ప్రకృతే నియంత్రిస్తుంది! 9 ప్రకృతే శాసిస్తుంది!!
మానవుడి మేధస్సుకు అందిన పరిజ్ఞానం ప్రకారం జీవం కలిగివున్న గ్రహం ఒక్క భూమి మాత్రమే! గెలాక్సీలోని ఇతర నక్షత్ర కూటములలోని (నక్షత్ర కుటుంబాలల్లో) ఏదైనా గ్రహంపై కూడా జీవరాశి వుండవచ్చు. ఆ జీవరాశి భూమిపై గల జీవరాశికి భిన్నంగా కూడా వుండవచ్చు! వాటి జీవన చర్యలు (metabolic) వైవిధ్య భరితంగా కూడా వుండవచ్చు! మానవుడిలాంటి బుద్ది కుశలతగల జీవులుగాని, ఇంతకన్నా మెరుగైనవిగాని, తక్కువస్థాయివిగాని కూడా వుండవచ్చు! ఈ విషయాలన్నీ భవిష్యత్తులో (వందల, వేల సం।।లు) తేలవచ్చు! నేటి ఆధునిక మానవుడు వాటిని గుర్తించవచ్చు! చూడవచ్చు! లేదా అసలే చూడకపోవచ్చు! దీనికై కొన్ని తరాలు పట్టవచ్చు! నాటికి భూస్వరూపంలో మార్పు జరగవచ్చు! మానవుడిలో కూడా జన్యుపరమైన అనేక మార్పులు చోటు చేసుకోవచ్చు!
ఇలా బుద్ధికుశలతతో సుఖలాలస జీవితం గడపడానికి, విధ్వంసకుడిగా ఎదగడానికి ఆలవాలమైన ఈ భూమి రూపు దిద్దుకోవడానికి వేలాది మిలియన్ సం।।లు పట్టిందని చూసాం! అయితే, భూగర్భ ఖనిజసంపదతో, ఆవాసయోగ్యంగా మారడానికి, సమాంతరంగా సముద్రాలు రూపొందడానికి దారితీసిన పరిస్థితులేంటి అనేది ఓ ప్రశ్న! నేల ఏర్పడిన తర్వాత సముద్రాలు ఏర్పడ్డాయా అనేది కూడా మరో ప్రశ్న! దీనికై భూగర్భ, ఖగోళశాస్త్ర పరిశోధకులు ప్రతిపాదించిన సిద్ధాంతాలు, చేసిన ప్రయోగాలు చూడాల్సిందే.
దీనిపై రెండు సిద్ధాంతాలున్నాయి.1.ఖండచలన సిద్ధాంతం 2. పలకల సిద్ధాంతం
ఖండచలన సిద్ధాంతం (The continental drift Theory)
జర్మనీకి చెందిన ఆల్‍ఫ్రడ్ వెజెనర్ (Alfred Wegener – 1880-1930) ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఓ మహా భూఖండిక మూడింట ఒకవంతు భూగోళ భాగాన్ని ఆక్రమించింది. దాదాపు 3,000 కి.మీ. లోతు భూగర్భపు పొరల్లో జనించిన అత్యధిక ఉష్ణ ఫలితంగా కరిగిన విభిన్న మూలకాల ద్రవరూప మిశ్రమం పైకి చిమ్మడం ద్వారా ఈ ఘనరూపమైన నేల, బండరాళ్ళతో కూడుకున్న కొండలు, పర్వతాలు ఏర్పడ్డాయనేది దీని సారాంశం! ఇలా భూగర్భంలో ఏర్పడిన అతి వేడి ద్రవపదార్థం బలహీన పొరలున్న (rift zones), ఆస్తినో ఆవరణం (asthebi sphere), అస్మావరణం (Litho Sphere)ల గుండా బయటికి వచ్చి, భూ పైభాగాన్ని ఆక్రమించడం జరిగిందని, ఇలా అనేక ప్రాంతాల్లో విరజిమ్మబడి ప్రవహించి వుంటుందని, ఈ విధంగా ఒక ప్రాంతపు పదార్థం మరో ప్రాంతపు పదార్థంతో కలయిక చెంది ఓ మహా ఖండికగా ఆవిర్భవించి వుంటుందని ఈ సిద్ధాంత భావన!
ఈ చర్య దాదాపు 300-270 మి।।సం।। క్రితం జరిగి వుంటుందని, 1927లో జరిగిన ఓ సదస్సు (Symposium)లో వెజెనర్ ఈ మహా ఖండికకు పంగే (Pangea (or) Pangaea) అనగా నేలల కలయిక (all lands) అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలన్నీ ఒకప్పుడు కలిసి వుండేవని, ఈ ఖండాల తీరప్రాంతాలను (అంచుల) క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక ఖండపు అంచుతో మరో ఖండపు అంచు అతికేలా (Jig saw Puzzle) వుంటుందని వెజెనర్ భావించాడు.
మహా ఖండిక (Pangea) ఏర్పడిన విధానం :
భూగర్భం నుంచి చిమ్ముక వచ్చిన ద్రవపదార్థం దాదాపు నాలుగు ప్రాంతాల్లో ఘనీభవించినా, అవి నిలకడగా ఉండలేక పోయాయి. అనగా లోపలి పొరల్లో నిరంతరం ఏర్పడే ద్రవపదార్థం, పలుచని పొరల కదలిలకతో ఘనీభవించిన ఖండికలు లోతట్టువైపు కదలికను ప్రారంభించాయి. ముందు దక్షిణ దృవం దగ్గరలోగల గోండ్వాన (Gondwana) ఖండిక ఉత్తర దిశగా కదిలి, కర్కటక రేఖ పైభాగాన గల యూర్‍అమెరికన్ (Euramerican) ఖండిక దక్షిణ భాగాన్ని ఢీకొని కలిసి పోయింది. అలాగే, ఉత్తర దృవ ప్రాంతంలో గల అంగారన్ (Angaran) ఖండిక దక్షిణవైపు కదిలి, గోండ్వానా, యూర్ అమెరికన్ మహాఖండిక ఉత్తరభాగాన్ని ఢీకొని ఒకే ఒక మహాఖండికగా (Pangea) దాదాపు 270 మి।। సం।। క్రితం రూపు దిద్దుకున్నదని వెజెనర్ భావించాడు.
అయితే, భూగోళ ఉత్తర, తూర్పు ప్రాంతంలో వున్న మరో మహాఖండిక (Cathaysis), అనగా నేటి ఉత్తర, దక్షిణ చైనా భూభాగం మాత్రం పైన రూపుదిద్దుకున్న మహాఖండికతో కలవకుండా ఒంటరిగానే వున్నట్లు వెజెనర్ గుర్తించాడు. దీనికి ఆయన అంచుల కత్తిరింపు (Jig saw puzzle)ను ఆధారంగా చూపాడు.
ఇక మిగతా మూడోవంతు భూగోళం ఒకే ఒక మహానీటి ప్రాంతంగా (Panthalass – all sea)గా వుండి పోయిందని సూత్రీకరించాడు.
మహాఖండిక తిరిగి విభజన :
ఇలా రూపుదిద్దుకున్న మహాఖండిక, దాదాపు 200 మి।। సం।। క్రితం తిరిగి విభజనకు గురై ప్రస్తుతం వున్న ఏడు ఖండాలుగా ఏర్పడ్డాయని ఖండచలన సిద్ధాంతం తెలుపుతున్నది. భూమి లోపలి పొరల్లో (tectonic plates) నిరంతరం జనించే వేడిమికి గంధకం, ఫాస్పరస్ లాంటి మూల పదార్థాలు కరిగి, ఇతర ఖనిజ పదార్థాలలో కలిసి మాగ్మాగా మారి బలహీనంగా వున్న భూ ఉపరితలం ద్వారా బయటికి రావడంతో, అప్పటికే ఉపరితలంగా ఏర్పడిన ఖండిక తిరిగి విభజనకు గురైందని వెజెనర్ భావించాడు. ఇలా విభజనకు గురైన ఒక భాగంతో స్వతంత్రంగా వున్న ఉత్తర, దక్షిణ చైనా భూభాగం (cathaysis) కాల క్రమంలో కలిసిపోయి వుంటుందని ఉవాచ!
మహాసముద్రాల ఆవిర్భావం (Formation of Oceans) :
మూడోవంతుగా వున్న నీటిభాగం (Panthalassa) మహా భూఖండిక విడిపోవడంతో ఏర్పడిన ఖాళీస్థలాన్ని ఆక్రమించడం ద్వారా సముద్రాలు ఏర్పడ్డాయనేది ఈ సిద్దాంత భావన! దాదాపు 180 మి।। సం।। క్రితం ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికా ఖండాల మధ్యన ఏర్పడిన (విడిపోవడంతో) ఖాళీలో నిండుకున్న నీటి భాగం అట్లాంటిక్ మహాసముద్రంగా రూపుదద్దుకున్నది. అలాగే దక్షిణ అమెరికా భూభాగం. ఆఫ్రికా ఖండిక పశ్చిమ తీరప్రాంతం నుంచి విడిపోగా ఏర్పడిన ఖాళీలో దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం 40 మి।। సం।। తర్వాత (అనగా 140 మి।। సం।। క్రితం) ఏర్పడింది. ఇక హిందూ మహాసముద్రం భారత ఉపఖండం అంటార్కిటిక్, ఆస్ట్రేలియా (మొదటి గోండ్వానా భాగం)ల నుంచి విడిపోగా దాదాపు 100 మి।। సం।। క్రితం ఆవిర్భవించింది. ఇక మిగతా భాగంలో (దాదాపు 63 మి।। చ.కి.మీ) వున్న నీటి భాగమంతా పసిఫిక్ మహాసముద్రంగా గుర్తించడం జరిగింది.
నిజానికి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహా సముద్రాలు కలిసిపోయినట్లు కనపడినా, నీటి సాంద్రతలోని తేడాలతో ఇవి ఒకదానితో ఒకటి కలవలేవు. అలాగే ఖాతానికి, సముద్రానికి ఇదే సాంద్రత వర్తిస్తుంది.
ఇలా ఓ వైపు మహా భూఖండిక ఖండాలుగా, ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా (గోండ్వానాలోని దక్షిణ భాగం, అలాగే ఉండిపోయిన మిగతా భాగం), ఇండియా లాంటి భూభాగాలతో పాటు, విశాలమైన ద్వీపాలు (మడగాస్కర్, హవాలియన్ మొ।।) ఏర్పడడం, ఏర్పడిన ఖాళీ స్థలాల్లో నీరు (Panthalassa నుండి) చేరి సముద్రాలుగా (Seas), మహాసముద్రాలుగా (Oceans), ఖాతాలుగా (Bays) ఏర్పడ్డాయి.
ఖండ చలన సిద్ధాంతానికి ఆధారాలు :
పైన ప్రస్తావించిన విధంగా విడివడిన భూఖండాల అంచుల ఆకృతులు ఒకదానితో ఒకటి కలిసి పోయే విధంగా (jig swa) వుండడమే ఈ చలన (drift) సిద్ధాంతానికి మూలాధారమని వెజెనర్ భావించాడు. దీనితోపాటు, శిలజాలు, ఉపరితల రాళ్లు, ఖనిజాలు దాదాపు అన్ని ఖండాల్లో సమతూకంగా మహఖండికనుంచి పంపిణీ జరిగాయని ఆయన భావన! ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా లభిస్తున్న నేలబొగ్గు, అంటార్కిటికా నేలమాలిగలో అపారంగా వున్న నేల బొగ్గులోని కొంత భాగమే కావడం గమనార్హం! వీటితోపాటు జీవపదార్థ పంపిణీ, ఆవిర్భావాలను కూడా వీటికి వెజెనర్ ఆధారంగా చూపాడు.
పోతే, వెజెనర్ సిద్ధాంతాన్ని భూభౌతిక శాస్త్రజ్ఞులు వ్యతిరేకించారు. దీనికై వీరు లేవనెత్తిన కారణాలు, వెజెనర్ భూభౌతిక శాస్త్ర నిపుణుడు కాడని, ఆయనది ఓ ఊహాత్మక ప్రతిపాదన మాత్రమేనని. బహుశా భవిష్యత్తులో వీటికి కార్బన్ డేటింగ్ సిద్ధాంతం వివరణ ఇవ్వవచ్చు! అంతవరకు ఈ సిద్ధాంత వాదనను కూడా గుర్తించాల్సిందే!
పలకల సిద్ధాంతం (The Plate Tectonic Theory) :
అమెరికాకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త మోర్గన్ (WJ Morgan 1935) ఈ సిద్ధాంతాన్ని 1966లో ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఊపందుకున్నది. ప్రపంచ వ్యాపితంగా సంభవించే భూకంపాలను, అగ్ని పర్వతాల ఉనికిని, గుర్తించడానికి 1960 ప్రాంతంలో వీటిని గుర్తించే సాధనాల్ని (seismo-meters) అనేక దేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధనాలు అందించిన గుణాంకాల ప్రకారం, భూమిలోగల పలకల మధ్యన అవినాభావ సంబంధం వున్నట్లు, అలాగే భూమయస్కాంతానికి సంబంధం వున్నట్లు గుర్తించాడు. వీటితోపాటు గతంలోని భూ ఉపరితల వాతావరణాన్ని (Paleo – climate) మొదటి దశ (past) భూగోళ అయస్కాంత శక్తిని (Paleo-magnetic)లను పరీక్షించడం ద్వారా ఉత్తర దృవ అయస్కాంతమున్న భూగోళమంతా కదిలి వుండాలని, లేదా భూమి లోపలిపొరలు (tectonic plates) కదిలి వుండడంతో గాని భూఖండికలు ఏర్పడి వుంటాయనేది ఈ సిద్ధాంత భావన! పోతే ఉత్తర దృవ అయస్కాంతం స్థిరపడి పోవడంతో పలకల చలనమే భూఖండాల ఆవిర్భావానికి కారణభూతమని ఈ సిద్దాంతం ప్రతిపాదించింది.
వెజెనర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్దాంతమే ఈ సిద్ధాంతానికి ఆధారమైనా, నేడు పలకల సిద్ధాంతం ప్రాచుర్యాన్ని పొందింది. దాదాపు 3.5-3.3 బిలియన్ సం।। క్రితం భూపొరల్లో కదలికల ద్వారా జనించిన అత్యధిక వేడితో శిలాజాల ద్రవం (magma) ఆస్తినో ఆవరణపు, అస్మావరణపు పొరల నుంచి బయటికి రావడంతో పైనున్న ఈ రెండు పొరలు ఘనరూప ఖండికలుగా విడవడినట్లు పలకల సిద్ధాంత ఉవాచ. అలాగే ఈ పక్రియ నిరంతరం జరుగుతూనే వుంటుందని దీని సారాంశం! ఇలా ఏడు (7) ప్రధాన పలకలు, పది (10) ఉపపలకలు విడివడినట్లు, అలాగే మహాఖండిక (Pangea) అనేక మార్లు ఏర్పడి వుంటుందని, విడిపోయి కూడా వుంటుందని, అనగా మహాఖండికగా ఏర్పడడం, విడిపోవడం ఓ సాధారణ పక్రియగా ఈ సిద్ధాంతం చెపుతున్నది.
భూ ఉపరితల పొర అయిన అస్మావరణపు పలకలు సాపేక్షంగా చలించే విధానాన్ని బట్టి మూడు సరిహద్దులుగా గుర్తించడం జరిగింది.
అభిసరణ సరిహద్దు (convergent boundaries) అపరసరణ లేదా నిర్మాణాత్మక సరిహద్దు (divergent) సమాంతర సరిహద్దు (transform)
అనగా భూ పలకలు కలిసిన, ఢీకొన్న, విడిపోయిన, సమాంతరంగా ప్రయాణం చేసిన విధానాల్ని బట్టి వీటిని విభజించడం జరిగింది.
త్రిక సంధి (triple junction) :
ఇలా పలకల చలనంతో ఏర్పడిన విధంగానే కాక పై మూడు విధాల పలకల సరిహద్దులు కలిసిన భాగం కూడా వుంటాయి. వీటిని త్రికసంధి అంటారు.
ఈ విధమైన పలకల చలనంతో గోండ్వానా (Gondwana), (మధ్య భారత్‍లో నివసించే గోండుల గుర్తుగా, ఈ మహాఖండికకు 1800 సం।।లో ఆస్ట్రియాకు చెందిన ఎడ్యూర్డ్సుయెస్ ((Eadward Suess) అనే శాస్త్రజ్ఞుడు పేరు పెట్టాడు.) లారేసియా (Laurasia), రొడినియా (Rodinia) మహా ఖండికలు ఏర్పడినవని ఈ సిద్ధాంతం చెపుతున్నది. ఇందులో గొండ్వానా సుమారు 550 మి।। సం।। క్రితం ఆవిర్భవించి, సుమారు 180 మి।। సం।। క్రితం, అనగా రాకాసి బల్లులు సంచరించే కాలంలో తిరిగి విడిపోవడం ప్రారంభించినట్లుగా ఈ సిద్ధాంతం చెపుతున్నది. మొదట దక్షిణ అమెరికా, అంటర్కాటికాలుగా సన్నని బాతులు వెళ్ళే మార్గంగా విడవడినాయని, తర్వాత ఆఫ్రికా, భారత్ ఉపఖండాలు విడివడినాయని, ఈ సిద్ధాంతం తెలుపుతున్నది. ఇక లారేసియా దక్షిణ తూర్పు యూరప్ (Balkan Peninsula) భాగంగా, భారత్ తప్ప మిగతా ఆసియా భూభాగంగా, ఉత్తర అమెరికా భూభాగంగా విడిపోయినట్లుగా ఈ సిద్ధాంతం భావిస్తున్నది.
ఇలాంటి మహాఖండికలలో రొడినయా (Rodinia) చాల పురాతనమై మహాఖండిగా, 1970లో వాలెంటైన్ మరియు మూర్స్ అనే శాస్త్రజ్ఞులు గుర్తించి, అది సుమారు 1.1 బిలియన్ సం।। క్రితం ఏర్పడినట్లుగా చెపుతున్నారు. తిరిగి ఇది 750-633 మి।। సం।। క్రితం విడిపోయినట్లుగా వీరు భావించారు. అనగా, పంగే, గోండ్వానాల కన్నా ముందు ఏర్పడినదన్నమాట.
ప్రస్తుతం మనం నివసిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తున్న, మనకు పుట్టక నిచ్చిన భూమి కథను, చరిత్రను దాదాపుగా ఈ కథనంలో వివరించడం జరిగింది. ఈ విషయాలేవి కొత్తవి కాకపోయినా, కనీసం ఇప్పుడన్నా పురాణ గాధల్ని, అశాస్త్రీయ వాదనల్ని నమ్మకుండా, శాస్త్రీయ ఆలోచనల్ని పెంపొందించ •కుంటే, కనీసం రేపటి తరమన్నా బాగుపడుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఈ తాత్విక చింతన చాలా అవసరంగా భావించాలి. విద్యార్థులకు, మన పిల్లలకు ఈ విషయాల్ని చెప్పగలగాలి.
భౌగోళిక మార్పులు, రూపాంతరాల గూర్చిన డాక్యుమెంట్లు నేడు అనేకం లభిస్తున్నాయి. యూ ట్యూబ్‍లో దొరుకుతాయి. మీరు చూడండి! పిల్లలకు చూపండి!!
(వచ్చే సంచికలో భూగోళం యొక్క సహజ కవచకుండాలల గూర్చి చూద్దాం!)
డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162