేబర్‍ను సద్వినియోగం చేసుకోవచ్చును.
  7. ఫారాలు నిర్మించే ప్రదేశంలో చెట్లు ఉంటే మంచిది. ఒకవేళ చెట్లు లేకుంటే, ఫారాలకు 25-45 మీ దూరంలో, అవిశ, సుబాబుల్‍, యూకలిప్టస్‍ లాంటి చెట్లను 3-5 వరుసల్లో, 6-7 మీ వెడల్పుతో నాటితే వడగాలుల్ని నిరోధిస్తాయి.
  8. ఎంపిక చేసే ప్రదేశంకు దగ్గరగా విద్యుత్‍ లైను ఉండాలి. లేకుంటే విద్యుత్‍ కనెక్షన్‍కు ఖర్చు చాలా అవుతుంది.
  9. ఫారాలు నిర్మించే ప్రాంతంలో నీళ్ళ లభ్యత బాగుండాలి. పశువులకు, పశుగ్రాసాల సాగుకు నీరు చాలా అవసరం. కనీసం భూగర్భజలాలు పుష్కలంగా ఉండాలి.
  10. లేబర్‍ కుటుంబాలకు కావలసిన కనీస సౌకర్యాలు, షాపులు, స్కూల్సు దగ్గరలో ఉంటే బావుంటుంది.
    ఫొటోలు : బాలరణ్య
  • ఆనబోయిన స్వామి
    ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *