తోటపల్లి సుబ్రహ్మణ్యం


సుబ్బయ్యా! ఎంత పనిచేశావయ్య. ఇదంతా ముఖ్యమంత్రిగా నేను చేయలేనిది నీవు చేశావు! అని ఆశ్చర్యపోయారు హైదరాబాద్‍ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‍ బూర్గుల రామకృష్ణారావు. ఏమిటది…?
1926 ఏప్రిల్‍ 23న నాగర్‍ కర్నూలు సమీపంలోని పాలెం గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సుబ్బయ్య అసలు పేరు తోటపల్లి సుబ్రహ్మణ్యం. తండ్రి సత్యమూర్తి, తల్లి భగీరథమ్మ. బాల్యంలో ఆయనకు పాఠశాల చదువు అబ్బలేదు. పౌరోహిత్యం చేసినా అభివృద్ధికి ఆమడదూరంలో పాలమూరు జిల్లాలో ఆర్థిక పరిపుష్టి దొరకలేదు. జాతి, కుల, మత వివక్షలకు అతీతంగా తన తోటి మనషుల్ని ప్రేమించి వారి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు పాలెం సుబ్బయ్య. ఆయన సంపన్నుడు కాని మధ్యతరగతి రైతు.


1200 మంది జనాభా గల తన పల్లెకు డిగ్రీ కాలేజీ, హైస్కూలు, గుడి, మంచినీరు, ప్రజా – పశువైద్యం, దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన సంస్థ, రాష్ట్రంలో తొలి వ్యవసాయ పాలిటెక్నిక్‍ కాలేజీ, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా నడిచే ఆగ్రో-ఇండస్ట్రీ, కుటీర, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు, రుణ, బ్యాంకుల సౌకర్యం… అన్నీ ఒకదాని వెంట ఒకటి వరుసగా పాలెంలో నెలకొనేలా సుబ్బయ్య చేసిన కృషి, ఆయన అసమాన కార్యదక్షతను రుజువు చేస్తుంది. పాలెం ఒక కుగ్రామం. అక్కడ ఎలాంటి వనరులు లేవు. రాజకీయ స్థానాలు ఆయన అధిష్టించ లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.


బిజినేపల్లి బ్లాకులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్‍ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ కార్యక్రమంలో ఉంది. దాన్ని పాలెం తీసుకురావాలని సుబ్బయ్య అభిప్రాయం. ఎం.పి.ఒ.ను విచారించగా రెండెకరాల స్థలం, పదివేల రూపాయల ప్రజావిరాళం ఇస్తే పి.హెచ్‍.సి. సాధ్యమవుతుంది. గ్రామంలో స్థలం, డబ్బు వారికిస్తారు. తను సొంతంగా రెండెకరాలు, ప్రభుత్వానికి పదివేలు చెల్లించాడు. సుబ్బయ్య పథకం ఫలించింది. పాలెంకు వైద్యశాల వచ్చింది. ఉచిత భోజనం, నివాస సౌకర్యాలు ఉంటేనే పాఠశాలను అభివృద్ధిపరిచే వీలవుతుందని గ్రహించిన సుబ్బయ్య వెంటనే హాస్టల్‍ ప్రారంభించాడు. కులవివక్షకు దూరంగా హాస్టల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించారు.
ఒకే హాస్టల్‍లో హరిజన, గిరిజన, మైనార్టీ, రెడ్డి కులాల విద్యార్థులను ఉంచిన ధైర్యశాలి. ఎందరో పేదపిల్లలు ఓరియంటల్‍ కాలేజీలో చేరి భాషా పండితులై ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలుగు అధిపతులైనారు. హాస్టల్‍ రావడం వల్ల ఎంతో మేలు జరిగింది. ఎందరో పేద విద్యార్థుల పిల్లలకు హాస్టల్‍ ఆలంబనమైంది. తొలుత అందులోకి గ్రాంటు లభిస్తే, అది దినదినాభివృద్ధి చెంది చివరకు 400 మందికి పెరిగింది.


ఉపాధ్యాయుల సంఖ్య ఒకటి నుంచి 36కు పెరిగింది. విద్య, వైజ్ఞానిక, సాహిత్య విషయాల్లో పాలెం ఆదర్శ గ్రామంగా నిలవడానికి నిలువెత్తు ప్రభావం సుబ్బయ్య. నీలం సంజీవరెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి వరకు ఏదో ఒక కార్యక్రమానికి పాలెం వచ్చినవారే. బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావు, టి. అంజయ్య, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులు ఈ విద్యా సంస్థల విషయంలో ఎంతో శ్రద్ధ చూపి… ఆర్థిక బాధలు గానీ, అధ్యాపకుల కొరత గానీ లేకుండా చేశారు. వారి వద్దకు సుబ్బయ్యకు నేరుగా ప్రవేశం లభించేది.


పాలెం సుబ్బయ్య స్కూల్లో సీటు అంత సులభంగా లభించేది కాదు. ముఖ్యమంత్రి విజయ భాస్కరరెడ్డి ఓరియంటల్‍ కళాశాల సీటు కోసం అప్పుడు జిల్లా పరిషత్‍ చైర్మన్‍ ఒక విద్యార్థికి పాఠశాల సీటు ఇవ్వమని సిఫారసు చేశారంటే సుబ్బయ్య స్కూలు, కాలేజీ స్థాయి ఏ పాటిదో అర్థమవుతుంది. 1960ల్లోనే విద్యా విధానంలో ఆయన నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చెప్పి చేయలేదు. చేసి చూపించాడు.
ఆ రోజుల్లో రైలు పట్టాల వెంట ఉన్న ముఖ్యమైన ఊళ్లు షాద్‍నగర్‍, జడ్చర్ల, మహబూబ్‍నగర్‍, మదనాపురంలోనే టెలిఫోన్‍ ఎక్స్ఛేంజీలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో జడ్చర్ల నుంచి పాలెంకు ఒకే వారంలో టెలిఫోన్‍ ఎక్స్ఛేంజీ తీసుకువచ్చారంటే సుబ్బయ్య ఎంత పట్టుదల వ్యక్తో తెలుసుకోవచ్చు. ఆయన తలపెట్టిన అభివృద్ధితో లబ్ధిపొందింది అణగారిన వర్గాల వారే.


నిస్వార్థంగా సేవలందించిన సుబ్బయ్య ఏనాడూ కూడా రాజకీయ పార్టీల వల్లగానీ, ఎన్నికల వల్ల గానీ పదవుల్లోకి రాలేదు. ఆయన సేవలు విస్తృత స్థాయిలో వినియోగించుకునేవారు. పీవీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వజూపినా తిరస్కరించారు. జలగం వెంగళరావు ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసినా రాజకీయాలు అడ్డువచ్చి దాన్ని ఇతరులు తన్నుకుపోయారు.


యాదృచ్ఛికమో లేక దైవ నిర్ణయమో కానీ సంపూర్ణ సూర్యగ్రహణం 1980లో వచ్చింది. ప్రపంచంలో అత్యధిక సూర్యగ్రహణ సమయం, సంపూర్ణ గ్రహణం పాలెంలోనే సంభవిస్తుందని దేశ విదేశాల శాస్త్రజ్ఞులు తేల్చిచెప్పారు. నాలుగు నిముషాల 48 సెకన్ల పాటు సూర్యగ్రహణం పాలెంలో ఉంటుందని చెప్పడంతో ఒక్కసారిగా దేశవిదేశీ ఖగోళ శాస్త్రజ్ఞులు పాలెం చేరుకున్నారు. ప్రపంచమంతటా పాలెం పేరు మార్మోగింది. చెన్నారెడ్డి తన క్యాబినెట్‍తో ఇక్కడకు ప్రవేశించారు. ఏమాత్రం సౌకర్యాలు లేని పాలెంలో అందరికీ సుబ్రహ్మణ్యమే వసతులు కలిగించారు. దీనికి ముగ్ధులైన అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‍ ఇక్కడివారి సహకారానికి కృతజ్ఞతలు వెల్లడిస్తూ ఒక అభినందన పత్రంపై సంతకం చేసి పంపించాడు. జాతీయంగానే గాక అంతర్జాతీయంగా పాలెంకు ఖ్యాతితెచ్చిన సుబ్రహ్మణ్యం అభినందనీయుడు.
విశ్రాంతి, విరామం లేకుండా పాలెం గ్రామానికి నలభై వసంతాలు సేవచేసిన సుబ్బయ్యకు అది ఎంతో సంతృప్తి నిచ్చింది. ప్రజల కోసం తన ఆస్తిని కర్పూరంలో కరిగించిన వ్యక్తి. గ్రామ సౌకర్యాల కోసం తనకున్న 40 ఎకరాల భూమి అమ్మేశారు. ప్రజా సేవలకు తనకున్న ఆస్తులన్నీ పోయాయి. ఇక మిగిలింది ఆయన కాంస్య విగ్రహమే. ఆ మహనీయుడు 1986 జూన్‍ 23న కన్ను మూశారు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

  • జి. వెంకట రామారావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *