నిలుపరా నీ రాష్ట్రం నిండు చరిత్రను…


మానవ వికాస చరిత్ర అనంతంగా దొరుకుతూనే వుంది. నిర్విరామంగా, ప్రపంచ పరివ్యాప్తంగా జరుగుతున్న పరిశోధకుల అన్వేషణలలో కొత్త సంగతులు బయటపడ్తూనే వున్నాయి. ఏనాటికానాటికి చరిత్ర కొత్తపుటలు తొడుక్కుంటూనే వున్నది. ఆ కొత్త పేజీలలో మనిషి ఎదిగిన తీరుతెన్నులు ఆశ్చర్యపరుస్తూనే వున్నాయి. ఇప్పటి మనుషులకు ఎప్పటి సంగతులో తెలుస్తున్నపుడల్లా విస్మయానందభరితులౌతున్నారు. పాతుకుపోయిన పాతనమ్మకాల నుంచి బయటపడాలంటే చరిత్ర తెలియడం గొప్ప చికిత్స. గతంలోని మానవ నాగరికతా, సంస్కృతులు పొందిన పరిణతుల గ్రాఫ్‍ గీసుకుంటే తెలుస్తుంది మనిషి తప్పొప్పుల పట్టిక. చరిత్ర మనకు చెప్పే పాఠం గతంలో మనిషి జీవనాన్ని భగ్నపరిచిన, ధ్వంసం చేసిన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలనే కదా.
మన ఊరిలోనే పురామానవుని సమాధులుండొచ్చు. ఆ సమాధులనుంచి ఆనాటి మనుషుల బతుకు తీరుతెన్నులు తెలియజేసే వస్వాధారాలు దొరకవచ్చు. ఆ వస్తువులలో ఈనాటి నాగరికులు ఆరాధించే దేవతల పూర్వరూపాలో, పాటించే మరణాంతర కర్మకాండలో, ఆహార సేకరణ, ఉత్పత్తుల పద్ధతులో, నగలో, నాణాలో, ఆయుధాలను పోలినవి ఉంటాయి. మనం మన పూర్వీకుల నాగరికతా, సంస్కృతులను అర్థం చేసుకునే అవగాహనా జ్ఞానాన్ని పొందుతాం.


ఇట్లాంటి సమాధుల్ని చరిత్రకారులు పేర్కొనే ఇనుప లేదా బృహత్సిలా (పెదరాతి) లేదా మెగాలిథిక్‍ సమాధులంటారు. మనదేశంలో క్రీ.పూ.1800 సం.ల నుంచి క్రీ.శ.300సం.ల వరకు ఇనుపయుగమని చరిత్రకారులు చేసిన కాలనిర్ణయం. కాని, 2017లో తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలంలోని పాలమాకుల, నర్మెటలలోని (36 సమాధులు) పెదరాతియుగం సమాధులలో 4గింటి తవ్వకాలను అప్పటి పురావస్తుశాఖ సంచాలకులు విశాలాక్షిగారి ఆధ్వర్యంలో పురావస్తుశాఖ డైరెక్టర్‍ రాములునాయక్‍, డిప్యూటీ డైరెక్టర్‍ పద్మనాభం, సహాయ సంచాలకులు నాగరాజు, ప్రాచీన కట్టడాల సంరక్షకుడు భానుమూర్తి, గంగాదేవిలతో కూడిన పురావస్తుశాఖ బృందం (వారసత్వశాఖ) చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది మూడవది. గతంలో పుల్లూరు తవ్వకాలలో దొరికిన మానవాస్థికలను పరీక్షించిన సీసీఎంబి ఆ ఎముకల్లోని డిఎన్‍ఏ ఆధారంగా అవి క్రీ.పూ.2,500సం.ల నాటివని తెలిపింది. అంతేకాదు ఆ ఎముకలు మధ్యాసియా ప్రజలవని, వారిక్కడకు వలసవచ్చినవారని తెలుస్తున్నదని కూడా ఒక ప్రకటనలో పురావస్తుశాఖ డైరెక్టర్‍ తెలియజేసారు. గతంలో హైద్రాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ ప్రాంగణంలో పెదరాతియుగం తవ్వకాలు జరిపించిన ఆర్కియాలజిస్టు కె.పి.రావు, అక్కడి సమాధులు కూడా అప్పటివేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఈ తవ్వకాలలో లభించిన మానవాస్థికలను కూడా సీసీఎంబికి పంపించి, పరీక్షలు చేయించాలని, అపుడు ఆనాటి పురామానవుల ఆహారపుటలవాట్లు, జీవితకాలం, వారి జాతివివరాలు తెలుస్తాయని అధికారులు పత్రికలకు తెలియజేసారు.


నర్మెట, పాలమాకులలో జరిపిన పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన వస్త్వాధారాలలో కుండలు, ఇనుప ఉలి, కత్తి, బరిసెలు, రాతిపని ముట్లు, జంతువుల దంతాలు, పురామానవులు అలంకరణ కొరకు వాడుకున్న ఎముకల బిళ్ళపూస లున్నాయి. కుండలలో ఎరుపు, నలుపురంగు (R&B Ware) కుండలు, కుంపటి, కుదురులు, వంటపాత్రలు, నీటిగిన్నెలు, ధాన్యపుకుండలున్నాయి. రాళ్ళను తొలువడానికి వాడే ఒక ఇనుపఉలి దొరికింది. సమాధులలో మరణించిన వారు వాడుకున్న మట్టి (మృణ్మయ) పాత్రలు, ధాన్యం నింపిన కుండలు దొరికాయి. ఇనుప ఆయుధం ఒకటి లభించింది. డైమండ్‍ ఆకారంలో ఉన్న బొక్కల పూసబిళ్ళలు దొరకడం నాటి పురామానవులు అలంకార ప్రియత్వాన్ని తెలుపుతున్నాయి. నర్మెటలో తవ్విన 4సమాధులలో మొదటి సమాధి మీద పరిచిన, ఆసియాలోనే అతిబరువైన 30టన్నుల మూతరాయిబండను తొలగించారు. 3వ సమాధిలో మట్టిపాత్రలు దొరికాయి. ఇందులోనే ఎముకలు లభించాయి. వీటిలో 40సెం.మీ.ల పొడవైన పురామానవుని మోచేతి ఎముక వుంది. ఎముకల శాంపిల్స్ ని హైద్రాబాదులోని సీసీఎంబికి పరీక్షల నిమిత్తం పురావస్తుశాఖ పంపించింది. పురావస్తుశాఖ నివేదిక ఇంకా విడుదల కావాల్సివుంది. సమాధులున్న ప్రాంతంలో ఒక రాతిగొడ్డలి దొరికింది.


నర్మెట, పాలమాకులలో పెదరాతియుగం సమాధులున్న ప్రాంతంలోనే ఒక రాతిబండమీద ప్రత్యేకమైన పంక్తులలో చెక్కిన రాతిబొద్దులు (Cupules) న్నాయి. వీటిని ముడుమాలలోని రాతిగద్దెమీద చెక్కిన నక్షత్రమండలంతో పోల్చవచ్చు. ఇవికూడా నక్షత్రపథాన్ని సూచిస్తున్నాయి. ఏ నక్షత్రమండలాకారంలో ఉన్నాయో చెప్పడానికి పరిశోధనలు చేయవలసివుంది. ఈ ప్రాంతంలో సిద్దిపేట మండలం పుల్లూరు, కొండపాక, నారాయణరావుపేట, పొన్నాలలో, నంగునూరు మండలం రాజగోపాల్‍పేట, నర్మెట, పాలమాకుల, వెల్కటూరు, గట్లమల్యాల, బద్దిపడగలలో, కోహెడ మండలంలోని కోహెడ, తంగెల్లపల్లి, కూరెల్లలో, మరుకుక్కు మండలంలోని మరుకుక్కులో, చిన్నకోడూరు మండలంలోని సందులాపూర్‍, రామంచ, రామునిపట్ల, ఇబ్రహీంనగర్‍, దామరకుంట(మరుకుక్కు)లో, ఇంకా ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్‍, వరదరాజపురంలో, మరిన్ని గ్రామాలలో పెదరాతియుగం సమాధులున్నాయి.


ఈ సమాధులన్నింటిలో బంతిరాళ్ళు పేర్చిన సిస్టు (పెట్టె) సమాధులే ఎక్కువ. ఆ సమాధులలోని తలాపు రాతిసలపకు కంత(పోర్ట్ హోల్‍) ఉండడం ఒకే సాంస్కృతిక సంప్రదాయం. మరణించిన వారి ఆత్మలు ఈ కంతల నుంచి బయటికి వెళ్ళి, మళ్ళీ సమాధులలోనికి వస్తాయన్నది పురా విశ్వాసం. ఈ నమ్మకాల జాబితాలో సమాధులలో వుంచిన ధాన్యం కుండలు, కర్మకాండ పాత్రలు, వారి ఆయుధాల వంటివి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సమాధుల విషయంలో ఎన్నోపోలికలున్నాయి. సిద్ధిపేట జిల్లా మరుకుక్కు మండల కేంద్రంలోని సమాధులు (సిస్టుల నిర్మాణం, మెన్హర్లు, బంతిరాళ్ళు) ఇరాక్‍ లోని ఇర్కుక్‍ లోని సమాధులతో పోలివున్నాయని చరిత్రకారుల అభిప్రాయమని 30యేండ్ల క్రితమే పత్రికలు రాసాయి. ఇపుడా మాటను రుజువుచేసే సాక్ష్యం పుల్లూరు తవ్వకాలిచ్చాయి కదా.


ఆ అభిప్రాయాన్ని రుజువుచేసే సాక్ష్యం ఇటీవల నంగునూరు మండల కేంద్రంలో నివసించే మా చరిత్రబృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‍ చేతికి దొరికింది. కొలిపాక శ్రీనివాస్‍ ఈ వస్తువు లభించేనాటికే తనవూరి పాటిగడ్డమీద, తమపొలం పరిసరాల్లో అనేక పురావస్తువులను సేకరించాడు. నంగునూరులో తనకు టెర్రకోట మట్టిపూసలు, ఇనుప ములికి, పైసలుగా వాడిన గవ్వలు, టెర్రకోట పెండెంట్‍ దొరికాయి. అన్నింటికన్నా మిన్న తనకు దొరికిన టెర్రకోట ఎద్దుతల బొమ్మ. ఈ బొమ్మను పోలిన టెర్రకోట బొమ్మలు ఇజ్రాయిల్‍, ఆఫ్ఘనిస్తాన్‍, ఇరాక్‍ దేశాలలో, సింధులోయ నాగరిక వస్తువులలో లభించాయి. ఇది మనకు మధ్యాసియా వారికి ఉన్న సాంస్కృతిక సంబంధాలను స్థాపించే రుజువునిస్తున్నది. మనవద్ద కొండపాకలో కూడా ఎద్దుశరీరం నడుం నుంచి వెనకభాగం టెర్రకోట బొమ్మ దొరికింది. ఇవి మనరాష్ట్రంలో ఈ ప్రాంతంలో దొరికిన విలువైన పురావస్త్వాధారాలు. రెండోది టెర్రకోట పెండెంట్‍. మనదేశంలో ఇటువంటి పెండెంట్లు దొరికింది చాలా అరుదు. రోమన్ల టెర్రకోట పెండెంట్లను తలపించిన ఈ టెర్రకోట పెండెంట్‍ నంగునూరులో దొరకడం ఒక చారిత్రక పరిణామగతిలో విశేషమే. ఇంకా మనం మన చరిత్రను మరింత లోతుగా వెతకాలని గుర్తుచేసే సంకేతం ఆ వస్తువు.


మనిషి జీవన సంస్కృతిలో అనేకానేక పరిణామాలు సంభవించాయి. ప్రాకృతికంగా కొన్ని, మనిషియొక్క స్వాభావికమైన ఉత్సుకతలవల్ల కొన్ని, నిరంతరంగా ఏర్పడే అవసరాల నిమిత్తం పూర్వానుభవాల నుంచి మనిషి గ్రహించిన జ్ఞానం కొత్తవస్తువులను తయారుచేసుకునేటట్లు చేసింది. మనిషి తనకు పనికొచ్చిన వస్తువులను, తనకు తిండిగా పనికొచ్చిన జంతువుల్ని, తమని చంపిన జంతువుల్ని గుర్తుపెట్టుకుని ఆరాధించాడు. ప్రేమించాడు. అవన్నీ దైవాలుగా మారడానికి చాలాకాలం పట్టింది. నంగునూరులో దొరికిన ఎద్దుతల మనిషికి వ్యవసాయానికి పనికొచ్చిన, తిండికి పనికొచ్చిన, బతుకుతెరువులో బాసటగా నిల్చిన జంతువు యాది. అది మనిషి ఆ జంతువుపట్ల కలిగివున్న గౌరవం. ఎడితనూర్లో గద్దగుండు మీద గీసిన రెండు మహిషాల గీటుబొమ్మలు (పెట్రోగ్లైఫ్స్) అప్పటి మనిషి తన సమూహానికి ఎంచుకున్న టోటెం చిహ్నాలు.


మా చరిత్రబృందం అన్వేషణలో సిద్ధిపేట జిల్లా కొండపాక మండలకేంద్రంలో గ్రామానికి దక్షిణదిశలో పారే ‘దక్షిణ గంగ’ అంచున చిన్నరాతిబోడు మల్లన్నగుట్ట వద్ద వున్న చెలకలలో శాతవాహనుల నాటి ఇటుకలు, అమ్మదేవత టెర్రకోటబొమ్మల శకలాలు, కుండపెంకులు, చిన్న సైజు (గురుగులవంటి) మట్టిపాత్రలు, టెర్రకోట పూసలు, దోసిళ్ళకొద్ది ఆభరణాలలో వాడుకునే నల్లపూసలు, పగడాలు, రంగు, రంగుల పూసలు, గాజు పరిశ్రమలో వాడిన రంగురాతి ముక్కలు, ఇనుప పరిశ్రమలో మిగిలిన ఇనుం చిట్టేలుకొల్లలుగా దొరికాయి. అరణితో నిప్పు రాజేసేటందుకు వాడే గుంటవున్న రాయి, ‘fire starting stone’ కూడా లభించడం విశేషం. అంతేకాదు హరప్పా తవ్వకాలలో దొరికినటువంటి ఎముకతో చేసిన ‘పాచిక’ దొరకడం కూడా ప్రత్యేకంగా చెప్పదగిన సంగతే. శానం వంటి చీల్పుడు పనిముట్టొకటి, అంతేకాదు శాతవాహనుల కాలానికి ముందునాటి చరిత్ర పూర్వయుగంలోని కొత్తరాతి యుగం రాతి పనిముట్లు ఒకేచోట లభించాయి. ఇవి ఈ ప్రాంతంలో పురామానవుల ఆవాస కేంద్రాలున్నట్టు తెలిపే ఆధారాలు. శాతవాహనులకాలం నుంచి చాలా కాలం దాకా ఇక్కడ గాజుపరిశ్రమ వున్నట్టు తెలుసుకోవడానికి ఇక్కడ లభిస్తున్న గాజు అంటిన వివిధకాలాలకు చెందిన కుండ పెంకులు సాక్ష్యాలు. టెర్రకోట బొమ్మలు కూడా సాతవాహనుల కాలానికి చెందినవే. మనకు వీటిని పోలిన టెర్రకోటబొమ్మలు కొండాపూర్‍ తవ్వకాలలో దొరికాయి.


ఈ ప్రాంతంలో లభించిన రాతిగొడ్డండ్లు కూడా మానవ వికాసంలో, పరిణతిలో బండగుర్తులుగా నిలుస్తున్నాయి. పురామానవుడు పాతరాతియుగం నుంచి చివరి రాతియుగం పెదరాతియుగం దాకా వాడుకున్న రాతిపనిముట్ల తయారీలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. క్వార్టజ్ రాళ్ళతో మొదలుపెట్టిన ఈ రాతిపనిముట్ల తయారీ కొత్తరాతియుగందాక, పెదరాతియుగంలో కొంతకాలం అగ్నిశిలలను వాడుకునే దాక వచ్చింది. రాతిపనిముట్లు పరిమాణాన్ని తగ్గించడమనేది మానవవికాసంలో గొప్ప మలుపు. దీన్నే Reduction of Tools అంటారు. మా బృందం పరిశీలనకు లభించిన రాతిగొడ్డండ్లను చరిత్రలో వివిధరకాల రాతిగొడ్లండ్లతో పోల్చిచూసాం. ఈ గొడ్డండ్ల డయాగ్రామ్స్ గీసి, వాటిని విశ్లేషించేందుకు సాయపడ్డాడు మా అహోబిలం కరుణాకర్‍. వివిధ ఆకారాలలో వున్న ఈ రాతి పనిముట్లలో ఎక్కువగా చేతిగొడ్డండ్లు వున్నాయి. కొన్ని చీల్పుడు (క్లీవర్స్) రాళ్లు, చెక్కుడు రాళ్ళు (చాపర్స్) ఆ రాతిపనిముట్లలో వున్నాయి.

కొండపాకలో దొరికిన చేతిగొడ్డండ్లలో అండాకారంవి, బల్లెం మొన వంటివి, బాదాం కాయ ఆకారం గలవి ఎక్కువ వున్నాయి. ద్విపార్శ్వసౌష్టవ, ద్విముఖ, కుంభాకార గొడ్డండ్లే ఎక్కువున్నాయి. వాటిలో కొన్ని అవశిష్ట వల్కలాలతో వున్నాయి. కొన్ని ఆఘాతాలతో, కొన్ని మెత్తటి సుత్తెదెబ్బలతో చేసినవి వున్నాయి. లభించిన రాతిపరికరాలలో అపూర్వమైన రెండువైపుల ఆయుధపు టంచులున్న (Double edged Hand axe) గొడ్డలి విశేషమైనది. ఏకపార్శ్వ కుంభాకారంతో 8అంగుళాల పొడవు, 4అంగుళాల వెడల్పులున్న ఈ పనిముట్టు ఇంతవరకు లభించిన వాటిలో ప్రత్యేకమైనది. చాలా అరుదైనది. ఇటువంటి గొడ్డండ్లు ఇనుముతో చేసినవి లభించాయి. యుద్ధంలో వాడే ఇనుప గండ్రగొడ్డలి పాత మహబూబ్‍ నగర్‍లో లభించినట్టు తెలిసింది. కాని, రెండంచుల ఆయుధంతో గొడ్డలి దొరకడం ఇదే ప్రథమం తెలంగాణలో.


ఈ రాతి పనిముట్లలో 7అంగుళాల పొడవు, 4అంగుళాల చుట్టుకొలతలున్న ద్వికుంభాకార, ద్విపార్శ్వముఖ, ధీర్ఘలంబితమైన బల్లెపుటాకారపు గొడ్డండ్లు, 6 నుంచి 3.5 అంగుళాల పొడవు, 4 నుంచి 2.6 అంగుళాల చుట్టుకొలతలున్న బాదంకాయ ఆకారంలో ద్వికుంభాకారం, ద్విపార్శ్వముఖాలతో ట్రెపీజియం రూపంలో కనిపించే చేతిగొడ్డండ్లు న్నాయి. మొత్తం లభించిన గొడ్డండ్లు 21. వాటిలో వాడనివి, కొత్తవి 9, వాడినవి, అరిగినవి 9, విరిగినవి 3. ఈ వివరాలతో ఈ ప్రదేశం కొత్తరాతియుగంలో పనిముట్ల కార్ఖానా అని చెప్పవచ్చు. ఇక్కడ లభించే గట్టివి, విరుగనివి అగ్నిశిలలను రాతిగొడ్డండ్ల తయారీకి వాడినారు.
ఈ ప్రాంతంలోనే మా చరిత్రబృందానికి తిమ్మారెడ్డి (కొండపాక), వెంకటాపూర్‍ (), రేగొండ (హుస్నాబాద్‍), లకుడారం, గిరాయిపల్లి (కొండపాక) దామరకుంట (మరుకుక్కు), వీరన్నపేట (చేర్యాల) రాతిచిత్రాలు లభించాయి. మెదక్‍ జిల్లాలో మరిన్ని రాతిచిత్రాల తావులను అన్వేషించింది మా బృందం. ఈ రాతిచిత్రాలలో పలుచోట్ల అగుపించిన ఎద్దులబొమ్మలు కొత్తరాతియుగంలో పురామానవుల వ్యవసాయ సంస్కృతీవికాసానికి బొమ్మలలిపి సంతకాలు.


పోస్ట్ స్క్రిప్ట్:
నంగునూరు కళ్యాణీ చాళుక్యుల పరిపాలనలో ఒక పాలనాకేంద్రం. ‘చతుర్థకులజుండైన’ రేవిరడ్డి నంగునూరి పాలకుడు. చండిరడ్డికి తండ్రి. రేవిరడ్డికి మిత్రుడైన పున్నిరడ్డి పుత్రుడు మల్లారడ్డి జిట్టకుల తిలకము వంటివాడు.


కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో ప్రసిద్ధ నంగునూరి పాలకుడు రేవిరెడ్డి మిత్రుడు పున్నిరెడ్డి అని బెక్కల్లు శాసనసారాంశంలో వుంది. కాని, శాసనంలో ‘నంగునూరి వల్లభుండగు రేవిరడ్డికి విలాస రతీశుండు (అంటే స్నేహితుడా? రేవిరడ్డికి పున్నరడ్డి స్నేహితుడని శాసనం పరిచయంలో రాసివుంది.) పౌత్రుండైన వీతభయుండు పున్నిరడ్డి’ (24 నుంచి 35 వరకు పంక్తులు) అని వుంది. అంటే నంగునూరు పాలకుడు రేవిరడ్డి కొడుకు చండిరడ్డి, రేవిరడ్డి మనవడు పున్నిరడ్డి. పున్నిరడ్డి కొడుకు మల్లరడ్డి. మల్లరడ్డి ‘కులతిలకుండండ్రు నన్నుం గులజనులని వేడ్కం జిట్టకుల తిలకము నా వెలయంగ వ్రెక్కంటం గరంబు… ము జినాగారమెత్తె నతి ధార్మికుండై’ అని శాసనం మొదటిపక్కలో ముగిసిపోతుంది. శాసనంలో ఒకచోట విష్టికులమని (8వ పంక్తి), మరోచోట జిట్టకులమని (45వ పంక్తి) వుంది.
ఈ పున్నిరెడ్డి (పున్నియరెడ్డి) ఆలేటి శాసనంలో(క్రీ.శ.1125) పేర్కొనబడ్డాడు?. పున్నిరెడ్డి కొడుకు మల్లారెడ్డి. మల్లరడ్డి వ్రెక్కంటి (బెక్కంటి) పురవరేశ్వరుడు (శాసనం 3వ పక్కన 11-12పంక్తులు). ముత్తాత రేవిరడ్డి నంగునూరు పాలకుడు మనవడు మల్లరడ్డినాటికి బెక్కల్లు పాలకుడైనట్లు శాసనం వల్ల తెలుస్తున్నది.
మల్లరడ్డిది ‘అప్రమిత నిర్మల బుద్ధి, సమృద్ధి శ్రావక వ్రతయుతులై వి(శిష్టుల)గు వారల వంశము’ అని శాసనంలోని 17-19పంక్తుల వల్ల విదితమౌతున్నది. అందువల్లనే జైనుడైన మల్లరడ్డి బెక్కల్లులో జినాగారం నిలిపాడు.


ఈ నంగునూరులో మహావీరుని జైనబసది వుండేదని చెప్పడానికి ఊరు బయట కాయోత్సర్గ భంగిమలో కనిపిస్తున్న గిన్నెదేవర (జినదేవర) (ఖానాపూర్‍ శాసనంలో గిన్నెదేవయాగి అని వుంది) నిలువెత్తు విగ్రహమే సాక్ష్యం. 10 అడుగుల ఎత్తు, 4 అడుగులకు పైగా వెడల్పున్న ఈ వర్థమాన మహావీరుని శిల్పం తెల్లగ్రానైట్‍ రాయిలో చెక్కబడ్డది. చిన్న పరుపుబండపై జినబసది నిర్మించబడ్డది. జినుని విగ్రహం చుట్టు పరిచిన ఇటుకల వేదిక, ఎదురుగా పరిచిన రాతిపలకలు, అంచులకు గోడ ఆనవాళ్ళుగా అక్కడక్కడ కనిపించే రాతికట్టలు పూర్వం అక్కడొక జైనదేవాలయ నిర్మాణం వుండేదనడానికి నిదర్శనాలు. జినదేవుని విగ్రహం పురుషాంగాన్ని చెక్కేసి గుంత తొలిచినట్టుంది. అందుకే అందరు జినదేవుని శిల్పాన్ని స్త్రీ శిల్పంగా భావించి, ఊరిబయటి దేవతగా పిలుస్తుంటారు. జైన దిగంబరత్వం గిట్టనివారు చేసిన ధ్వంసక్రియ విగ్రహాన్ని చెడగొట్టింది. జైనం మీద జరిగిన దాడిగా కూడా చెప్పొచ్చు.


ఈ ప్రాంతంలో జరిపిన అన్వేషణలలో పాల్లొన్న వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్‍, అహోబిలం ప్రభాకర్‍, అహోబిలం కరుణాకర్‍, నసీర్‍, సామలేటి మహేశ్‍, అరవింద్‍ ఆర్య, సముద్రాల సునీల్‍, రాగిమురళి, కట్టా శ్రీనివాస్‍, కొలిపాక శ్రీనివాస్‍ లకు ప్రత్యేకంగా…
మొత్తంగా రాష్ట్రమంతటా విస్తరిస్తున్న చరిత్రబృందం సభ్యులందరికి నా అభినందనలు. ధన్యవాదాలు.

  • శ్రీ రామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *