ప్రకృతితో చెలిమి చేద్దాం…


ఒకే విషయాన్ని పదేపదే మాట్లాడుకోవాల్సిరావడం అనివార్యమవుతున్నది. మనిషి మనుగడకు మూలమైన మౌలిక అంశాల ప్రస్తావన-చర్చ అధిక ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.
ఒకటిన్నర సంవత్సరాలుగా మనల్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా నేపథ్యంలో మనల్ని మనం మరోసారి సమీక్షించుకోవాలి. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమితో సమ్మిళితమైనదే ప్రకృతి. ఈ ప్రకృతి ఆవరణలో కోట్లాది సంవత్సరాలుగా, అనేక కోట్ల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అందులో మానవజాతి కూడా ఒకటి. ఈ జీవజాతులకు ప్రకృతితో వుండే సమతుల్యతే జీవ వైవిధ్యం. అన్ని జీవజాతులు తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాయి. కానీ మనిషి ఒక్కడే తన కనీస అవసరాలకే కాక సుఖాల కోసం, అంతులేని ఆడంబరాల కోసం, అందుకవసరమైన ధన సంపాదన కోసం తన దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతి వాడేసుకుంటున్నాడు. ముఖ్యంగా భూమి పైన, భూమి లోపల సహజ వనరులను కాలుష్యమయం చేస్తున్నాడు. ప్రకృతి అంతా తన ఒక్కడిదే అన్నట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.


ప్రకృతి గొప్ప ప్రయోగశీలి. సృష్టికి అండగా వుండని (సపోర్టు యివ్వని) జీవజాతులకు మనుగడ లేకుండా చేస్తుంది. ఈ ప్రయోగం కోట్ల సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. డైనోసార్లు, సాటిల్‍ పులి, మనిషి పురాతన రూపంగా భావించే నియాండర్తల్స్ వరకు తెర వెనక్కి పంపింది. ఇప్పటికీ ప్రతి రోజూ వంద జీవజాతులు అంతర్ధానమవుతున్నాయి. ఇప్పుడు సృష్టికి, ప్రకృతికి సపోర్ట్ యివ్వని మనిషిని కూడా ప్రకృతి పక్కకు తప్పిస్తుంది. అలా మానవజాతిని అంతర్ధానం చేయడానికే ప్రకృతి కరోనాని ఆయుధం చేసుకున్నదా.. అదే నిజమైతే మనిషి ఉనికి మాటేమిటి.. దీన్నించి ఎలా బయటపడాలి. ఇప్పటికీ అవకాశం మించి పోలేదు. ప్రకృతిఆవరణలోని కోట్లాది జీవజాతులలో తనూ ఒకడినని తెలుసుకోవాలి. ఆధిపత్య ధోరణి వదులు కోవాలి. ప్రప్రకృతితో చెలిమి చేయాలి. జీవన విధానంలో పాటించే విలువలలో మార్పు రావాలి.


కరోనా సెకండ్‍ వేవ్‍ మరింత భయాందోళనలకు గురి చేస్తుంది. పిల్లల మీదా చూపు విసిరింది. పాఠశాల, హాస్టల్‍ విద్యార్థులు కరోనాకు గురయ్యారు. సురక్షితమనుకున్న దేశాలలో కూడా పిల్లలపై ప్రభావం చూపింది. సింగపూర్‍లో ఒక్కరోజులోనే 38 కేసులు నమోదయ్యాయి. బి.1.167 రకానికి చెందిన వైరస్‍ కారణమని, యిది మొదటిసారిగా భారత దేశంలో గుర్తించబడిందని నిర్ధారించారు. జాగ్రత్త చర్యగా ఈ టర్మ్ వరకు స్కూల్సుని మూసేశారు. బ్రెజిల్లో ఐదేళ్ల లోపు పిల్లలు 2,200మంది మరణించారు. తక్కువ సమయంలో ఇంతమంది పిల్లలు మరణించిన సంఘటన మరెక్కడ లేవని అంటున్నారు. హాంకాంగ్‍లో వైరస్‍ సోకిన చిన్నారులలో నాలుగు మాసాల పసిపాపను గుర్తించారు. తైవాన్‍లో ఒక వారాంతంలో 330 పిల్లల కేసులు నమోదయ్యాయి. ఈ దేశాలన్నిటిలో పాఠశాలలు మూసివేశారు.
తెలంగాణ రాష్టప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది. పాఠశాలలు పనిచేయాలన్న విద్యావేత్తలు, తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యాల ఒత్తిడులను కాదని పాఠశాలలను మూసివేసింది. విద్యా సంవత్సరం వృధాకాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుంది. థర్డ్వేవ్‍లో గర్భస్థ శిశువులతో సహా చిన్నారులపై మరింత ప్రభావం చూపగలదని ఆరోగ్య, వైద్య నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నవేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే సన్నద్ధమై నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పీడియాట్రిక్‍ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలి. అన్ని స్థాయిల్లో కూడా పిల్లలకు నిర్దిష్ట సంఖ్యలో బెడ్స్ రిజర్వ్ చేయాలి. పిల్లలకు అవసరమైన మందులు ఇతర ఉపకరణాలు సిద్ధంగా ఉంచుకోవాలి. పిల్లలకు సాధ్యమైనంత త్వరగా టీకాలు ఇవ్వాలి. రేపటి తరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
ప్రకృతి, పర్యావరణం పరిరక్షణ, మనిషి – లోని అంతర్గత సంబంధాలను, సంక్షోభాలను అవగాహన చేసుకొని పరిష్కార దిశగా కృషి చేయడమే మనముందున్న కర్తవ్యం.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *