సామ్యవాద శాస్త్రవేత్త – సైన్స్ రచయిత


జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి చాలామంది విచారిస్తూ ఉంటారు. సాధించలేకపోయిన వాటిని పదే పదే తలచుకుని దిగులు చెందుతూ ఉంటారు. గతం గుర్తుచేసుకుని, బాధను దిగమింగుకుంటూ కూడా కొందరు ఉంటారు. అట్లాంటివారు ఎప్పుడైనా శాస్త్రవేత్తల గురించి, సైన్సు రచనలు చేసే వారి గురించి కొద్దిగా చదివితే ఊరట పొందవచ్చుననిపిస్తుంది. పాపులర్‍ సైన్సు రచనలో ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన, స్వయంగా పలు శాస్త్ర సంబంధిత అంశాల గురించి శోధించి చెప్పిన జేబీఎస్‍ హాల్టేన్‍ను చదివినప్పుడు చాలా విషయాలు గురించి బెంగ తొలగిపోయింది నాకు. జీవితపు ఏ మూలనో ఏర్పడ్డ వెలితి, అసంతృప్తి మటుమాయమై పోయింది.


నాకు నేను జీవితం గురించి ఏమి ఆలోచిస్తాను? ఏమి ఆశిస్తున్నాను అనే ప్రశ్నవేసుకుని ఆయన ఎంతో సరళమైన సమాధానం చెప్పు కున్నాడు. జీవితానికి కావలసింది తిండి, నీరు, బట్టలు, ఆవాసం అని తేల్చి చెప్పాడాయన. ఇందుకోసం ఆయన మొట్ట మొదట పని కావాలంటాడు. అలాగే పనికి గౌరవప్రదమైన వేతనం కూడా అవసరమంటాడు. ఆనందమంటే మరి ఏమిటో అనుకునేరు – అది చిన్న చిన్న సంతోషాల మొత్తం కాదు. అసలు ఆనందమంటే ఆటంకం, అవరోధం లేకుండా సాగాల్సిన పని లేదా కార్యక్రమం అన్నాడు. ఆ విధంగా పనిని తొలి ప్రాధాన్యంగా గుర్తించాడు. పని చేయటం ద్వారా ఆనందం, సౌఖ్యాలు రెండూ దొరుకుతాయని కూడా భావించాడు హాల్టేన్‍ మహనీయుడు. కఠినమైనదే అయినా పని, శ్రమ ఆసక్తికరంగా ఉంటుందంటాడు. పని ఎప్పుడూ ఫలాలను అందజేస్తుందని ఆయన అభిమతం. తాను అనుకున్న పనిని ఎంచుకుని చేసుకోగలిగిన వెసులుబాటు, అదృష్టం తనకు దక్కిందని చెపుతూ సైన్సు రచయితల నుంచి వైదొలగదలిస్తే, యుద్ధ వార్తలను అందించే పాత్రికేయుడిగా అది కాదనుకుంటే పిల్లలు కథలు రాసే బాల సాహితీవేత్తగా అది కూడా వద్దనుకుంటే రాజకీయ ఉపన్యాసకుడిగా పనిచేయగల వెసులు బాటు తనకుందని సంతోషిస్తాడు.


జీవితంలో పని తరువాత ఆయన కోరుకున్నది స్వేచ్ఛ. ఎక్కువ మంది కంటే మరింత అధిక స్వేచ్ఛను ఆశించాడు. ముఖ్యంగా భావప్రకటనా స్వేచ్ఛను కోరుకున్నాడు. తాను ఏమనుకుంటున్ననది ఏమి ఆలోచిస్తున్నది రాసే, మాట్లాడే స్వేచ్ఛను హాల్టేన్‍ అభిలషించాడు.
స్వేచ్ఛ తరువాత హాల్టేన్‍ ఆరోగ్యం కావాలంటాడు. అడపా దడపా వచ్చే తలనొప్పి, పంటినొప్పులతో ఇబ్బంది ఏమీ లేదంటాడు. ఆ మాటకొస్తే ప్రతి ఏడేళ్లకు ఏదైనా తీవ్ర అనారోగ్యం కలిగినా ఫరవాలేదంటాడు. ఏ అనారోగ్యం ఎట్లా కలిగినా పని చేసే శక్తి సామర్థ్యాలతో ఉండాలంటాడు. పని నుంచి కొంత సేదదీరే స్వల్ప ఆనంద సంతోషాలుండాలి. నేను పనిచేసే స్థితిలో లేనప్పుడు మరణించటం పెద్ద విషయమేమీ కాదంటాడు. పని పట్ల ఆ శాస్త్రవేత్తకున్న నిబద్ధత అటువంటిది.


స్వేచ్ఛ ఆరోగ్య విషయాల తరువాత హాల్టేన్‍ పండితుడు స్నేహాన్ని అధికంగా కోరుకున్నాడు. స్నేహితులు కూడా తాను కలిసిపనిచేసే రంగాలయిన శాస్త్ర, రాజకీయ రంగాలతో సన్నిహితులు, కామ్రేడ్లు వీరి స్నేహం ఆశించాడు. అంతా సమ స్కంధులుగా ఉంటే సమాజాన్ని కోరుకున్న హాల్టేన్‍ తాను ఇతరులను విమర్శించే, ఇతరులు తనను విమర్శ చేయగల సమానత్వం ఉండాలంటాడు అందరి మధ్య. ముందుగానీ, తరువాత గానీ ఎటువంటి విమర్శ, చర్చ లేకుండా ఎవరో ఒకరు ఆదేశిస్తే విధేయంగా అంగీకరించాలనుకునే వారితో నాకు స్నేహం పొసగదు. అలాగే నా ఆదేశాలను విమర్శకు పెట్టకుండా అంగీకరించే వారితో కూడా నాకు స్నేహం కుదరదు అని నిక్కచ్చిగా చెపుతాడు. తనకంటే అతి పేదలతో లేదా ధనికులతో స్నేహం చేయడం చాలా కష్టంగా ఉంటుందంటాడు. ఈ నాలుగంశాలు సాధారణ మానవ అవసరాలు అనే అవగాహన హాల్టేన్‍ కలిగి ఉన్నాడు.
వీటితోపాటు సాహసం కూడా ఉండాలంటాడు. ప్రమాదం, సాహసవంతం కాని ఈ జీవితం తాలింపు లేని కూరలాంటిదని భావిస్తాడు. అయితే ఎవరైనా తమ జీవితం ఉపయోగకరం, ఫలప్రదం అని భావించినప్పుడు రిస్క్కోసం రిస్క్ చేయటం తగదనే హితవు కూడా చెపుతాడు.


తాను డిమాండ్‍ చేయకుండా అభిలషించే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని పుస్తకాలతో కూడిన సొంత గది, మంచి పొగాకు, ఓ కారు, రోజు వారీ స్నానం, చిన్న ఉద్యానవనం, స్నానం చేయడానికి పూల్‍, బీచ్‍ లేదా నది సమీపంలో ఉంటే చాలు. అయితే ఇవి అందుబాటులో లేకపోయినా సంతోషంగానే ఉంటానంటాడు.
తాను కోరుకున్నది, అభిలషించినవన్నీ దొరికినందున తాను అదృష్టవంతుడిననే భావిస్తాడు. తాను వేటిని ముఖ్య అవసరాలు అని భావిస్తాడో అవి తన సహచరులు ఆనందించలేరు. వారికవి అందుబాటులోనూ లేవంటాడు. వారు అసంతోషంగా ఉండటం తనకేమీ సంతోషదాయకం కాదంటాడు.
భూమండలం మీద ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులు పని చేయడాన్ని అమితంగా ఇష్టపడ్డాడు. శ్రామికులు తమ శ్రమ ఫలాన్ని తామే అనుభవించటం కావాలి తప్ప తమ శ్రమ ఇతరులకు లాభాలను సంపాదించిపెట్టేది కాకూడదు అని భావించాడు. తాను శాస్త్రవేత్త అయినప్పటికీ తన పని పట్ల తనకొక ఫిర్యాదు కూడా ఉండిపోయింది. అదేమంటే తన పని అనుప్రయుక్తం కాదు. తాను జీవశాస్త్రవేత్తగా ఎన్నో నూతన సత్యాలను / వాస్తవాలను ఆవిష్కరించాడు. కానీ వాటి నుండి ఏ ఉపయోగమూ పొందలేకపోయింది. సమాజం మొత్తానికి అవి ఉపకరించినా విడి వ్యక్తులను తాను ఆవిష్కరించిన సత్యాల వల్ల ఏ ప్రయోజనమూ లబ్దీ లేకుండా పోయింది.


తాను చేసే పనులు, పరిస్థితులను తానెలా నియంత్రణలో ఉంచగలుగుతున్నాడో, శ్రామికులు కూడా తమ పని స్థలాల్లో పరిస్థితులను నియంత్రించగలిగి ఉండటాన్ని చూడాలని భావించాడు. తనను తాను సామ్యవాదిగా ప్రకటించుకున్న హాల్టేన్‍ పరిశ్రమలను పారిశ్రామికులు నియంత్రిస్తూ ఉండాలంటాడు. స్వేచ్ఛ వర్క్షాప్‍ నుండే మొదలు కావాలంటాడు. సాధ్యమైనంతగా స్త్రీ పురుషులు ఆరోగ్యవంతులుగా ఉండాలంటాడు. కూడు, గూడు, వైద్య సదుపాయం అటు రాశిలోనూ వాసిలోనూ ఉండాలి. ఆధునిక సాంకేతిక మానవ జీవశాస్త్రం కోరినది సమకూర్చ గలిగేదిగా ఉండాలని భావించాడు.
తాను వర్గ పీడనను, లైంగిక పీడనను అంతం చేయాలని భావించాడు. వర్గ, లింగ బానిసత్వం అంతమైనప్పుడే నిజమైన సోదరత్వ భావన పుడుతుందని అప్పుడే సమానత సాధ్యమవుతుందని భావిస్తాడు. అటు వర్గ పీడన, ఇటు స్త్రీల అణచివేత కొనసాగటానికి కారణం ఆర్థికమేనని చెపుతూ, ఇవి అంతం కావాలంటే ఆర్థిక రంగంలో విప్లవం రావాలని ఆశించాడు.


తాను ఏమే వెసులుబాట్లు, సౌకర్యాలు పొందుతూ ఉన్నాడో అవన్నీ తన సోదర ప్రజానీకం పొందాలని ఆశించడం ద్వారా తాను సోషలిస్టునని హాల్టేన్‍ నిర్ద్వంద్వంగా పేర్కొంటాడు. అయితే సోషలిజం తక్షణమే అన్నిటినీ సమకూర్చి పెట్టదు. యూరప్‍ అంతటా పెట్టుబడిదారీ విధానం కూలదోయబడి శ్రామికులు అధికారంలోకి వస్తే చూసి పరమానందంగా కన్ను మూస్తానంటాడు.
తనకు కావలసిన జాబితాలోంచి కొన్ని లోపించాయి అని చెపుతాడు హాల్టేన్‍. వాటిల్లో శాంతి, భద్రత. వీటిని సాధించటం క్లిష్టమైన పరిస్థితులలో ఇవి ఉండాలని ఆశించటం నిరర్థకం అంటాడు. ఫాసిజం అనేది ఒక సజీవ వాస్తవికత. హిట్లర్‍, ముస్సోలినీలు బహిరంగంగా ప్రకటించి, వారి చర్యల ద్వారా నిరూపించింది ఒక్కటే. అది యుద్ధం.
యుద్ధం వ్యాపిస్తోంది ప్రస్తుతం. అది ప్రపంచం మొత్తానికీ ప్రాకదని, అది 1914 నుండి 1917 వరకు ప్రాకినట్లు వ్యాప్తిచెందదని విశ్వసించాడు. ఫాసిజం అంతమయ్యే దాకా పరిపూర్ణ శాంతి చేకూరదనే బలంగా హాల్టేన్‍ విశ్వసించాడు.
పని, ఆహారం, స్వేచ్ఛ, ఆరోగ్యం, స్నేహం ఇవి ఆయన ఆశించినవి. తాను నివసించే సమాజానికి సామ్యవాద అవసరం ఎంతయినా ఉందన్నాడు. ఆ నిబద్ధతతోనే అనేక శాస్త్ర సత్యాలను ఆవిష్కరిస్తూ, సైన్సు రచనలతో సుప్రసిద్ధుడయ్యాడు. అట్లాంటి శాస్త్రవేత్తలు, సైన్సు రచయితలు అరుదు.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *