తీర్పుల్లో నవలలోని అంశాలు


తీర్పుల్లో కవిత్వం కనిపించిన సందర్భాలు చాలా వున్నాయి. కవిత్వమే కాదు కొన్ని సందర్భాల్లో నవలలోని అంశాలు కూడా తీర్పుల్లో కన్పిస్తున్నాయి. చార్లెస్‍ డికెన్స్ పేరు తెలియని వ్యక్తులు చాలా అరుదని చెప్పవచ్చు. ఆయన రాసిన రెండు పుస్తకాల్లోని విషయాలు రెండు ప్రధాన తీర్పుల్లో ప్రతిబింబించాయి. ఆ రెండు తీర్పులు కూడా సుప్రీంకోర్టు తీర్పులు కావడం విశేషం.
భోపాల్‍ గ్యాస్‍ దుర్ఘటన సంఘటనకు సంబంధించి స్పెషల్‍ లీవ్‍ దరఖాస్తుని పరిష్కరించే విషయంలో సుప్రీంకోర్టు చార్లెస్‍ డికెన్స్ రాసిన ‘జార్న్డైస్‍ వర్సెస్‍ జార్నడైస్‍’ కేసుని ప్రస్తావించింది. జస్టిస్‍ మార్కండేయ ఖట్జూ, జస్టిస్‍ టియస్‍ ఠాకూర్‍లతో కూడిన సుప్రీంకోర్టు బెంచి ఈ అంశాలని ప్రస్తావించింది.
రెండవ కేసు కాశ్మీర్‍లో ఇంటర్నెట్‍ని నిలుపుదల చేసినందుకు వ్యతిరేకంగా దాఖలైన దరఖాస్తులని పరిష్కరించే క్రమంలో సుప్రీంకోర్టు చార్లెస్‍ డికెన్స్ రాసిన ‘ఏ టేల్‍ ఆఫ్‍ టూ సిటీస్‍’ అన్న పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. జస్టిస్‍ ఎన్‍.వి.రమణ, బి.ఆర్‍.గవాయ్‍ మరియు ఆర్‍. సుభాష్‍ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ‘ఏ టేల్‍ ఆఫ్‍ టూ సిటీస్‍’ పుస్తకంలోని ఓ పేరాను ఉదహరించింది. ఈ తీర్పుని జస్టిస్‍ రమణ వెలువరించారు.


ఏదైనా విషయాన్ని బలంగా చెప్పాలనప్పుడు సాహిత్యం అవసరం ఏర్పడుతుంది. అది కథ కావొచ్చు. కవిత్వ చరణాలు కావొచ్చు. నవలలోని అంశాలు కావొచ్చు. కథాంశం కూడా కావొచ్చు. ఈ రెండు తీర్పులనే కాదు. చాలా తీర్పులని, ఉపన్యాసాలని గమనించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది.
మొదటి కేసు విషయానికి వస్తే – భోపాల్‍ గ్యాస్‍ దుర్ఘటన. అది చాలా సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో నలిగింది. కేసుల నడక అమలు కొస్తే న్యాయ వ్యవస్థ నత్తనడక నడుస్తుంది. ఈ విషయం అందరికీ తెల్సిందే.


ఇదే విషయాన్ని జస్టిస్‍ మార్కండేయ ఖట్జూ, టిఎస్‍. ఠాకూర్‍ నేతృత్వంలోని బేంచి ప్రస్తావిస్తూ ఇలా అన్నది – భోపాల్‍ కేసు దుర్ఘటన కేసులో తీర్పు వచ్చేసరికి మరో 25 సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటికి బాధితులు ఎవ్వరూ బతికి వుండకపోవచ్చు.
‘ఈ కేసుని పరిష్కరించడానికి ట్రయల్‍ కోర్టుకి 25 సంవత్సరాలు పట్టింది. అది హైకోర్టులో మరో 15 సంవత్సరాలు తీసుకుంటుంది. ఆ తరువాత సుప్రీంకోర్టుకి వస్తుంది. అక్కడ మరో 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి బాధితులెవ్వరూ బతికి వుండరు’. కేసుల పరిష్కారానికి ఇన్ని సంవత్సరాలు పడుతుండటం న్యాయమూర్తులని అసహనానికి గురిచేసింది. ఈ కాలయాపనకి కారణం కక్షిదారులు, వాళ్ళ న్యాయవాదులు. న్యాయవ్యవస్థలోని లోపాలని ఆసరా చేసుకొని కేసులని జాప్యం చేస్తున్నారని న్యాయమూర్తి ఖట్జూ అభిప్రాయ పడినాడు.


ఈ విధంగా అభిప్రాయాన్ని అసహనాన్ని వ్యక్తపరుస్తూ న్యాయమూర్తి ఖట్జూ చార్లెస్‍ డికెన్స్ రాసిన జార్న్డైస్‍ మరియు జార్నిడైస్‍లోని అంశాలను ఉదహరించారు. ఆ పుస్తకంలో ఒక కేసు పరిష్కారానికి 100 సంవత్సరాలు పడుతుంది. కొన్ని తరాల తరువాత కూడా కేసు నడుస్తూ వుంటుంది. ఆ కేసులోని పార్టీల వారసులకి, న్యాయవాదులకి అదేవిధంగా న్యాయమూర్తులకి ఎందుకోసం కేసు నడుస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో కూడా కేసుల పరిస్థితి అదే దశకు చేరుకుంటుందని న్యాయమూర్తి తన ఆవేదనని వ్యక్తపరిచాడు.
24 సంవత్సరాలుగా నడుస్తున్న భోపాల్‍ గ్యాస్‍ దుర్ఘటన కేసులోని ప్రత్యేక లీవ్‍ దరఖాస్తుని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన పరిశీనలను. ఇది 2010లో చేసిన పరిశీలనలు. ఈ కేసులోని కథాంశం మన దేశంలోని కేసులకి సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.
ఇక రెండవ కేసు విషయానికి వస్తే కాశ్మీర్‍లో ఇంటర్నెట్‍ని రద్దు చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు ఉదహరించిన అంశాలు. చార్లెస్‍ డికెన్స్ రాసిన ‘ఏ టేల్‍ ఆఫ్‍ టా సిటీస్‍’లోని విషయాలు.
ఆగస్ట్ 5, 2019 నుంచి కాశ్మీర్‍లో ఇంటర్నెట్‍ సేవలని నిలిపివేశారు. ఆర్టికల్‍ 370ని తొలగించి కాశ్మీర్‍కి ప్రత్యేక హోదాని తొలగించివేశారు. అది రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయింది. ఇంటర్నెట్‍ని నిలిపి వేయడానికి వ్యతిరేకంగా చాలా కేసులు సుప్రీంకోర్టులో దాఖలైనాయి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకి అది భంగమని దరఖాస్తుదారులు సుప్రీంకోర్టు ముందు వాదించారు.
ఈ ఇంటర్నెట్‍ నిషేధం అవసరమని, కాశ్మీర్‍ లోయలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇది అవసరమని సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం వాదించింది.
ఈ వాదనలని విన్న సుప్రీంకోర్టు ఇంటర్నెట్‍ అనేది ప్రాథమిక హక్కులోని ఆర్టికల్‍ 19లో అంతర్భాగమని, అందుకని ఈ నిషేధాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటికే ఐదు నెలలు దాటిందన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ తీర్పుని ప్రకటించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‍ ఎన్‍.వి.రమణ చార్లెస్‍ డికెన్స్ రాసిన ‘ఏ టేల్‍ ఆఫ్‍ టూ సిటీస్‍’లోని అంశాలని కాశ్మీర్‍లోని పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొంటూ అందులోని విషయాలను ప్రస్తావించారు.


‘‘ఇవి మంచి రోజులు, ఇవి చాలా చెడ్డ రోజులు. ఈ కాలం వివేక వంతమైనది. ఇది తెలివి తక్కువ కాలం. విశ్వసించే యుగం, దగాకోరు యుగం.
ఇది కాంతివంతమైన కాలం. ఇది చీకటి కాలం. ఇది వసంతం లాగా ఆశ కలిగించే కాలం, చలికాలం మాదిరిగా నిరాశ కలిగించే కాలం; మన ముందు అన్నీ వున్నాయి, మనముందు ఏవీ లేవు; మనం నేరుగా స్వర్గానికి వెళ్తున్నాం. మనం నేరుగా మరో దారిలో వెళ్తున్నాం.
క్లుప్తంగా – ఈ కాలం ప్రస్తుత కాలంలో – కొన్ని అధికార సంస్థలు గొడవలకి కారణమవుతాయి అని మంచికి కావొచ్చు. చెడుకు కావొచ్చు. ఇందులో ఓ సాదృశ్యం మాత్రమే!’’
ఇదంతా తీర్పుకి ముందు ఓ ఉపోద్ఘాతంలా న్యాయమూర్తి చదివారు.
ఇంకా ఇలా అన్నారు – ఈ భూమి మీద స్వర్గంలాంటి ప్రదేశం. అలాంటిది అలజడులకి మిలిటెన్సీ ప్రతిధ్వనిస్తుంది. హిమాలయాలు ప్రశాంతతని వెదజల్లితే, ఇక్కడ రోజూ రక్తం ప్రవహిస్తుంది.


రెండు పార్శాలను, రెండు వ్యతిరేక చిత్రాలను ఇవి చూపిస్తున్నాయి అని న్యాయమూర్తి అన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 19లో ఇంటర్నెట్‍ అంతర్భాగం అని సుప్రీంకోర్టు అంటూనే అది వెంటనే పునరుద్దరించాలని ఉత్తర్వులు జారీ చేయకుండా, ఈ నిషేధాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని అనడం ఈ తీర్పులోని ప్రత్యేకత. అది మన వ్యాస పరిధిలోనికి అవసరం లేని అంశం.
డికెన్స్ నవల ఫ్రెంచ్‍ విప్లవ నేపథ్యంలో రాసినది. రూలింగ్‍ క్లాస్‍కి వ్యతిరేకంగా కార్మికవర్గం యుద్ధం చేసిన రోజులు.
తీర్పుల్లో ఎక్కువగా కన్పించేది ఉర్దూ కవిత్వం. ఆ తరువాత షేక్స్పియర్‍ కొటేషన్లు. చిన్న కథలు ఇట్లా సాహిత్యం కూడా తీర్పుల్లో చోటుచేసుకుంటుంది. మనదేశంలోని కోర్టుల్లో జరుగుతున్న జాప్యానికి సంకేతంగా డికెన్స్ జార్న్డైస్‍ జార్న్డైస్‍ నవలని సుప్రీంకోర్టులోని ఓ బేంచి ఉదహరిస్తే మరో బేంచ్‍ మరో సందర్భంలో ‘టేల్‍ ఆఫ్‍ టూ సిటీస్‍’లోని ఓ సందర్భాన్ని ఉదహరించడం జరిగింది.


న్యాయమూర్తులకి చట్టం మాత్రమే తెలిస్తేపోదు. చాలా విషయాలు తెలిసి వుండాలి. చాలా వాటిమీద పరిజ్ఞానం వుండాలి. వాటిని సందర్భోచితంగా ఉపయోగించాలి. అప్పుడే బలంగా వుంటుంది.
న్యాయమూర్తులకి అన్ని విషయాలు తెలుసని న్యాయవాదులు పొగుడుతూ వుంటారు.
సాహిత్యం పట్ల అభిరుచి వున్న న్యాయమూర్తులే కథలని కవిత్వాలని, నవలలోని అంశాలని ప్రస్తావిస్తూ వుంటారు. అందుకు ఉదాహరణే ఈ రెండు తీర్పులు.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *