జుల్ఫీకరుద్దీన్‍


పంతొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటీష్‍ సైనికుల ద్వారా హైదరాబాద్‍లోకి ఫుట్‍బాల్‍ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్పండ్‍ నవాబ్‍ ప్రోత్సాహంతో నగరంలో ఫుట్‍బాల్‍ క్రీడ వేళ్ళూనుకోవడం ఆరంభమయ్యింది. నవాబుకు తోడుగా కాకినాడ, రాజమండ్రి మహారాజులు కూడా ముందుకు వచ్చి పోషకులుగా నిలవడంతో ఫుట్‍బాల్‍ క్రీడ హైదరాబాద్‍లో పటిష్టపడటం ప్రారంభమయ్యింది.


18 మంది ఒలింపిక్‍ స్థాయి ఫుట్‍బాల్‍ క్రీడాకారులను అందించిన అప్పటి కోచ్‍ ఎస్‍.ఏ. రహీం హైదరాబాద్‍ జట్టు ప్రాభవానికి కర్త, కర్మ, క్రియ.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రహీం, ఏ మూల మంచి ఆటగాడు ఉన్నాడని తెలిసినా వెదుక్కొంటూ వెళ్లి తెచ్చి ప్రోత్సహించిన క్రీడా స్ఫూర్తే ఆయన.
1951 భారత్‍లో జరిగిన ఆసియా క్రీడల్లో 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో బంగారు పథకాలు సాధించే జట్టుగా భారత్‍ను రహీం సాబ్‍ రూపొందించారు. రహీంసాబ్‍ హయాంలో హైదరాబాద్‍ యువకులు ఫుట్‍బాల్‍ అంటే విపరీతమైన అభిమానం చూపేవారు.
ఆ రోజుల్లో విక్టరీ మైదానమే హైదరాబాద్‍ ఫుట్‍బాల్‍కు ముఖ్య కార్యస్థానం. 1950 నుంచి 1965 వరకు హైదరాబాద్‍లో ఫుట్‍బాల్‍ క్రీడకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు.


1952 హెల్పింకీ ఒలింపిక్స్లో సయ్యద్‍ ఖ్వాజ, అజీజుద్దీన్‍, నూర్‍ మహమ్మద్‍, ఎస్‍.కె. మొయినుద్దీన్‍ పాల్గొన్నారు. 1956లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో ఏకంగా 8 మంది హైదరాబాదీ ఆటగాళ్ళు పాల్గొనగా, 1960లో ఇటలి రాజధాని రోమ్‍లో జరిగిన ఒలింపిక్స్లో ఆరుగురు మన రాష్ట్ర ఆటగాళ్ళు పాల్గొన్నారు.


‘‘ఫుట్‍బాల్‍ ఒలింపిక్స్లో మూడు వరుస గోల్ప్తో హ్యాట్రిక్‍ సాధించిన భారత క్రీడాకారుని పేరేమిటి’’ ఆ మధ్య కౌన్‍ బనేగా కరోడ్‍ పతి అనే టివి కార్యక్రమంలో అమితాబ్‍ బచ్చన్‍ గంభీర స్వరం విసిరిన ప్రశ్న. హైదరాబాద్‍లోని మధ్య తరగతి నివసించే కాలనీలో ఆ కార్యక్రమం చూస్తున్న యువకులు తమతో ఫుట్‍బాల్‍ కబుర్లు చెప్పే వృద్దుడి కేసి జవాబు కోసం చూశారు. ఆయన తడుముకోకుండా సమాధానం చెప్పాడు. అది సరైన సమాధానం. ఆ పెద్దాయన జ్ఞాపకశక్తికి యువకులు అచ్చెరువు పొందారు.


అయితే హాట్రిక్‍ కోసం వ్యూహ రచన చేసిందీ, మూడుసార్లు బంతిని గోల్‍లోకి తన్నిన నోయెల్‍కు బంతిని పాస్‍గా ఇచ్చింది ఇప్పుడు తమకు సమాధానం చెప్పిన జుల్ఫీకరుద్దీన్‍ అనే కొస మెరుపు ఆ యువకులతో పాటు చాలామందికి తెలియదు. ఒకనాటి హైదరాబాద్‍, భారతదేశ ఫుట్‍బాల్‍ ఘన చరిత్రకు మనిస్తంభం వంటి ఉద్దండుడు జుల్ఫీకరుద్దీన్‍. నగర గల్లీల నుంచి ఒలింపిక్‍ మైదానం వరకు మన క్రీడా పతాకం పట్టుకొని పరుగులు తీసిన అజేయుడు. ఆంధప్రదేశ్‍ పోలీస్‍ జట్టుకు మన రాష్ట్ర జట్టుకు పదేళ్ళపాటు విజయవంతంగా నాయకత్వం వహించిన దిగ్గజం జుల్ఫీకర్‍.


హైదరాబాద్‍, మెహదీపట్నం సమీపంలోని మరద్‍ నగర్‍లో 1936, ఫిబ్రవరి 7వ తేదీన జుల్ఫీకర్‍ జన్మించారు. తండ్రి ఇమాముద్దీన్‍ రెవెన్యూ శాఖలో సెక్షన్‍ ఆఫీసర్‍గా పనిచేసేవారు. ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళతో వారిది పెద్ద కుటుంబం. క్రికెట్‍, సినిమా వ్యామోహాలు ఇంకా నగరానికి ప్రబలని ఆ రోజుల్లో ఫుట్‍బాల్‍ క్రీడంటే హైదరాబాద్‍ యువకులకు వల్లమానిన ప్రేమ, అభిమానం. చిన్నా పెద్ద మైదానాలన్ని ఫుట్‍బాల్‍ మ్యాచ్‍లతో, ప్రాక్టీసులతో కళకళ లాడుతుండేవి. చుట్టూ వున్న వాతావరణం వల్ల జుల్ఫీకర్‍ కూడా అప్రయత్నంగానే ఆ క్రీడపట్ల ఆకర్షితులయ్యారు.


ఇంటి చుట్టూ పక్కల స్నేహితులతో కలసి దొరికిన టెన్నీస్‍ బంతినో, రబ్బర్‍ బాల్‍నో తన్నుతూ పరవశించిపోయేవాడు. దినా రాత్రులు పుట్‍బాల్‍ అభ్యసించే వాడు. అసలు ఫుట్‍బాల్‍ను కొనడానికి మిత్రులెవ్వరి వద్ద డబ్బులు ఉండేవి కావు. అందుకని పాత గుడ్డ పీలికల మధ్య బరువైన వస్తువులు పెట్టి గుండ్రంగా బంతిలా నాయనమ్మ చేత కట్టించుకొని పట్టుకెళ్ళి వీధుల్లో తమ పిక్కబలం చూపేవారు.


ఫుట్‍బాల్‍ ఆడటం తండ్రికి ఇష్టం ఉండేది కాదు. అందుకే మొదట బంతిని గోడ అవతలకి తరలించి, ఆనక ఏదో పనిపైన వెళ్తున్నట్లు జుల్ఫీకర్‍ జారుకునేవాడు. అలా తండ్రి కళ్ళు కప్పి ఫుట్‍బాల్‍తో ప్రేమాయణం సాగించాడు. కఠోరమైన సాధనతో అలవడ్డ అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆయనను చక్కని ఆటగాడిగా తీర్చిదిద్దింది. క్లబ్‍ మ్యాచ్‍లలో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ రోజు రోజుకు అగశ్రేణి ఆటగాడిగా జుల్ఫీకర్‍ ఎదిగిపోయాడు. క్రీడాభిమానుల్లో జుల్ఫీకరుద్దీన్‍ పెద్ద పేరయ్యింది.
1954లో హైదరాబాద్‍ స్పోర్టింగ్‍ క్లబ్‍ తరపున అంబర్‍పేట్‍ సిటి పోలీసు జట్టుతో ఆడిన మ్యాచ్‍ జుల్ఫీకరుద్దీన్‍ క్రీడా జీవితాన్ని మలుపు తిప్పింది.


ఆ మ్యాచ్‍లో ఆయన కనబరచిన అద్భుతమైన ఆటతీరుకు ముగ్ధుడైన సి.పి.ఎల్‍ కమాండెంట్‍ జుల్ఫీకర్‍ను పోలీసు ఉద్యోగంలో చేరి తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించమని కోరారు. ఎంప్లాయ్మెంట్‍ కార్డ్ కూడా లేని జుల్ఫీకర్‍కు అన్నీ సమకూర్చి పోలీసు కానిస్టేబుల్‍గా నియమించారు. అప్పటి నుంచి సి.పి.ఎల్‍ జట్టుకు, ఆంధ్ర ప్రదేశ్‍ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మొదలు పెట్టారు. 1956లో జాతీయ ఫుట్‍బాల్‍ ఛాంపియన్‍షిప్‍ టోర్నమెంట్‍ ‘‘సంతోష్‍ ట్రోఫి’’ ఫైనల్స్లో రెండు అద్భుతమైన గోల్స్ సాధించి హీరోగా వార్తల్లోకి ఎక్కారు. అదే ఏడాది మెల్బోర్నో ఆస్ట్రేలియా ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు.


విదేశీ మైదానంలో విభిన్నమైన వాతావరణంలో ఆడి రాణించడం సామాన్యమైన విషయం కాదు. సెమి ఫైనల్స్లో యుగస్లేవియా చేతిలో పరాజయంపాలై నాలుగో స్థానంలో నిలబడ్డారు. తొలుత ఒక్క గోల్‍ ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి మనజట్టు పట్టు సడలించేసింది. 1958లో టోక్యో ఆసియా క్రీడల్లోనూ, 1959లో కౌలాలంపూర్లో జరిగిన మెర్థిక టోర్నమెంట్‍లోను భారత కీర్తి ప్రతిష్టల కోసం జుల్ఫీకరుద్దీన్‍ శ్రమించారు. 1956 మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో జుల్ఫీకరుద్దీన్‍ తన ప్రతిభ చాటారు.


మన దేశంలో జరిగే పెంటాగ్యులర్‍ ట్రోఫీ, సంతోష్‍ ట్రోఫీ, రోవర్స్, ఐ.ఎఫ్‍.ఎ.డి.సి.ఎం. వంటి అన్ని టోర్నమెంటుల్లోనూ జుల్ఫీకర్‍ తన గోల్స్తో, తానందించిన అద్భుతమైన సమయోచిత పాస్‍లతో రాష్ట్ర జట్టును గెలిపించారు.


జుల్ఫీకరుద్దీన్‍ క్రీడా జీవితంలో అద్భుతమైన ఎన్నో సంఘటనలు తళుక్కుమంటాయి. 1956లో బొంబాయి రోవర్స్ ట్రోఫీ ఫైనల్స్లో అతి శక్తివంతమైన మహమ్మదన్‍ క్లబ్‍తో మన జట్టు తలపడింది. ఆంధప్రదేశ్‍కు ఓటమి ఖాయమని అంతా అంచనాలు కట్టారు. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో బొంబాయిలోని గ్రౌండ్‍ జనంతో కిటకిటలాడింది.


ఆట మొదలైన రెండో నిముషంలో దాదాపు మధ్య కోర్ట్ నుంచి బంతిని లాఘవంగా తన్ని అద్భుతమైన గోల్‍ చేశారు. కనీ వినీ ఎరుగని పరిణామానికి ప్రేక్షకులంతా నిశ్చేష్టులయ్యారు. మైదానం మౌన ముద్ర దాల్చింది. బంతి ఎక్కడో దూరాన ఉంది లెమ్మని గోల్‍ కీపర్‍ గోల్‍ పోస్ట్ నుంచి బలంగా ఇవతలికి వచ్చి నిర్లక్ష్యంగా నిలుచున్న వైనాన్ని పసిగట్టిన జుల్ఫీకర్‍ కేవలం సెకన్లలో నిర్ణయం తీసుకొని నేరుగా గోల్‍లోకి బంతిని తన్నారు. దీంతో గుండె బలం చెదరని ప్రత్యర్థి జట్టు మహమ్మదన్‍ క్లబ్‍ 3-0 తేడాతో ఓడిపోయింది.


కెప్టెన్‍గా జుల్ఫీకర్‍ అసాధ్యుడు. వ్యూహ రచనలోను, జట్టును సమిష్టిగా నడపడంలో ఆయన పెట్టింది పేరు. క్రమ శిక్షణకు ఆయన మారుపేరు. మొయిన్‍, యూసుఫ్‍, నూర్‍, అజీజ్‍ వంటి మేటి క్రీడాకారులున్న జట్టుకు ఆయన కెప్టెన్‍గా బాధ్యతలు నిర్వర్తించి ఎన్నో విజయాలు సునాయసంగా దక్కించుకున్నారు. జట్టు సభ్యులను పేకాట, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంచేవారు.


విదేశీ పర్యటనల్లో, అధికార విందుల్లోసైతం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చేవారు కాదు. జుల్పీకర్‍ ఇస్లాం సంప్రదాయాలను ఆచరిస్తారు. కాలికట్‍లో టోర్నమెంట్‍ ఆడుతుండగా రంజాన్‍ మాసం వచ్చింది. జుల్ఫీకర్‍తో పాటు యూసుఫ్‍, ఖలీం కూడా ఉపవాస దీక్ష పాటిస్తూనే మ్యాచ్‍ ఆడారు.


ఆ ఉదయాన వ్యాయామం చేయడం వెంటనే మ్యాచ్‍ ఆడటంవల్ల తీవ్ర అలసటకు గురయ్యాడు. అది గమనించిన కోచ్‍ పెంటయ్య దీక్ష రోజుల్లో ముస్లిం క్రీడాకారులకు వ్యాయామం నుంచి మినహాయింపు ఇవ్వబోయాడు. అయితే జుల్ఫీకర్‍ అందుకు అంగీకరించలేదు. ఈ చర్యవల్ల జట్టులో ఏకత్వానికి విఘాతం కలుగుతుంది కాబట్టి అందరు ఒకే పద్దతులు పాటించాలని అభిప్రాయపడ్డారు. ఉపవాస దీక్ష పాటిస్తూనే, వ్యాయామంకు హాజరయ్యేవారు. అలాగే మ్యాచ్‍లు ఆడేవారు.


దక్షిణ భారత ఫుట్‍బాల్‍ జట్టుకు నాయకత్వం వహిస్తూ రష్యా, హంగేరి, డెన్మార్క్, జర్మని, ఇతర యురేపియన్‍ జట్టుతో తలపడ్డారు. పెంటాగ్యులర్‍ ఫుట్‍ బాల్‍ టోర్నమెంట్‍లో కెప్టెన్‍గా, కోచ్‍గా మద్రాస్‍, హైదరాబాద్‍, కేరళ, బెంగళూరు, శ్రీలంకలలో జరిగిన అన్ని ఫైనల్స్లో గెలుపొంది 1963లో ఎఫ్‍.ఐ.ఎఫ్‍.ఏ. అధ్యక్షుడు సర్‍ స్టాన్సీ రోజ్‍ చేతులపై ట్రోఫీ అందుకున్నారు. అవకాశాలు వెతుక్కుంటూ జుల్ఫీకర్‍ స్నేహితులు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. కొందరు పాకిస్తాన్‍ కూడా వెళ్ళారు. కానీ ఆడే రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన జట్ల నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ తన పంచ ప్రాణాలైన హైదరాబాద్‍ను వదిలి వెళ్ళేది లేదనే వాడు. గెలిచినా ఓడినా ఈ గడ్డపైనే అనేవారు. అదే మాటపై జుల్ఫీకర్‍ జీవితాంతం హైదరాబాద్‍ కోసమే నిలబడ్డారు. ఆ రోజుల్లో మ్యాచ్‍కి 50 రూపాయలు మాత్రమే తమకు ఇచ్చేవారని, అయితే తాము డబ్బు కోసం కాకుండా ఆట మీద మక్కువ, దేశం, రాష్ట్రంపట్ల భక్తితో మాత్రమే ఫుట్‍బాల్‍ ఆడేవారమని జుల్ఫీకర్‍ చెబుతుండేవారు.


పోలీసు శాఖలో అంచలంచలుగా ఎదిగి 1963లో నల్లగొండలో రిటైర్‍ అయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా పాటుపడ్డారు. కరీంనగర్‍లో పని చేస్తున్నప్పుడు పోలీసు క్రీడలు ఘనంగా నిర్వహించారు. పోలీస్‍ పరేడ్‍ గ్రౌండ్‍లో ఉన్న ఫోర్ట్ వాల్‍ ఆయన హయాంలో నిర్మించిందే.
పోలీసు శాఖలో ఆయన చూపిన కర్తవ్య దీక్షను గుర్తిస్తూ ప్రభుత్వం సేవాపతకంతో గౌరవించింది. హైదరాబాద్‍ క్రీడా ప్రాభవానికి వెలుగు రవ్వల సంతకంలా నిలబడ్డ జుల్ఫీకరుద్దీన్‍కు జేజేలు.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-పి.వి. రామమోహన్‍ నాయుడు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *