ప్రఖ్యాత వైరాలజిస్టు పీటర్‍ పయట్‍ కోవిడ్‍-19 అనుభవాలు


గత ఏడాది మార్చిలో వైరాలజిస్టు పీటర్‍ పయట్‍కు కరోనా సోకింది. లండన్‍ స్కూల్‍ ఆఫ్‍ హైజీన్‍ల ట్రాఫికల్‍ మెటాసిన్‍ స్కూల్‍ డైరెక్టర్‍గా ఉన్నారు. ఒక వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పయట్‍ బెల్జియంలో పెరిగారు. ఎబోలా వైరస్‍ ఆవిష్కర్తల్లో ఆయనొకరు. 1976 జైరే ప్రాంతంలోని విష జ్వరాల మీద పరిశోధించి ఎబోలా వైరస్‍ అనే కొత్తరకం వైరస్సే జ్వరాలకు కారణమని తేల్చారు. ఆయన జీవితం మొత్తం అంటువ్యాధులకు వ్యతిరేకంగా పరిశోధన, పోరాటలలోనే గడిచింది. 1995-2000కి మధ్య కాలంలో యునైటెడ్‍ నేషన్స్ ఎయిడ్స్ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.


మార్చి 19న తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం వచ్చింది. ఆ సమయంలో దగ్గు లేదు. అయినా నేను పనిచేస్తూనే ఉన్నాను. నేను సందేహించినట్లుగానే కోవిడ్‍ పాజిటివ్‍ వచ్చింది. ఇంట్లో అతిథుల కోసం కేటాయించిన గదిలో ఐసోలేట్‍ అయ్యాను. గత పది ఏళ్ళలో ఏనాడూ నేను అనారోగ్యంతో సెలవు తీసుకోలేదు. ఆరోగ్యంగానే ఉంటాను. ప్రతిరోజూ నడుస్తాను. నేను భయపడలేదు కాని, వయసు 71 సంవత్సరాలు కాబట్టి కొంత కలతకు గురయ్యాను. అయినా ఇది కూడా గడిచి పోతుందిలే అని భావించాను.


ఏప్రిల్‍ 1న ఓ డాక్టర్‍ మిత్రుడు పరీక్షలు చేయించటం మంచిదని సలహా ఇచ్చాడు. జ్వరం నానాటికి విషమించేదిగా మారింది. ఊపిరితిత్తులు తీవ్ర న్యుమోనియాకి గురయ్యాయి. కోవిడ్‍ లక్షణమే అది, అట్లాగే బాక్టీరియా నిమ్ము కూడా తోడైంది. ఆక్సిజన్‍తోటి తీవ్రంగానే ఉన్నా శ్వాస తీసుకోవడంలో పెద్ద ఇబ్బందులకు గురికాలేదు. కొంత అలసట బాగానే అనిపించింది. కోవిడ్‍ పరీక్షలో నెగటివ్‍ వచ్చినా. వైరస్‍ అంతర్థానమైనా దాని ప్రభావం కొన్ని వారాలపాటు ఉంటుంది.
మొదట వెంటిలేట్‍ మీదకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డాను. అదృష్టవశాత్తూ ఆక్సిజన్‍ మాస్క్తోనే పనిగావించింది. ఇంటెన్సిన్‍ కేర్‍ విభాగంలో యాంటీ చాంబర్‍ గదిలో నా ఐసొలేషన్‍.


నా గదిని కొలంబియా వాసి అయిన క్లీనర్‍తో, బంగ్లాదేశ్‍ నుంచి వచ్చిన మనిషితో పంచుకున్నాను. ముగ్గురికీ మధుమేహం ఉంది. పగలూ రాత్రి నిశ్శబ్దంలో సింఫుల్‍గా గడిచిపోయాయి. ఎందుకంటే మాట్లాడే శక్తి, ఓపిక మా ముగ్గురిలో ఎవరికీ లేవు. మాటకూడా పెగిలేవి కాదు. గొణగటమే. ఇప్పటికీ సాయంకాలం నా గొంతు పెద్దగా పెగలదు. నా మనసులో ఒకే ప్రశ్న ఇదంతా ముగిశాక నేనెలా ఉండబోతున్నాను అనేది నా బుర్రను తొలిచేసేది.
నాలుగు దశాబ్దాల పాటు నేను ప్రపంచ వ్యాప్తంగా వైరస్‍లతో పోరాడాను. అంటువ్యాధుల నిపుణ పరిశోధకుడు అయ్యాను. నా సంతోషం ఏమంటే నాకు ఎబోలా రాలేదు కరోనా మాత్రమే వచ్చింది. శాస్త్రీయ అధ్యయనాలు చెపుతున్నదేమంటే ముప్పైశాతం వరకు మరణించే అవకాశాలున్నాయని వెస్ట్ ఆఫ్రికాలో 2014లో వచ్చిన ఎబోలా మరణాల కేసు కూడా అంతే ఉంది. కొన్నిసార్లు ఎంత శాస్త్రీయ ఆలోచనలతో ఉంటాం అనుకున్నా కొన్ని ఉద్వేగాలకు లొంగిపోతాం. నేను మనసులో అనుకునేవాడ్ని జీవితాంతం వైరస్‍లతో పోరాడావు కాబట్టి అవి ఇప్పుడు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాయని. ఒక్కవారం పాటు భూమికి స్వర్గానికి మధ్య ఊగిసలాడాను. ముగింపు తెలియకుండా.


కొద్దికాలం తర్వాత ఆసుపత్రినుండి డిశ్చార్జి. ఇంటికి పబ్లిక్‍ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకున్నాను. ఎందుకంటే నేను నగరాన్ని చూడాలనుకున్నాను. మనుషులెవరూ లేని వీధులు, మూతబడిన పబ్‍లు, దుకాణాలు, ఆశ్చర్యకరంగా తాజా గాలి నగరం నిండా. వీధుల్లో ఎవరూ లేకపోవటమొక కొత్త అనుభవం. నేను నా కండరాలు బలహీన పడటం వల్ల సరిగ్గా పని చేయలేకపోయాను. ఊరికే పడుకుని ఉండటం, కదలిక లేకపోవటం అనేది అంత మంచి విషయమేమీ కాదు. ముఖ్యంగా ఊపిరి తిత్తులకు చికిత్స జరుగుతూ ఉన్నప్పుడు.


ఇంటి దగ్గర దీర్ఘ సమయం ఏడ్చే వాడిని కూడా కొద్ది సేపు అలా పడుకుని ఉండిపోయేవాడిని. బుర్రలో ఎప్పుడూ ఏదో ఒక అనుమానం ఎక్కడో పొరపాటు జరుగుతుంది అనే అనిపిస్తూ ఉండేది. ఆలోచనల్లో చిక్కుకుపోయినా కూడదీసుకుని ఎలాగోలాగా బయటపడాలి. సరైన దృష్టిని, ఆలోచనను అలవరచుకోవాలి. ఇంతకు ముందుకంటే నేనిప్పుడు నెల్సన్‍ మండేలాను ఇష్టపడతాను. ఎందుకంటే జైలులో 27 ఏళ్ల బంధింపబడటం కూడా గొప్ప సయోధ్యతో బయటకు వచ్చాడు.
వైరస్‍ల పట్ల నాకు ఎప్పుడూ గౌరవభావమే ఉండేది. అదేమీ ఇప్పుడు తగ్గలేదు. నా జీవితంలో ఎక్కువ భాగం ఎయిడ్స్ వైరస్‍కు వ్యతిరేకంగా పోరాడేందుకు వెచ్చించాను. ప్రస్తుతం వైరస్‍ నా శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంది. నా చూపు ఇప్పుడు భిన్నం. వైరస్‍లను ఇప్పుడు నేను చూసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. వైరస్‍లలో ఇంతకు ముందు తలపడిన అనుభవానికి ప్రస్తుత అనుభవానికి భిన్నంగా ఉంది. నేనిప్పుడు దుర్భేద్యమైన వాడినేమీ కాదు.


ఆసుపత్రి నుండి డిశ్చారయ్యాక ఒక వారానికి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడింది. తిరిగి ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ అవుట్‍ పేషెంట్‍గా చికిత్స చేసి పంపబడ్డాను. నేను న్యుమోనియా పేషంట్‍ నయ్యాను. ఊపిరి తిత్తుల జబ్బు అది. సైటోకైన్ల తుఫానువల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. రోగనిరోధక వ్యవస్థ అతిగా పనిచేయటం వల్ల వచ్చే ఫలితం. వైరస్‍వల్ల టిష్యూ దెబ్బతిన్న కారణంగా ఎవరూ మరణించరు. చాలామంది వారి రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం వల్ల చనిపోతారు. రోగనిరోధక వ్యవస్థకు వైరస్‍ను ఏం చేయాలో తెలియదు. మన రోగనిరోధక వ్యవస్థను నెమ్మదింపజేసే కార్టికో స్టెరాయిడ్ల చికిత్సలోనే ఉన్నానింకా. వైరస్‍ విజృంభణతో పాటుగా సైటోకైన్‍ స్టార్మ్ గనుక వచ్చి ఉంటే నేను మిగిలేవాడినే కాదు. నాకు ఆట్రియల్‍ ఫైబ్రిలేషన్‍తో పాటుగా నా గుండె నిమిషానికి 170 సార్లు కొట్టుకునేది. దీనిని కూడా చికిత్సతో నెమ్మదింపజేయాలి. నియంత్రించాలి. ముఖ్యంగా రక్తం గడ్డకట్టటం, స్ట్రోకు మొదలైనవి నియంత్రించబడాలి. అసలు ఇదంతా కూడా వైరస్‍ను తక్కువ అంచనా వేయటమే. అది శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేయగల సామర్థ్యం గలది.


చాలా మంది భావించేదేమంటే కోవిడ్‍-19 ఒక్కశాతం రోగులనే చంపుతుంది. మిగతా వారికి జలుబు లక్షణాలతో వచ్చి పోతుందని. ఇది చాలా తప్పుడు అవగాహన. ఈ కథ రాన్రాను మరింత సంక్లిష్టమవుతూ ఉంటుంది. కోవిడ్‍ వచ్చి వెళ్లాక చాలా మందికి దీర్ఘకాలిక మూత్రపిండ, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. వారి నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా వందల వేలమందికి తమ శేషజీవితం మొత్తం రీనల్‍ డయాలసిస్‍ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
మనం కరోనా వైరస్‍ గురించి తెలుసుకునే కొద్దీ ప్రశ్నలూ, సందేహాలు ఉత్పన్నమవుతాయి. మనం ప్రయాణిస్తూనే నేర్చుకుంటున్నాం. ఈ ఎపిడమిక్‍ లేదా పాండమిక్‍ను త్వరగా నియంత్రించడం లేదని విధాన నిర్ణయకర్తలను, శాస్త్రవేత్తలను విమర్శించేవారు ఎక్కువ. ముందు చూపులేకుండా అనాలోచితంగా వ్యవహరించటం చూస్తే కోపం కూడా కలుగుతుంది.


అంతిమంగా నా ఊపిరితిత్తులు మెరుగు పడ్డాయి. నేను మళ్లీ పనికి మరలాలి. నా పని తాత్కాలికంగా పరిమితమైనదే అయినప్పటికీ పని మొదలెట్టాలి. నేను చేయాల్సిన మొదటి పని కోవిడ్‍-19 రీసెర్చ్ & డెవలప్‍మెంట్‍ ప్రత్యేక సలహాదారుగా వాన్‍డర్‍ లేన్‍కి పని చేయటం.
కరోనా వైరస్‍కు వాక్సిన్‍ లేకుండా మనం మళ్లీ సాధారణ జీవితం గడపటం సాధ్యం కాదు. అసలు ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం వాక్సిన్‍ వ్యూహమే. వాక్సిన్‍ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలి. లాజిస్టిక్స్ విషయంగా ఇదొక పెను సవాలు.
ఈ సంక్షోభం కొన్ని ప్రాంతాలలో రాజకీయ ఒత్తిడులను తేలిక పరుస్తుందను కోవటం భ్రమే అయినప్పటికీ, గతంలో పోలియో వాక్సిన్‍ ప్రచార సందర్భాలలో దీనిని చూశాం.


కోవిడ్‍-19కి వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థది గొప్ప కృషి. అయితే డబ్ల్యూహెచ్‍ఓలో కొన్ని సంస్కరణలు రావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికాధికంగా సలహా సంఘాల మీద ఆధారపడుతూ వస్తుంది. అది అతి తక్కువగా బ్యూరోక్రాటిక్‍ లక్షణాలు గల సలహా కమిటీలపై ఆధారపడితే మంచిది. ఈ కమిటీలలోని దేశాలు తమ ఆసక్తులను ప్రాధమికంగా కాపాడుకోవటం కోసం పనిచేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తరచుగా రాజకీయ క్షేత్రంగా రూపొందుతూ ఉన్నది.


ఏది ఏమైనా నేను జన్మతః ఆశావాదిగానే మిగులుతాను. నేనిప్పుడు మృత్యువును కూడా ఎదుర్కొన్నాను. అర్థం పర్థం లేని వాటిని సహించే ఓపిక సహనాలు నాకు ఇంతకు మొదటి కంటే బాగా తగ్గిపోయాయి. అందుకనే నేను మరింతగా ఆచితూచి విషయాలకు స్పందించటంలో నా ఎంపికను నేను కలిగి ఉంటాను.
(Dirk Dranlans పీటర్‍ పయట్‍తో జరిపిన సంభాషణకు Martin Enserink అనువాదం sciencemag.orgలో ప్రచురితం. సౌజన్యం బెల్జియన్‍ పత్రిక Knack and Sciencemag.org May 8, 2020)


-మంగారి రాజేందర్‍ (జింబో)
: 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *