కందూరి మల్లికార్జునచోడుని అవురవాణి (అవిరువాణ్డి) శాసనం


కందూరుచోడులు క్రీ.శ.1060 నుంచి 1160 వరకు అంటే వందేండ్లు మహబూబ్‍ నగర్‍ జిల్లా జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలు, నల్లగొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలతోకూడిన కందూరునాడును పరిపాలించేవారు. కోడూరు, పానగల్లులు వీరి రాజధానులుగా వుండేవి. కందూరిచోడుల వంశానికి మూలమైన వారిని గురించి ఒల్లాల శాసనం (ఎపిగ్రాఫియా ఆంధ్రికా, శా.సం.8, పే.55 -పీవీపిశాస్త్రి పరిష్కర్త) వల్ల తెలుస్తున్నది.


ఎక్కడో ఒఱయూరుకు చెందిన ప్రధాన చోడరాజుల శాఖ ఏఱువప్రాంతాన్ని ఏలింది. ఏఱువప్రాంతం కృష్ణానదికి రెండువైపుల వ్యాపించివుండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఏఱువ ప్రాంతాన్న ఏలినవారు కనుక వీరికి పేర్లకు విశేషణంగా ఏఱువ చేరింది. పానుగల్లు రాజధానిగా 1వ భీముడు (భీమచోడుడు) పాలించేవాడు. 1వ ఏఱువ భీముని కొడుకు 1వ తొండయ, అతని కొడుకు 2వ భీమచోడుడు. చోడభీమునికి 4గురు కొడుకులు. వారు 2వ తొండయ, ఇఱుగయ, (శాసనశిల భాగం విరిగిపోవడంవల్ల 3వచోడుని పేరు తెలియరాలేదు) మల్ల (మల్లికార్జునుడు)లు. మల్లికార్జున చోడుడు క్రీ.శ.1098లో ఒల్లాలగ్రామాన్ని అప్పన పెగ్గడకు దానమిచ్చినట్లు ఒల్లాల శాసనం తెలుపు తున్నది. మల్ల పెద్దన్న 2వ తొండయచోడుడు వేయించిన క్రీ.శ.1091నాటి పానగల్లులో దొరికింది. ఇతనికి సంబంధించిందే క్రీ.శ.1089నాటి శాసనం కొలనుపాకలో లభించింది. అందులో వీరు కందూరు పురవరేశ్వరులుగా పేర్కొనబడ్డారు. వీరి తండ్రి భీమచోడుడు త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని సంతోషపరిచి కందూరునాడును మాన్యంగా పొందినట్లు ఒల్లాల శాసనం చెప్తున్నది.


కందూరుచోడ మల్లరాజు వేయించిన ఒల్లాల శాసనం కాకుండా దానికన్నా ముందే వేయించిన కొత్తశాసనం ఒకటి నల్లగొండ జిల్లా, నార్కెట్‍ పల్లి మండలం అవురవాణి గ్రామం తూర్పు శివారు, కల్వర్టు దగ్గరలో లభించింది.
అవురవాణి అని ఇపుడు పిలుస్తున్న గ్రామానికి అవురొండి అని మరొక పేరుందని తెలుస్తున్నది. ఈ అవురొండే ఇటీవల గ్రామ శివార్లో పడివున్న శాసనంలో అవిరువాణ్డిగా పేర్కొనబడింది.


80పంక్తులలో తెలుగులిపి, తెలుగుభాషలో రాయబడివున్న ఈశాసనం కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుని ఏలుబడిలో సామంతుడైన కందూరి మల్లికార్జునుని దానశాసనం. శకసం. 1016లో అంటే క్రీ.శ.1094లో సూర్యగ్రహణ నిమిత్తం మల్లయరాజులు దామయపఱింగవులకు కాళ్ళుకడిగి సర్వనమస్యంగా 1 మర్తురు నీర్నేల(తరి) భూమిని దయచేసినట్లు ఈ శాసనం తెలుపుతున్నది.


ఇందులో రాజుగారిని గురించిన బిరుదగద్య దురవగాహకంగా వుంది. నిజానికి కందూరి మల్లికార్జునచోడుని పేరుమీద క్రీ.శ.1098లో వేయబడిన పాములపాడు, ఒల్లాల శాసనాలు రెండే లభిస్తున్నాయి. ఇది మూడవది. మల్లరాజులే మల్లికార్జునుడు. ఈ శాసనం వేయబడిన సంవత్సరాన్నిబట్టి మల్లికార్జునచోడుడు 1094నాటికే మహామండలేశ్వరుడైనాడనుకోవాల్సి వుంటుంది. అంతేగాక ఉదయన చోడుడు క్రీ.శ.1144లో వేయించిన పరడశాసనం (నల్లగొండ జిల్లా శాసనసంపుటిలో వ.సం.48)లో తమతండ్రి మల్లపురాజులంగారికి ధర్మువుగా ఆమనగల్లులో మల్లసముద్రం అనే చెరువును తోడించినట్లు పేర్కొబడింది.


అట్లే శాసనభాష కూడా కందూరివారి శాసనాలభాషతో సరిపోల్చవచ్చు. రామలింగాలగూడెం (మార్కండేశ్వరాలయ) శాసనంలో ‘కావలియ బ్రహ్మయ్యకు గాళ్ళు గడిగి ధారాపూర్వకం సేసి యాచంద్రస్థాయిగా దయచేసియిచ్చిరి’ అని వుంది. ఇవే మాటలతో పోలిన మాటలు అవిరువాణ్డి శాసనంలో కూడా దానసందర్భంలో ‘మఱ్తురు నిరినేలయు దామయ పఱింగవులకు సర్వనమస్యముగా -గాళ్ళు గఱిగి ధారాపూర్వకము దయసేసితిమి’ అని రాయబడ్డాయి.
ఈ శాసనంలో ఏ శాసనంలోలేని విధంగా ‘మ’ అనే అక్షరం ఎక్కువచోట్ల ‘రొ’ వలె రాయబడి వుంది. పరిశోధనాత్మకమైనది ఈ లిపి.
ఈ శాసనం రాసినది కరణం నందేన.
శాసనంజాడ చెప్పి, శాసనప్రతిని తీయడంలో కొత్త తెలంగాణ చరిత్రబృందం (శ్రీరామోజు హరగోపాల్‍, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు నాగరాజు, ప్రవీణ్‍)తో సహకరించింది అప్పాజీపేట యాదగిరి (ఆంధ్రభూమి దినపత్రిక విలేకరి), తనతోడుగా వచ్చిన మిత్రులు. అట్లే ఈ శాసనపరిష్కారంలో ప్రముఖ శాసనపరిశోధకుడు డా.సూర్యకుమార్‍ గారు, తెలంగాణ చరిత్రకారుడు డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారు విలువైన సూచనలను అందించారు. అందరికి ధన్యవాదాలు. (మా యాత్రాకాలం: 09.03.2017)


శాసనం వివరాలు:


నల్లగొండ జిల్లా, నార్కెట్‍ పల్లి మండలం అవురవాణి గ్రామశాసనం:
శాసనస్తంభం కొలతలు: 9 అంగుళాల వెడల్పు, 9అడుగుల ఎత్తైన నల్లశానపు రాతిస్తంభం
శాసనకాలపు రాజవంశం: పశ్చిమ(కళ్యాణి)చాళుక్యులు
రాజు: త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుడు
కాలం: శక సం.శ్రీముఖ,1016 సూర్యగ్రహణ సమయం (ఫాల్గుణ అమావాస్య) అనగా క్రీ.శ.1094సం. మార్చి 26
లిపి: తెలుగు,
భాష: తెలుగు
దాత: చాళుక్య సామంతరాజు, మహామండలేశ్వరుడుః మల్లయ (మల్లికార్జున) రాజులు


అవురవాణి (అవిరొండి) శాసనపాఠం:
మొదటివైపు:

శాసనస్తంభంపై శాసనప్రారంభంలో శివలింగం, సూర్యచంద్రులు, ఆవు, దూడల బొమ్మలున్నాయి

 1. స్వస్తి సమధిగత ప
 2. 0చమహాశబ్ద మ
 3. హా మణ్డలేశ్వ
 4. ర యయోధ్య పు
 5. ర వరేశ్వర చేల్వ
 6. నీగళ్ళ వైరీ హ్రీ
 7. త్సేళ్ళయరిబల మ
 8. ళ్ళెం ఱళింగీనల్లరే
 9. పుడిమిర దీపా
 10. కరం సత్యరత్నా
 11. కర భావన సిం
 12. ఘ జయదుత్తర
 13. 0గ జయాంగనా ర
 14. మణీం చాళెక్యాభ
 15. రణ సుజనమనో
 16. రంజనం శత్రుమ
 17. ళభంజన దినానా
 18. త మనోభివాంచృనః
 19. వరాహలాంఛన ను
 20. మాది సమస్త ప్ర
 21. శస్తిసహితం శ్రీ
 22. మన్మహామణ్డలేశ్వర
 23. మల్లయరాజులు
 24. సక వర్ష 1016
 25. సం. నగునేంది


రెండోవైపు:

 1. శ్రీముఖ సంవ
 2. త్సర సూర్య
 3. గ్రహణ నిమిత్తము
 4. నం జఱకు దేబమి
 5. 0దితీ వారి అవిఱు
 6. వాణ్డి పొలమునం
 7. ది ఉత్తరము చే
 8. మేను దాని పిఱుం
 9. దంనేను చే మఱ్తురు
 10. నిరినేలయు దామ
 11. య పఱింగవులకు
 12. సర్వనమస్యముగా-
 13. గాళ్ళు గఱిగి ధారాపూ
 14. ర్వకము దయసేసితి
 15. మి బ్రహ్మణర్వ సుధా
 16. దత్తారాజభిస్సగరా
 17. దిభిః యస్యయస్య య
 18. దాభూమి స్తస్యత
 19. స్య తదాఫలం సామా
 20. న్యోయం ధర్మసేతు
 21. నృపాణా కాలేకాలే
 22. పాలనీయో భవద్భి
 23. స్సర్వేనేతాచ్ఛాదినః
 24. పార్థివేంద్రాన్భూయో భూ
 25. యో యాచత్నే
 26. రామచంద్రః మద్వంశ
 27. జాఱ్పర మహీపతి వం
 28. శ జావా పాపాద పే
 29. త మనసోభువి
 30. భావి భూ
 31. పాః యే పాలయ
 32. 0తి మమధర్మ
 33. మిదం సమస్తం


మూడోవైపు:

 1. తేవామ్మయా
 2. విరచితోంజలి
 3. రేషమూర్ధిః
 4. యార్వదత్తాం ద్విజా
 5. చ్యేయత్నద్రక్చ
 6. ఉదిష్టిరమహిర్మే
 7. విమతాం శ్రేష్ట దానా
 8. – యా పాలనం
 9. షష్టివర్షా సహ
 10. శ్రేణి స్వర్గేతిష్ట
 11. తి భూమిదః
 12. (నీ)చ్చేతా చానుమ
 13. 0తాచ తాన్యే
 14. -కే వసేతు
 15. స్వదత్తాం పరదత్తాం
 16. వాయోహరేత
 17. వసుంధరాం ష
 18. ష్టిర్వర్ష సహస్రా
 19. ణి విష్టాయాం
 20. జాయతే క్రిమిః
 21. కరణ నందేన
 22. వ్రాలు

శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *