అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-9 విష్ణుకుండిన గోవిందవర్మ


హైదరాబాదు ప్రాకృత బౌద్ధశాసనం (క్రీ.శ.4వ శతాబ్ది)


సిద్ధార్థుడు బుద్ధుడైన తరువాత శుద్ధోధనుని కోరికపై కపిలవస్తు మహానగరాన్ని సందర్శించటానికి అంగీకరించాడు. సిద్ధార్థ – గౌతముడు మళ్ళీ మనమధ్యకొస్తున్నాడని తెలుసుకొన్న శాక్యులంతా ఆనందపరవశులైనారు. ఆనోటా, ఈనోటా విన్న రాహులుడు, ఏడేళ్ల తరువాత తన తండ్రిని మొదటిసారిగా చూడబోతున్నందుకు ఆక్షణం ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. ఈ సంగతి తెలిసి పరమానందభరితయైన యశోధర ఇల్లూ, వాకిలీ అందంగా అలంకరించటంలో నిమగ్నమై తన్ను తాను మరచిపోయింది. ‘అమ్మా నా తండ్రి, బుద్ధ భగవానులవారొస్తు న్నారటగా ఆయన ఎలా ఉంటారో కొంచెం చెప్పవా’ అని రాహులుడు అడిగినపుడుగానీ యశోధర మళ్లీ ఈలోకంలోకి రాలేదు. ‘అవును రాహులా! నీ తండ్రి బుద్ధ భగవానులు మన నగరానికి వస్తున్నార’ని సంతోషం వెళ్లబుచ్చుతూ చెప్పింది యశోధర. ‘బుద్ధ భగవానులు ఎలా ఉంటారో చెప్పమ్మ’ అని మళ్లీ అడిగిన రాహులునితో ‘నాయనా నీ తండ్రి నరసీహుడు. నరుల్లో సింహంలాంటి వాడు’ అని చెప్పి తన పనిలో తాను మునిగిపోయింది. ఈ వివరాలన్ని ఉన్న నరసీహగాథను విన్న బౌద్ధేతర వాదులు ‘నరసీహ’ పదాన్ని గ్రహించి సగం నరుడు, సగం సింహం రూపాలను కలగలిపి నరసింహుడెవరోకాదు విష్ణుమూర్తి మరో అవతారమే నన్నారు. అప్పట్నించి నరసింహుడు మహా బలవంతుడ (అహోబలుడ)ని, ఉగ్రుడైన నరసింహుడు చల్లబడటానికి కొండ గుహల్లోనే నివసించాడంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ పున్నమినాడు ప్రజలందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకొనే బుద్ధజయంతి ఉత్సవాలనాడే నృసింహజయంతిని జరుపుకొనే సంప్రదాయం వచ్చింది. అహోబిలం, మంగళగిరి, భీమునిపట్నం (పావురాళ్ళ కొండ), సింహాచలం మొదలైన నరసింహ క్షేత్రాలన్నీ ఒకనాటి బౌద్ధ స్థావరాలే.


హైదరాబాదు నగరం నడిబొడ్డున మూసీ తీరానగల చైతన్యపురిలోని కొండగుహల దగ్గరున్న క్రీ.శ.నాలుగో శతాబ్దం నాటి బౌద్ధారామం ముప్పయ్యేళ్ళ క్రితం (1979-80 ప్రాంతంలో) కొసగుండ్ల నరసింహస్వామి ఆలయమైంది.
చైతన్యపురికి దక్షిణానున్న మూసీ ఒడ్డున వెలసిన న్యూమారుతీనగర్‍, ఫణిగిరి, గౌడ్‍ కాలనీల్లో ఇళ్ల కోసం పునాదులు తీసినపుడల్లా పగిలిన ఇటుకలు నలుపు-ఎరుపు, ఎరుపు రంగు నగీషీగల కుండపెంకులు బయటపడుతూనే ఉన్నాయి. శాత వాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన (క్రీ.శ. 2 నుంచి క్రీ.శ.5వ శతాబ్దాలు) కాలాలకు చెందిన ఈ పురావస్తువులు ఈ ప్రాంతం ప్రాచీన జనావాసంగా ఉండేదని రుజువు చేస్తున్నాయి.


1979-80 సం।।లో స్థానికులు కొసగుండ్లపై ఏవో రాతలున్నాయని గుర్తించి, పురావస్తుశాఖకు తెలియ జేయగా, ప్రముఖ శాసన పరిశోధకులు పి.వి.పరబ్రహ్మశాస్త్రి, ఆ శాసనం నకలు తీసి పరిశోధించి, అది క్రీ.శ.4వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ అక్షరాలతో నున్న ప్రాకృత శాసనమని తేల్చి చెప్పారు. అంతేకాదు. అక్కడొక బౌద్ధ విహారముండేదని విష్ణుకుండిన రాజ్య స్థాపకుడైన గోవిందవర్మ తన పేర నిర్మించిన బౌద్ధ విహార నిర్వహణకు కొన్ని దానాలను కూడా చేశాడని తెలియజేశారు.
శాతవాహన, ఇక్ష్వాకుల తరువాత బౌద్ధానికి రాజాదరణ లభించింది విష్ణుకుండినుల కాలంలోనే. విష్ణుకుండిన మొదటి గోవిందవర్మ పట్టపురాణి పరమభట్టారిక మహాదేవి ఇంద్రపాలపురం (నల్లగొండజిల్లా తుమ్మలగూడెం)లో తన పేరిట ఒక మహావిహారాన్ని నిర్మించి, అక్కడ నివసించే చతుర్ధిశార్యవరభిక్షు సంఘానికి భోజనం, నీటి ఏర్పాట్లు, ధూప. దీప, గంధ, పుష్పాలకు, కట్టడాల మరమ్మతులకూ అవసరమైన నిధుల కోసం తన భర్త గోవిందవర్మ చేత ఎర్మదల, పెన్కపఱు అనే గ్రామాలను దానం చేయించింది. ఇంతేకాదు, ఇతరచోట్ల కూడా ఆమె ఇంకా స్థూప, చైత్య, విహారాలను నిర్మించి బౌద్ధ భిక్షువుల కోసం శయనాసనాలను కూడా కల్పించి సర్వజీవరాసుల హితాన్ని కోరే బౌద్ధం పట్ల తన మక్కువను తెలియజేసింది.


సిద్ధార్థ గౌతముని జీవితాన్నీ, అంతకు మించి బౌద్ధాన్నీ బాగా చదువుకొన్న గోవిందరాజు గొప్ప బౌద్ధమతాభిమాని. బౌద్ధ ధమ్మ ప్రచారానికి పూనుకొని, తన పాలనలోని అన్ని జిల్లాలోనూ, స్థూపాలను మనోహరంగా నిర్మించాడు. చైత్యాలను చక్కగా అలంకరించాడు. తాను ‘‘సకల సత్వధాతుత్రాణాయోత్పాదిత మహాబోధి చిత్తుడనని’’ శాసనాల్లో ప్రకటించుకొన్నాడు. విష్ణుకుండిన చివరి రాజైన రెండవ విక్రమేంద్రవర్మ (క్రీ.శ.6వ శతాబ్ది) పరమభట్టారిక మహాదేవి నిర్మించిన విహారంలో నివసించే భిక్షవుల కోసం ఇరుండేర అనే గ్రామాన్ని దానం చేశాడు. అంతేకాదు. ఒక శాసనంలో గోవిందవర్మ గుణగణాలను వివరిస్తూ, అతడు ‘‘షడభిజ్ఞ ప్రాతీహార్యదర్శనాను గ్రహజనిత సుగతశాసనాభి ప్రసాదుడనియూ, మహా విహార ప్రతిష్ఠాపనాధిగత అనంత పుణ్యసంభారుడనీ’’ విక్రమేంద్రవర్మ పేర్కొన్నాడు. ఇతని సామంతుల్లో ముఖ్యుడైన పృథ్వీమూలుని కొడుకు హరివర్మ కూడ గుణపాశపురంలో ఒక విహారాన్ని నిర్మించాడు. విష్ణుకుండినుల కాలంలో వైదిక మతం పుంజుకొన్నా బౌద్ధమతం జనరంజకంగానే కొనసాగింది.


చైతన్యపురి (ఫణిగిరి)లోని గోవిందరాజ బౌద్ధ విహారం దగ్గర కనుగొన్న ప్రాకృత శాసనంలో..
పురిమివిడాలపాడం హులావాసం పుబగిరి మహా
విహారపతిథాపకస వసుదేవసిరిదామస మహా
వీతరాగస పిండపాతిక ధమధరస
పరంపరాగతన బంరదేవ థవిర శిసేన భదంత
సంఘదేవేన గోవిద్దం రాజవిహారస గంధక చీవరక
…త సెల సంవాసధ ఘరంపతిధాపితమ్‍’
అని ఉంది.
క్రీ.శ. 4వ శతాబ్దినాటి ఈ శాసనంలో అక్కడ గోవిందరాజ విహారముందనీ, అందులో పిండపాతకశాఖకు చెందిన ధేరవాద బౌద్ధ భిక్షులుండేవారనీ, పిండపాతిక, ధమ్మధరుల పరంపరకు చెందిన బంరదేవుడనే బౌద్ధాచార్యుని శిష్యుడైన భదన్తసంఘదేవుని ఆధ్వర్యంలోనున్న భిక్షువులకు అవసరమైన గంధం, చీవరాల (భిక్షువు వంటిని కప్పుకొనే ఉత్తరాసంగ, నడుముకు చుట్టుకొనే అంతరవాసక, భుజాలమీదుగా పైన కప్పుకొనే సంఘాటి అనే మూడు బట్టల్ని త్రిచీవరాలంటారు) నందించే వారికోసం రాతితో కట్టిన ఆవాసాన్ని దానం చేసిన వివరాలున్నాయి.
విష్ణుకుండినులు, శాసనాల్లో వారు శ్రీపర్వతస్వామి పాదానుద్యాతులమని చెప్పుకొన్నారు. మహాయాన బౌద్ధ కేంద్రంగా అంతర్జాతీయఖ్యాతి గడించిన నాగార్జునకొండకు శ్రీపర్వతమని పేరున్నట్లు ఇక్ష్వాకుల శాసనాలు కోడైకూస్తున్నాయి. మహాకారుణికుడైన బుద్ధభగవానుడే శ్రీపర్వతస్వామి. అతడే వారి కులదైవం. సర్వస్వం పరిత్యాగం చేసిన గోవిందవర్మ తన ఆదాయాన్ని భిక్షు ద్విజానాథయాచక వ్యాధిత దీనకృపణజనోపభుజ్యమానంగా ఖర్చుపెట్టి వారి కోసం అనేక ఆయతన, విహారాలను నిర్మించిన పరమసౌగతికుడు.


ఇటీవల మల్‍తుమ్మెద వద్ద ఎం.ఎ.శ్రీనివాసన్‍, శంకరరెడ్డిల బృందం కనుగొన్న క్రీ.పూ.3వ శతాబ్ది శాసనం మునులగుట్ట వద్ద సునీల్‍ సముద్రాల, శ్రీరామోజు హరగోపాల్‍ వెలుగులోకి తెచ్చి క్రీ.పూ.2-1నాటి బ్రహ్మీశాసనాలు నుంచి కోటలింగాల, ధూళికట్ట, మొక్కాట్రావుపల్లి, ఫణిగిరి, పెద్దబంకూరు, నేలకొండపల్లి, బెక్కల్లు, కరీంనగర్‍లలో దొరికిన బ్రాహ్మీ, సంస్కృత, తెలుగు బౌద్ధ శాసనాలు. తెలంగాణలో బౌద్ధ ధర్మం వేళ్లూనుకొని, విస్తరించిన నేపథ్యాన్ని వివరిస్తున్నాయి.

చైతన్యపురిలోని గోవిందరాజ విహార ఉనికి, హైదరాబాదు నగర చరిత్రకు తిరుగులేని సాక్ష్యాన్నందించింది. ఈ శాసనంలో పిండపాతిక (బుద్ధుడు చెప్పిన 13 ధూతంగాలలో (ప్రమాణాలు)) ఒకటి. అంటే బౌద్ధ భిక్షువులు భిక్ష కోసం వెళ్లటం. గృహపతులు తమ భిక్షాపాత్ర (పట్టి)లో జారవిడిచే (పిండాలను) భోజన పదార్థాలను స్వీకరించటం. అన్ని బౌద్ధ శాఖల భిక్షువులు ఆనాడు పిండపాతిక ఆచారాన్ని పాటించారు. ఈ శాసనంలోని మరో పదం – పుబగిరి మహా విహారం. పూర్వగిరి మహావిహారం. దీన్ని చాలా మంది ఒడిషాలోని పుబ్బగిరి గానూ, మరికొందరు విజయవాడ దగ్గరి ఫెనుమాక – ఉండవెల్లి కొండగానూ, మరికొందరు కడపజిల్లా పుష్పగిరి గానూ గుర్తించారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఆ పుష్పగిరి మరో విహారాన్ని ప్రతిష్టాపించిన వసుదేవసిరిదాముడు, ధమధర (బుద్ధ ధర్మం తెలుసుకొని ప్రచారం చేసే ఆచార్యుల పరంపరకు చెందిన వాడని, అతడు మహావీతరాగుడని (అన్ని బంధాల నుంచి విముక్తుడైన వాడని), ఇంకా బంర(హ)దేవ స్థ విరుని శిష్యుడైన భదంత (గౌరవనీయ) సంఘ దేవుని ప్రస్తావన తొలిసారిగ ఈ శాసనంలోనే ఉంది. గంధం అన్న పదం, బుద్ధ, స్థూప, బుద్ధపాద వందన సందర్భాల్లో ధూప, దీప, గంధ సమర్పణ అనే మహాయాన సంప్రదాయాన్ని సూచిస్తున్నందున, గోవిందరాజ విహారంలో ధేరవాద, మహాయాన బౌద్ధశాఖలు తమ కార్యకలాపాలు నిర్వహించేవని చెప్పొచ్చు. తొలిసారిగ, క్రీ.శ.4వ శతాబ్ది బ్రాహ్మీ శాసనం, ఇంకా పిండపాతిక పరంపరను, ఆనాటి తెలంగాణలో బౌద్ధం గురించి, బౌద్ధాచార్యుల గురించి తెలియజేస్తున్నందున, ఈ శాసనం తెలంగాణ శాసనాల్లో మేటి శాసనం.


ఈ శాసనంపై పరిశోధన చేసిన డా. పి.వి.పరబ్రహ్మశాస్త్రి, డా. ఎన్‍. ముకుందరావు, శ్రీ బి.యన్‍.శాస్త్రి, పునఃపరిశోధన చేసిన ద్యావనపల్లి సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్‍గార్లకు ధన్యవాదాలు.
విష్ణుకుండిన రాజుల తొలినాళ్లలో నిర్మించిన ఈ బౌద్ధ విహారం వద్ద గల ఈ శాసనం వల్ల హైదరాబాదు నగర చరిత్ర నాలుగు వందల సం।।ల నుంచి 16 వందల సంవత్సరాలకు పోయింది.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *