జీవాల్ని పోషించే పద్ధతులు


జీవాల పెంపకందార్లు మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల్ని మూడు రకాల పద్ధతుల్లో పెంచుతున్నారు. ఆ పద్ధతులు, వాటిని ఆచరించడంవల్ల ఒనగూరే లాభాలు, నష్టాల గురించి వివరంగా తెల్సుకుందాం.


ఎ) విస్తృత పద్ధతి:


మన రాష్ట్రంలో 90% జీవాల్ని 6-8 గంటలపాటు బయట మేతకై తిప్పుతూ, రాత్రికళ్లా ఇంటిదగ్గర లేదా ఊరిచివర పొలాల్లో నిలిపిఉంచుతారు. పగలంత బయళ్లలో, అడవుల్లో, యజమాని స్వయంగా జీవాల్ని మేపుతుంటారు. దీనినే ‘‘విస్తృత పద్ధతి లేదా సాంప్రదాయ పద్ధతి’’ అని వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రతి 2-3 గొర్రెలకు ఒక హెక్టారు భూమి చొప్పున మేపుకు తిరగడానికి అవసరముంటుంది. ఈ పద్ధతిలో మేపు ఖర్చు ఉండదు. మంద అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటుంది. జీవాల పెంపకం నిరుత్సాహాన్ని కల్గిస్తుంది.
ఈ విధానంలో దాణాగాని, ఇతర ఏ ఆహారంగాని ప్రత్యేకంగా ఇవ్వనందున, పిల్లల్లో పెరుగుదల అంతగా ఉండదు. పిల్లల్ని మాంసోత్పత్తి కొరకు చాలా కాలం పోషించాల్సి ఉంటుంది. సం।।లో 4-5 మాసాలు తప్ప, మిగతా కాలంలో బీళ్ళలో గడ్డి లభ్యం కానందున మేకలు, గొర్రెలు అర్థాకలితో ఉండాల్సి వస్తుంది. బీళ్ళలో ఒకవేళ గడ్డి లభ్యమైనప్పటికి అది నాణ్యతగా, ఉండదు. ఈ పద్ధతిలో పెంచే గొర్రెలు, పరిశుభ్రమైన త్రాగునీటి కొరతను తరచుగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ పద్ధతిలో పెంచే గొర్రెల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి. పశువైద్య సౌకర్యం అందుబాటులో ఉండడం వీలు పడదు.


జీవాలు ప్రతి రోజు 4-5 కి.మీ. దూరం నడవడం వల్ల, అవి తిన్న మేత ద్వారా లభించేశక్తి కన్నా, అవి నడవడానికి ఎక్కువశక్తి అవసరమై, త్వరగా నీరసపడిపోతాయి. ఎండ, వానలకు గురయి, వ్యాధి నిరోధకశక్తి కోల్పోయి, సులభంగా వ్యాధులకు గురవుతాయి. సాధారణంగా జీవాలు డిసెంబర్‍, జనవరి మాసాల్లో ఈనుతుండడం వల్ల మందల్లో గొర్రెపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇవి 2-3 మాసాల వయస్సు వచ్చి, సరిగ్గా ఎదిగే దశలో, బీళ్ళలో మేత లభించని పరిస్థితులు ఎదురవుతాయి. తద్వారా గొర్రె పిల్లలు, మేక పిల్లల ఎదుగుదల, పునరుత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.
జీవాల్ని విస్తృతపద్ధతిలో పోషించడం వల్ల జీవాల్ని క్రమపద్ధతిలో జత కలుపడం, సంఖ్య లెక్కించడం, మందులు టీకాలు వేయించడం కష్టమవుతుంది. మేలిజాతిని వృద్ధిచేసుకోవడం వీలుపడదు. ఏఏ జీవాలు పొర్లినవో తెలుసుకోవడం కష్టమవుతుంది.
మేత లభించని పరిస్థితుల్లో జీవాలతో పాటు, కుటుంబాలు కూడా గ్రామాలు విడిచి మేత దొరికే ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన దుర్భర పరిస్థితులు ఎదురవుతాయి.
ఈ పద్ధతిలో అడవి జంతువులు, దొంగల బెడద ఎక్కువగా ఉంటున్నందున, జీవాల్ని రక్షించడం కష్టంగా ఉంటుంది. ప్రమాదాలు సంభవిస్తుంటాయి.


రోజు రోజుకు లభించే విస్తీర్ణం తగ్గుతున్న ఇలాంటి గడ్డుపరిస్థితుల దృష్ట్యా, విస్తృత పద్ధతిలో జీవాల్ని ఎక్కువగా పెంచుకుంటున్న మన జీవాలపెంపకందార్లు, వర్షాకాలం ప్రారంభంలోనే స్టయిలో వంటి పశుగ్రాసవిత్తనాలను బీళ్ళలో వెదజల్లడం వల్ల, జీవాలకు మాంసకృత్తులు అధికంగా ఉండే మేతను పుష్కలంగా అందించగల్గుతారు. అలాగే అవిశ, సుబబుల్‍, దిరిశన, ఏపి వంటి పశుగ్రాసచెట్లను నాటితే, అవి త్వరగా పెరిగి, నీడతోపాటు వాటి ఆకులు, రెమ్మలు జీవాలకు మేతగా ఉపయోగపడుతాయి. ఈ చర్యతోపాటు మేత లభ్యంకాని పరిస్థితుల్లో సాయంత్రం మంద ఒకదగ్గరికి చేరిన తర్వాత, కొంత దాణా, త్రాగునీరు ఇస్తే, విస్తృత పద్ధతిలో పెరిగే జీవాలకు, పెంచేవారికి కొంత వరకు మేలు కలుగుతుంది.


బి) పాక్షిక సాంధ్రపద్ధతి:
 • ఈ పద్ధతిలో జీవాల్ని కొద్ది సమయం నిర్ణీత ప్రదేశంలో, పాక దగ్గర్లోని బయళ్ళలో తిప్పి, ఎక్కువ సమయం పాకల్లో ఉంచి మేత, దాణా, నీరు అందిస్తుంటారు.
 • ఈ పద్ధతి ఆచరించడం వల్ల జీవాలకు పోషకపదార్థాలన్ని సక్రమంగా అంది త్వరగా ఎదుగుతాయి. జీవాలు మంచి బరువు తూగుతాయి. పునరుత్పత్తి ప్రమాణాలు వృద్ధిచెందుతాయి. వ్యాధుల బెడద తగ్గుతుంది. అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతో చౌకగా దాణా తయారుచేసి అందివ్వడం వీలువుతుంది.
 • ఎదలోని జీవాల్ని గుర్తించి, శ్రేష్ఠమైన పొట్టేలు / పోతులో జతకలుపడం వల్ల, జాతి కలిగిన మంద వృద్ధి చెందుతుంది.
 • ప్రతి గొర్రె, మేకను పరిశీలించడం, లెక్కించడం, మందులు త్రాగించడం తేలికగా ఉంటుంది.
 • పచ్చిక బీళ్ళు తగ్గి పోతున్న ఈ రోజుల్లో పాక్షిక సాంద్ర పద్థతి ఆచరించడం వల్ల మేపు కొరత గురించి, జీవాలు చాలా దూరం నడవడం వల్ల శక్తి కోల్పోయే పరిస్థితి గురించి కంగారు పడాల్సిన అవసరం అంతగా ఉండదు. అంటువ్యాధుల బెడద ఉండదు.
సి) సాంద్రపద్ధతి
 • ఈ పద్ధతిలో జీవాల్ని పాకల్లోనే ఉంచి దాణా, పచ్చిమేత, ఎండుగడ్డి అందిస్తుంటారు. త్రాగు నీరు ఎల్లప్పడు అందుబాటులో ఉంచుతారు.
 • తక్కువ భూమిలో ఎక్కువ జీవాల్ని పోషించవచ్చును.
 • పాకల్లో ఉంచి జీవాల్ని మేపడం వల్ల మేపు, మందుల వాడకం, జతకలుపడం విషయంలో పర్యవేక్షణ సులభమవుతుంది. పెరుగుదలలేనివాటిని ఏరివేయడం, వ్యాధిసోకినజీవాలను గుర్తించి చికిత్స చేయించడం సాధ్యమవుతుంది.
 • జీవాలు విశాంత్రిగా మేత తీసికొనడం వల్ల, బరువు త్వరగా పెరుగుతాయి. బయట తిరిగి మేసేపని లేనందున, శక్తి వృథా కాకుండా, అధికోత్పత్తికి ఉపయోగపడుతుంది. సగటు పెరుగుదల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.
 • ఎండ, వాన చలివంటి ప్రతికూల పరిస్థితులకు జీవాలు లోనుకాకుండా ఉంటాయి. జీవాలు వ్యాధుల బారిన సులభంగా పడవు.
 • ఈ పద్ధతిలో ఒక వ్యక్తి 200 వరకు జీవాలను కాపలా కాయగలడు.
 • దొంగలు, తోడేళ్ళు, కుక్కల బెడద ఉండదు.
 • ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నప్పటికి, పెట్టుబడి ఎక్కువైనప్పటికి, లాభాలుకూడా ఉంటాయి.
 • కొన్ని విదేశీ జాతి గొర్రెలు, మేకల పెంపకానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉండడం గమనించడం జరిగింది.


పై మూడు రకాల మేపు, పోషణ పద్ధతుల గురించి (క్షేత్రస్థాయిలో) పరిశీలిస్తే, జీవాల్లో త్వరితగతిన అధికోత్పత్తి సాధించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘పాక్షిక సాంధ్ర పద్ధతి’’ పట్ల జీవాల పెంపకం దార్లు దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.


జీరోగ్రేజింగ్‍ అంటే…

అనాదిగా గొర్రెలు, మేకలను రోజంతా పచ్చిక బయళ్ళలో, కొండలు, అడవులున్న ప్రాంతాల్లో త్రితూ పోషించడం మనందరికి తెల్సిన విషయమే. కాని జీరోగ్రేజింగ్‍ పద్ధతిలో జీవాల్ని మేత కొరకు బయట త్రిప్పడమంటూ ఉండదు. జీవాల్ని ఎల్లప్పుడు పాకలోనే ఉంచి సాంద్రపద్ధతిలో పెంచడం, అక్కడే దాణా, గడ్డి, పశువైద్య సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ పద్ధతినే ‘‘జీరోగ్రేజింగ్‍ పద్ధతి’’ అని వ్యవహరిస్తారు.

ఆనబోయిన స్వామి, సెల్ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *