ఇద్దరు పిల్లలు


‘‘డవకురా చచ్చినాడా! ఊరికే ఏడిస్తే వస్తదా? అన్నయ్య పోయి తేవాలి గదా!’’ అని తల్లి కేకలు వేసింది పసివాణ్ణి.
ఆ ‘వస్తువు’ ఏడిస్తే వస్తుందో రాదో ఆ పసివాడికి తెలీదు. ఆ పసివాణ్ణి ఎలా సముదాయించాలో ఆ తల్లికి తెలీదు. వాడి ఏడుపుతో విసుగొచ్చి వీపు మీద రెండు దెబ్బలు వేసి ఇంట్లోకి తీసుకుపోయింది.
సరిగ్గా అదే సమయంలో, ఆ తల్లి పెద్దకొడుకు, ఏడేళ్ళవాడు గోపాలం – వాళ్ల ఇంటికి కొంచెం దూరంలో అమ్మవారి గుడి దగ్గర వేపచెట్టు కింద నించుని బతిమాలుతున్నట్టు అంటున్నాడు.
గోపాలానికి ఎదురుగా నించున్న కుర్రాడు – సుబ్బడు కూడా అదే వయస్సువాడు. వాడి చేతిలో ‘కీ’ ఇచ్చి నడిపించే ‘బొమ్మకారు’ ఉంది… గోపాలం మాటలు వినగానే సుబ్బడు ‘ఇవ్వను’ అని నోటితో అనకుండా, ఆ ‘బొమ్మకారే’ తనకి చాలా ముఖ్యమైనట్టూ అదే తనకి ప్రాణమైనట్టూ దాన్ని గుండెలకి హత్తుకున్నాడు.
సుబ్బడికి ఆ బొమ్మకారు బహుమతిగా వచ్చింది. ఈ మధ్యనే వాడి బావ ఊరునుంచి వచ్చినప్పుడు ఆ బొమ్మకారు వాడికోసం తెచ్చాడు. ఆ కారునీ కారు తెచ్చిన బావనీ చూసి సుబ్బడు మురిసిపోయాడు. సంతోషంగా గంతులేస్తూ, స్నేహితుడు గోపాలం ఇంటికి పరిగెత్తాడు.
సుబ్బుడూ గోపాలం మంచి స్నేహితులు. సుబ్బడు తండ్రీ, గోపాలం తండ్రీ ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళు కొంచెం దూర దూరంగా ఉన్నా ఒకే వీధిలో ఉన్నాయి. సుబ్బడూ గోపాలం ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదువుతున్నారు.
ఈ స్నేహితులిద్దరిలో – బటానీలు, పకోడీలు, గాలిపటాలు, పెన్సిళ్లు – ఇద్దరిలో ఎవరు కొనుక్కున్నా సరే రెండోవాడికి కూడా
ఉన్నట్టే లెక్క.


మరి ఈ బొమ్మకారు సంగతి? ఆ కారును చూడగానే సుబ్బడెంత సంతోషించాడో గోపాలం కూడా అంత సంతోషించాడు. కారు చాలా బాగుంది. ఎర్రగా మెరుస్తూంది. సుబ్బడు ‘కీ’ ఇస్తే పరిగెడుతోంది. కాని, మచ్చుకి ఒక్కసారైనా సుబ్బడు, కారుని గోపాలం చేతికి ఇవ్వలేదు. ‘ఇది నాది. దీన్ని నేనే వాడాలి’ అనే గర్వం సుబ్బడిలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే సహజమైన కుతూహలం అణుచుకోలేక ‘‘నేనొకసారి ‘కీ’ ఇస్తాను. కారు నాకివ్వరా’’ అన్నాడు గోపాలం. సుబ్బడు ఇవ్వలేదు. పైగా
‘‘మరీ… మరీ… మా బావ కోప్పడతాడ్రా..’’ అనేశాడు.
గోపాలానికి అసహ్యం వేసింది. ఇన్నాళ్లూ ఏది కొనుక్కున్నా ఇద్దరూ పంచుకుని తినేవారు. ఇద్దరూ కలిసి ఉపయోగించుకునేవారు. మరి ఈ ‘కారు’ చేతులోకి రాగానే సుబ్బడు ఎందుకిలా మారిపోయాడో గోపాలానికి అర్థం కావటం లేదు.


సుబ్బడు ఇంటికి బయల్దేరాడు. ఇంతలో గోపాలం తమ్ముణ్ణి ఎత్తుకుని, గోపాలం తల్లి వాడికి ఎదురుగా వచ్చింది. నిజానికి గోపాలం తమ్ముడు సుబ్బడికి తమ్ముడే ఇన్నాళ్లూ. కాని ఇప్పుడో?
సుబ్బడి చేతుల్లో ఎర్రగా మెరుస్తున్న ‘కారు’ చూసి గోపాలం తమ్ముడు నవ్వుతూ వాడి మీదికి వాలాడు. పిల్లవాణ్ణి దింపి కింద కూర్చోబెడుతూ ‘‘సుబ్బడూ! ఆ బొమ్మ వీడికోసారి ఇవ్వరా’’ అన్నది గోపాలం తల్లి. ఆవిణ్ణి కాదనే ధైర్యం లేకపోయింది సుబ్బడికి.
‘‘ఇదిగో కారు!’’ అంటూ కారును రెండు నిమిషాలు పిల్లాడి చేతుల్లో ఉంచక తప్పలేదు… తరువాత అది తీసుకొని వెళ్ళిపోయాడు సుబ్బడు. పసివాడు. ‘‘కారు.. కారు’’ అని ఏడవటం మొదలెట్టాడు.


తరవాత నాలుగు రోజులు సుబ్బడు గోపాలం ఇంటికి వెళ్ళలేదు. ‘బొమ్మకారు’ అడుగుతాడేమోనని స్కూల్లో కూడా గోపాలానికి దూరంగా వేరే సీట్లో కూర్చునేవాడు. ఒక రోజు స్కూలు నుంచి తిరిగి వస్తుంటే గోపాలం కలిశాడు. జేబులో బఠానీలు తీసి ‘‘తీసుకోరా’’ అన్నాడు సుబ్బడితో. ‘‘నాకొద్దురా’’ అని వెళ్ళిపోయాడు సుబ్బడు. బఠానీలు తీసుకుంటే, గోపాలం బొమ్మకారు అడుగుతాడేమోననే సుబ్బడు వద్దన్నాడు. కాని, గోపాలం పరిస్థితి అలా ధీమాగా వెళ్ళిపోయేటట్లు లేదు. ఇంటి దగ్గర తమ్ముడు పసివాడు ఆ బొమ్మకారు కోసం తెగ ఏడుస్తున్నాడు. ‘‘కారు కావాలి… బొమ్మకారు కావాలీ’’ అని ఒకటే ఏడుపు. ఆ కారు తన కోసం కాదు.

తమ్ముడికోసం అడగాలి. తమ్ముడు అసలే జబ్బు పిల్లాడు. వాణ్ణి గురించి అమ్మానాన్న ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటారు. పైగా కారు కోసం ఊరికే మారాం చేసి విసిగిస్తూంటే నాన్న తిట్టాడు. అమ్మ వాణ్ణి కొట్టింది కూడా. అయినా వాడు ‘కారు కారు’ అని ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి అమ్మకి విసుగెత్తి.
‘‘సుబ్బణ్ణి అడిగి ఆ కారు ఓ సారి తీసుకొచ్చి తమ్ముడి కియ్యరా… మళ్ళీ రేపు సుబ్బడి కిచ్చేద్దువుగాని’’ అన్నది.
అభిమానం, రోషం చంపుకుని గోపాలం సుబ్బడి ఇంటికి వెళ్ళాడు.


సుబ్బడి చేతుల్లో ఆ బొమ్మకారు ఉంది. అకస్మాత్తుగా వచ్చాడు గోపాలం. కారు ఇవ్వమని నోరు తెరిచి అడిగాడు. ‘‘తమ్ముడు కారు కావాలని తెగ ఏడుస్తున్నాడురా! అసలే వాడికి ఒంట్లో బాగాలేదు.. అమ్మ నిన్ను అడిగి ఈ కారు తెమ్మంది. మళ్ళీ రేపు తెచ్చి ఇచ్చేస్తాను.’’
గోపాలం అకస్మాత్తుగా వచ్చి అడిగేసరికి ఏం చెప్పలేక ఆ కారు పట్టుకొని అలాగే గోపాలంతో పాటు అమ్మవారి గుడిదగ్గర వేప చెట్టుదాకా వచ్చాడు.

***


… అదే – ఆ అమ్మవారి గుడి దగ్గర వేప చెట్టుకిందే నించుని గోపాలం బతిమాలుతున్నట్టుగా సుబ్బణ్ణి మళ్ళీ అడిగాడు.
‘‘ఏరా! కారు ఇయ్యవు కదూ?’’
జవాబు చెప్పకుండా నించున్నాడు సుబ్బడు.
గోపాలం కోపంతో, బాధతో వణికి పోతున్నాడు. సుబ్బడు గుటకలు మింగుతున్నాడు. ‘బొమ్మకారు’ ఇవ్వాలనీ ఉంది… ఇవ్వటానికి ఇష్టం లేకుండానూ ఉంది.
‘‘తమ్ముడు ఏడుస్తున్నాడు. అమ్మ అడగమంది. లేకపోతే ఎవడిక్కావాలి నీ వెధవ కారు?’’ అని రోషంగా అన్నాడు గోపాలం.
‘‘అది కాదురా గోపాలం! ఎల్లుండి సాయంత్రం నేను తెచ్చి ఇస్తాలే. ఎల్లుండి మా అక్కా బావా ఊరెళ్ళిపోతారు. తరవాత.. తరవాత తెస్తారా!’’ నీళ్ళు నములుతూ అన్నాడు సుబ్బడు.


బొమ్మను ఇవ్వడానికీ, అక్కాబావా ఊరికెళ్ళడానికీ ఏం సంబంధమో గోపాలానికి అర్థం కాలేదు. ఇవ్వకుండా తప్పించు కోవడానికి సుబ్బడు ఆ సాకు చెప్పాడు. కోపంతో పళ్ళు బిగించాడు గోపాలం. రోషంతో బాధతో ఊగిపోతూ మరొక్కసారి అడిగాడు.
‘‘ఇవ్వవు కదూ!’’
సుబ్బడు తల వంచుకున్నాడు. తటపటాయిస్తున్నాడు. సెకండ్లు గడిచాయి. నిమిషాలు గడిచాయి. చివరికి ఏమనిపించిందో ఏమో, చప్పున తలెత్తి – ‘‘ఇందరా! – తీసుకో!’’ అన్నాడు. కాని… తీసుకోవడానికి గోపాలం అక్కడ లేడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు.
సుబ్బడు మర్నాడు స్కూలుకి వెళ్లాడు. గోపాలం రాలేదు. క్లాసులో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మాస్టారు సుబ్బణ్ణి చూసి ‘‘ఏరా సుబ్బారావు! ఏడిరా నీ నేస్తం’’? అని అడిగాడు. సుబ్బడికి తెలీదు.
‘‘కలిసి రావటం మానేశారేంరా?’’
సుబ్బడు మాట్లాడలేదు.
‘‘దెబ్బలాడుకున్నారా?’’
‘‘లేదండీ’’ అనేశాడే కాని, సుబ్బడి మనస్సులో చాలా బాధగా ఉంది – గోపాలం ఎందుకు రాలేదో అని. రెండో రోజు కూడా గోపాలం బడికి రానేలేదు.
సాయంకాలం స్కూలు వదిలాక అయిదున్నర గంటలకి బొమ్మకారు తీసుకొని సుబ్బడు, గోపాలం ఇంటికి వెళ్ళాడు.
గోపాలం ఇంటి ముందు నాలుగురైదుగురు పిల్లలు నించుని లోపలికి తొంగి తొంగి చూస్తూ ఏదో గుస గుసలాడుతున్నారు. వాళ్ళకి ఆ ఇంట్లోకి వెళ్ళాలని ఉన్నట్టుగా, అయినా ఎందుకో భయపడుతున్నట్టుగా ఉన్నారు. వాళ్ళ చూపులూ గుసగుసలూ వాళ్ళ ప్రవర్తనా చూస్తే సుబ్బడికి కూడా ఎందుకో భయమేసింది.
‘‘ఏరా ఏమిటలా తొంగి చూస్తున్నారు?’’ ఏమైంది? అని అడిగాడు కొంచెం జంకుతూనే.


పిల్లలందరూ సుబ్బడి వంక ఆశ్చర్యంగా చూశారు. ‘‘నీకు తెలీదా’’? అని అడిగాడు ఒకడు. ఏదో ప్రమాదకరమైన సంగతి చెప్పబోతున్న ఆదుర్దా, బాధా కనిపించింది వాళ్ళ ముఖాల్లో. వాళ్లేదో చెపుతున్నారు కూడా. కాని ఆ మాటలు సుబ్బడికి వినిపించలేదు. వాడు కంగారుగా గడపదాటి లోపలికి దూకాడు.
ముందు గదిలో గోడవారగా తడిసి ఎండిన చాపమీద తలకింద చెయ్యి పెట్టుకుని ఒక పక్కకి తిరిగి పడుకుంది గోపాలం తల్లి. ఒక ముసలావిడా ఒక నడివయస్సు మనిషి ఆమె దగ్గర దిగాలుపడి కూర్చుని ఏదో చెపుతున్నారు.
గుమ్మంలో నుంచే అదంతా చూస్తూ వెనక గదిలోకి వెళ్ళాడు సుబ్బడు. అక్కడ గోపాలం గోడకి ఆనుకొని కూర్చుని మోకాళ్ళ మీద చేతులుంచుకొని, చేతులమీద తల ఆనించి ఎటో దిగులుగా చూస్తున్నాడు.


సుబ్బడు చటుక్కున గోపాలం దగ్గరికి వెళ్ళి- ‘‘గోపాలం! ఇదుగోరా ‘కారు’! తీసుకోరా! అచ్చంగా అచ్చంగా నువ్వే తీసుకోరా!.. నాకొద్దురా!’’ అంటూ చెయ్యి జాచి ఇవ్వబోయాడు. గోపాలం తలెత్తి సుబ్బడి కళ్ళల్లోకి చూస్తూ – ‘‘నాకెందుకురా కారు?… ‘‘కారు కావాలీ’’ అని ఏడ్చిన తమ్ముడు అన్నీ వదిలి, అందర్నీ వదిలి, ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడ్రా!’’ అని పొంగి వస్తున్న ఏడుపుని అణుచుకుంటూ మోకాళ్ళ మధ్య ముఖం దాచుకున్నాడు. తన చేతుల్లో ఉన్న కారుని దూరంగా పారేసి ‘‘గోపాలం!… గోపాలం!’’ అంటూ సుబ్బడు – గోపాలాన్ని కౌగిలించుకుని భోరున ఏడ్చాడు.

– రాచకొండ విశ్వనాథ శాస్త్రి
(ఫిబ్రవరి 1991 బాలచెలిమి – పిల్లల మాసపత్రిక సౌజన్యంతో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *