బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా!

తెలంగాణ… హైదరాబాద్‍ నగరం.. రాజ్యం… తవ్విన కొద్దీ కొత్త మణులు, చారిత్రక వైఢూర్యాలు, సాంస్కృతిక రత్నాలను, సాహిత్య కెంపులను అందించే విలువైన నిక్షేపాలున్న నిధి. ఒకప్పుడు ఇది ‘కోహినూరు’కు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతకన్నా గొప్పదైనా చారిత్రక వారసత్వానికి వారధి. హైదరాబాద్‍ నగరం గురించి పర్షియన్‍, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో.. శిలా శాసనాల్లో, రాగి రేకుల్లో, తాళపత్రాల్లో ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉన్నది. 

కుతుబ్‍షాహీల కాలం నుంచి ఫ్రెంచ్‍, డచ్‍, బ్రిటీష్‍, పర్షియా, అరబ్బు, మద్రాసు ప్రాంతాల నుంచి గోలకొండ, హైదరాబాద్‍ నగరా లను సందర్శించిన వాళ్ళు తమ అనుభవాలను, అనుభూతులను రికార్డు చేసినారు. నిజాం పాలనలో బ్రిటీష్‍ రెసిడెంట్లుగా, మిలిటరీ అధికారులుగా పనిచేసిన కొన్ని వందల మంది స్వీయానుభవాలను, చరిత్రను చిత్రికగట్టినారు. అట్లాగే దాదాపు 1800ల ప్రాంతం నుంచి హైదరాబాద్‍ రాజ్యం స్థితిగతులను, పర్యావరణాన్ని, సహజ వనరులను, భూగర్భ నిధులను, ఖనిజాలను, ప్రజల ఆచార వ్యవహారాలను, భాషా, సంస్కృతులను వ్యాసాల రూపంలో వెలువరించినారు. కల్నల్‍ కాలిన్‍ మెకంజీ, ఆయన అనుయాయులు కావలి వెంకట బొర్రయ సోదరులు హైదరాబాద్‍ రాజ్యంలోని వివిధ ప్రాంతాలను సర్వేచేయడమే గాకుండా కైఫియత్తులను రాయించినారు. ఈ కైఫియత్తుల్లో ఆనాటి భాషతో పాటుగా, అపురూపమైన సమాచారాన్ని సేకరించి పెట్టినారు. ఇట్లా పోగైన సమాచార సంపద అందరికీ తెలియాల్సిన అవసరమున్నది. ఇంతకు ముందు ఎక్కడా చరిత్ర పుటల్లో చోటుచేసుకోకుండా పోయిన విషయాల్ని వివరంగా పూసగుచ్చి తెలంగాణ తల్లికి మాలగా అర్పించాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ తనను తాను తెలుసుకోవడమే గాకుండా, తెలుసుకున్న సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తేవాల్సిన సందర్భమిది. గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ/హైదరాబాద్‍ రాజ్యానికి సంబంధించి కొన్ని లక్షల పుటల సమాచారాన్ని సేకరించడం జరిగింది. ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్ అండ్‍ రెఫరాల్‍ సెంటర్‍ తరపున ఈ సమాచారాన్ని వివిధ పరిశోధకులు, పత్రికలు, వ్యక్తులు, పండితులతో పంచుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మరొక్కసారి అరుదైన చారిత్రకాంశాల్ని, సామాజిక విశేషాల్ని, సాంస్కృతిక వైభవాన్ని, భాషా వైశిష్ట్యాన్ని, హిందూ-ముస్లిం తేడాలేకుండా అన్ని మతాల వారు ప్రదర్శించిన అపురూపమైన ప్రతిభ, సంస్థలుగా చిరస్మరణీయమైన సేవలందించిన విశేషాలను ఇక్కడ రికార్డు చేయడం జరుగుతోంది. నృత్యం, చిత్రం, గానం, కీర్‍బత్తీస్‍ కథలు, దక్కనీ గజల్స్, సాహిత్యం అంతా పంచభాషా సంస్కృతిని, మిశ్రమ జీవన విధానాన్ని పట్టిచ్చే ఆకరాలు. అలాయి బలాయి సంస్కృతికి నిదర్శనం. పండుగలు, పబ్బాలు, ఊరేగింపులు, జానపదుల కళారూపాలు, అక్కన్న మాదన్నలు ఆదరించిన/ ప్రోత్సహించిన బోనాలు, బతుకమ్మ ఇవ్వాళ గజ్జెగట్టి ఘనంగా ప్రదర్శిస్తోంది. గతం నుంచి మనకు అందిన వారసత్వం, వారసత్వ కట్టడాలు, వాటి ప్రాధాన్యత కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది.


హైదరాబాద్‍ చరిత్ర అంటేనే అబ్బురం. విస్మయం. అరబ్‍-రొహిల్లా వీరుడు తుర్రెబాజ్‍ఖాన్‍ తన గురువు మౌల్వీ అల్లావుద్దీన్‍ బోధనలతో ప్రభావితమై బ్రిటీష్‍ వారిపై తిరుగుబాటు చేసినాడు. పోరాటంలో ప్రాణాలు వదిలినా ఈ దేశ మూలవాసులెవ్వరూ పరాయిపాలనకు తలొగ్గేది లేదని హెచ్చరించాడు. బ్రిటీష్‍ వారి వెన్నులో వణుకు పుట్టించాడు. వీరుడిగా నిలిచాడు. ఇది 1858నాటి సంఘటన. అయితే 1815లో ఒక 15 యేండ్ల బాలుడు బ్రిటీష్‍వారితో హైదరాబాద్‍లో యుద్ధం చేసి వారిని మట్టి కరిపించిన చరిత్ర మనలో చాలా మందికి తెలియదు. ఆ చరిత్రను సృష్టించింది కూడా హైదరాబాదే! బహుశా దేశం మొత్తంగా ఒక దేశీయుడు బ్రిటీష్‍సైన్యాన్ని ఎదుర్కొని విజేతగా నిలిచిన తొలి సంఘటన ఇదే అయ్యుంటది.

ఒక 15 యేండ్ల బాలుడు బ్రిటీష్‍ సైన్యాన్ని గడగడలాడించాడంటే నమ్మశక్యంగాని విషయం. కాని వాస్తవం. సికిందర్‍ఝా (మూడో నిజాం) (1768-1829) పాలన చేస్తున్న కాలమది. ఈ సికిందర్‍ ఝా తన తండ్రి రెండో నిజామ్‍ అలీఖాన్‍ మరణానంతరం 1803లో అధికారంలోకి వచ్చాడు. 1829 వరకు పాలన చేసి తన 61వ యేట మరణించాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. హాజీ బేగమ, చాంద్‍నీ బేగమ్‍. మొత్తం 19 మంది సంతానం. తొమ్మిది మంది కూతుళ్ళు. పది మంది కొడుకులు. సికిందర్‍ ఝా మూడో కొడుకు ‘ముబారిజుద్దౌలా’ మన వీరుడు. ముబారిజుద్దౌలా బ్రిటీష్‍ అధికారి వద్ద దర్జీగా పనిచేసే ఒక వ్యక్తిని నిర్బంధించాడు. నిర్బంధించడానికి కూడా కారణమున్నది. బ్రిటీష్‍ వారి సూట్లు, బట్టలు ఈ దర్జీ కుట్టేవాడు కావడంతో ఆయన సేవలకు మెచ్చి కొంత భూమిని బ్రిటీష్‍వారు ఇనామ్‍గా ఇచ్చినారు. అయితే ఈ భూమికి సంబంధించి కొంత రెవిన్యూ సుంకం చెల్లించాల్సిందిగా ముబారిజుద్దౌలా, అతని మిత్రుడు ఆ దర్జీని ఆదేశించినారు. ఇందుకు అతను అంగీకరించక పోవడంతో అతన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. రాజభవనంలో నిర్బంధించినారు.


దీంతో ఆ బ్రిటీష్‍ అధికారి నిజాం దర్బారు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చి టెయిలర్‍ నిర్బంధ విషయం తెలుపుతూ, అతన్ని విడుదల చేయవలసిందిగా సికిందర్‍ఝాను కోరినాడు. దీనికి ఆయన స్పందిస్తూ తన కొడుకు, అతని మిత్రుడి నిర్బంధంలో ఉన్న దర్జీని విడుదల చేయడమే గాకుండా నిండు సభలో గౌరవ సూచకంగా దర్జీకి శాలువా కప్పి సత్కరించాడు. ఈ విధమైన సత్కారం ఆనాడు అత్యంత ఉన్నతులకు మాత్రమే లభించేది. అంతే గాకుండా తన రక్షణ బృందంలోని ఒక అధికారిని దర్జీ భద్రతా విషయాలు చూసుకునేందుకు కేటాయించినాడు. భవిష్యత్‍లో ముబారిజుద్దౌలా నుంచి ఎలాంటి హాని ఉండబోదు అనే భరోసాను కూడా కల్పించాడు. నిండు సభలో అదీ విదేశస్తుల మూలంగా తనకు అవమానం జరగడంతో ముబారిజుద్దౌలా కుమిలి పోయాడు. కన్నకొడుకునైన తనను కాకుండా బ్రిటీష్‍ అధికారికి ఎక్కువ గౌరవం ఇవ్వడాన్ని జీర్ణీంచుకోలేక పోయాడు. దీంతో బ్రిటీష్‍ వారి మీద పగసాధించుకోవాలని ముబారిజుద్దౌలా నిర్ణయించుకున్నాడు.

అంతేగాకుండా తన మేనమామ మన్నా సాహిబ్‍ (మునీర్‍ ఉల్‍ ముల్క్), ఆయన కొడుకుతో జత కట్టాడు. అనుకున్నదే తడవుగా మొత్తం రాజభవనాలన్నింటిపై నిఘా పెట్టినాడు. చుట్టూ బారికేడ్లు నిర్మించి తన అనుమతి లేకుండా ఎవ్వరూ లోనికి రావొద్దని, అలా వచ్చిన వారిని తల తీసెయ్యాల్సిందిగా ఆదేశించాడు. అంతేగాదు ఈ భవంతులు ఆక్రమించుకునే దిశలో ఎవ్వరు అడ్డం వచ్చినా వాళ్ళు తమ సొంత కుటుంబీకులైన వారిని కూడా వధించాల్సిందిగా ఆదేశించాడు. గురి చూసి కాల్చే నేర్పు గల వాళ్ళను భవంతులపై కాపాలకు దించినాడు. ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. అంత:పురంలో భయం ఆవరించింది.


పరిస్థితులు అదుపు తప్పడంతో కెప్టెన్‍ హేర్‍ నాయకత్వంలో ‘రస్సెల్‍ బ్రిగేడ్‍’ (సైన్యం) నగరంలోకి ప్రవేశించింది. వీరి ఏకైక లక్ష్యం ముబారిజుద్దౌలా. ఇక్కడ బ్రిటీష్‍ పటాలానికి, ప్రిన్స్ మద్ధతుదారులకు తీవ్రమైన పోరాటం జరిగింది. ఈ పోరులో బ్రిటీష్‍ సైన్యంలోని కెప్టెన్‍ డార్బే (ఈయన నాన్‍ కమీషన్‍డ్‍ అధికారిగా ఉన్నాడు) మరో 12 మంది సైనికులు చనిపోయారు. అయితే ఓడిపోతున్న సైన్యానికి మద్దతుగా బ్రిటీష్‍ వారు సికింద్రాబాద్‍లో ఉన్నటువంటి పటాలాలను హైదరాబాద్‍కు రావాల్సిందింగా ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సికిందర్‍ ఝా తన బావమరిది, మంత్రి కూడా అయిన మునీర్‍ ఉల్‍ ముల్క్ని రంగంలోకి దించినాడు. ఈయన బ్రిటీష్‍ పటాలాలేవీ హైదరాబాద్‍లోకి రావడానికి వీలులేదని ఆదేశిస్తూ, యుద్ధాన్ని ఆపడం కోసం ముబారిజుద్దౌలా చుట్టూతా బ్రిటీష్‍ పోలీసులు నిఘా ఏర్పాటుచేసుకోవడానికి అనుమతిచ్చాడు. ఈ చర్య ముబారిజుద్దౌలాలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. నేను ఒక్క రాజుకు తప్ప మరెవ్వరికీ లొంగేది లేదని చెబుతూ గుర్రంపై సవారీ అయి నగరమంతా విజయోత్సవ ర్యాలీని నిర్వహించాడు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాడవాడలా స్వాగతం పలికారు. బ్రిటీష్‍ సైన్యం ఈ సంఘటనను అవమానంగా భావించింది. చివరికి రాజు మీద వత్తిడి తీసుకొచ్చి ముబారిజుద్దౌలాను గోలకొండ కోటలో బంధించేలా చేశారు. ముబారిజుద్దౌలా 1815-1820 వరకు అంటే 15వ యేట నుంచి 20వ యేడు వరకు గోలకొండ కోటలో బందీగా ఉన్నాడు. ఈ ముబారిజుద్దౌలాకు ‘హైదర్‍ అలీ ఖాన్‍’ అనే బిరుదు కూడా ఉన్నది.


నిజానికి ఒక 15 ఏండ్ల బాలుడు తన మేనమామ సహాయంతో మొత్తం బ్రిటీష్‍ వారిని గడగడలాడించడం చారిత్రక సంఘటన. ఆ తర్వాతి కాలంలో కూడా అటు బ్రిటీష్‍ వారికీ, ఇటు హైదరాబాద్‍ పాలకులకూ పక్కలో బల్లెంలా పనిచేసినాడు. హైదరాబాద్‍పై ప్రాంతేతరుల ముఖ్యంగా బ్రిటీష్‍ వారి పెత్తనాన్ని, జోక్యాన్ని తీవ్రంగా నిరసించినాడు. అందుకు ప్రజల మద్ధతు కూడగట్టేందుకు కూడా ప్రయత్నించినాడు. సికిందర్‍ఝా అనంతరం నాసిరుద్దౌలా 1829లో అధికారంలోకి వచ్చాడు. ఈయన అధికారంలో ఉన్న కాలంలో ముబారిజుద్దౌలా ‘వహాబీ’ ఉద్యమానికి దక్షిణాదిన బీజాలు వేసినాడు. కర్నూలుతో సహా అనేక మందిని బ్రిటీష్‍ వారికి వ్యతిరేకంగా కూడ గట్టినాడు. ఈ సంఘటన గురించి మరోసారి చర్చించుకుందాం.


వ్యక్తులు, సంఘటనలు, వివిధ విషయాలు, యుద్ధాలు, తిరుగుబాట్లు, పాలకుల లొంగుబాట్లు, బ్రిటిష్‍ రెసిడెంట్ల అత్యూత్సాహం, నిజాం నవాబుల నిరసనలు అన్నీ కలగలిసి హైదరాబాద్‍ చరిత్రను మలుపు తిప్పాయి. పాలకులు తమ రాజ్యాలను కాపాడుకోవడం, స్థిరీకరించుకోవడం, విస్తరించడం కోసం యుద్ధాలు చేసేవారు. ప్రజలు కూటమిగా ఏర్పడి చేసే తిరుగుబాట్లను అణచివేయడం కూడా రాజ్యపాలనలో భాగమే! అయితే కొన్ని కొన్నిసార్లు చిన్న విషయాల కోసం, లేదా పంతాలు పట్టింపుల కోసం కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చేసేవారు.


వందల యేండ్లుగా ఈ నగర చరిత్రను రికార్డు చేస్తున్నా ఇంకా వెలుగులోకి రావాల్సిన కోణాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్‍ రాజ్యంలో బ్రిటీష్‍పై మొదటి తిరుగుబాటు చేసింది తుర్రెబాజ్‍ఖాన్‍ అని ఇప్పటి వరకూ చదువుకున్నాము. ఈ చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమయింది. హైదరాబాద్‍ నగరంలో బ్రిటీష్‍వారిపై మొదటి తిరుగుబాటు 1815లో జరిగింది. దీనికి నాయకత్వం వహించింది మూడో నిజామ్‍ సికిందర్‍జా తనయుడు ముబారిజుద్దౌలా. ఈ తిరుగుబాటు ఒక దర్జీ నిర్బంధం విషయంలో జరిగింది.


-సంగిశెట్టిశ్రీనివాస్‍, ఎ:98492 20321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *