మంచి పని


‘‘రాణక్కా! రోజూ ఒక మంచిపనయినా చెయ్యాలని మా టీచరు చెప్పారు’’ అన్నాను పాలుతాగుతూ.
‘‘ఒక ముసలతన్ని రోడ్డు దాటించిన పిల్లాడి కథను మీ టీచర్‍ ముందుగా చెప్పారు కదా!’’ అని అడిగింది రాణక్క. అక్కకి పాలలో మీగడ గొంతు దిగదు. అందుకే పాలమీద తేలిన మీగడను తీసేయటంలో మునిగి ఉంది.
‘‘నీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అడిగాను.
‘‘మా టీచర్‍ కూడా చెప్పారులే. ఒక మంచిపనిచేసి, దాని గురించి రాసి చూపించమన్నారు’’
‘‘అయితే ఈ రోజే ఇప్పుడే మొదలు పెడదామా’’ పాలుతాగేసి ఉత్సాహంగా అన్నాను.
‘ఊ’ అంటూ ఒప్పుకుంది రాణక్క.
‘‘నేను కూడా మంచి పనులు చేస్తాను’’ అంటూ చిట్టి తమ్ముడు రాము తయారయ్యాడు.
‘‘అయ్యో! వీడి ముందు చెప్పకుండా ఉంటే బాగుండేది! ఇప్పుడు తుమ్మబంకలా పట్టుకుని వదలడు. మనం ఎక్కడికెళితే అక్కడికి తోక లాగా వస్తాడు. మనం ఏది చెయ్యబోతే అది తనూ చెయ్యాలంటాడు’’ నాకు చాలా కోపం వచ్చేసింది.
రాము రెండవ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ టీచరు మంచి పనులు చెయ్యమని చెప్పలేదాయె. వాడేమో చిన్నవాడు, మేమేమొ పెద్దవాళ్లం. రోడ్డును మా అంతట మేము దాటగలం. వాడు దాటలేడు. మరి రోడ్డును దాటడానికి ముసలివాళ్ళకు ఎలా సహాయ పడగలడు?
ఇదంతా వివరించి నచ్చచెప్పాలని చూశాం. కాని వింటే కదా! మంచిగా చెబితే ఎప్పుడూ అర్థం చేసుకోడు. మా వెంటనే తిరగటం మొదలు పెట్టాడు. ఎవరికైనా రోడ్డు దాటటంలో సహాయపడటంతో మంచి పనులు మొదలు పెడతామనుకున్నాం. కాని ఎంతసేపున్నా రోడ్డు దాటడానికి ఒక ముసలావిడగానీ, ముసలాయన గానీ రాలేదు. విసుగొచ్చి ఇంటికి వెళదామనుకుంటుండగా ఒక పెద్దమనిషి కనపడ్డాడు. మరీ అంత ముసలాయన కాదు. రోడ్డు దాటాలనుకున్నట్లే ఉన్నాడు.
మేము పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాం. రావద్దని చెప్పేలోగా రాము మా వెనక పడి రానే వచ్చాడు. అతని దగ్గరకు వెళ్ళి నిలుచోగానే మా వైపు తేరిపార చూడసాగాడు. రోడ్డు దాటించమని అడగటానికి తటపటాయిస్తున్నాడేమో ననిపించింది.
‘‘రోడ్డు దాటబోతున్నారా?’’ రాణి అడిగింది.


‘ఊ’ అని విసురుగా బదులిచ్చి, మరో మాట మాట్లాడకుండా రాము చెయ్యీ నా చెయ్యీ గభాలున దొరకపుచ్చుకుని రోడ్డు దాటసాగాడు. రాణి మా వెనుకనే వస్తోంది. మేము అతనికి సహాయ పడేదిపోయి అతనే మాకు సహాయపడుతున్నాడని నాకు అర్థమైంది. నేను రాణివైపు చూశాను. అక్క నవ్వుతోంది. నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను. ఇద్దరం ఒక్కసారే పెద్దగా నవ్వేశాం. ఏం జరుగుతుందో అతను గ్రహించే లోపునే మాచేతులను వదిలించుకుని ఇంటికేసి పరుగుతీశాం. దారిపొడుగునా నవ్వుతూనే ఉన్నాం. అలా నవ్వుతూ మా ఇంటి తోటలోని కొలను దగ్గరికి వచ్చాం.
‘‘నీటిలో పడిన పురుగుల్ని రక్షిద్దామా’’ రాణి అడిగింది. ‘ఇదయినా మంచి పనే కదా!’ అని మునుగుతున్న పురుగుల కోసం వెదికాం. కాని ఆ క్షణంలో నీటిలో మునుగుతున్న పురుగులేవి లేవు. రాము కూడా మాతో చేరి వెదకసాగాడు. వాడు నీటి మీదికి మరీ వంగి ఉండటం చూసి.
‘‘ఓరే రాము! నీటిలో పడతావు. నువ్వు ఇంట్లోకిపో’’ అని కసురుకున్నాను.
రాము కొంచెం వెనక్కి జరిగాడు కాని ఇంట్లోకి వెళ్ళలేదు. అక్కని పురుగుల కోసం వెతకమని చెప్పి నేను రాము చెయ్యి పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకువెళ్ళాను. వాడు ఎంతగా తన్నుకున్నా, అరుస్తున్నా లక్ష్యపెట్టలేదు. అమ్మ దగ్గరికి తీసికెళ్ళి తమ్ముడు విసిగిస్తున్నాడని చెప్పాను. కాని అమ్మ తమ్ముడిని ఏమీ అనకుండా నన్నే కోప్పడింది.


నేను అలిగి ఒక మూల కూర్చున్నాను. రాము నన్ను మాట్లాడించాలని, బ్రతిమాలు కోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను మాత్రం మూతి బిగించి, ముఖం ముడుచుకుని అలాగే కూర్చున్నాను.
అంతలోనే తోటలోంచి అక్క అరుపులు వినపడ్డాయి. ‘‘మణీ! తొందరగా రావే. నీటిలో రెండు చీమలు పడ్డాయి.’’
నా అలకా, విచారం మరిచిపోయి తోటలోకి పరిగెత్తాను. ఇద్దరం కొలను పక్కకు చేరాం. నీటిలో రెండు ఎర్ర చీమలు పడి కొట్టుకుంటున్నాయి. నేను రెండు ఎండిన ఆకులు ఏరి ఒకటి రాణికి ఇచ్చాను. అక్క చీమ పక్కగా ఆకును ముంచి మెల్లిగా పైకి తీసింది. చీమ ఆ ఆకును పట్టుకుని బయటకు వచ్చింది. నేను కూడా అలాగే చేశాను. ఇద్దరం ఆకులను నేలమీద పెట్టాం నీటిలో తడిసిన చీమలు నీళ్ళు వదిలించుకుని, మీసాలు సవరించుకుంటుంటే ఊపిరి తీసుకోవటం కూడా మరిచి చూడసాగాం. ఒకటి రెండు నిమిషాల తర్వాత చీమలు ఒళ్లు సవరించుకుని కదిలాయి.
‘‘చూడండి! నేను కూడా ఒక చీమను రక్షించాను’’ అంటూ రాము అరిచాడు. వాడి చేతిలో ఉన్న ఆకు మీద తడిసిన చీమ ఒకటి నీళ్ళు వదిలించుకుంటుంది.
‘‘ముందు నువ్వు చీమని నీళ్ళల్లో పడేశావు కదూ?’’ రాణి కోపంగా అడిగింది.
రాము ఏం మ్లాడలేదు కానీ వాడే చీమని నీటిలో పడేసి రక్షించాడని తెలిసిపోతోంది.
‘‘చీమని రక్షించి మంచి పనిచేశావు. కాని ముందుగా దానిని నీటిలో పడెయ్యటం వల్ల దానికెంతో బాధ కలిగించావు. కాబట్టి నువ్వు చేసిన మంచి పనికి ఉపయోగం లేదు’’. అని రాణక్క చెప్పింది.
ఒక నిమిషం పాటు రాము తలవంచుకొని ఏమి మాట్లాడలేదు. తరవాత తలెత్తి మా వైపు సూటిగా ‘‘మీ మాటేమిటి? మీరు నన్ను ఎన్నోసార్లు బాధపెట్టారు. నన్ను మీతో అడుకోనివ్వరు. ఎప్పుడూ తిడుతుంటారు. మీరు చేసే మంచి పనుల వల్ల ఏమైనా ఉపయోగ ముంటుందా?’ అని అన్నాడు.
మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఇక నుంచి రాముతో మంచిగా ఉండాలనుకున్నాం.
‘‘ఈ చీమల్ని ఇక్కడే వదిలేస్తే ఎవరైనా తొక్కేసార్తు. వీటిని గోడ దగ్గర వదిలిపెడదామా?’’ అన్నాను.
రాణి తలూపి తన ఆకును పట్టుకుంది. ముగ్గురం ఆకుల్ని పట్టుకొని గోడ దగ్గరకు తీసుకెళ్ళి వదలిపెట్టాం. మూడు చీమలు వరుసలో గోడ ఎక్కుతుంటే ముగ్గురం చూడసాగాం.


-అనిల్‍ ఎక్‍బోటే
అనువాదం : సురేష్‍, (బాల రచయితల వర్క్షాప్‍ సౌజన్యంతో
)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *