చిన్నారులను కాటేస్తున్న కరోనా

కరోనా వైరస్‍ చిన్నారులను ఏం చేయనుందనే విషయంలో మనం అంత అప్రమత్తంగా ఉండడం లేదు. వైరస్‍ మార్పు చెందుతూ మరింత తీవ్ర పరిణామాలు కల్పించేదిగా మారుతున్న కొద్దీ రేపటి నాడు పిల్లలపైనే దాని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. సింగపూర్‍లో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యాసంస్థలన్నిటినీ మే 19 నుంచి తాత్కాలికంగా మూసివేశారు. భారత్‍ లో మొదటిసారిగా కనిపించిన వైరస్‍ రకం సింగపూర్‍లో కూడా బయటపడి పెద్దల కంటే ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తోందని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
బ్రెజిల్‍లో మాదిరిగానే, ఈ వైరస్‍ అసాధారణంగా అధిక స్థాయిలో చిన్నారులను హతమార్చింది. ఇటీవలి కాలంలో బ్రెజిల్‍లో ఐదేళ్ల లోపు చిన్నారులు 2,200 మంది కంటే ఎక్కువ మంది చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అంత తక్కువ వ్యవధిలో ఇంత అధిక సంఖ్యలో చిన్నారులు మరెక్కడా మరణించిన దాఖలాలు లేవు. కోవిడ్‍ పై విజయం సాధించిన తైవాన్‍ సైతం రాజధాని తైపీలో మే 28 వరకు పాఠశాలలను మూసివేసింది. ఈ వారంతంలో చిన్నారులకు సంబంధించి 300కు పైగా కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇవన్నీ కూడా మనకేం చెబుతున్నాయి? ముప్పు పొంచి ఉన్న మాట నిజం. హెచ్చరికలు అధికమవుతున్నాయి. భారతదేశంలో థర్డ్ వేవ్‍ రానుందని చెబుతున్నారు. అలాంటి చోట ఈ హెచ్చరి కలను మరింత తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని, ముందుగానే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సింగపూర్‍లో పాఠశాలలు మూసి వేస్తున్నారు. ఆన్‍లైన్‍లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంట్లో నుంచే నేర్చుకోవడం ప్రారంభమైంది. సింగపూర్‍ కొంత కాలం క్రితమే ఈ మహమ్మారి సమయంలోనూ అత్యంత సురక్షితమైందిగా గుర్తింపు పొందింది. అలాంటి చోటనే ఇప్పుడు చిన్నారులకూ కోవిడ్‍ సోకుతోంది. ఇటీవల ఒక్క రోజే స్థానికంగా వ్యాపించిన కేసులు 38 నమోదు అయ్యాయి. ఏడాది కాలంలో ఒక్క రోజు నాడే అన్ని కేసులు రావడం అదే మొదటిసారి. ఓ ట్యూషన్‍ సెంటర్‍ కు సంబంధించిన నలుగురు చిన్నారుల కేసులు కూడా వాటిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా బి.1.617 రకానికి చెందినవి. ఈ రకాన్ని మొదటిసారిగా భారత్‍లో గుర్తించారు.
కరోనా వైరస్‍లో చోటు చేసుకుంటున్న మ్యుటేషన్లలో కొన్ని మరింత ప్రమాదకరమైనవని, అవి చిన్నారుల్లో కూడా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని సింగపూర్‍ విద్యాశాఖ మంత్రి ఒంగ్‍ ఎ కుంగ్‍ అన్నారు. ఈ చిన్నారుల్లో ఎవరూ కూడా అంత తీవ్రంగా అనారోగ్యానికి గురి కానప్పటికీ, అది అందరికీ ఆందోళన కలిగించే అంశమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ టర్మ్ ముగిసే వరకు పాఠశాలలన్నిటినీ మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అంతేగాకుండా 16 ఏళ్ల లోపు పిల్లలకు కూడా టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.


మహమ్మారి విజృంభణ సమయంలో దాన్ని బాగా కట్టడి చేసిన తైవాన్‍ కూడా ఇప్పుడు ఇదే విధమైన చర్య తీసుకుంది. వారంతంలో అక్కడ 333 కేసులు నమోదయ్యాయి. సురక్షిత ప్రాంతంగా తైవాన్‍ కు ఉన్న పేరు ప్రఖ్యాతులకు ఈ వైరస్‍ ముప్పు తెచ్చేదిగా మారింది. చిన్నారులకు సైతం కరోనా సోకుతుందేమోనని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తైపీతో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలు ఈ టర్మ్ ముగిసే వరకూ తరగతులు రద్దు చేశాయి.
హాంకాంగ్‍లో దక్షిణాఫ్రికా రకానికి చెందిన ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వైరస్‍ సోకిన వారిలో అతి పిన్న వయస్కురాలిగా నాలుగు నెలల చిన్నారిని గుర్తించారు. దీంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులకందరికీ టెస్టులను తప్పనిసరి చేయాలని, అన్ని తరగతుల్లోనూ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచించేందుకు ఇది బాట వేసినట్లయింది.


బ్రెజిల్‍ విషయానికి వస్త, అక్కడ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. ఇటీవలి నెలల్లో కరోనా వైరస్‍ అసాధారణ రీతిలో అధిక స్థాయిలో చిన్నారులను బలిగొంటోంది. ఐదేళ్లలోపు చిన్నారులు కనీసం 832 మంది ఈ వైరస్‍ కారణంగా మరణించారు. నిజానికి ఈ సంఖ్య చాలా తక్కువని, విస్తృత స్థాయిలో పరీక్షలు జరగనందున మరెన్నో మరణాలు లెక్కలోకి రాకుండా పోయి ఉంటాయని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. ఈ వైరస్‍ మరింతగా మ్యుటేట్‍ చెందుతున్నందున, అది గర్భస్థ శిశువులతో సహా చిన్నారులపై మరింత ప్రభావం కనబర్చగలదని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఈ ధోరణులను భారత్‍ పరిశీలించాల్సిన అవసరం ఉంది. థర్డ్ వేవ్‍ వచ్చే ముప్పు ఉన్నందున ముందుగానే దానికి సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పిల్లల సురక్షితకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. సాధ్యమైనంత త్వరగా దిగువ పేర్కొన్న చర్యలు తీసుకోవాలి.

  • రాష్ట్ర, జిల్లాస్థాయిలో పిడియాట్రిక్‍ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
  • అన్ని స్థాయిల్లో పిల్లలకు నిర్దిష్ట సంఖ్యలో బెడ్స్ రిజర్వు చేయాలి
  • పిల్లకు అవసరమైన మందులు, ఇతర ఉపకరణాలు సిద్ధంగా
  • ఉంచుకోవాలి
  • పిల్లలకు సాధ్యమైనంత త్వరగా టీకాలు ఇవ్వాలి


థర్డ్ వేవ్‍ రూపంలో మరోసారి మహమ్మారి వ్యాపించకుండా చూసుకునేందుకు భారత్‍కు ఇప్పటికీ అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఇప్పుడు వాడుకోవాలి.

సేకరణ : డెస్క్, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *